ఎస్.ఎం.ఎస్ - అచ్చంగా తెలుగు

ఎస్.ఎం.ఎస్

Share This

ఎస్.ఎం.ఎస్

లక్ష్మి రాఘవ


 “అదేమిటన్నయ్యా వస్తున్నానని ఫోను కూడా చెయ్యలేదు“ శారద అలా అంటుందని రామ్మూర్తికి తెలుసు. “ఏమీ లేదమ్మా కొంచం పని వుండి రావాల్సి వచ్చింది. ముందుగా అనుకోలేదు..” “వదినా పిల్లలూ బాగున్నారా“ “ఆ..బాగున్నారు...బావ ఇంకా నిద్ర లేవలేదా?” “ఆయన యింతవరకు నిద్ర పోతారా? ఆరు గంటలకే మార్ని౦గు వాక్ కి వెళ్లారు. ఇక వచ్చేస్త్తారు కూర్చో“ అంటూ వేడి వేడి గా కాఫి అందించింది. కాఫీ పూర్తి అయ్యేలోపలె బావ శివరాం వచ్చేసాడు. “బాగున్నావా రామూ ర్తీ ....ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తా“అని  బెడ్ రూం లోకి వెళ్ళాడు . శారద పలకరింపు లోనూ, శివరాం మాటల్లోనూ ఎక్కడా తేడా కనపడలేదు. మరి తనను అర్జెంటుగా రమ్మని, శారదకు కూడా తెలియనివ్వద్దని ఎందుకు పిలిచినట్టు బావగారు? ఏ విషయమై వుండవచ్చు....ఇలా  సాగు తున్నాయి  రామూర్తి ఆలోచనలు. ఇంతలో బట్టల్లు మార్చుకుని ముఖం  టవలు తో తుడుచుకుంటూ వచ్చాడు శివరాం. “అన్నయ్య కేదో పని వుంది వచ్చాడట“ వంటింట్లోనుండి  భర్తకు కాఫీ తెస్తూ అంది శారద. ఆమె మాటకి రామ్మూర్తి శివరాం వంక చూసాడు. శివరాం  కళ్ళల్లో సైగ అర్థం అయ్యింది. “స్నానం చేసి రెడీ కా  రామ్మూర్తీ, తొమ్మిదింటికి నేను ఆఫీసు కేళ్ళేటప్పుడు నిన్ను ఎక్కడి కి  వెళ్ళాలో  అక్కడ డ్రాప్ చేస్తాను.” అన్నాడు శివరాం. అన్నట్టే తొమ్మిది గంటలకు బావా, బామ్మర్దులు టిఫన్లు ముగించి కారులో బయలు దేరారు. రోడ్డు మలుపు తిరగ్గానే శివరాం అన్నాడు “నిన్నోక్కటి అడగాలి రామ్మూర్తీ “ “అడగండి బావా” “శారదకు తెలిసిన ప్రసాద్ అన్న వ్యక్తీ ఎవరు?” “ప్రసాదా...??“ ఒక్క క్షణం ఆశ్చర్యం గా అన్నాడు రామ్మూర్తి. శివరాం పెళ్లి అయిన 25 సంవత్చరాలకు ఇలా అడుగు తాడని, తానూ జవాబు చెప్పాల్సి వస్తుందని కలలో కూడావూహించలేదు రామ్మూర్తి..అందుకే వెంటనే జవాబు చెప్పలేక పోయాడు. “ఏమి  రామ్మూర్తీ , మాట్లాడవు?” శివరాం ప్రశ్నకు “ప్రసాద్   నాకు తెలుసు“ “ఎప్పటి నుండి?” “బావా మీరెందుకిలా అడుగు తున్నారో నాకు తెలియదు..కానీ మీరు ముందు కారణం ఏమిటో చెప్పండి“ “ఈమధ్య శారదకు తరచూ  SMS  లు వస్తున్నాయి“ “ఎవరిదగ్గరి నుండి?” “ప్రసాదు ఫోను నుండి“ “ప్రసాదు ఫోను అని మీకెలా తెలుసు“ “కనుక్కున్నాను“ “ఎలా“ “ఎలాగైతేనేమి లే ఆ నెంబరు ప్రసాద్ అనే వ్యక్తిది“ “SMS  లు ఏమి వస్తున్నాయి?” “ఫోనులో మాట్లాడమని  కొన్ని రోజులు, అర్జంటు గా కలవాలని తరువాత వచ్చాయి“ “అంటే మీరు శారద ఫోను తరచూ చెక్ చేస్తారా?” అసహ్యయ కరమైన చూపు చూసాడు శివరాం ని. “ఎప్పుడు చెక్ చెయ్యలేదు  రామ్మూర్తి, కాని ఒక రోజు మద్యాహ్నం అనుకోకుండా భోజనానికి వచ్చాను. అప్పుడు ఫోను వస్తే శారద ఫోను కట్ చేసింది మళ్ళి రెండు నిమిషాలలో ఫోను వస్తే ఫోను తీసుకుని వంటింట్లోకి వెళ్లి “నాకు ఫోను చెయ్యద్దు అని గట్టిగా చెప్పడం వినబడింది. తను నాకు ఫోను గురించి ఏమైనా చెబుతున్దేమోనని చూసాను తను చెప్పలేదు. నాకూ అప్పుడే అడగాలనిపించలేదు. నిదానంగా చెబుతున్దేమోనని వెయిట్ చేసాను పది రోజులు. చెప్పలేదు. పోనీ అన్య్మనస్కగా వుందా అంటే అదీ లేదు ,హాయిగానే వుంది. అంటే నేను లేనప్పుడు ఫోన్లు వస్తున్నా యేమో. అందుకే మాములుగా వుందేమో..నేను  ఈవిషయం డైరెక్టు గా అడిగి వుండవచ్చు  కానే తనే నాకు చెప్పవచ్చు కదా అని పంతం. చివరకు రెండు రోజుల క్రితం శారద పక్కింటి కి పెరంటాని కి వెడుతూ తన మొబైలు మర్చిపోయింది. తను ఇంట్లో లేకుండా ఫోను కనబడడం తో క్యూరియాసిటి తట్టు కోలేక తన SMS లు చెక్ చేసాను.  ఎక్కువగా ఒక్క సారి  మాట్లాడితే చాలు అని వున్నాయి. “శారద అవన్నీ డిలీట్ చేసి వుండవచ్చు కదా“ “అదే నాకు అర్థం కాలేదు..నేను చెక్ చెయ్యను అది నా సంస్కారం  అనుకుని వురుకుందా? అయినా ఇలా చేస్తున్నాడు ఈ వ్యక్తీ అని చెప్పలేదు ఒక్క మాటైనా. అందుకే  ఆ నెంబరు ఎవరిదా అని కనుక్కోవలసి వచ్చింది. కనుక్కున్నాక అది ఒక మగాడిది అని తెలుసు కున్నాక ఎందుకో తనను అడగటం కన్నా నీ ద్వారా తెలుసు కుందామనిపించి నిన్ను రమ్మని  ఫోను చేశా..ఇంత చెబుతున్నా  నీవు ఎందుకు ప్రసాదు ఎవరో చెప్పడం లేదు ? ఏదైనా దాస్తున్నవా? “ఇందులో దాచ్చాల్సినది ఏమీ లేదు బావా..శారదకు మేము మొదట ఫ్హిక్స్ చేసిన సంబంధం  ప్రసాదు దే  కాని అది తప్పి పోయింది “ “ఎందుకు తప్పిపోయింది?” “ప్రసాదు శారదను ఏదో పెళ్లి లో చూసి ఇష్టపడి, తానుగా ఇంటికి వచ్చి నాన్నను అడిగాడు. పెద్దలతో మాట్లాడు తాము అన్నాము. ‘శారద ను కూడా అడిగి చెప్పండి. మళ్ళి మా పెద్దలను తీసుకు వస్తాను‘ అన్నాడు. అతని ఉద్యోగం వయసు వివరాలు అన్నీ విచారించుకున్నాక మాకు బాగానే అని పించింది. శారద ఏనాడు నాన్న మాటను కాదన లేదు. మరో సారి వచ్చి  వాళ్ళ నాన్నగారు, అమ్మా వస్తారని నిశ్చితార్థం చేసుకుందామని చెప్పాడు. అప్పుడు శారదతో ఒక సారి మాట్లాడతానని అడిగితె నాన్న కాదనలేదు. ఆరోజు ఇంట్లోనే ఒక అరగంట శారదతో మాట్లాడినాడు. శారదాను ఎక్కడ చూసాడో, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకోవాలను కున్నాడో  చెప్పాడట. శారద కుడా కోరి వచ్చిన వరుడని సంతోషపడింది. శ్రావణ మాసం లో వాళ్ళు వచ్చి మాట్లాడి డేటు ఫిక్స్ చేసుకునే టట్టు అనుకున్నాము. ఇంతలో వాళ్ళ నాన్న గారి నుండి ఫోను. ప్రసాదు కు తన అత్తకూతురుతో  పెళ్లి ఖాయం  అయ్యిందని అందు వలన మీరు వేరే సంబంధం చూసుకోండి అనీ. ఆ తరువాత ప్రసాదు ఒక్కసారి కూడా కలవలేదు శారద కంటే ఎక్కువ షాకు తిన్నది నాన్న. కుదిరిన మొదటి సంబంధం అనటం కన్నా అత్త కూతురు వుంటే  తనకు తానూ గా వచ్చి శారదను పెళ్లి చేసు కుంటానని ఎందుకు రావాలి?. ఆ తరువాత ప్రసాదు ఒక్కసారి కూడా కలవలేదు.. ”తప్పి పోయిందని  వదిలెయ్యండి నాన్న “ అని శారద అన్నా నాన్న చాల రోజులే బాధపడ్డాడు. అప్పుడు కూడా శారద దైర్యం చెప్పింది “మన అదృష్టం బాగుంటే ఇంకా మంచి సంబంధం కుదురు తున్దిలే “అని. అది అన్నట్టు గానే మీ సంబంధం వచ్చింది. చక చకా పెళ్లి వరకు వచ్చేసింది. అంతా హ్యాపీ గా అయిపొయింది. ఇది జరిగి యిన్నళ్ళ తరువాత ఇప్పుడెందుకు ప్రసాద్ మాట్లాడాలని అనుకుంటున్నాడో తెలియదు. శారదకు నచ్చక దానికి జవాబు ఇచ్చి వుండదు అనుకుంటున్నాను.. మీకేదైనా అనుమానమా?” ఇంతే తను చెప్పాల్సింది అని ముగించాడు రామ్మూర్తి. “శారద మీద అనుమానం అని కాదు రామ్ముర్తీ. తను నాకు ఎందుకు చెప్పలేదు అన్నది బాధ“ “మీకు తెలియనే కూడదు అనుకుంటే  ఎస్. యం . యస్ . లు డిలీట్ చేసెయ్యొచ్చు కదా. అలాగే వుంచిందంటే తను గిల్టీ  కాదు అనిపించదా“ “అది నిజమే. డిలీట్ చేసేసి వుంటే ఈ పరిస్థితి వుండేదే కాదు కదా“ “మరేమి చేద్దాం బావా, నన్ను అడగ మంటావా?” “వద్దు రామ్మూర్తి, ఒక పని చేద్దాం. ఆ నెంబరు నీకు ఇస్తా. నీవు అతనితో మాట్లాడు. కారణం ఏమిటో తెలుస్తుంది.” “నాకేందుకో  శారద నే అడిగేస్తే బాగుంటుంది అని పిస్తుంది బావా“ “వద్దు..వద్దు...తనకు నాకు మద్య వున్న అనుభందం లో ఇలాటిది కలతలు సృష్టించకూడదు. నన్ను అర్థం  చేసుకో“ వాళ్ళ సంసారంలో కలతలు ఎందుకు అనిపించింది రామ్మూర్తికి కూడా. “సరే ఫోను నెంబరు ఇవ్వండి“ ప్రసాదుకు నెంబరు ఇచ్చాడు శివరాం. “మీరు ఆఫీసు లో వుండండి బావా, నేను మాట్లాడతా“ అలా ఎందుకు అని ప్రశ్నించకుండా తన ఆఫీసుకు వెళ్ళాడు శివరాం. ఆఫీసు బయటనుండే ఆ నెంబరుకు ఫోను చేసాడు రామ్మూర్తి “హలో“ అవతలివైపు గొంతు  గుర్తు పట్టేలా లేదు. “ఎవరు“ అన్నారు మళ్లి “మీ పేరు ప్రసాదేనా ?” “అవునండీ.. మీరెవరు?” “నేను శారద అన్నయ్య రామ్మూర్తి ని“ “రామ్మూర్తి గారు...” ఆగొంతులో సంతోషం కొట్టోచ్చేలా వుంది “మీరు ఒకసారి నన్ను కలుస్త్టారా“ “ముందు ఇది చెప్పండి ప్రసాదు గారు. మీరు శారదకు   SMS లు ఎందుకు ఇస్తున్నారు?” “వివరంగా చెబుతాను ప్లీజ్ రండి “అని address  చెప్పాడు. ఆ అడ్రేస్సు విని కంగారు పడ్డాదు రామ్మూర్తి. గబగబా అటువేడుతున్న ఆటోను ఎక్కి ఫలానా చోటికి అని చెప్పాడు. ఒక్క  అరగంట లో ప్రసాదు ముందు వున్నాడు. బెడ్ లోంచి లేవబోతున్న ప్రసాద్ ను చూసి గుర్తు పట్ట లేదు ఓక క్షణం . అతను వున్నది బసవ తారకం క్యాన్సరు హాస్పిటల్ లో... కీమోతెరఫి వల్ల  కాబోలు జుట్టంతా రాలి పోయింది . “కూర్చోండి రామ్మూర్తి గారూ“ “ఏమైంది మీకు ?  ఎప్పటినుండి క్యాన్సరు ?” “మూడేళ్ళ నుండి.” “మీరు ఈ కండిషను లో వుంటూ శారదకు ఫోను మీద  సతాయింపు లేందుకు చెప్పండి“ కొంచం నిష్టూరంగా అన్నాడు “రామ్మూర్తి గారు నాకు క్యాన్సరు ఫైనల్ స్టేజి లో వుంది. బతికితే ఇంకో రెండు నెలలు అంతలోగా శారదకు తన జీవితం లో నుండి ఎందుకు తప్పు కున్నానో తెలియచేయ్యాలని“ “అది తెలియ చెయ్యాలని అనిపించడానికి 25 years పట్టిందా? మీకు వేరే పెళ్లి చేసుకుంటున్నారని తెలిపినప్పుడే మేము మీ గురించి మరచి పోయ్యాము. శారద పెళ్ళయి లక్షణం గా కాపురం చేసు కుంటూ వుంది. ఇప్పుడు మీరు మాట్లాడ్డానికి ప్రయత్నించడం భావ్యమేనా?” “ నేను తప్పు చేసాను. మీకు వివరంగా చెప్పి వుండాల్సింది. పెళ్లి చేసుకున్నాను నిజమే, శారద  పెళ్ళయినట్టు తెలుసు కున్నాను కానీ నేను చేసిన తప్పు వూరకనే పోలేదు. నా భార్య  కూడా చని పోయింది. నాకెవ్వరూ మిగలలేదు. క్యాన్సరు నన్ను కబలించేసింది. చావు దగ్గరిలో వుంది అన్నప్పటి నుండి  ఒకసారి క్షమాపణ అడగాలని అనుకున్నాను దానికి సాను కూలంగా దేవుడు నాకు శారద నెంబరు తెలిసేలా చేసాడు. కానీ నేను ఫోను చెయ్యగానే  ‘మీతో నాకు మాటలు అనవసరం“  అని పెట్టేసారు. ఎన్ని SMS లు ఇచ్చినా, ఎంత రిక్వెస్ట్ చేసినా  ఆవిడ మనసు కరగలేదు. మీరు వచ్చారంటే మీకు చెప్పి వుండ వచ్చు. రామ్మూర్తి గారూ మీతో చెప్పుకున్నా  చాలు అనిపిస్తోంది. నేను శారద ను ఇష్టపడి పెళ్లి కి మావాళ్ళను  ఒప్పించినా నాకు మేనరికం వుండటం వల్ల మా ఇంట్లో వాళ్ళు అయిష్టంగా వున్నారు ఇంతలో నా మరదలు సూసైడ్ ని ప్రయత్నిచింది. దానితో పెద్ద గొడవ అయ్యింది.  అప్పుడు నాన్నమాటలకు తలవొగ్గి  ఆ పెళ్లి చేసుకున్నా. మీ కు చెప్పే దైర్యం లేకపోయింది. చాల రోజులు బాధ పడ్డాను. జీవితం లో నాకుగా నేను తీసుకున్న నిర్ణయం శారదను పెళ్లి చేసుకోవాలని. అది జరగక పొగా నేను మీతో మాట్లాడి వస్తానంటే నాన్న గారే మీకు ‘పెళ్లి కాన్సెల్ ‘ అని చెప్పెసానని అనటం తో నాకూ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. అటు  మేనత్తా ఒకటే పట్టు పెళ్లి తొందరగా అయిపోవాలని....తరువాత  రోజుల్లో శారదకు పెళ్లి కుదరటం, పెళ్లి  అవటం దాకా తెలుసుకున్నాను. నా పెళ్లి నిర్ణయమే నా పతనానికి నాంది తెలుసుకోలేక పోయాను. ఆఫీసు లో ఏదో గోడవై ఉద్యోగం పొయింది...భార్యకు ఎప్పుడూ అనారోగ్యం. పిల్లలు పుట్టినా మిగలలేదు. నా జీవితం చూసి అమ్మ, నాన్న కుమిలిపోతూనే తనువు చాలించారు..ఆఖరికి నాభార్య కూడా అనారోగ్యం తో చని పోయింది. ఇక నాకు ఈ వ్యాధి వచ్చి  నా ఆస్తి అంతా హరించుకు పోయింది. ఇక ఎన్నో రోజులు బతకను...నేను శారదకు ఏమి చెప్పకుండా తన జీవితం లో నుండి తప్పుకుని  చాలా తప్పు చేసానని, అది ఒప్పుకుంటే  ప్రాయశ్చిత్తం మాట ఎలావున్నా నా ప్రాణం ప్రశాంతంగా పోతుందని అనిపించింది. అందు కే తనతో ఒక్క సారి మాట్లాడాలని అనుకున్నానే తప్ప వేరే ఉద్దేశాలు లేవండి...” మద్య మద్యలో ఆపుతూ ఆయాసంగా ముగించాడు ప్రసాద్ . “ప్రసాద్..కొన్ని కొన్ని ఎందుకు జరుగుతాయో చెప్పలేము. కారణాలు వెతుక్కుంటా ము. అదో తృప్తి అంతే. నేను శారదకు చెబుతాను. మీరు నిశ్చింతగా వుండండి“ అని చెబుతూ వుంటే అతని కళ్ళల్లో కలిగిన సంతోషానికి రామ్మూర్తి కళ్ళు చెమ్మగిల్లాయి..అతని దగ్గర సెలవు తీసుకుని ఆటో ఎక్కి శివరాం ఆఫీసుకి వచ్చాడు. “ఏమిటి ఇంతసేపు అయ్యింది ? మాట్లాడావా” అని అడిగాడు శివరాం. రామ్మూర్తి కొంచం సేపు మాట్లాడలేక పొయ్యాడు. శివరాం కి ఏమైందో అర్థం కాలేదు. రామ్మూర్తికి మంచినీళ్ళు, కాఫీ తెప్పించాడు అవి తీసుకున్నాక శివరాం కు ప్రసాద్ పరిస్థితి చెప్పాడు. శివరాం కి కూడా బాధేసింది తను శారదను తప్పుగా అనుకున్నందుకు. రామ్మూర్తి ఇంటికి వేడతానంటే తానూ వస్తానని  శివరాం కూడ బయలు దేరాడు . అనుకోకుండా ఇంటికి వచ్చిన వారిద్దరినీ చూసి ఆశ్చర్య పోయింది శారద. “ఏమిటీ అన్న వచ్చాడని ఆపీసు మానేశారా?” “రామ్మూర్తి పని చూసుకుని నేరుగా ఆఫీసు కే వచ్చాడు. మళ్ళి రేపు వూరికి వేడతానంటు వుంటే  నేనూ వచ్చేసా “ అన్నాడు శివరాం. “ఏమిటి అన్నయ్య పని అయిపోగానే వెళ్ళాల్సిందేనా..రెండు రోజులు  వుండ వచ్చు కదా“ “లేదమ్మా..ఏదో అర్జంటు పని పడితేనే రావాల్సి వచ్చింది. ఈసారి మీ వదిన ,పిల్లలతో కలసి వస్తాములే“ భోజనం తరువాత శివరాం  “ నేను కాస్సేపు పడుకుంటా కానీ ,నీవు కూడా కాస్సేపు రెస్టు తీసుకో “”అని బెడ్రూం లోకి వెళ్ళాడు. వారి బెడ్రూం పక్కనే వున్నా గెస్టు రూం లోకి రామ్మూర్తి  పడుకోవడానికి వచ్చాడు. శారద కూడా పని ముగించుకుని అన్న దగ్గరకు వచ్చింది శివరాం కు శారదను అనుమానించి నందుకు చాలా బాధగా వుంది నిద్ర పట్ట లేదు.  పైగా   రామ్మూర్తి శారద ఏమి మాట్లాడు కుంటారో అని ఆత్రుత వుండడం తో ఒక చెవి అటు వేసి వుంచాడు . “శారదా, నీ కొడుకు రజిత్ చదువు వచ్చే యాడాది కి అయిపోతుంది కదా“ “అవునన్నయ్యా. క్యాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగం వస్తుందని గ్యారెంటీ.  వాడు ఉద్యోగం లో చేరితే ఇక నిశ్చింత.” “ఒక్కడి ని కన్నా  బాగా చదివే కుర్రాడి ని కన్నావులే.“ నవ్వుతు అన్నాడు రామ్మూర్తి. “అన్నయ్య నీకో విషయం చెప్పాలి.“ శారద మాటలకు శివరాం అలెర్ట్ అయ్యాడు పక్క రూం లో. “ఏమిటి ?” “నీకు ప్రసాద్ గుర్తున్నాడా?” “గుర్తు లేకేం...తప్పిపోయిన సంబంధం మరచిపోయినా పేరు గుర్తుంది“ “అతను నాతొ మాట్లాడాలని ఫోను చేసాడు. నేను ఒద్దంటే ఒకటే  SMS లు యిస్తున్నాడు. ఒక సారి కలవాలనీ, మాట్లాడాలనీ...నాకు తలచుకుంటేనే అసహ్యంగా వుంది. ఒక వారం నుండి మీ బావగారికి చెప్పాలని చూస్తున్నాను . ధైర్యం చేయలేక పోతున్నాను. అతనెవరు అంటే పాత కథ అంతా చెప్పాలి కదా.” “చెప్పేస్తే పోలా “ “చెప్పాలనే  మేసేజ్స్ అలాగే వుంచా....” “పోనీ  చెప్పే అవసరం లేదని అన్నీ డిలీట్  చేసేయ్” “నాకు గిల్టీ గా వుంటుంది అన్నయ్యా పెళ్లి ఒక ప్రేమ బంధం కన్నా ఒక నమ్మకం అని నా అభిప్రాయం. ఎప్పటికైనా మీ బావకు తెలిస్తేబాగుండదు కదా“ “నీ మనసు స్వచ్చంగా వున్నప్పుడు ఇది పట్టించుకునే అవసరమే లేదు. ఇద్దరి మద్యా రహస్యాలు వద్దు అనుకుంటే తప్ప చెప్పడం అనవసరం అని పిస్తుంది నాకు.” “అలా అనుకుని డిలీట్ చేశాననుకో ఒక వేళ మళ్ళీ వస్తే చెప్పాల్సి వస్తుంది కదా“ “మళ్ళీ రావులే“ “అదెలా చెబుతావు ?” వెంటనే అడిగింది శారద . “అల్లా అనిపిస్తూంది నాకు “ “ఇప్పుడు నా మనస్సు తేలికైంది అన్నయ్యా...పడుకో..”అని లేచింది శారద. పక్క రూం లో ఇదంతా విన్న శివరాం శారద తనమీద వుంచిన నమ్మకాన్ని చరిచి చెప్పినట్టయింది. SMS ల గొడవ ఏమైనా వివాహ బంధం లో ఒకరి మీ ద ఒకరికి నమ్మకం వుండాలిగానీ ఎలాటి సమస్యలైనా గాలిలో తెలిపోయేవే అని తెలియ చెప్పింది . శారద వ్యక్తిత్వం ఆకాశానికి లేచి ఆమె ముందు తను మరుగుజ్జులా ఫీల్ అయ్యాడు శివరాం.    

No comments:

Post a Comment

Pages