శునక నీతి - అచ్చంగా తెలుగు

శునక నీతి

- దోమల శోభారాణి 


“బావా!.. మా బబ్లూకి పెళ్ళి చేద్దామనుకుంటున్నాను. నీకు తెలిసిన మంచి సంబంధమేదైనా ఉంటే చూడు” అన్నాడు జగన్నాథం. గాంధీ పార్కులో సిమెంటు బెంచీ మీద కూర్చుంటూ.
“మీ బాబు భార్గవ్‍కేనా?.. హైద్రాబాదులోని కోమలితో సంబంధం సెటిలైంది కదా. బెడిసి కొట్టిందా.. ఏంటి?” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కైలాసం. జగన్నాథం ప్రక్కనే ఆసీనుడవుతూ.
ఇద్దరూ ఈమధ్యనే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైరయ్యారు. గాంధీ పార్కులో నడకలు సాగిస్తూ పరిచయాలు పెంచుకున్నారు. నడతలు తెలుసు కుంటూ చేరువయ్యారు. ‘బావా... బావా...’ అని సంబోధించుకొనే స్థాయిలో మిత్రులయ్యారు.
“భార్గవ్‍కు కాదు బావా. బబ్లూకి. మనమే కదా హైద్రాబాదు వెళ్ళి భార్గవ్ పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకొచ్చాం.. ”
ఈమారు మరింత ఆశ్చర్య పోయాడు కైలాసం.
“బబ్లూకు పెళ్ళేంటి బావా?... అంతేలే... చిన్న పిల్ల వాణ్ణి చూస్తే ఎవరికైనా వేళాకోళమే...” అంటూ మొహం నయాపైసంత చేసుకున్నాడు కైలాసం.
అలా అప్పుడఫ్ఫుడు కైలాసాన్ని ఉడికించడం జగన్నాథానికి మహా సరదా....
“ఆ... నువ్వు చిన్న పాపాయివి పాపం! ఇంకా పాలు గూడా మరువలేదు. వేళాకోళం కాదు బావా. నిజంగానే అంటున్నాను.”
“బబ్లూ అంటే మీ కుక్కనే గదా బావా!... ” యింకా తన సందేహం తీరనట్లు అడిగాడు కైలాసం.
“ఛ!.. ఛ!!.. దాన్ని కుక్క అనకు బావా. నామనసు గ్లాసులో పోసిన పెగ్గు విస్కీ నేలపాలైనట్లవుతుంది..
గ్రామ సింహమను. సంతోషిస్తాను. లేదా శునకం అను. అది నాకొడుకుతో సమానం. చిన్న కూనగా ఉన్నప్పుడు వీధిలోని కుక్కలన్నీ బారి నుండి కాపాడి, చేరదీసి పెద్ద వాణ్ణి చేశాను. వాడికి ‘బబ్లూ’ అని ముద్దు పేరు పెట్టాడు భార్గవ్. మాఇంట్లో వాడంటే మాకందరికి పంచప్రాణాలు . బబ్లూ మాకుటుంబంలో ఒక సభ్యుడు”
“అయితే కావచ్చు. కాని పెళ్ళి సంగతేంటి? నేనెక్కడా వినలేదు, కనలేదు. కుక్కలకు పెళ్ళిళ్ళు చేయడం”
“ఓస్!... అదా నీ అనుమానం. భార్గవ్ పెళ్ళి నిశ్చయానికి ముందు వాని జాతకం చూపించాను బావా!. అప్పుడు బయట పడిందీ విషయం. వాడు పూర్వ జన్మలో ఒక కుక్కను హత్య చేసాడట. ఆ శునక పాపం భార్గవ్‍ను వెంటాడుతునే ఉందట. వానికి పెళ్ళి గండముందట. పెళ్ళయ్యాక ఏడాదిలోగా భార్గవ్ ప్రాణానికి ముప్పు కలుగుతుందట. దానికి పరిష్కారం భార్గవ్ పెళ్ళితోబాటు అదే ముహూర్తానికి మరో మూగ జీవికి కళ్యాణం జరిపిస్తే కీడు తొలగి పోతుందట. ఆ మూగజీవి కుక్క అయితేనే శ్రేష్టం. అని శాస్త్రుల వారు సెలవిచ్చారు. అందుకే మా బబ్లూకు పెళ్ళి చేయాలను కుంటున్నాను... ” కైలాసంకు బుర్ర పనిచేయటం లేదు. అయోమయ స్థితిలో కనుగుడ్లు మిటకరిస్తున్నాడు.
‘కోడి మెదడు!’ అని మనసులోనే నవ్వుకున్నాడు జగన్నాథం. ‘కైలాసం అనుమానాన్ని నివృతి చేయాలనీ.. ఒక క్లాసు పీకితే కాని బుర్రకెక్కదు...’ అనుకుని గొంతు సరి చేసుకున్నాడు జగన్నాథం. “ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయమే బావా! సకాలంలో వర్షాలు కురవాలని కప్పల పెళ్ళిళ్ళు, గాడిదల పెళ్ళిళ్ళు చేయడం చూడ్డం లేదా?.. మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా ఈ సంప్రదాయాలు కొన సాగుతున్నాయి...” అంటూ పెళ్లిళ్ల చేంతాడు చిట్టా తీసి సుత్తి వేయసాగాడు.
2004 లో అదృష్టం కలిసొస్తుందని నేపాల్‍లో ఒక ముదుసలి వాడు కుక్కను పెళ్ళి చేసుకున్నాడు.
2005 లో ఒక బ్రిటిషు మహిళ మిలియనీర్ డాల్ఫిన్‍ను వివాహం చేసుకుంది.
2010 జూన్ మాసంలో ఇండోనేసియాలో కార్ల్ లీగర్‍ఫీల్డ్ అనే అతను ఆవును పెళ్ళాడాడు.
2013 మే నెల 14న, సీటిల్ నార్త్ వెస్ట్ లో ఉండే అమెరికన్ సిటిజన్ ఒకావిడ గాడిదను పెళ్ళి చేసుకుంది.
2013 జూన్ 11న, మన ఇండియాలో కలకత్తా దగ్గర 9 సంవత్సరాల ఒక ట్రైబల్ అమ్మాయిని కుక్కకిచ్చి పెళ్లిచేసారు. అది వారి సంప్రదాయం.
‘లిండా’ అనే ఆవిడ ‘మ్యాక్స్’ అనే కుక్కను పెళ్ళాడినట్లు టీ.వీ లో చూశాను. ఆస్టేలియాలో మూడు సంవత్సరాల క్రితం డిసెంబర్ రెండున ‘జోసెఫ్‍గిసో’ అనే యిరవై యేండ్ల యువకుడు ఐదేండ్ల కుక్కను పెళ్ళి చేసుకున్నాడు.
అంతెందుకు మన తమిళనాడులో ఆరు సంవత్సరాలక్రితం కుక్కపిల్లలను చంపితే పాపం తగిలిందని దాని పరిహారం కోసం సెల్వకుమార్ అనే వ్యక్తి కుక్కను పెళ్ళి చేసుకోలేదా?...”
కైలాసం బెంచీ మీద హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాడిలా పడిపోయాడు.
ముందు జాగ్రత్తగా తెచ్చుకున్న బాటిలోని నీళ్లు కైలాసం ముఖాన చల్లాడు జగన్నాథం.
ఉక్కిరి బిక్కిరి అవుతూ తల విదిలించుకుని లేచి కూర్చున్నాడు కైలాసం.
కాసేపటికి కైలాసం తేరుకోవడం చూసి మళ్లీ సుత్తి తీసాడు జగన్నాథం.
“అయితే కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు జరగడం సహజం. భార్గవ్ కుక్కను పెళ్ళాడే బదులు అదే ముహూర్తానికి అదే పెళ్ళి పందిరిలో రెండు కుక్కలకు పెళ్ళి జరిపిస్తే దోష నివారణ జర్గుతుందని శాస్త్రులుగారు సవరణ చూపారు. అందుకే బబ్లూకు మంచి సంబంధం చూస్తున్నాను. అర్థమైందా?...”అంటూ కళ్ళెగరేస్తూ అడిగాడు జగన్నాథం.
కైలాసం బాగా అర్థమైనట్లు వాచిన తన తలను రెండు చేతులా పట్టుకుని గంగిరెద్దులా ఊపాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం ఆవహించింది. పార్కులోని చెట్టుపై పక్షులు తమ గూటికి చేరుకుంటున్నట్లుగా కిల, కిలారావం మొదలయింది...
కైలాసానికి వింతగా తోచింది. జగన్నాథానికి జాతకాల పిచ్చి ఉందని తెలుసు కాని మరీ ఇంతగా ముదిరిపోయి ఉందని ఊహించలేదు. అయినా ‘ఎవరి నమ్మకాలు వారివి. మనమెందుకు కాదనాలి?.. రేపేమన్నా అయితే? మన మీది కొస్తుంది. ఎందుకొచ్చిన తంట. సలహాలిచ్చి జగన్నాథం మనసు మార్చే కంటే బబ్లూకు సంబంధం చూడడమే ఉత్తమమని’ నిర్ణయాని కొచ్చాడు కైలాసం. ఇంతలో కైలాసం మస్తిష్కంలో ‘బసంతి’ తళుక్కున మెరిసింది....
“సరే బావా. నాకు తెలిసిన మంచి సంబంధమొకటుంది. ఆశునకం పేరు బసంతి. దాన్ని మాపక్కింటి వాళ్ళు సాదుకుంటున్నారు. మా ఇంట్లో కూడా అది చనుచవుగా తిర్గుతూ ఉంటుంది. కావాలంటే ఓరోజు దాన్ని తీసుకొచ్చి చూపిస్తాను. బబ్లుకు పెళ్ళి చూపులు అరేంజ్ చేద్దాం” జగన్నాథం లెవల్లోనే సమధానమిచ్చాడు కైలాసం.
“అఖ్ఖర్లేదు. నీమీద నాకా నమ్మకముంది. మరి పెళ్ళి అంటే ఒప్పుకుంటారంటావా?...”
“మహదానందంగా ఒప్పుకుంటారు. దాని బాధ పడలేకే ఎవరికైనా అమ్మేద్దామని చూస్తున్నారు. అది ఈమధ్య మనుషులకు అడ్డదిడ్డంగా వెనుదిర్గుతూ తోక లేపి నానా హంగామా చేస్తోందట. వీధిలోని ఊర కుక్కలతో సంగమం బసంతి ఆరోగ్యం పాడౌతుందని వారి భయం. నేను మేనేజ్ చేస్తాగా... అయితే కాస్తా ఖర్చవుద్ది...‘శునక శుల్కం’. నువేమో నీ కొడుక్కి గూడా కట్నం ఆశించకపోతివి...” “దానిదేముందిలే బావా!... ఎవరి ఆలోచనలు వారివి. నా బబ్లూ కోసం ఆమాత్రం ఖర్చు భరించనా?... నాకు మరో కూతురుంటే మాత్రం ఖర్చయ్యేదికాదా?...” అంటూ జగన్నాథం అభయమిచ్చే సరికి కార్యం సిద్ధించినట్లే అనుకున్నాడు కైలాసం.
“సరే... అయితే నడుద్దాం... ” అంటూ లేచాడు కైలాసం. “నేను చెప్పిన విషయం మర్చి పోవద్దు బావా....” అంటూ మరో మారు బబ్లూ పెళ్లి సంబంధం విషయం మర్చి పోకుండా ఉండటానికై కైలాసం తొడ గిల్లాడు జగన్నాథం. “నువ్వు నిశ్చింతగా ఉండు బావా... బబ్లూను ఓయింటి వాడిని చేసే బాధ్యత నాది” అంటూ కైలాసం తొడ నిమురుకుంటూ గృహోన్ముఖుడయ్యాడు. తన ముసి, ముసి నవ్వులు జగన్నాథానికి అగుపించకుండా జాగ్రత్త పడ్డాడు.... ***** అనుకున్న ముహూర్తానికి భార్గవ్, కోమలిల వివాహం జరగడం సర్వ సాధారణ విషయం.
కాని అదే పచ్చని పెండ్లి పందిట్లో వారి పెళ్ళికి ముందు జరిగిన బబ్లూ, బసంతీల పెళ్ళి అందరిని ఆకట్టుకొంది.
బసంతి సొగసైన చేరడేసి కళ్ళు. తామర రేకుల్లా చెవులు. పలు వరుస.. బాదాం పప్పు దినుసులు. నాజూకైనా నడుము ముందు సినిమా హీరోయిన్ల నడుములు దిగ తుడుపే. దాని వాలము శునకాగ్రేసరులను పడదోసే గాలము. అది నడుస్తుంటే మయూరం సహితం సిగ్గు పడాల్సిందే!...
యిక బబ్లూ అచ్చంగా రాకుమారుడే...
బబ్లూ, బసంతీల ఈడూ జోడూ బలేగా కుదిరాయని ముచ్చట పడిపోయారు పెళ్ళికి హాజరైన పిన్నలు, పెద్దలు.
అదే పెళ్ళి పందిరిలో బబ్లూ తరఫున జగన్నాథం, జగదాంబ దంపతులు. బసంతి తరఫున కన్యా దాతలు కైలాసం దంపతులతో పెళ్ళి తతంగమంతా మేళ తాళాలతో నిర్విఘ్నంగా శునక శాస్త్రయుక్తంగా వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు నిర్వహించారు.
నుదుట పెళ్ళి తిలకం. బుగ్గన కాటుక చుక్క. తగిన వస్త్ర ధారణి అయిన బసంతి సిగ్గులొలక పోస్తోంది... మెడలో పూల కళ్యాణ మాలతో.
పూలామాలాంకృతుడైన బబ్లూ ఎంతైనా తాను మగధీరుడనన్న ధీమాతో ఏమాత్రం మెడ వంచకుండా సగర్వంగా బసంతి పాద పీడనం చేశాడు. ముందుగా పెళ్ళి చూపులు లేవుగా. మనసులో తన అనుమానాన్ని నివృతి చేసుకొనే తలంపుతో...
తన షడ్రుచుల నాలుకను చాచి బసంతి మోమును తడుమసాగాడు... ‘నేను నీకు నచ్చానా?...’ అనే రీతిలో.
ఈ కాలంలో ఆడశునకాలమైనా... మేమేమైనా తక్కువా?... అన్నట్లుగా తన నాలుకతోనే తిర్గి సమాధానమిచ్చింది బసంతి. మెడలు పెనవేసుకొంటూ.. కనులు మూసుకొని తలలు వంచుకొని వెనుక రెండు కాళ్ళపై నిలబడి ముందు కాళ్లతో నమస్కరిస్తూ.. తమ పెళ్ళిని తిలకిస్తున్న వారిని ఆశీర్వాదాలు కోరాయి.
పెళ్ళివేడుకను తిలకించే జనం ఈలలు, కేరింతలు కొడ్తూ అక్షింతలు చల్లారు. మేళతాళాల వాయిద్యం మిన్నంటింది.
శునక శుల్కం ముట్టగానే అప్పగింత వేడుకలో ఏ అపశృతులు దొర్లకుండా బసంతిని అప్పగించారు కైలాసం దంపతులు.
భార్గవ్, కోమలి... బబ్లూ, బసంతీల పెళ్ళిళ్ళు ఒకే పందిరి క్రింద వైభవంగా ముగిసాయి.
మా ఇంటికి ఇరువురు కోడళ్ళు వచ్చారని సంబర పడిపోయారు జగన్నాథం దంపతులు. ***** ఏడాది గడిచే లోగానే జగన్నాథం తాతయ్యను చేశారు భార్గవ్, బబ్లు...
‘భార్గవ్, కోమలి పుణ్య దంపతులకు అమ్మాయి జననం. అదేమి విచిత్రమో! కాని బసంతి అదే సమయానికి ఒక ఆడకూనకు జన్మ నిచ్చింది.
ఆ ఇంట్లో ఆనందం వెల్లు విరిసింది. బంధు మిత్రుల అభినందనలతో తబ్బిబ్బయ్యారు జగన్నాథం దంపతులు.
మనుమరాలి పేరు ‘కీర్తి’ అని బసంతీ, బబ్లూల కూనపేరు ‘బంతి’ అని శాస్త్రోక్తంగా నామకరణ మహోత్సవాలు జరిపించారు. జగన్నాథం దంపతులు.
జగన్నాథం మనసంతా హాయి నిండుకొని పోయింది. బబ్లూతో అనుబంధం. వాడు తమ ఇంటికి చేస్తున్న సేవ... బబ్లూ వచ్చిన వేళా విశేషం... తమ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎదిగిన తీరు.. బసంతితో పెళ్ళి... ఊహల్లో తేలిపోతున్నాడు...
ఆ జగన్నాటక సూత్రధారి మాయలు ఎవరికెరుక?...
అంతా విధి విలాసం. సర్వంతర్యామి అయిన తనను సదా స్మరించాలనే నెపంతో ఏదో ఒక రూపంలో మనుష్యులను కష్ట పెట్టడం అతనికిష్టమైన ఆనవాయితీ!...
బబ్లూకు కాస్తా సుస్తీ చేసిందని జగన్నాథం సతీమణి, భార్గవ్ కార్లో బబ్లూను తీసుకొని వెటర్నరీ హాస్పిటల్‍కు వెళ్ళారు. బబ్లును పరీక్షించి టెస్టులు వగైరా చేశాడు డాక్టర్.
“ఏం ఫరవాలేదు. మామూలు జ్వరమే. సిరప్ రాసిస్తాను. మూడూ పూటాలా మజ్జిగ అన్నంలో కలిపి తినిపించడి. ప్రస్తుతం ఒక ఇంజెక్షన్ చేస్తాను” అన్నాడు డాక్టర్.
జగదాంబ బబ్లును తల నిమురుతూ మురిపిస్తున్నది. భార్గవ్ సహకారంతో బబ్లూకి ఇంజక్షన్ చేశాడు డాక్టర్. బబ్లూకి అది అలవాటే అప్పుడప్పుడు సూది మందు చవి చూస్తూ ఉంటుంది. “కుయ్య్..! కుయ్య్!!..” అని సర్దుకుంది.
సిరప్ కొనుక్కొచ్చాడు భార్గవ్. బబ్లుని తీసుకుని కార్లో కూర్చుంది జగదాంబ. భార్గవ్ కారు స్టార్ట్ చేసి పొరపాటున ముందు మిర్రర్‍లో చూసుకోకుండానే రోడ్డు మీదికి కారు ఎక్కించాడు. వెనకాల మృత్యు రూపంలో అతి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ లారీ రెప్పపాటులో వీళ్ల కారును గుద్దేసింది. కారు రూపు రేఖలు లేకుండా తునాతునకలయింది. హా!.. హా!!.. కారాలతో జనం పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని అప్పటికే ముగ్గురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి.
జగన్నాథ సంసార రథం తలక్రిందులైంది. సొమ్మసిల్లాడు. కోమలి దుఃఖాన్ని ఆపడం ఎవరి తరమూ కావటంలేదు....
బసంతి మూగజీవి, నిర్జీవి అయిన బబ్లును చూస్తూ రోదించే హృదయ విదారక దృశ్యం జన్నాన్ని కన్నీరు పెట్టించింది. ***** జగన్నాథం ఇల్లంతా వెలితి... బబ్లూ లేకుండా బసంతి ఆహారం ముట్టడం లేదు. బంతికి పాలు సరిపోవటం లేదు. జగన్నాథం ఆమూగజీవుల పాపం తగులుతుందని గిన్నెలో పాలు పోసి త్రాగిస్తుంటే బసంతి దీనంగా అతని వంకే చూస్తోంది. అది ఆహారం తీసుకొనే మార్గమేమిటా అని ఆలోచిస్తున్నాడు జగన్నాథం.
ఉన్నఫళంగా చెట్టంత కొడుకు, చేదోడు వాదోడుగా ఉండే భార్య, ఇంట్లో సింహంలా మెలిగే బబ్లు అదృశ్యమయ్యేసరికి సగమై పోయాడు జగన్నాథం. కైలాసం ప్రతీ రోజు జగన్నాథాన్ని మామూలు మనిషిగా మార్చడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు.
విధి విలాసం.. ఎలా జరుగనుందో అలా జరుగుతుందని కైలాసం విశ్వాసం.. అతడికి కర్మ సిద్ధాంతం మీద నమ్మకం.
క్రమేణా జగన్నాథం మాటల ధోరణిలో మూఢ విశ్వాసాలపై మార్పు వచ్చినట్లు గమనించ సాగాడు కైలాసం.
రోజులు గడుస్తున్నాయి... ఎంతటి గాయాలైనా కాలానికి కనుమరుగవడం సహజమే... కాలానికున్న మహత్యమే అది.
బసంతి కోలుకో సాగింది. బంతి ఇంట్లో పరుగులు దీస్తూ బబ్లూ లేని లోటును పూరిస్తున్నాయి. కీర్తి బోసి నవ్వులు చిందిస్తూ భార్గవ్ ముఖారవిందాన్ని తాతకు పులుమతోంది. జగన్నాథం కోమలి, కీర్తి.. బసంతి, బంతి కోసం మనుగడ సాగించడం తప్పలేదు...
తిరిగి జీవన యానంలో కలిశాడు...
పార్కుకు కైలాసంతో నడక సాగిస్తున్నాడు...
ఆరోజు పార్కులో బబ్లూ బసంతిల వివాహ విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అభినయిస్తున్నాడు కైలాసం. జగన్నాథం మోములో చిరునవ్వు తళుక్కున మెరిసింది చాలా కాలానికి. దాని కోసమే ఇన్నాళ్ళుగా ఎదురి చూస్తున్న కైలాసం తృప్తిగా తనూ జగన్నాథం నవ్వులో శృతి కలిపాడు. ఇరువురి నవ్వులతో పార్కులోని బొడ్డు మల్లెల చెట్టు నిలువెల్ల పులకించి పోయి ఊగుతూ పూలవర్షం వారిపై కురిపించింది.
కైలాసం దగ్గర సెలవు తీసుకొని గృహోన్ముఖుడయ్యాడు జగన్నాథం. అల్లంత దూరం నుండే పసి గట్టిన బసంతి పరుగెత్తుకుంటూ వచ్చింది. దాని తలమీద రక్తపు మరకలు.. కళ్ళళ్ళో నీళ్ళు. ఏదో చెప్పాలనే తపన జగన్నాథం గుండెల్లో రైళ్ళు పరుగెత్తించింది. ‘మళ్ళీ ఏదో అనర్థం జర్గింద’ని అనుమానపడుకుంటూ నడకలో వేగం పెంచాడు. ముందుగా బసంతి పరుగెడుతూంది... బంతి కూన రక్తం మడుగులో అచేతనంగా పడి ఉంది వీధిలో. బసంతి నాలుకతో తడుముతోంది. జగన్నాథం మనసు ఆవిరైంది. బసంతిని దగ్గరికి తీసుకున్నాడు. అప్రయత్నంగా కళ్ళు వర్షించ సాగాయి. ఏం జరిగిందో కనుక్కుందామని ఆందళనగా ఇంట్లోకి అడుగు పెట్టాడు జగన్నాథం. ఎదురుగా అగుపడిన దృశ్యం చూసి కళ్లు బైర్లు కమ్మాయి. కుప్పలా కూలిపోయాడు.
కోమలి కంగారు పడింది. గ్లాసులో నీళ్లు తెచ్చి ముఖంపై చిలకరించింది. కాసేపటికి తేరుకుంటూ భయం భయంగా దిక్కులు చూడ సాగాడు.
“మామయ్యా.. ఏంకాలేదు. కీర్తి బాగానే ఉంది ఇటు చూడండి నాఒళ్ళోనే ఉంది... మీరేమీ కంగారు పడకండి” కోమలి ధైర్య వచనాలు జగన్నాథాన్ని తట్టి లేపాయి. రెండు ముక్కలుగా తెగిన పామును తదేకంగా చూడసాగాడు.
“మామయ్యా.. నేను వంటింట్లో ఉన్నాను. కీర్తి మంచంపై ఉంటే దొర్లి కింద పడిపోతుందేమోనని నేలపై పడుకో పెట్టాను. బసంతి బంతితో వీధిలో ఆడుకుంటోంది. ఇంతలో ఏదో అలికిడి అయితే హాల్లోకి వచ్చాను. నాగు పాము పడగ విప్పి కీర్తకి రెండడుగుల దూరంలోనే ఉంది. నా ప్రాణాలు పైనే ఎగిరి పోయాయి. బసంతీ అంటూ కేక వేశాను. బసంతి పరుగెత్తుకుంటూ వచ్చి పాము వెంట పడి రెండు ముక్కలు చేసింది. నేను కీర్తిని ఒళ్ళోకి తీసుకున్నాను. నా కాళ్ళూ చేతులు ఆడలేదు. బసంతి వెనకాలే బంతి వచ్చి గూట్లో దూరిందేమో నని అనుకున్నాను. కాని వీధి కుక్కలు మొరుగుతుంటే బయటికి వచ్చి చూశాను. అప్పటికే అవి బంతిని కొరికేసాయి” అంటూ ఏడువసాగింది.
                                                                                                                  ***** కొద్ది రోజులు గడిచాయి... ఒక రోజు బసంతి ఒక మగ శునకం టామీని తీసుకుని జగన్నాథం ముందుకు వచ్చింది. జగన్నాథం ఆశ్చర్య పోయాడు. నిజమే దానికి ఒక మగ తోడు అవసరమే. తాను తన తోడును కోల్పోయి ఎంత మదన పడ్తున్నాడో ఆ దేవుడికే ఎరుక. బసంతి నిర్ణయం సరిఅయినదే..
బసంతి, టామీలు వెనుక కాళ్ళపై మోకరిల్లి ముందు కాళ్ళను చాపి దీనంగా తల ఎత్తి జకన్నాథాణ్ణి చూడ సాగాయి తమని ఆశీర్వదించ మన్నట్లుగా.. జగన్నాథం ప్రేమతో ఆరెండింటి తలలపై నిమిరాడు. అవి సంతోషంతో తోకలు ఆడించుకుంటూ పెనవేసుకో సాగాయి.
ఈ విషయం పూస గృచ్చినట్లు కైలాసానికి పార్కులో చెప్పాడు జగన్నాథం.
కైలాసం చిరు నవ్వు నవ్వాడు. అతడి మనసులో ఒక ఆలోచన మెరిసింది..
“బావా! నువ్వు ఏమనుకోకపోతే ఒక సలహా ఇస్తాను. బసంతి ఎలాగూ మన ప్రమేయం లేకుండా తన జోడును ఎన్నుకుంది. మనకు సగం పని భారం తప్పింది. మరి కోమలి సంగతి ఏమిటి? తనకూ ఓతోడు కావాలి కదా.. కోమలిని మా యింటి కోడలుగా రమ్మని వేడుకుంటాను.. యిది మా బాబు పంపిన సందేశమే..” అన్నాడు కైలాసం.
జగన్నాథం కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి. కైలాసం రెండు చేతులు కృతజ్ఞతా పూర్వకంగా పట్టుకున్నాడు. ***** మోడుబారిన తన జీవితం మళ్ళీ చిగురిస్తుందని కలలో కూడా అనుకోలేదు కోమలి.
బసంతిని విడ్చి వెళ్ళాలంటే కోమలికి మనసొప్పడం లేదు. దానికి చేసిన అన్యాయం తనను దహించి వేస్తోంది.
‘ఎంత మూర్ఖంగా వ్యవహరించాను.. బసంతి పెళ్ళి మా వివాహ బంధాన్ని తెంపి వేసిందనే మూఢ నమ్మకంతో బసంతి పీడ వదిలించు కోవాలనుకున్నాను. దాని కూన బంతిని చంపేస్తే బసంతి ఇంటి నుండి వెళ్లి పోతుందని తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఆవాళ క్షణికావేశంలో కత్తిపీటతో బంతిని కొట్టిన దృశ్యం యింకా కళ్ల ముందు సదృశ్యంగా అవహేళన చేస్తోంది... బసంతి మూగ జీవి.. చెప్పుకోలేక పోయింది. అది బంతిని కొట్టడం చూసింది. తనపై దాడికి ప్రయత్నించి కీర్తి ముందు ప్రత్యక్షమైన పామును చూడగానే ఆగిపోయింది. కీర్తిని తన ప్రాణాలకు తెగించి కాపాడింది.. ఆ తరువాత తనపై ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచనే రాలేదు దానికి. మనుషులకే కాని పగలూ ప్రతీకారాలు జంతువులకెక్కడివి?.. ’ అనుకుంటూ మనసులో ఆవేదన పడ సాగింది.. కోమలి కళ్ళు జలపాతాలయ్యాయి.
అప్పగింతల కార్యక్రమం ఉద్వేగంగా మారింది. జగన్నాథం కళ్ళూ చెమ్మగిల్లాయి. తానిప్పుడు కోమలి తండ్రి హోదాలో కైలాసం కుటుంబానికి అప్పగిస్తున్నాడు. హృదయవిదారకరమైన వాతావరణ మార్పు కోసం కైలాసం ధైర్య వచనాలు పలుకసాగాడు.
బసంతి దైన్యంగా చూస్తూ తన నాలుకతో కోమలి పారాణి దిద్దిన పాదాన్ని తడుముతుంటే ‘జరిగిందేదో జరిగింది. గతాన్ని మర్చి పోదాం’ అనే అనుభూతిని పొందింది కోమలి. తన అశ్రునయనాలను తుడ్చుకుంది...
బసంతి మోములో ఆనందం వెల్లివిరిసింది. ‘ఈ శుభ సమయంలో విచారణకు తావు లేదు. ఇది ఆనందిస్తూ నర్తించాల్సిన సమయం’ అన్నట్లుగా బసంతి తన నూతన జతగాడు అయిన టామీని పెనవేసుకుంటూ నృత్యం చేయసాగింది.. కోమలిని నవ్వించాలనే తాపత్రయంతో..*

No comments:

Post a Comment

Pages