శ్రీధరమాధురి – 13 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 13

Share This

శ్రీధరమాధురి – 13

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )



మనిషి పుట్టుక నుంచి, ఏదీ అతని చేతుల్లో ఉండదు. అయితే, అన్నీ తన ఆధీనంలోనే ఉంటాయని, తానే కర్తనని, భ్రమపడుతూ ఉంటాడు మనిషి. ఇతర ప్రాణుల్నీ, ప్రకృతిని శాసించాలని, ఉన్నతిని సాధించాలని ప్రయాస పడుతూ ఉంటాడు. ఈ ప్రక్రియలో అనేక కష్టాలు పడుతూ ఉంటాడు. కాని, మన వెనుక ఉండి, ఈ సృష్టిని అంతటినీ ప్రచ్చనంగా నడిపించే ఆ శక్తి దైవమని గుర్తించి, ఆయన ఏది ఇచ్చినా అనుగ్రహంగానే భావించి, జీవించేవారికి ...  జీవనం దూదిపింజంత తేలిగ్గా గడిచిపోతుంది. అందుకే, మనకు ఏదీ ఎంచుకునే వీలు లేదంటూ... పూజ్య గురుదేవులు అందించిన అమృత వచనాలు ... మీకోసం...

మీ ప్రార్ధనలను మన్నించి మిమ్మల్ని కరుణించేందుకు దైవానికి తనదైన మార్గం ఉంది... తనదైన సమయం ఉంది... తన స్వంత ప్రణాళికలు, విధానాలు ఉన్నాయి. ఎటువంటి సందేహం లేకుండా ఆయన్ను శరణాగతి వేడడమే ప్రధానం. ఆయనపట్ల అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండండి. ఆయన సంకల్పాన్ని, నిర్ణయాన్ని, మీ ప్రార్ధనలకు లభించిన అనుగ్రహంగా స్వీకరించండి. ఆయనే సర్వశ్రేష్టులు. కనుక మీకు ఏది శ్రేష్టమైనదో, మేలైనదో ఆయనకు బాగా తెలుసు. మీ నమ్మకం మిమ్మల్ని – మీరు ఆయన నిర్ణయాన్ని మనస్పూర్తిగా అంగీకరించే దిశగా నడపాలి. కేవలం ఆయన దయ మాత్రమే, మీరు దేన్నీ ఎంచుకోకుండా, పూర్తి జాగృతితో జీవితం గడిపేంత ధైర్యవంతుల్ని చెయ్యగలదు. అంతా దైవానుగ్రహం. 
**********
 మీరు ‘ విజయం’ అనే విధానానికి అలవాటు పడిపోయారు. మీరు దేనిలో ఎక్కువ విజయవంతులు కాగలరో కనుగొనాలని అనుకుంటారు. మీరు పోటీ పడతారు. మీరు ప్రశంసలు, బహుమానాలు ఆశిస్తారు. ఈ పరుగుల్లో వేరెవరో గెలుస్తారని మీకు ఎల్లప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఈ భయం- మీ మనస్సులో ఒక అభాద్రతాభావాన్ని సృష్టిస్తుంది. ఎన్నో టెన్షన్ లు. మీకొక ప్రణాళిక ఉంటుంది. మీరే కర్తలని మీరు అనుకుంటారు, అందుకే చాలా టెన్షన్ పడతారు.
 నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. అన్నింటి గురించి దైవమే శ్రద్ధ వహిస్తారు. నేను ప్రధముడిగా నిలవాలన్నా, ఆయనే నిర్ణయిస్తారు, ఆఖరున నిలవాలన్నా ఆయనే నిర్ణయిస్తారు. నేను చేసేందుకు ఏమీ లేదు. ఎందుకంటే జీవితంలో ఏది జరిగినా అది నా చేతుల్లో లేదు. కాబట్టి, ఆయన దయతో, ఆయన ఏది నిర్ణయిస్తే, నేను దాన్ని స్వీకరిస్తాను. ఆ దయను ఆయన నాపై ప్రసరింపచేసారు. ఇది పూర్తిగా దైవానుగ్రహం...
 మీ జీవితంలో మీకేన్నో ఎంచుకునే వీలుంది. పూర్తి ప్రణాళికలు, ఖచ్చితమైన ప్రణాళికలు... ఉప్పొంగే అహంకారం... వాస్తవానికి  ఎప్పుడైతే మీరు ఆశించినట్లుగా జరగదో, అప్పుడు మీరు నిరాశకు లోనౌతారు... అంతా దైవానుగ్రహం. 
**********
 నేను ఎందుకు పుట్టానో ... నేను ఎంచుకోలేదు...
తల్లిదండ్రులతో ఎలా దీవించబడ్డానో  ... నేను ఎంచుకోలేదు...
గురువులతో ఎలా దీవించబడ్డానో... నేను ఎంచుకోలేదు...
ఎందుకు పెళ్లి చేసుకున్నానో... నేను ఎంచుకోలేదు....
నేను ఎందుకు పనిచేస్తానో.. నేను ఎంచుకోలేదు...
నాకు ఇంతమంది మిత్రులు ఎందుకున్నారో... నేను ఎంపిక చేసుకోలేదు ...
నేను అరణ్యానికి ఎందుకు వెళ్తానో ... నేను ఎంపిక చేసుకోలేదు  ...
నన్ను పులులు, చిరుతలు తినకుండా ఎలా ఉన్నాయో... నాకు తెలీదు...
నేను ప్రయోగాలు ఎందుకు చేస్తానో...నేను ఎన్నుకోలేదు...
నేను ... జాగృతితో ఉండండి... అప్రమత్తంగా ఉండండి... మోసపోకండి... ప్రేమించండి ... జీవితాన్ని ఆస్వాదించండి... మూర్ఖంగా వ్యవహరించకండి... అంటూ చేసే వ్యాఖ్యలన్నీ – ఎంపికలేనివి ...
మీరు నన్ను అర్ధం చేసుకున్నా... అది ఎన్నుకోనిదే...
మీరు నన్ను అపార్ధం చేసుకున్నా... ఎన్నుకోనిదే...
మీ మీద నాకు ఎటువంటి విరుద్ధ భావనలు లేకపోవడం ... ఎంచుకోనిది...
మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించడం... ఎన్నుకోనిదే...
మీరు కర్తలు కాదని నాకు తెలియడం... ఎంచుకోనిది...
మీరే కర్తలని మీరు భావించడం... ఎంచుకోనిదే...
మీరు అహంభావులు కావటం ... ఎంపిక లేనిది...
దైవానుగ్రహం వల్ల నాలో అహం చివరి బెంచి లో ఉండడం... ఎంపిక లేనిది...
నేను సరదాగా మాట్లాడడం... ఎంపిక లేనిది...
నేను తీవ్రంగా మందలించడం... ఎంపిక లేనిది...
నేను మిమ్మల్ని జీవితాన్ని ఆస్వాదిస్తూ, అన్ని ధైర్యంగా ఉంటూ, అన్ని జీవులపట్ల ప్రేమగా, దయగా ఉండమనడం... ఎంచుకోనిదే... 
*******************
సాధువు – మీ వ్యక్తిత్వాన్ని పెంపొందింకోండి...
నేను – (పెద్దగా నవ్వి )... హే భగవాన్, కలుపు విత్తనం కూడా ముందే నాటబడింది. వసంతకాలం రాగానే అది మొలకెత్తింది. ఇప్పుడు అదొక వృక్షంగా మారింది. విత్తనం అనేది నేను ఎంపిక చేసుకోలేదు. ఇక దాన్ని పెంచిపోషించేందుకు ఏముంది ? విత్తనం లోనే వ్యక్తిత్వం పుట్టింది. దానికి ‘కలుపు మొక్క’ అనే లక్షణం ఉంది. మనం మహా ఐతే దాన్ని తెగనరకగలం. కాని, అది మరోచోట పెరుగుతుంది. ఇక నేను ఎన్నుకునే ప్రక్రియ నాకు ఎక్కడుంది పూజ్యనీయ ఆచార్యా ? ఎందుకంటే... నేను ఎంపిక లేని జీవనం గడుపుతాను. నాకు గమ్యం లేదు, మార్గం లేదు, శోధన చేసి ఆచరించేది లేదు. ఇక నేను ఏమి పెంపొందించగలను ? నేనువ్యక్తిగా ఏదీ చెయ్యను.నేను కర్తను కాదు. నేను దేనికీ కర్తృత్వం వహించనప్పుడు, నేను పెంపొందించుకోవలసినది ఏముంది ? ‘నేను’ అన్నది  పరిమితులకు లోబడే అర్ధరహితమైన పదం.మీకు అర్ధమయ్యేందుకే ‘నేను’ ‘నాది’ అన్న పదాలు వాడుతున్నాను. ఏదీ నా అధీనంలో లేనప్పుడు, దైవం చేతుల్లో ఉన్నప్పుడు, నేను వంగో, మెలికలు తిరిగో ఎలా పెరుగుతాను ? ఇది నా స్థితి, నేను దైవం నిర్ణయించిన విధంగా జీవించడాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను. అప్పుడే పుట్టిన బిడ్డ గురించి తల్లి జాగ్రత్తలు తీసుకున్న విధంగా, ఆయన నా గురించి శ్రద్ధ వహిస్తారు. నాకు ఏ వ్యక్తిత్వం గురించీ తెలీదు, దాన్ని పెంపొందించుకోవడం తెలీదు. నేను ఆ పూజ్యనీయుడైన సాధువుకు ప్రణమిల్లి, ఆయన నావంక చూస్తుండగా, ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాను. అంతా దైవానుగ్రహం. 
*******************
ఒకసారి నా గురువైన రాజర్ నాకు ‘వైకుంఠపాళి’ ఆటబొమ్మను చూపారు. దాన్ని’ పరమపద సోపాన పటము’  అంటారు. ఆయన అందులో నిచ్చెన గురువని, పాము పితరులని అన్నారు. అందులోని పాచిక ఒక అవకాశం. కాని మీరు పాచికలు తిప్పేటప్పుడు ఎంచుకోలేరు. అలా ఎంపిక లేకుండా పాచికలు ఆడిస్తూ  (జీవితంలో కర్మ చేస్తూ ) ఒకరు ఒక ఇంటి నుంచి, ఒక ఇంటికి మారుతూ ఉంటారు. గురువనే నిచ్చెన వారు కర్మను కొంతవరకూ తప్పించుకునేలా సహాయపడతారు. కొన్ని ఇళ్ళకు మీరు వెళ్ళకుండా చేస్తారు. కాని, పితృదేవతలు అది గమనిస్తూ, మీరు ఎంపిక లేకుండా పాచికలు తిప్పేటప్పుడు, మీరు వారింటికి (పాము తలవద్దకు ) వచ్చేలా చేసి, మిమ్మల్ని క్రింది ఇంటికి వెనక్కు పంపుతారు. గురువు మిమ్మల్ని పైకి పంపడం ద్వారా కర్మను తప్పించుకోవడం బోధిస్తారు. పాచిక దైవం... ఆయన దాన్ని దొర్లిస్తూ, మీ లెక్కలు చెబుతారు. గురువుకు, పితృదేవతలకు మధ్య దైవం ఆటాడుతారు . ఈ ఆట అనేక జన్మల పాటు కొనసాగుతుంది. చిట్టచివరికి, మీరు పాచిక తిప్పుతూ ఉండగా, దైవం గురువుకు, పితరులకు మధ్య మీరు ప్రయాసతో ఆడిన ఆటతో తృప్తిని పొంది, మీరు చిట్టచివరి పెద్ద పామును తప్పించుకునేలా చేసి, పరమపదం చేరేందుకు అనుగ్రహిస్తారు. ఇదే వైకుంఠము... జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యే స్థితి. ఈసారి మీరు ఈ ఆట ఆడేటప్పుడు, దీన్ని గురించి ఆలోచిస్తూ ఆడండి. అప్పుడు ఆట మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇది నా గురువు చూపిన జ్ఞానమార్గం. 
**************

మీలో లోపాల్ని ఎంచడం నాపని కాదు. మీరు కాని, నేను కాని కర్తలం కామని, నాకు బాగా తెలుసు. ఇది దైవంచే అందించాబడ్డ ఎంపిక లేని జీవనవిధానం. దేని గురించీ నేను మాట్లాడేది ఏమీ లేదు. ‘సంసారం’ అనే సముద్రం మధ్యలో నేను తేలుతూ ఉన్నానంటే, అది కేవలం ఆయన దయ . ఏ చర్యకూ నేను బాద్యుడిని కాదు, ఇతరులు బాధ్యులు కాదు. ఈ విశ్వంలో జరిగే ప్రతి చర్య దైవమే చేస్తారు. నన్ను ఆయన  పరిసరాల్లో ఉంచింది కేవలం ఆయన దయ, అనుగ్రహం. ఇది సంపూర్ణంగా ఆయన దయ, సంకల్పం.
****************
  దైవాన్ని పూర్తిగా శరణు వేడాలంటే, ఒకరు మెదడు భాషను మర్చిపోయి, హృదయ భాషను నేర్చుకోవాలి. దైవంపట్ల సంపూర్ణ విశ్వాసం... కేవలం ఆయన దయ, దయ, దయ... వేరేమీ అక్కర్లేదు. ప్రతి దానిలో దైవాన్ని చూడండి. ప్రతి దాన్ని మేధతో కాకుండా మనసుతో చూసే అంతర్ద్రుష్టితో మీరు దీవించబడాలి. అంగీకరించడం, స్వీకరించడం, సమ్మతించడం... జీవితపు ప్రతి అడుగులోనూ ఆయన అభీష్టాన్ని పూర్తిగా అంగీకరించాలి. ఎంపిక లేని జీవితం గడుపుతూ, కేవలం ప్రేమ మరియు దయ మీకు తెలిసిన భాషగా మార్చుకోవాలి. అప్పుడే సంపూర్ణ శరణాగతి సాధ్యమవుతుంది.
************

No comments:

Post a Comment

Pages