దోసామృతం - అచ్చంగా తెలుగు

దోసామృతం

Share This

దోసామృతం

( సరదా కథ )

మల్లాది వేంకట గోపాలకృష్ణ

రామనాథానికి దోసకాయంటే మహా ఇష్టం. ఎనలేని ఆపేక్ష. పిచ్చి. రోజూ దోసకాయతో చేసిన ఐటెమ్ లేకపోతే ముద్ద కూడా దిగదు. దోసకాయ కూర రోజూ మూడుపూట్లా చేసినా లొట్టలేసుకుని తినేస్తాడు. శనివారమో, మంగళవారమో ఉపవాసం ఉన్నప్పుడు కూడా దోసకాయ కూరనే ఫలహారంగా తినేస్తాడు. పక్కింటి బామ్మగారు ఓ రోజు తన వాలకం చూసి బుగ్గలు నొక్కుకుంటూ “ఇదెక్కడి చోద్యం నాయనా.. ఉపవాసం ఉన్నప్పుడు ఫలహారం అంటే పళ్లు తినాలి కానీ.. ఇలా దోసకాయ కూరచేసుకుని తింటారా ఎక్కడైనా..?“ అంటూ మూతి ముప్ఫైయ్యారు వంకర్లు తిప్పుతూ ఆక్షేపించేసరికి రామనాథానికి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పట్నుంచీ ప్రతి మంగళవారమూ, శనివారమూ ఎంచక్కా బాగా పండిన దోసకాయలు తెచ్చుకుని తోలుని పీల్ చేసేసి గింజలతో సహా భేషుగ్గా తినెయ్యడం మొదలుపెట్టాడు.
రామనాథం భార్య రమణికి ఇతగాడి దోసకాయ పిచ్చిని చూసి రోజురోజుకీ పిచ్చెక్కిపోతోంది. మొగుడుకదా అని ప్రేమగా గులాబ్ జామూనులు చేసి పెడితే వాటితోపాటుగా దోసకాయ ముక్కల పచ్చడిని నంజుకుని తినేశాడు. రమణికి ఆ టేస్ట్ చూసి కళ్లు తిరిగాయి. అదేమని అడిగితే “నువ్వుకూడా ఓసారి తినిచూడు ఎంత బాగుంటుందో.. మళ్లీ మళ్లీ గులాబ్ జామూనులు చేసినప్పుడల్లా తప్పనిసరిగా నీ అంతకి నువ్వే దోసకాయ ముక్కల పచ్చడికూడా చేసేస్తావు” అనేసరికి రమణికి నోట మాట రాలేదు. రామనాథానికి దోసకాయమీద వ్యామోహం ఏ స్థాయిలో ఉందంటే సినిమాకెళ్లేటప్పుడుకూడా ఓ డబ్బాలో చక్కగా దోసకాయ కూర తీసుకెళ్లి ఇంటర్వెల్లో శుభ్రంగా స్నాక్స్ కింద తినేసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు.  రామనాథం పిచ్చి చేష్టలకి భయపడిపోయిన రమణి అసలు తనని సినిమాకి తీసుకెళ్లమని అడగడమే మానేసింది.
రోజు రోజుకీ రామనాథానికి దోసకాయ మీద వ్యామోహం పెరిగిపోతోంది. ఉన్న రుచులకు తోడుగా కొత్త కొత్త రుచుల్ని దోసకాయ కాంబినేషన్లో కనిపెట్టి వాటిని చెయ్యమని భార్యని తెగ ప్రాధేయపడతాడు. రమణికేమో ఆ కొత్త రుచుల గురించి ఆలోచిస్తేనే అదో రకంగా ఉంటుంది. రోజూ దోసకాయ పప్ప, దోసకాయ కూర, దోసకాయ ముక్కల పచ్చడి, దోసకాయ బజ్జీ, పులుసులో దోసకాయ ముక్కలు, చారులోకూడా దోసకాయ ముక్కలు, దోసకాయ బజ్జీలు, దోసకాయ అదీ దోసకాయ ఇదీ తినీ తినీ అసలు దోసకాయ అన్న పేరంటేనే వెగటు పుట్టేసింది. అదేమంటే నాకు దోసకాయ చేసేసి నీకేం కావాలంటే అది చేసుకోవచ్చుగా అంటూ రామనాథం లైట్ తీసుకుంటాడు. దోసకాయ తప్పితే ఒక్క చిక్కుడు కాయల కూరని మాత్రం తను ఇష్టంగా తింటాడు తప్ప మరో కూర పేరైనా తలచుకునే ప్రశ్నేలేదు. రామనాథం వాలకంతో రమణి పూర్తిగా విసిగిపోయి తనని బెదిరిస్తే మారతాడేమో అన్న ఉద్దేశంతో అసలు పూర్తిగా దోసకాయ వండడమే మానేసింది. రామనాథం తెచ్చిన దోసకాయలన్నింటినీ “దోస ముత్తైదువ నోము” అనే ఓ కొత్త నోము కనిపెట్టి చుట్టుపక్కల పేరంటాళ్లకి ఇవ్వడం మొదలుపెట్టింది.
రామనాథం దిగులుపడిపోయాడు. ముద్ద ముట్టడం మానేశాడు. ఏదోలా మేనేజ్ చేద్దామని రమణి రోజూ చిక్కుడుకాయ కూర చేస్తోంది. కానీ రామనాథానికి ముద్ద దిగడం కష్టంగానే ఉంది. ఓ రకంగా ఇద్దరిమధ్యా దోసకాయ యుద్ధం మొదలయ్యింది. ఎలాగైనా మాన్పించేయాలని రమణి పట్టుదల. ఆరు నూరైనా తనకిష్టమైన దోసకాయని మానేయడానికి వీల్లేదని రామనాథం హఠం. ఇద్దరూ ఎత్తులకు పైయెత్తులు వేస్తూ నెగ్గుకొస్తున్నారు కానీ పట్టుదలని మాత్రం విడిచిపెట్టడం లేదు. మెల్లగా ఈ గోల వీధికి పాకింది. ఇంటి గుట్టుమాత్రం గుట్టుగానే ఉన్నా ఇద్దరిమధ్యా యుద్ధంమాత్రం తారాస్థాయికి చేరుకుంది. రామనాథం దోసకాయలవల్ల కలిగే లాభాలను వివరించేందుకు ఓ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. దోసకాయ గొప్పదనాన్ని వివరిస్తూ ఓ హరికథని రాసి దాన్ని స్వయంగా ఎన్నోచోట్ల పాడి వినిపిస్తున్నాడు.
నాయనలారా.. దోసకాయ అనెడి అమృతం మన మానవులకు వరంగా దొరికిన విధంబెట్టిదనిన.. దేవదానవులు మధియించిరట క్షీరసాగమును.. మంధర గిరినే కవ్వముజేసి.. వాసుకినే తాడుగజేసి.. కింద తలంలో నారాయణుడే కూర్మరూపుడై మూపున గిరినే మోసే.. అయ్యలారా.. ఆ విధంబున క్షీర సాగరాన్ని చిలకగా చిలకగా.. ఉన్నట్టుండి కాలకూట విషం వచ్చింది.. దాన్ని పరమేశ్వరుడు స్వీకరించి తన కంఠంలోనే నిలిపి గరళ కంఠడయ్యాడు.. తర్వాత కొంతకాలానికి చిలకగా చిలకగా అమృతం రానే వచ్చింది.. అమృత భాండాన్ని చూసిన రాక్షసులు దేవతల్ని పక్కకి నెట్టి దాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు వైనతేయుడు అంటే గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని నోట కరచుకుని రివ్వున గాల్లోకి ఎగిరాడు.. అత్యంత వేగంగా ఆయన దాన్ని నోటితో పట్టుకుని శ్రీ మహావిష్ణవు కడకు వెళ్తూ ఉండగా.. పొరపాటున రెండు చుక్కల అమృతం ఆ భాండంనుంచి జారి భూమ్మీద పడిందట.. ఆ రెండుచుక్కల్లో ఒకటి దోసతీగెగా మారిందట.. రెండోది సుర తీగగా మారిందట.. అందువల్లనే భూమ్మీద దోసకాయలు తిన్నవారైనా సరే.. సురని సేవించినవారైనా సరే అమితమైన ఆనందాన్ని పొందగలుగుతున్నారు.. అదన్నమాట.. విషయం.. అంతటి మహత్తు కలిగిన దోసకాయని నిరతమూ సేవించడంవల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం.. దైవానుగ్రహానికి దైవానుగ్రహం.. దేవతల అనుగ్రహం.. పుష్కలంగా కలుగుతాయి నాయనలారా.. “ అంటూ రామనాథం గొంతెత్తి పాడుతుంటే దోసకాయలకు ఫాలోయింగ్ పిచ్చపిచ్చగా పెరిగిపోయి మార్కెట్లో కిలో రెండొందలు పలకడం మొదలయ్యింది.
రామనాథం పేరు చెప్పుకుని మార్కెట్లో కూరగాయల వ్యాపారులంతా దోసకాయల్ని విరివిగా అమ్మడం మొదలుపెట్టారు. దాదాపుగా నెల రోజులు గడిచేసరికి దోసకాయకి మార్కెట్ విపరీతంగా పెరిగిపోయి కోట్ల రూపాయల లాభాలు ఆర్జించే పరిస్థితి కనిపిస్తోంది.  ప్రతి దుకాణానికీ రామనాథం ఫోటో వేళ్లాడుతోంది. వ్యాపారులు పొద్దున్నే కొట్టు తీయగానే ముందుగా రామనాథం ఫోటోకి దణ్ణం పెట్టుకోవడం కూడా సెంటిమెంట్ అయ్యింది. అదేంటో రామనాథం ఫోటోకి దణ్ణం పెట్టుకుని బేరానికి దిగితే నాలుగు రెట్లు ఎక్కువ వ్యాపారం, నాలుగు రెట్లు ఎక్కువ లాభం వస్తున్నాయి. ఈ ఊపుని కొనసాగించేందుకు రామనాథం తన హరికథల్లో సౌందర్య సాధనంగా దోసకాయ ఎలా ఉపయోగపడుతుందోకూడా వివరించి చెప్పడం మొదలుపెట్టాడు. బ్యూటీ పార్లర్లలో కూడా దోసకాయకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. రాష్ట్రంలో అసలు ఈ మధ్యకాలంలో ఎవరైనా వ్యాపారం చేసి బాగుపడ్డారంటే అది కేవలం దోసకాయల బిజినెస్సే అన్నంతగా వ్యాపారం పెరిగిపోయింది.
అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంతకీ రామనాథం పుణ్యమా అని దోసకాయలకు విపరీతమైన మార్కెట్టూ డిమాండ్ పెరిగాయి కానీ రామనాథానికి మాత్రం ఇంట్లో రమణి పచ్చి దోసకాయ వాసనైనా చూపించట్లేదు. నెలరోజులు గడిచేసరికి రామనాథం చప్పిడి అన్నం తినలేకపోయాడు. తనకి అత్యంత ప్రాణప్రదమైన దోసావకాయని చేసి పెడితేనే ఇహ తను ఇంట్లో ఉంటాననీ, లేకపోతే సన్యాసం పుచ్చుకుంటాననీ డిక్లేర్ చేశాడు. నిజానికి సన్యాసం పుచ్చుకోవాలన్న కోరిక ఏమాత్రం లేదుగానీ అట్లాగైనా రమణి మనసు కరుగుతుందేమనన్న ఆశ. రమణికూడా అనుకున్నట్టుగానే కాస్త భయపడింది. ఎందుకొచ్చిన గోల ఈ పాడు దోసకాయ పుణ్యమా అని ప్రాణానికి ప్రాణమైన మొగుడు దూరమవుతాడేమోనని బెంగపట్టుకుంది. కానీ ఓటమిని అంగీకరిస్తే మొత్తం జీవితమంతా దోసకాయే అక్రమిస్తుందన్న భయంకూడా గట్టిగానే ఉండడంవల్ల పట్టిన పట్టుని విడవకుండా కూర్చుంది.
రామనాథం తట్టుకోలేకపోయాడు. పోనీ నువ్వు చెయ్యకపోతేమానె నాకైనా ఆ దోసావకాయ ఎలా పెట్టుకోవాలో చెప్పవే అని బుజ్జగింపుగా అడిగాడు. రమణి విసుక్కుంది. నాకు తెలియదు పొమ్మంది. రామనాథం అవుడియా వేశాడు. దోసావకాయ రెసిపీ ఎవరైనా చెప్పగలరు అని ఓ పోస్ట్ పెట్టేశాడు. పనిలో పనిగా తాను స్వయంగా దోసావకాయ పెట్టుకుని తింటానంటూ ఇంట్లో ఛాలెంజ్ చేశానని కామెంట్ కూడా జత చేశాడు. ఆ కామెంట్ వికటించింది. ఆడలేడీస్ అంతా కామ్ గా ఉండిపోయారు. సాటి ఆడదానికి అండగా ఉండాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. నలభీమ పాకాన్ని సిద్ధం చేయడంలో చేయి తిరిగిన ఓ మారాజు దోసావకాయ ఎట్లా పెట్టాలో వివరిస్తూ తిరుగు తపాని ఫేసుబుక్కులో రామనాథం గోడమీద ముద్రించాడు. చెలరేగిపోయిన రామనాథం మార్కెట్ కెళ్లి ఐదు కిలోల దోసకాయలు, పచ్చడి చేయడానికి కావాల్సిన సంభారాలు తీసుకొచ్చి చకచకా పచ్చడి పెట్టేశాడు. పచ్చడి పెట్టడమైతే పెట్టాడుకానీ ఇప్పుడు మళ్లీ ఎలక కుడితిలో పడింది. ఐదు కిలోల పచ్చడంటే మాటలా.. మొత్తంగా ఓ పెళ్లికి సరిపోతుంది. పచ్చడి చెల్లడం ఎలా అన్నది మీమాంస.
తినడం సంగతి దేవుడెరుగు ముందు కొండలా కనిపిస్తున్న పచ్చడిని కరిగించడంపైన రామనాథం అటెన్షన్ పే చేస్తున్నాడు. ఉన్నట్టుంది మళ్లీ అలవాటు ప్రకారం మరో అవుడియా తట్టింది. దోసావకాయ అనబడే ఆ దోసామృతాన్ని చక్కగా డబ్బాల్లో ప్యాక్ చేసి సుబ్బరంగా పట్టుకెళ్లి రమణికి తెలియకుండా వాళ్లాఫీసులో అందరికీ తలో డబ్బా ఇచ్చొచ్చాడు. పైగా ప్రత్యేకించి ఆఫీస్ కి కూడా మరో డబ్బాని కేటాయించాడు. దోసావకాయకి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందరూ దాని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. లంచ్ అవర్ లో కొలీగ్స్ షేర్ చేస్తే కలుపుకుని లొట్టులేసుకుంటూ తిన్న రమణి..”అబ్బ ఈ దోసావకాయ ఎవరు చేశారో కానీ పుణ్యాత్ములు.. ఎంత బాగుందండీ.. స్వర్గానికి బెత్తెడు దూరమే.. ఎంత రుచి ఎంత రుచి.. “ అంటూ కితాబిచ్చేసింది కూడా. రాధ మాడమ్ చెప్పాకగానీ తెలియలేదు పతిదేవుడు దాన్ని ఇచ్చెళ్లాడని. ఆఫీస్ లో అంతా ఆయన్ని తెగ పొగిడేస్తున్నారు. నలభీమపాకం అని పేరు విన్నాం కానీ మగాళ్లుకూడా ఇంత టేస్టీగా వంటచేస్తారని మీవారి చేతి దోసామృతాన్ని తిన్నాకే తెలిసిందండీ అంటూ కాంప్లిమెంట్ల వర్షం కురిపించారు. ప్రత్యేకించి రామనాధానికి ఫోన్ చేసి వెరీ గుడ్ సార్ కీపిట్ అప్.. అప్పుడప్పుడూ ఇలాంటి వంటకాలు చేసి మాకు రుచిచూడ్డానికి పంపిస్తూ ఉండండి అని ఓ రిక్వెస్ట్ కూడా పెట్టేశారు.
రమణికి కళ్లలో నీళ్లు తిరిగాయి. పాపం మొగుడనేవాడు కడుపునిండా నాలుగు మెతుకులు తృప్తిగా తిని నెలరోజులు దాటిపోయింది. అయినా ఆయన ఏమడిగాడు. కేవలం దోసకాయేకదా. తనేమైనా తాగి తందనాలాడుతున్నాడా,  పక్కచూపులు చూస్తున్నాడా.  ఏమీ లేదుకదా. జస్ట్ దోసకాయంటే ప్రాణం పెడతాడు అంతే కదా. చేసి పెడితే పోయే. కాస్త సినిమాలకీ సింగినాదాలకీ వెళ్లినప్పుడు మాత్రం అక్కడ దొరికే పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్ లు, కూల్ డ్రింక్ లు గట్రా తీసుకుంటే బాగుంటుందని నచ్చజెబితే పోయే. అంతేగా. రమణికి ఇవ్వాళ్లెందుకో ఆగడం వల్ల కావడం లేదు. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్లిపోదామా అనిపిస్తోంది. సాయంత్రం ఆయనకి సర్ ప్రైజ్ ఇవ్వాలి. అన్నీ దోసకాయ ఐటెమ్సే చేసి పెట్టాలి. ఎంతగా బాధ పెట్టింది తను. తలుచుకుని తలుచుకునీ కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అనుకున్నట్టుగానే త్వరత్వరగా బైటపడి బిరబిరా ఇంటికెళ్లి పోయిన రమణి దోసకాయ కూర, దోసకాయ ముక్కల పచ్చడి చేసి చారులోకూడా దోసకాయ ముక్కలు వేసింది. ఇంటికి తొందరగా వచ్చేయండి మీకో సర్ ప్రైజ్ అంటూ మొగుడికి మెసేజ్ కూడా పెట్టింది.
రామనాథం భార్యలో మార్పుని చూసి ఆశ్చర్య పోయాడు. చకచకా కాళ్లు కడుక్కొచ్చి కూర్చుని ఆబగా దోసామృతాన్ని గ్రోలాడు. సుష్టుగా భోంచేసి బ్రేవ్ మని తేన్చాడు. ఏవోయ్.. ఏంటీ నీలో ఈ మార్పుకి కారణం.. అంటూ సరసంకూడా మొదలుపెట్టాడు. రమణి పని త్వరగా ముగించుకుని చకచకా వచ్చేసింది. మొగుడి దగ్గర కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకుందాం అని సంబరపడుతుండగానే పతిదేవుడి సెల్ ఫోన్ బీప్ బీప్ మని చప్పుడు చేసింది. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. పట్టుకెళ్లి ఆయనకిద్దాం అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసింది. అంతే రమణి నెత్తిమీద పిడుగుపడ్డట్టయ్యింది. “ మీరిచ్చిన సలహావల్ల నాకు చాలా మేలు జరిగింది. అన్నట్టుగానే త్వరలోనే మీకు పది కిలోల దోసకాయలు ఫీజుగా ఇస్తాను.. సన్నజాజుల సీత..“  రమణి గుండె ముక్కలయ్యింది. ఓరి నాయనో ఎవత్తీ సన్నజాజుల సీత. మంటరాజుకుంది. విసవిసా మొగడి దగ్గరికెళ్లి ఎవత్తీ సన్నజాజుల సీత.. అది మీకు పది కిలోల దోసకాయలు కానుకగా ఇవ్వడం ఏంటి.. అంత పే…………………………………....ద్ద మనసున్న మనిషా.. అంటూ ముక్కుచీదుతూ, వెక్కిళ్లు పెడుతూ, ముక్కుపుటాలెగరేసుకుంటూ రాగాలు తీసింది.
రామనాథానికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎవరో పాపం ఆవిడ ఈ మధ్యే ఫేస్ బుక్కులో ఫ్రెండయ్యింది. కొంచెం అటూ ఇటూగా మాట కాస్త అదోలా కటువుగా ఉన్నా, రామనాథం పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఒకటిరెండు సార్లు ఫోన్ చేస్తే మాట్లాడాడు. ఏదో సలహా అడిగితే చెప్పాడు. అంతే. ఇచ్చిన ఐడియా వర్కవుట్ అయినట్టుంది. చాలా రోజులుగా మీడియాలో దోసకాయలపట్ల తాను కల్పిస్తున్న అవగాహన గురించి చూసో, వినో ఉంటుంది. ఆ క్యాంపెయిన్ కి ప్రభావితురాలై ఉంటుంది. అందుకే కాస్త ఆపేక్షగా పది కిలోల దోసకాయల్ని కానుకగా ఇస్తానని మెసేజ్ పెట్టుంటుంది. ఇందులో దురర్ధం ఏంటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా రామనాథానికి వెలిగి చావలా.. అవతల రోజురోజుకీ రమణి కత్తి నూర్పులు ఎక్కువై పోయాయి. సూటి పోటి మాటలు, నిందలు నిష్టూరాలూ పెరిగిపోయాయి. అవునులే నా మీద మీకు ప్రేమ తగ్గిపోయింది. అంతేలే అంటూ రాచి రంపాన పెట్టడం కూడా పెరిగిపోయింది. అన్యాయంగా రామనాథం ఓ మెసేజ్ కి బలైపోయాడు. అదికూడా ఎవరో పది కిలోల దోసకాయల్ని మీకు త్వరలోనే కానుకగా ఇస్తానంటూ పెట్టిన మెసేజ్. దేవుడా.. నా కష్టాలకు అంతే లేదా.. అంటూ ఎన్ని విధాలుగా ఎందరు దేవుళ్లకు మొరపెట్టుకున్నాడో లెక్కేలేదు.
ఏ దేవుడు కరుణించాడో తెలీదుగానీ ఉన్నట్టుంది ఓ రోజున రామనాథానికి జ్ఞాన జ్యోతి వెలిగింది. ఆదివారంపూట ఇంట్లో కూర్చుని సినిమా చూస్తున్నాడు. బెడ్రూమ్ సీన్.. రాఘవేంద్రరావుగారి సినిమా.. హీరో చెలరేగి హీరోయిన్ అందచందాల్ని వర్ణిస్తూ పాడేస్తున్నాడు.. బత్తాయిలు, యాపిల్స్, దానిమ్మపండ్లు ఒకటేమిటి రకరకాల పళ్లు.. తెగ దొర్లి పడుతున్నాయి. హీరోయిన్ వాటి స్పర్శకి మెలికలు తిరిగిపోతూ, సిగ్గుని కాస్త ఎక్కువగానే ఒలకబోస్తూ తన్మయత్వంతో తెగ అభినయించేస్తోంది. చటుక్కున్న రామనాథానికి జ్ఞాపకం వచ్చింది. దోసబుద్ధితో, దోసకాయమీద అమితమైన ప్రేమతో రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ప్రపంచాన్నంతటినీ దోసకాయ స్వరూపంగా భావించే తను ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియని తనంతో, అజ్ఞానంతో ఇలాగే రమణీ తనూ కలిసి ఓ సినిమా చూస్తున్న టైమ్ లో దోసకాయతో హీరోయిన్ సౌందర్యానికి సాపత్యం చెబుతూ అద్భుతంగా వర్ణించిన విషయం చటుక్కున గుర్తొచ్చింది. వెంటనే ఏం చేయాలో ఫ్లాష్ వెలిగింది.
మర్నాడే రామనాథం సెల్ కి సదరు మెసేజ్ పెట్టిన సన్నజాజుల సీత వీళ్లింటికి దిగబడడం, పది కిలోల శ్రేష్టమైన దోసకాయల్ని కానుకగా ఇవ్వడం, తాను పడ్డ కష్టం గురించి, దాన్నుంచి బైటపడ్డానికి రామనాథం చెప్పిన సలహా గురించీ రమణికి చెప్పడం, అన్నింటికన్నా ముఖ్యంగా ఆ సన్నజాజుల రమణి ఓ సాంఘిక సంస్కర్త కావడం, ఆమెకి ఎనభై రెండేళ్లుండడం.. తర్వాత ఏం జరిగుంటుందో ప్రత్యేకించి చెప్పఖ్కర్లేదు కదూ. రమణి అనుమానం పటాపంచలైపోయింది. రామనాథం బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజునుంచి తనకి అత్యంత ప్రీతికరమైన దోసకాయమీద రామనాథానికి ఉన్నట్టుండి విరక్తి కలిగింది. పూర్తిగా దోసకాయ తినడం మానేశాడు. కానీ విచిత్రంగా రమణికి మాత్రం ఇవన్నీ ఏమీ తెలియక దోసకాయ కూర చేస్తూనే ఉంది. రామనాథం తిన్నట్టు నటిస్తూనే ఉన్నాడు. ఓ నాటికి రామనాథం దోసకాయలు తింటలేదన్న విషయం రమణికి అర్ధమైపోయింది. తాను కోరుకున్నదీ అదే కాబట్టి.. ఆమెకి పట్టలేని ఆనందం కలిగింది. ఇంక చెప్పడానికేముంది.. చెప్పండి.. కథ కంచికి.. రామనాథం కాపురం ఆనండడోలికల్లోకి.. మనమంతా మనమన పనుల్లోకి.. ఏమంటారు..

No comments:

Post a Comment

Pages