వాస్తవిక స్థితిగతులకు అద్దం పట్టే – పాముల పుట్టల్లో చట్టసభలు - అచ్చంగా తెలుగు

వాస్తవిక స్థితిగతులకు అద్దం పట్టే – పాముల పుట్టల్లో చట్టసభలు

Share This

వాస్తవిక స్థితిగతులకు అద్దం పట్టే – పాముల పుట్టల్లో చట్టసభలు

పుస్తక రచయత : ఎస్. గణపతిరావు

పుస్తక పరిచయం : భావరాజు పద్మిని


“అమ్మా ! కొండల్ని మింగే పాములు, చెరువుల్ని మింగే పాములు, భూముల్ని మింగే పాములు, ప్రజల్ని మింగేవి... వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. అంత పెద్ద పాములు వస్తాయా ?” అని కుర్రాడు బ్రహ్మం గారి చరిత్ర చదువుతూ మొదటి పాఠం దగ్గరే ఆగిపోయి – అమాయకంగా మోహం పెట్టి, అడిగాడు.
“దేశాన్ని మింగేసేవే వస్తాయిరా... !!” అని ఆ తల్లి; బ్రహ్మంగారికే కాలజ్ఞానం బోధిస్తున్నట్లుగా చెప్పింది.
ఆశ్చర్యంతో నోరు కోటగుమ్మంలా తెరిచాడు వాడు.
****************
సీతమ్మను రామాయణ కాలంలో కాపలాకాసే అశోకవనం రాక్షసుల్లా చూస్తే చాలు ఒళ్ళు జలదరించేలా ఉన్నారు వీళ్ళు. ఒంటిమీద ముళ్ళ పోదల్లా దట్టంగా చుట్టుకున్న జుత్తు, కొనదేరిన శూలాలు ప్రహరీగోడకు పాతిపెట్టినట్లు నెత్తిమీద వెంట్రుకలు, నిటారు పర్వతాల్లా ఇటు అటు తలకి బలంగా కొమ్ములు, సమాంతరమైన పొట్టమీద ఏనుగుల దండు గొబ్బెమ్మలు పెట్టినట్టు పొడుచుకు వచ్చిన పొట్ట.
నుదుటి కింద సూర్యబింబాల్లా కళ్ళు. కొండ పట్టేంత మూతి. గొర్రెల మంద పంపినా ఒక పంతికిందకు కూడా రానంత బలిష్టమైన దంతాలు. అడుగు మోపితే చాలు గుంతగా మారి, పాతాళగంగ తన్నుకొచ్చేంత బలమైన పాదాలు...
వాళ్ళను ప్రజాప్రతినిధులు అంటారు...
****************
కలాల్లో ఎన్నో రకాలు...
ప్రేమవాహిని కురిపించే కలాలు, ప్రకృతి ఆరాధనతో, ఆ ప్రకృతితో మమేకమై తొలకరి జల్లులు కురిపించే కలాలు, స్త్రీ కలాలు, పురుష కలాలు, వివాదాలకు దూరంగా రాసుకునే ‘సేఫ్ సైడ్’ కలాలు, పార్టీల కలాలు, ప్రాంతీయత మత్తు కమ్మిన కలాలు... అనేకం.
కాని, వీటిల్లో అదురు బెదురూ లేకుండా, సమకాలీన సమాజపు స్థితిగతులను, లోపాలను ధైర్యంగా ఎత్తి చూపే ‘దమ్మున్న’ కలాలు చాలా చాలా అరుదు. ఒక రచయతగా, తనకున్న సామాజిక బాధ్యతను గుర్తించినవారే ఈ సాహసానికి పూనుకుంటారు.
అటువంటి రచయత శ్రీ శంకు గణపతి రావు గారు. గాంధిజీ , సుభాశ్చంద్ర బోస్, ప్రకాశం పంతులు గారు వంటి త్యాగధనులు తిరిగిన ఈ దేశంలో , దైవం అనేకమార్లు ఏరికోరి అవతరించి నడయాడిన ఈ పుణ్యభూమిలో, నేడు ఎటు చూసినా దురాగతాలే ! అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు... నడి వీధిలో దొంగతనాలు, భద్రత అన్నదే కరువైపోతోంది.
ఇటువంటి స్థితిలో ఉన్న మనసులకి చికిత్స ఎవరు చేస్తారు ? ఏ రోగానికైనా చికిత్స చేసే సత్తా ఉన్నవి... అక్షరాలు.
అందుకే, అక్షరాలనే ఆయుధంగా వాడుకుని, చక్కటి కధల సంపుటిని అందించారు గణపతిరావు గారు.
జంతికలు అమ్ముకు బ్రతికే ఒక అనాకారి, చెత్తకుప్పపై దొరికిన ఆడబిడ్డను పెంచుకుని, తర్వాత ఆ బిడ్డ నాదంటూ, ఎవరో లాక్కుపోతే, విలవిలలాడే కధ... ‘పాలు పడని తల్లి...’ ఈ కధ చదువరులను కంటతడి పెట్టిస్తుంది.
స్నేహితుడని భావించి, చనువిచ్చిన వ్యక్తి, ఆమెకు పెళ్లి జరగబోతూ ఉండగా , చెడగొట్టి, తనను ప్రేమిస్తున్నాను అంటే, ఆశ్చర్యపోయింది ఆమె. ఆమె తేరుకుని, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా ‘నువ్వంటే యెంత ప్రేమో చూడు...’ అంటూ తనను తాను బలి చేసుకున్నప్పుడు, ఆ స్త్రీ పడే వేదనను ప్రతిబింబించే చక్కటి కధ – మనువాడిన మనసు.
అలాగే, అశనిపాతంలా అకారణంగా విరుచుకు పడుతూ, ప్రజల ప్రాణాలు తీసే తీవ్రవాదులను, జగతికి తల్లిదండ్రులైన అర్ధనారేశ్వరులే దిగి వచ్చి మట్టుపెడితే... అన్న ఆలోచన లోంచి పుట్టిందే... మంటల యుద్ధం అనే కధ. ఈ కధ చదువరులను ఉద్వేగానికి గురిచేసి, నిజంగా ఇలా జరిగితే బాగుండు, అనుకునేలా చేస్తుంది.
ఇవే కాదు, ఇంకా ఎన్నో కధలు, సూటిగా మీ మనసు మూలాల్ని తాకుతాయి. మరి ఈ పుస్తకం కావాలంటే... క్రింది నెంబర్ లో రచయతను సంప్రదించండి.
వెల : 100 రూ.
ప్రతులకు సంప్రదించండి : ఎస్. గణపతిరావు
సెల్ నెంబర్ : 9176282903, 9652294856.

No comments:

Post a Comment

Pages