మీ జీవితానికి సారధి మీరే - అచ్చంగా తెలుగు

మీ జీవితానికి సారధి మీరే

Share This

మీ జీవితానికి సారధి మీరే

-బి.వి.సత్య నగేష్


మీ జీవితాన్ని ఈ సమాజం లేదా ఒకరిద్దరు వ్యక్తులు నడిపిస్తున్నారు అనుకోవడం.....కేవలం తప్పించుకొనే ధోరణి మాత్రమే. మీ జీవితానికి సారధి ఎవరు అంటే... అది మీరే. జీవితం విజయం వైపు పరుగులు పెట్టినా, లేక దిగజారుడుగా అపజయం వైపు దిగిపోతున్నా దానికి కారణం 'నేనే' ప్రతి వ్యక్తి తనను తాను విమర్శించుకోవాలి. నా జీవితానికి సృష్టి కర్త, నిర్మాణకర్త, శిల్పి, సారధి 'నేనే'  అని నమ్మిన వ్యక్తి తనను తాను కావల్సినట్లుగా మలచుకోగల్గుతాడు.
మన జీవితం మన నమ్మకాల ప్రతిబింబం. మన నమ్మకాలన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయిఉంటాయి. మన్ జీవితం లో ఎదురైన అనేక సంఘటనలు పునశ్చరణ వలన అనుభవాలుగా మారి చివరకి నమ్మకాలు గా మారతాయి. వీటినే 'మానసిక ముద్రలు ' అంటాం. విచిత్రం ఏమిటంటే...సగటు మనిషిలో చాలావరకు ప్రతికూలమైన (నెగటివ్) నమ్మకాలు ఉంటాయి. 95% సమయం లో అనుమానం, భయం, ఆందోళన, ఒత్తిడి, ఆత్మ సూన్యతాభావం తో సగటు మనిషి ప్రతికూలంగా ఆలోచిస్తూ ఉంటాడు. అందువల్ల అవే విషయాలు గుర్తుకు వచ్చి ప్రవర్తనను ఒక తీరుగా మారుస్తాయి. కనుక ప్రతికూలంగా ఆలోచించడం ఆపి, నాజీవితానికి నేనే సారధి అని నమ్మి ఒక కఠినమైన సానుకూల ఆలోచనా సరళిని అలవర్చుకుంటే అతి తక్కువ సమయంలోనే మంచి మార్పును గమనించగలుగుతాము.
ఒక ఊరిలో రైతు దగ్గర రెండు కుక్క పిల్లలున్నాయి. ఆ రైతు కొడుకు తండ్రికి ఒక ప్రశ్న వేసాడు. "ఈ రెండు కుక్కలూ పెద్దయిన తరువాత పోట్లాడుకుంటే, ఏ కుక్క నెగ్గుతుంది?" అని ప్రశ్నించాడూ "ఏ కుక్కకి తిండి ఎక్కువ పెడితే ఆ కుక్క నెగ్గుతుంది" అని తండ్రి సమాధానం చెప్పాడు. ఈ విషయాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. మన ఆలోచనా ప్రక్రియ మనమీదే ఆధార పడి ఉంటుందని, ఆలోచనలు అనేవి ఎక్కడనించో రావు అని నమ్మితే సానుకూలంగా ఆలోచించే  పద్దతి అలవాటవుతుంది. సానుకూల ఆలోచనాసరళి, ప్రతికూల ఆలోచనాసరళి అనేవి పైన ఉదాహరణలో రెండు కుక్కలు లాంటివి. ఈ రెండింటిలో ఏ సరళిని ప్రోత్సహిస్తే ఆ సరళి అలవాటుగా మారుతుంది. జీవితంలో నెగ్గుకు వచ్చి అనుకున్న లక్ష్యాలను సాధించి సంతోషంగా ఉండాలనుకుంటే సానుకూల ఆలోచనాసరళి ప్రతీక్షణంలో అమలు పరిచి అలవాటుగా మార్చుకోవాలి.
"మనిషి చెడుగురించి ఎందుకు ఆలోచిస్తాడు ?" చెడుకు ఎందుకు ఆకర్షించబడతాడు ? అనేది సగటు మానవుడి వ్యధ. ఈ విషయాన్ని విశ్లేషిద్దాం.
సానుకూలంగా అలోచించాలంటే కొంత ప్రయత్నం చేయవలసిందే. చెడుగా ఆలోచించడానికి అంత ప్రయత్నం అవసరం లేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక విద్యార్ధి పరీక్షలో మంచి మార్కులు సంపాదించుకోవాలనుకుంటే చాలా కృషి చెయ్యాలి. పరీక్షలో ఫెయిల్ అవ్వాలంటే అస్సలు చదవకపోయినా చాలు. అలాగే మంచి పేరు సంపాదించుకోవాలంటే చలా కృషి చెయ్యాలి.  చెడ్డ పేరు సంపాదించాలంటే ఏ పనీ చేయకుండా కూర్చుంటే చాలు. సహజంగానే ఎ సమాజం 'ఛీ' కొడుతుంది.   'సహజం' అంటే ఒక విషయం గుర్తుకువచ్చింది. 'సహజం' అంటే 'నేచురల్ ', 'అప్రయత్నంగా వచ్చేది ', 'అసంకల్పితంగా జరిగేది ' అని అర్ధాలు చెప్పవచ్చు.
ప్రపంచంలో సహజ శక్తులెన్నో ఉన్నాయి. సగటు మనిషి గుర్తించే మూడు సహజ శక్తుల గురించి చూద్దాం.
1) భూమ్యాకర్షణ శక్తి
2) దిక్సూచి ఎప్పుడూ ఉత్తరం వైపే చూపిస్తుంది.
3) అయిస్కాంతం ఎప్పుడూ ఇనుమునే ఆకర్షిస్తుంది.
ప్రతికూల ఆలోచనా ప్రక్రియ కూడా ఈ మూడు సహజ శక్తులలాంటిదే. ఈ క్రింది ఉదాహరణలు చూద్దాం.
1) మనిషి నీటిలో పడిపోవడం వలన మునిగిపోడు. నీటిలోంచి పైకి రావడానికి ప్రయత్నం చెయ్యకపోవడం వల్లనే మునిగి పోతాడు. ఈత కొట్టడం అనేది సానుకూల ఆలోచనా ప్రక్రియ తో కూడిన ఒక ప్రయత్నం. ఏ ప్రయత్నం చేయకుండా భయం తో ఆందోళన చెదుతూ వుంటే అది ప్రతికూల ఆలోచనా ప్రక్రియ తో సమానం. ఇది భూమ్యాకర్షణ శక్తి లాంటిదే. ఇది మనిషిని నీటి అడుగు భాగానికి తీసుకుపోయి ప్రాణం తీస్తుంది.
విషం లేని పాము కాటు వేసినపుడు భయం, ఆదోళన తో చనిపోయినవారు ఎందరో ఉన్నట్లు చరిత్ర చెప్తుంది. కనుక భూమ్యాకర్షణ శక్తి లంటి ప్రతికూల ఆలోచనా సరళికి గురికాకుండా, భయం, ఆందోళన చెందకుండా సానుకూలంగా ఆలోచించే ఎదురీతను సాధన చెయ్యాలి.
2) పది మంచి పనులు చేసి, ఒక తప్పు పని చేస్తే సమాజం ఆ తప్పు పనిని గురించే మాట్లాడుతుంది. ఒక విద్యార్ధి 5 సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకొని ఒక్క సబ్జెక్టు లో తక్కువ మార్కులు తెచ్చుకుంటే ఆ ఒక్క సబ్జెక్టు గురించే మాట్లాడుతుందీ సమాజం. ఇది దిక్సూచి లోని ముళ్ళు ఎప్పుడూ ఉత్తరం వైపు చూపించినట్లే సమాజం తప్పు వైపే చూస్తుంది.
3) అయిస్కాంతం ఎప్పుడూ ఇనుమునే ఆకర్షిస్తుంది. ఖరీదైన బంగారం, వెండి లోహాలను ఆకర్షించదు.
కనుక పైన పేర్కొన్న సహజ శక్తులు లాంటిదే ప్రతికూల ఆలోచనా ప్రక్రియ. గాలి పటం పైపైకి పోవాలంటే గాలిని ఢీకొనాలి.అలాగే జీవితంలో విజయం పొందాలంటే ప్రతికూల ఆలోచనా సరళిని సానుకూల ఆలోచనా సరళితో ఢీకొని  పైపైకి ఎదగాలి.
నెగటివ్ గా ఆలోచించకూడదు నిజమే ! కానీ అన్ని విషయాల్లోనూ పాసిటివ్ గా ఆలోచించలేముకదా అని ప్రశ్నించుకొని, అధ్యయనం చేసి మరొక విషయాన్ని తెలియచేసారు బిహేవియరల్ సైంటిస్టులు. దానిని "రైట్ థింకింగ్" అంటారు. దీనిని మనం అనుకూల ఆలోచనాసరళి అనుకుందాం. ఉదాహరణకు ......అడవిలో రాత్రి వేళ దట్టమైన చెట్లు, పొదలు ఉన్న తెలియని ప్రాంతానికి వెళ్ళాలి. వెళ్ళ్డానికి భయపడడం 'నెగటివ్", ధైర్యంగా దూసుకుపోవడం "పాసిటివ్" అనుకుందాం. ఈ రెండూ తప్పేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఉదయం పూట వెళ్ళ్డం శ్రేయస్కరం, రాత్రిపూట తప్పనిసరిగా వెళ్ళాలంటే తగిన సామాగ్రి తో వెళ్ళడం "అనుకూల ఆలోచనా సరళి" అవుతుందంటున్నారు. అందుకని ఈ 'థింకింగ్ ' అనే ముఖ్యమైన ప్రక్రియ మన అదుపులోనే ఉందని నమ్మి, నా జీవితానికి నేనే సారధిని అని జెవితాన్ని రూపు దిద్దుకోవాలి. మీ జీవితానికి మీరే సారధి అని నమ్మి హీరో గా కావాలని ప్రయత్నించాలి. అలా ప్రయత్నించకపోతే సహజంగానే విలన్ గా మారిపోతారు. మీరే సారధి అని నమ్మండి.

No comments:

Post a Comment

Pages