గెలుపెవరిది? - అచ్చంగా తెలుగు

గెలుపెవరిది?

Share This

       గెలుపెవరిది?

- బి.హరిత 


"లేవోయ్, ఈ రోజు సాహితిని స్కూలుకు పంపవా? ఇంకా పడుకున్నావ్" ఒక శనివారం పొద్దున్నే నన్ను నిద్రలేపుతూ అడిగారు మా ఆయన.
"అబ్బ ఇవాళ పక్కమీదనుంచీ లేవబుద్ధి కావట్లేదండీ. మీకు సెలవేగా! ఇదొక్క రోజూ పాపాయిని మీరు తయారు చేసి పంపరూ?" బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ అన్నాను నేను.
"చెయ్యలేక కాదు నేను ఒకరోజు దాన్ని తయారు చేసి స్కూలుకు దిగబెడితే, అది రోజూ ఇంక నాన్నే దింపాలి అని కూర్చుంటే నా గతేం కాను? అదే నా భయం. లేకపోతే ఆఫీసులో నేను చేసే పనులతో పోలిస్తే ఈ పనొక లెక్కా? నువ్వైతే దాన్ని స్కూలుకు పంపడం ఒక యజ్ఞంలా ఫీలయిపోతూ పేద్ద హడావిడి చేస్తావు కాని" ఎద్దేవా చేశారు ఆయన.
చిర్రెత్తుకొచ్చింది నాకు. "ఈ కబుర్లకేమీ తక్కువ లేదు. ఏదీ ఒక్క రోజు మీరు దాన్ని సంబాళించండి. చూద్దాం"
"ఏం నాతోనే సవాలా? సరే పందెం కాద్దాం అయితే. ఈ రోజు పూర్తిగా పాప సంగతి నేను చూసుకుంటాను. నీలా హడావిడి చేయకుండా, దాని మీద పెద్ద పెద్దగా అరవకుండా, కాళికా నృత్యం చేయకుండా అలవోకగా చేసేస్తాను. అలా చేయగలిగినట్లైతే నువ్వు ఓడిపోయినట్లు. ఇంకెప్పుడూ నువ్వేదో పెద్ద భూభారాన్ని మోస్తున్నట్లు ఫోజులు కొట్టకుండా నేను గెలిచానని ఒప్పుకోవాలి. లేదా? నువ్వు గెలిచిన పక్షంలో ప్రతీ శనివారం పాపాయిని నేనే తయారుచేసి, స్కూలుకు దిగబెడతాను. సరేనా?"
ముందు ఈ శనివారం పని బాధ తప్పుతుందని ఆనందంగా ఒప్పుకున్నా.
వెంటనే వెళ్ళి చిట్టి దాన్ని లేపారు, "ఈరోజు నేనే నిన్ను తయారు చేసి స్కూలుకు పంపుతా, లే నాన్నా" అంటూ. టక్కున లేచి కూర్చుంది నాలుగేళ్ళ మా సిసింద్రీ సాహితి. మొన్నే ఎల్.కీ.జీ.లో వేశాము దాన్ని. మామూలు రోజుల్లో నేనెంత లేపినా లేవదు. ఒక్క క్షణానికి దాని మీద పీకలదాక కోపం వచ్చింది.
బ్రష్ మీద పేస్ట్ వేసి దానిచేతికిచ్చారు. కాసేపటికి, "ఏమోయ్ ఇది పేస్టు మింగేసింది" అదేదో ఘనకార్యం చేసినట్లు ఆనందంగా చెప్పారు.
"ఇవాళ శనివారం కదా తలస్నానం" గుర్తుచేశానాయనకు. కాస్త భయపడ్డట్టు కనపడ్డా అంతలో సర్దుకుని "ఏం బెదిరిస్తున్నావా? చిటికెలో చేసి పారేస్తాను" అంటూ బాత్రూములోకి దాన్ని తీసుకెళ్ళారు. లోపలినుండీ కాసేపటికి మాటలు వినపిస్తున్నాయి. "నాన్నా కళ్ళు మండిపోతున్నాయి. ఇలా తల ఎత్తి ఇక్కడ అడ్డుగా చేయి పెట్టి పోయి, లేకపోతే కళ్ళలోకి పడిపోతుంది" వాళ్ళ నాన్నకు చెబుతోంది నా కూతురు.
ఓసినీ! అనుకున్నాను నేను. నేను ఎంత జాగ్రత్తగా కళ్ళల్లోకి పడకుండా పోసినా ఏదో ఒక వంక పెట్టి ఏడుపెత్తుకుంటుంది. ఇవాళ వాళ్ళ నాన్న పోసేసరికి కళ్ళు మండిపోతున్నా ఎలా పోయాలో వాళ్ళ నాన్నకు సలహాలిస్తోంది. అంతేలే ఎవ్వరికైనా అమ్మ మొహం చూస్తేనే ఏడుపు గుర్తొస్తుంది.
"అమ్మా! నాన్న జుత్తు పీకేస్తున్నారు" పిలకలు వేయించుకుంటూ అరచింది చిట్టితల్లి పక్క గదిలోంచీ. "దానిని జుత్తు పీకడం అనరు నాన్నా, జడ వేయడం అంటారు. ఏమండీ కాస్త మృదువుగా వేయండి, తల్లిగాడు భయపడుతున్నాడు"
"నువ్వేమీ కలగజేసుకో అక్కరలేదు. అయినా నా తల్లికి పిలకలు వేయడంకంటే ఇలా హాయిగా జుత్తు వదిలేస్తేనే బాగుంటుంది", ఇక దాని పిలకలతో తంటాలు పడలేక తీర్మానించేశారు మా వారు.
"జుత్తు కళ్ళలోకి పడుతుందండీ, సాయంత్రం వచ్చేసరికి చింపిరి చింపిరిగా తయారవుతుంది, కావాలంటే ఇదొక్కటీ నేను చేస్తాను" నేను కలగజేసుకోబోయాను.
వద్దన్నట్లు చేయి చూపించి, "నేను వేయలేక కాదు ఇలాగే బాగుందని!  ఏం చిట్టి తల్లీ?" దాని వైపు తిరిగి అడిగారు. దానికి కూడా అదే బాగుంది. సంతోషంగా ఊ కొట్టింది.
"దా ఇంక టిఫిన్ తిందాం. ఏం తింటావు బంగారం?"
"నాన్నా, ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా ఆ బిస్కట్లు."
"పొద్దున్నే బిస్కట్లేంటమ్మా? అవి తింటే కాసేపటికే ఆకలేస్తుంది" నా మామూలు ధోరణిలో చెప్పబోయాను.
"పిల్లలు ఏది ఇష్టంగా తింటే అదే వాళ్ళకి బలం", బిస్కట్లు తెచ్చి ఇస్తూ తన చర్యను సమర్థించుకున్నారు ఆయన.
రోజూ స్కూలుకు నీరసంగా వెళ్ళే నా కూతురు ఈవేళ తన ఉంగరాల ముంగురులు గాలిలో నాట్యం చేస్తూ ఉండగా, బాక్సు పట్టుకుని నవ్వుకుంటూ బై చెప్పి వెళ్ళిపోయింది. నిజం చెప్పొద్దూ, నాకు కొంత అసూయ కలిగిందన్నది నగ్న సత్యం. నిజంగానే నాకే దానిని హాండిల్ చేయడం సరిగ్గా చేతకాదేమో! అనుమానమొచ్చింది.
"ఏమండీ, ఇంత ఆలస్యమయింది?" సాయంత్రం వస్తూనే నా బంగారాన్ని దగ్గరకు తీసుకుంటూ అడిగాను ఆయన్ని. దాని కళ్ళను చూస్తే ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయినట్లున్నాయి. "ఏం లేదోయ్, దారిలో మావాడొకడు కనిపిస్తే మాట్లాడుతూ టైమ్ చూసుకోలేదు. కాస్త ఆలస్యం అయ్యేసరికి పిచ్చిమొద్దు బెంగపెట్టుకుంది" కులాసాగా చెప్పారాయన. ఒళ్ళు మండిపోయింది నాకు.
దాన్ని మళ్ళీ ఉత్సాహపరచడానికి, తనవైపు తిప్పుకోవడానికి పార్కుకు తీసుకువెళ్ళారు. అలసిపోయి వేలాడిన మొహంతో ఓ గంటకి ఆయన తిరిగొచ్చారు. అక్కడ నానా గడ్డీ కొని పెట్టినట్టున్నారు. రాగానే వెలిగిపోతున్న దాని మొహం, ఉబ్బిపోయిన దాని పొట్ట చూస్తే తెలిసిపోయింది.
"చూశారా? మీరు ఏవేవో కొనిపెట్టినట్టున్నారు పార్కులో. అది ఇప్పుడు అన్నం తిననంటోంది. పిల్లలను చూసుకోవడమంటే వాళ్ళకు నచ్చింది కొనిపెట్టడం కాదండీ, వాళ్ళకు మంచిదేదో అది చేయడం", నా అక్కసును వెళ్ళగక్కా. ఆయన అది అవమానంగా ఫీలయి, దానిచేత అన్నం తినిపించడం సవాలుగా తీసుకున్నారు.
"తల్లీ అన్నం తినమ్మా!" "వద్దు నాన్నా, ఆకలేయట్లేదు."
"అలా కాదు తినాల్సిందే! లేకపోతే ఇంజెక్షన్ తీసుకువస్తా" అంటూ పాత సిరెంజ్ ఏదో ఇంట్లో పడి ఉంటే దాన్ని తీసుకొచ్చి బెదిరించారు.
ఆ ఇంజెక్షన్ భయం కొద్దీ నాలుగు ముద్దలు తింది. తరువాత అదిక తినలేకపోయింది. అయినా ఈయన పంతం కొద్దీ పొడుస్తా పొడుస్తా అంటూ అన్నమంతా తినిపించారు. నాకు దాని పరిస్థితి చూస్తే జాలేసింది. ఈయనను అనవసరంగా రెచ్చగొట్టాననిపించింది. ఇంజెక్షన్ భయంవల్లో, పొద్దున్న నుండీ కలగాపులగమైన తిన్న చిరుతిండ్ల వల్లో, ఇప్పుడు బలవంతంగా కుక్కుకున్న అన్నం వల్లో దానికి పెద్ద వాంతయిపోయింది.
కళ్ళల్లోంచి, ముక్కులోంచి నీళ్ళు, ఈయన కూడా కాస్త ఖంగారు పడ్డారు.
ఏడుస్తున్న దాన్ని సముదాయించి, లాలించి, పాటలు పాడి, కథలు చెప్పి మంచం మీద పడుకోబెట్టి, తిరిగొచ్చి అంతా కడుక్కుని, ఇల్లు ఫినాయిల్ తో తుడుచుకుని పడుకునేసరికి పన్నెండు.
మరుసటిరోజుకి పాపాయి తేరుకుంది. ఆ రోజు సాయంకాలం టీ తాగుతూ ఆయన అడిగారు, "ఆఁ! ఏవోయ్! ఇంతకీ ఎవరు గెలిచినట్లు?"
ఒక నిముషం విస్తుపోయి అంతలోనే తేరుకుని, "సందేహమా మహాప్రభూ! మీరే గెలిచారు" ఖంగారుగా ఓటమిని అంగీకరించాను పందెం షరతు గుర్తు తెచ్చుకుంటూ.
ఇద్దరం ఊపిరి పీల్చుకున్నాము.

No comments:

Post a Comment

Pages