మన్మథ నామ వత్సర శుభాకాంక్షలు - అచ్చంగా తెలుగు

మన్మథ నామ వత్సర శుభాకాంక్షలు

Share This

మన్మథ నామ వత్సర శుభాకాంక్షలు 

 - చెరుకు రామమోహనరావు 


అది యేమోగద శ్రావ్యనాద నినదంబై దోచె మేల్కొల్పులా ?

ఉదయార్కప్రభుతా నిరూపక సముద్యోగంపు నాదమ్ములా  ?

సుదతీ సేవ్య విశుద్ధరాగ కళలన్ శోభిల్లు సంగీతమా  ?

యదిగాదయ్యదె వచ్చెనామని  విశుద్ధాహ్లాద గాత్రంబుతోన్ 

 

అల్లదె వచ్చే చైత్ర రథ మాంధ్ర ధరిత్రి విశాల వీధులం

దెల్లెడలన్ తెనుంగుజను లింపెసలార నివాళులివ్వగా 

తల్లి యుగాది లక్ష్మి సముదంచిత తేజము బర్వజేయుచున్ 

ఫుల్ల మనంబుతో తరలె పూర్ణ కటాక్షము చిల్కరించుచున్

వల్లరులెల్ల మల్లియల  వాసన నింప ధరాతలమ్మునన్ 

మెల్లన పిల్లతెమ్మెరలు మేయిని తాకుచు హాయి గొల్పగా 

పల్లవముల్ చిగుర్చి ఫల భారము నింపగ మావి మాకులున్

అల్లన వచ్చె చూడుమదె యామని యామిని దాటి సొంపుగా

 

బాలేందు మౌళియౌ బహుసర్ప భూషుండు

నీలకంఠుడు నిటల నేత్రధరుడు

నీలాలకలు నీలి నేత్ర గాత్రము వాడు

అందానికద్దమై నట్టివాడు 

కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి 

తల్లుల తనయందు దాల్చు తల్లి

అష్ట లక్ష్ముల రూపు కష్టమ్ములనుబాపు

 కరుణ గల్గిన దేవి కలిమి తల్లి 

 

దేవతలు వాణి వాక్పతి దీవెనలను 

కురియ జేయగ శుభమంచు కోయిలమ్మ

కూసె 'మన్మధ' 'దా' యంచు కోర్కె మీర

మావి చిగురులు తినుచు తా మరులు గొనుచు

మన్మధనమ్ముజేసి ఇక మంచిని పెంచుడు యౌవ్వనాళి మీ 

జన్మము సార్థకమ్మొదవ జాగృతి చేయుడు దేశమంతయున్ 

తన్మయతాతరంగముల తానము లాడగ  పౌరులెల్ల ఈ 

మన్మధ నామ వత్సరము మంగళ గీతిక పాడ వేడుకన్

No comments:

Post a Comment

Pages