చిత్రకళా రారాజు - ఆర్టిస్ట్ రాజు - అచ్చంగా తెలుగు

చిత్రకళా రారాజు - ఆర్టిస్ట్ రాజు

Share This

చిత్రకళా రారాజు - ఆర్టిస్ట్ రాజు  

- భావరాజు పద్మిని 


‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నట్లుగా నిరంతర సాధన, కృషి తో గొప్ప స్థాయికి చేరుకొని, భావి చిత్రకళాకారులకు ప్రేరణగా, తెలుగు చిత్రకారుల్లో తలమానికంగా నిలిచారు ‘ఆర్టిస్ట్ రాజు’ గారు. వీరితో అచ్చంగా తెలుగు ముఖాముఖి ని ప్రత్యేకించి మీకోసం అందిస్తున్నాము ..... అ.తె : నమస్కారమండీ  రాజు గారు : నమస్కారం. 
అ.తె: మీ స్వగ్రామం , కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. 
రాజు గారు : మా స్వగ్రామం విజయనగరం జిల్లా గర్బాం అనే ఊరండీ.. నేను పుట్టింది 1959 లో . 
అ.తె: మీ తల్లిదండ్రులు గురించి చెబుతారా ? 
రాజు గారు : మా నాన్నగారు సత్యనారాయణ రాజు గారు, తల్లిగారు రాజేశ్వరి గారండీ. 
అ.తె : మీ నాన్నగారు ఏంచేస్తుండేవారండీ ? 
రాజు గారు :  మాంగనీస్ మైన్స్ లో మేనేజర్ గా ఉండేవారు.  మా అమ్మగారు హౌస్ వైఫ్ .. మా చిన్నప్పుడే నాన్నగారు కాలం చేశారు.. ఇప్పుడు ఇద్దరూ లేరు. మేము మొత్తం ఐదుగురం అన్నదమ్ములం, ఇద్దరు అక్కలు. నేను నాలుగవవాడినండీ..! 
అ.తె  :  మీ కుటుంబంలో ఆర్టిస్ట్ లు ఎవరన్నా ఉన్నారా?? 
రాజు గారు : మా రెండో అన్నయ్య బొమ్మలేసేవారు.. ఆయన తర్వాత మానేశారు. నాకు మాత్రం చిన్నప్పటి నుంచీ బొమ్మలేయడం చాలా ఇష్టం. మా కుటుంబంలో మా అన్నయ్యలు, అక్కలు అందరూ ప్రోత్సహించేవారండీ. మా నాన్నగారు కాలం చేశాక, మా పెద్దన్నయ్యగారితో విజయవాడకు వలస వచ్చాము. 1980 జనవరిలో, లో నా ఫస్ట్ కార్టూన్ ఆంధ్రపత్రిక వీక్లీలో ప్రింట్ అయ్యింది. చిన్నప్పటి నుంచి, బాపూగారు , చంద్ర జయదేవ్  గారు, గోపీగారి బొమ్మలు చూసి వేసే అలవాటు పెంచుకున్నాను. 
అ.తె  : మీకు గురువులు ఎవరైనా ఉన్నారా ? మీ చిత్రకళా ప్రస్థానం ఎలా సాగింది ? 
రాజు గారు : నేను చిత్రకళను ఎవరివద్దా నేర్చుకోలేదు. 1983 లో
ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం చేశాను. ఆర్టిస్ట్ పి.ఎస్ బాబు అని, ఆ సమయంలో ఆంధ్రజ్యోతి లో పనిచేసేవారు. ఆయన బొమ్మల్ని బాగా గమనించేవాడిని. వారి టేబుల్ మీద మాడ్ మ్యాగజైన్, పంచ్ మ్యాగజైన్ వంటి ఆంగ్ల పత్రికలు చూసాను. వాటిలో జాక్ డేవిస్, మార్క్ జూకర్ వంటి గొప్ప చిత్రకారుల బొమ్మలు ఉండేవి. అలాగే టైం మగజైన్ లో వచ్చే పాట్ ఒలిఫెంట్ , జెఫ్ మాక్ నెల్లి  పొలిటికల్ కార్టూన్స్ బాగా ఫాలో అయ్యేవాడిని. వెస్ట్రన్ కార్టూన్స్ ఫాలో అవ్వడం వల్ల నా కార్టూన్ లలో ఎక్కువ వెస్ట్రన్ టచ్ కనబడుతుంది.   తర్వాత 1984 తొలినాళ్లలో వేమూరి బలరాం గారు స్వాతీ మ్యాగజైన్ లోకి రమ్మని పిలవడంతో వెళ్లడం జరిగింది. మాసపత్రికలో ముందు నుంచీ వేసేవాణ్ణి. అనంతరం దాసరి నారాయణరావు గారు స్థాపించిన ఉదయం దినపత్రికలో ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యను.  1984 నవంబర్ నుంచి, 1995 వరకూ ఉదయం దినపత్రికలోనే పనిచేస్తూ రాజకీయ కార్టూన్లు ఎన్నో గీసా..!  ఉదయం మూసేసిన తర్వాత, అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైన ‘ఆర్ట్ యానిమేషన్స్’  లో ఆర్ట్ డైరెక్టర్ గా చేశాను. తల్లవఝ్ఝుల శీవాజీ, నేనూ కలిసి హార్ట్ ఆనిమేషన్ లో పనిచేశాం. ఆయన ఎడిటర్, నేను ఆర్ట్  డైరెక్టర్ ని. మా
మధ్య మంచి స్నేహం ఉంది. అక్కడ నుంచి బయటికి వచ్చాక పెయింటింగ్ మీద దృష్టిమళ్ళింది.. ఇక పెయింటింగ్స్ లో కలర్ కాంబినేషన్ ను ఆర్ట్ క్యాంప్ లలో చూసి నేర్చుకున్నా! ప్రస్తుతం ఫ్రీ లాన్స్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నా ! 
అ.తె. : మీకు ప్రేరణగా నిలిచే గొప్ప చిత్రకారులు ఎవరు ? 
రాజు గారు : ప్రపంచంలోని పెద్ద చిత్రకారులైన పాల్ గాగ్విన్ , అమృతా షేర్గిల్ ,జతిన్ దాస్ , ధీరజ్ చౌదరి, వైకుంఠం,  లక్ష్మణ్ గౌడ్ , నార్మన్ రాక్వెల్ ,గోపి,  పి. ఎస్. బాబు, బాపు, జాక్ డేవిస్, మార్ట్ డ్రూకర్, మోహన్, సమీర్ మొండల్ వంటివారి వర్క్స్ చూసి, చాలా ఇన్స్పైర్ అయ్యే వాడిని. ఇంకా నాకు అత్యంత ఇష్టమైన చిత్రకారుల గురించి చెప్పాలంటే.... ఎస్. వి. దామెర్ల రామారావు గారు, రామారావు గారు, కొండపల్లి శేషగిరిరావు గారు, సంజయ్ అష్టపుత్రే , సచిన్ జల్తరే  వంటి ఆర్టిస్ట్ లు చాలా ఇష్టం. ఇక ఇల్లుస్ట్రేషన్స్ గురించి చెప్పాలంటే, బాపూగారు,గోపీ,చంద్ర, మోహన్, వాసు (సాక్షీ), అన్వర్, పి.ఎస్ బాబు, తమిళ కార్టూనిస్ట్  బాలమురుగన్ , జయరాయ్, వింగ్స్, మరియో మిరిండా అంటే చాలా ఇష్టమండీ.. ఇక పెయింటింగ్స్ లో శివాజీ గారు నేనూ కలిసి, బొంబాయి, బెంగుళూరు, హైదరాబాద్ వంటిచోట్ల చాలా ఎగ్జిబిషన్స్ పెట్టాము. 
అ.తె : ఇక ఈ చిత్రకళనే వృత్తిగా స్వీకరించాలంటే  ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిందే కదండీ. అలాంటి వారికి ఏం సందేశం ఇస్తారూ? 
రాజు గారు :  కొత్తటెక్నిక్ లు వస్తున్నాయ్. కాబట్టి ఆర్టిస్ట్ కి ఒక స్టైల్ , శైలి
అవసరం. ఓపిక ఎక్కువ కావాలి. ఎందుకంటే ఎంత బాగా వేశామనుకున్నా గాని ఒకోసారి రెస్పాన్స్ రాకపోవచ్చు. దీనిలో మరో విషయం ఏంటంటే.... ఆర్టిస్ట్ అనే వాడు డబ్బులకోసం కాకున్నా, బొమ్మలు వేస్తూనే ఉండాలి. అలాగే ఉంటాడు కూడా. బొమ్మలు మనశ్శాంతి కోసమో అయినా వెయ్యాలి, వేస్తూనే ఉండాలి. పేరు తెచ్చుకోవాలి. ప్రతివారికీ ఒక రోజు అంటూ వస్తుంది. అందుకే మీరు నిరాశ పడకుండా, సాధన మానకుండా, కొత్త మెళకువలు నేర్చుకుంటూ ఉంటే, తప్పక విజయం సాధిస్తారు.  
అ.తె : మీరు ఏవైనా అవార్డులుకున్నారా ? మీ ఆర్టిస్ట్ జీవితంలో ముఖ్య ఘట్టం ఏమైనా ఉందా? 
రాజు గారు : ఇరవై ఏళ్ల క్రితమే.. బల్గేరియా, స్విడ్జర్లాండ్, రుమేనియా
దేశాలకు చెందిన అవార్డులు కార్టూనిస్ట్ గా అందుకున్నాను. దాదాపూ నా కెరీర్ మొదలు పెట్టిననాటి నుండీ, ఇప్పటి వరకూ దాదాపూ ఏడు, ఎనిమిది వేల కార్టూన్లు వేశాను. హాన్స్ ఇండియా కు కూడా పొలిటికల్ కార్టూనిస్ట్ గా పనిచేశా..! ఇంకా కార్టూన్స్ వేస్తూనే ఉన్నాను. కార్టూన్ లో భావం స్పష్టంగా ఉన్నప్పుడు, ప్రక్కన వ్యాఖ్యానం అవసరం లేదని, నా భావన ! మౌనంగానే మాట్లాడే అటువంటి కార్టూన్లు వెయ్యడం నాకు ఎంతో ఇష్టం. ఎప్పటికైనా ‘న్యూ యార్కర్’ మగజైన్ లో నా కార్టూన్ రావాలి అన్నది నా ఆశయం. 
అ.తె : మీ కార్టూన్లను మెచ్చుకున్న పెద్దల గురించి చెబుతారా..? 
రాజు గారు : చాలా మంది ఉన్నారండీ..  !! శంకర్, మృత్యుంజయ్ , వి.కె. సురేంద్ర , అశోక్, లేపాక్షి, బాలు  వంటి కార్టూనిస్టులు, నా తోటి ఆర్టిస్ట్లు, గోపీ, చంద్ర, అన్వర్, జయదేవ్, మోహన్, గార్లకు, నా  ప్రియ మిత్రుడు శివాజీకి నా కార్టూన్స్ అంటే చాలా ఇష్టం. 
.తె : మీరు కార్టూన్స్ కాకుండా ఇల్లుస్ట్రేషన్స్ కూడా వేస్తారా?? 
రాజు గారు : ఆ వేస్తాను... చాలా నవలలకి వేశాను.. 1984 లోనే స్వాతి
మంత్లీకి చాలా కవర్ డిజైన్స్ వేశాను. గోపీ గారూ,బాపూ గారూ చంద్ర గారూ వేసే టైం లోనే , నేను కవర్ డిజైన్ లు వేశా..! విపుల, చతుర వంటి మాగ్జైన్స్ కి వేశా! ఇంకా ఆంధ్రజ్యోతికి వేశా.! 
అ.తె : మీరు వేసిన బొమ్మల్లో మర్చిపోలేని బొమ్మ, ఎక్కువ గా ఇష్టపడే బొమ్మ ఏదో చెబుతారా??? 
రాజు గారు :  నా బొమ్మలన్నీ నాకిష్టమే.. !నా పెయింటింగ్స్ చాలామంది పెద్దలు కొన్నారు. సినీనటులు ప్రకాష్ రాజ్, కలకత్తాకు చెందిన వారు, చైనా వాళ్ళు చాల మంది నా పెయింటింగ్స్ కొనుగోలు చేశారు. అది చాలా సంతోషం కలిగించే విషయం. 
అ.తె: మీరు కంప్యూటర్ లో ఇల్ల్యుస్ట్రేషన్స్ వేస్తారా?? 
రాజు గారు :  నేను ప్రస్తుతం కంప్యూటర్ మీదే వేస్తున్నానండి. దాదాపూ 15 ఏళ్ల నుంచి పేపర్ మీద వెయ్యడం లేదండీ. ఫొటోషాప్ లో ఇల్ల్యుస్ట్రేషన్స్ అన్నీ కంప్యూటర్ మీదే వేస్తున్నా! సి.ఎస్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఒకటుంది.. దానికి ఆర్ట్ డైరెక్టర్ గా రెండేళ్ళు పనిచేశా ! అప్పటి నుంచీ కంప్యూటర్ మీదే వేస్తున్నా! 
అ.తె :  ఉద్యోగం చేస్తూ పెయింటింగ్స్ ఎలా వేసేవారు ? 
రాజు : ఉదయాన్నే 6 గంటల నుంచి 1998 నుంచి 2000 వరకు సి.ఎస్ లో
పనిచేశాను. పెయింటింగ్స్ అనేవి  పగలనేది చేయనండి. తెల్లవారుఝామున 5 గంటల నుంది 9 గంటల వరకు వేస్తాను. ఇక పెయింటింగ్ జోలికి వెళ్ళను.   మిగిలిన సమయాల్లో కార్టూన్స్ వేస్తుంటాను. ఈ మధ్య ‘రీడర్స్ డైజెస్ట్’ లో నా వర్క్స్ వచ్చాయి. అది కూడా గొప్పవిషయమే అని భావిస్తున్నా! తెలుగు కార్టూన్స్ కి రెమ్యునిరేషన్స్ రాదండీ.. రీడర్స్ డైజెస్ట్ వంటి వాటిలో కార్టూన్స్ కి రెమ్యునరేషన్స్ బానే ఉంటాయండి. ఇక్కడ మాత్రం ఎవరో అడిగారని కార్టూన్స్ వేసి ఇవ్వడమే గానీ బ్రతకడానికైతే కుదరదు. ఏదో పొలిటికల్ కార్టూనిస్ట్ లుగా స్థిరపడ్డవారి పరిస్థితి ఫర్వాలేదు గానీ, కొత్తవారు గానీ ఇతరులు గానీ సంపాదనపరంగా ఏమీ సాధించలేరండి.  హాబీ క్రింద ఉండాల్సిందే కానీ కార్టూనిస్ గా సంపాదన మాత్రం ఉండదు.. సరదాగా వేయడమే..! 
అ.తె : చాలా మంది కార్టునిస్ట్ లు మధ్యలో ఫీల్డ్ నుంచి డ్రాప్ అవుతున్నారండీ ..!! 
రాజు గారు :  అందుకే ఎవరూ దీన్ని వృత్తిగా స్వీకరించట్లేదు. ఏదో బిజీ అయిపోయి .. సరదాగా ఐడియా వచ్చినప్పుడు కార్టూన్స్ వేయడం. ఈ ఫేస్ బుక్ వంటి సామాజిక వెబ్ సైట్స్ లో పోస్ట్ చేసి,  ఫ్రెండ్స్ నలుగురు లైక్ లు కొడితే సంతోషించడమే గానీ, ఆదాయం ఉండదు.  ఫేస్ బుక్ లాంటి చోట  ఎవరో పబ్లిషర్ కోసం ఎదురు చూడఖ్కర్లేదు. మనకు మనమే పబ్లిషర్ కదా ఇక్కడ.! అందుకే, ఎవ్వరూ పెద్దగా కార్టూన్స్ మీద డబ్బుసంపాదన ఆశించడం లేదండీ! 
అ.తె : రచయితలకి గానీ, కార్టూనిస్ట్ లకు గానీ ఫేస్ బుక్ నిజంగానే చక్కని వేదికగా మారిందండీ..! అప్పటికప్పుడే  ప్రజా స్పందన కూడా తెలిసిపోవడం కొంత ఆనందాన్ని.. ప్రోత్సాహాన్ని ఇస్తుంటుంది కదా..!? 
రాజు గారు : అవునండీ.. మ్యాగజైన్స్ కి పంపడం, అవి వచ్చాయో రాలేదో చూడటం,.. అనే బాధ ఉండదు.. ఈ ఫేస్ బుక్ లాంటి వాటి వల్ల నలుగురిలో మంచి గుర్తింపు వస్తుంటుంది. మాలాంటి ప్రొఫెషనల్స్ ఐతే అనుకంత ఫ్రీలాన్స్ వర్క్స్ వంటివి వేస్తూ.. సరదాగా అప్పుడప్పుడూ ఇక్కడా వేస్తుంటాం. 
అ.తె : మీరు చిన్ననాటి నుంచి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి బొమ్మలు వేసేవారో చెప్పండి.. 
రాజు గారు : అదే..! నాకు మొదటి నుంచి.. బాపూగారి బొమ్మలు, బాలి గారి బొమ్మలు ఇష్టం. అప్పుటిలో పెయింటింగ్స్ గురించి పెద్దగా తెలిసేది కాదు. ఇల్ల్యుస్ట్రేషన్స్ లో మేం విజయవాడలో ఉన్నప్పుడు వచ్చే మ్యాగజైన్స్ స్వాతి గానీ, యువ గానీ జ్యోతి వంటి వాటిల్లో గోపీ, చంద్ర, బాలి, సిఎస్ బాబు, మోహన్ వంటివారి బొమ్మలు వచ్చేవి. బాలజ్యోతిలో  సూపర్ స్టార్ గా వెలిగారు పి.ఎస్ బాబు గారు. 1983 లో ఆయన బొమ్మలు వేయడం చూశా. వారికి నేనంటే చాలా ఇష్టం .! నేనెవరో తెలీనప్పుడే మోహన్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. 1983 లో నా బొమ్మలు చూసి అప్పటిలోనే పోస్ట్ లో మార్కర్ పెన్ పంపించారు నాకు. అంతగా ఎంకరేజ్ చేశారు నన్ను. ఇప్పటికీ నేను మోహన్ ని తరచూ కలుస్తుంటాను. 
అ.తె : మీ కుటుంబంలో ఈ ఆర్ట్ ఫీల్డ్ లోకి ఎవరైనా వచ్చారా?? 
రాజు గారు : మా ఫ్యామిలో ఆర్ట్ ఫీల్డ్ లో ఎవ్వరూ లేరు .. ! 
అ.తె : మీరు ఉండటం హైద్రాబాద్ లోనేనా? 
రాజు : నేను ఉండటం హైద్రాబాద్ లోనే ! 1990 లో ఉదయం పేపర్ కోసం పనిచేసేందుకు ట్రాన్స్ ఫరై హైద్రాబాద్ కి వచ్చా! 1984 లో వచ్చాక విజయవాడ ట్రాన్స్ ఫర్ చేశారు..హైద్రాబాద్ లోని ఆర్టిస్ట్ లతో మంచి అవినాభావ సంబంధం ఉండటంతో ఇక ఇక్కడే సెటిల్ అయ్యాము..!  
అ.తె : మీ కుటుంబ సభ్యుల గురించి చెబుతారా?? 
రాజు గారు : మా శ్రీమతి గారి పేరు ఉషారాణి అండీ. మాకు ఒక అమ్మాయి.. స్వాతి.. ఎంబి ఏ పూర్తిచేసి, ఒక కంపెనీ లో  హెచ్ ఆర్ ఎగ్జిక్యుటివ్ గా జాబ్ చేరింది. మా శ్రీమతి కూడా గ్రాఫిక్ డిజైనర్ ఒక యాడ్ ఏజెన్సిలో ఉద్యోగం చేస్తున్నారు. 
అ.తె  : ఆర్టిస్ట్ లలో రాజు గారిది ప్రత్యేక స్థానం అని ఆర్టిస్ట్ లు చెబుతున్నారు. 
రాజు గారు :  అది మా మిత్రుల అభిమానమేనండీ..!  చాలామంది ఆర్టిస్ట్ లు,  ఉదాహరణకు నాగేంద్రబాబు గారి వంటి వారు నా బొమ్మలు చూసి ఇన్స్పైర్ అయ్యానని చెప్పారు. అలాంటి ఉత్తేజం ఉందేమో నా బొమ్మల్లో నాకైతే తెలీదు. పెద్దలెవరైనా వేసిన బొమ్మలు చూస్తే, ఇది బాగా వేశారే నాకు అనిపిస్తుంటుంది.. కాబట్టి నా బొమ్మల శక్తి గురించి నా కన్నా ప్రక్కవాళ్లకే బాగా తెలుస్తుంది. 
అ.తె  : మీరు ఆర్టిస్ట్ గా ఇంకా ఏదైనా సాధించాలన్న కోరిక ఉందా?? 
రాజు గారు:  నా కార్టూన్ న్యూ యార్కర్ పత్రికలో రావాలన్నది నా కోరిక . అదంత ఈజీ కాదు. ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ వెయ్యాలన్న కోరికైతే ఉంది. 
అ.తె : మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి, మీ అభిప్రాయాలు అచ్చంగా తెలుగు తో పంచుకున్నందుకు కృతజ్ఞతలండీ! నమస్కారం ! 
రాజు గారు : నమస్కారమమ్మా!  

No comments:

Post a Comment

Pages