‘సంగీత కళానిధి’ షేక్ చినమౌలానా - అచ్చంగా తెలుగు

‘సంగీత కళానిధి’ షేక్ చినమౌలానా

Share This
‘సంగీత కళానిధి’ షేక్ చినమౌలానా 
 - భావరాజు పద్మిని 

ఆయనకు ఆలయమైనా, మసీదైనా, చర్చైనా ఒక్కటే ! నాదోపాసకులకు మత భేదం లేదు అని చెప్తూ, శ్రోతల హృదయాల్లో మంగళవాద్యం మ్రోగించిన గొప్ప నాదస్వర విద్వాంసులు, సంగీత కళానిధి ‘షేక్ చినమౌలానా ‘ గారి గురించిన విశేషాలు ఈ సంచికలో తెలుసుకుందాం... నాదస్వరం పేరెత్తగానే ఆంధ్రులందరికీ నాదస్వర విద్వాన్ షేక్ చినమౌలానా స్ఫురణకు వస్తారు. ఈయన 1924 మే 12న ఒంగోలు జిల్లా కరవది గ్రామంలో జన్మించారు. వంశపార్యంగా నాదస్వరం మౌలా వాళ్ళ ఆస్తి! ఒకటిగాదు రెండుగాదు, దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచీ కరవది దేవాలయానికి ఆస్థాన విద్వాంసులు. చిన్నతనంలోనే తన పూర్వీకులైన పెద్దపీరు, చిన్నపీరు వంటివారి గురించి తెలుసుకున్న చిన్నమౌలా అంతటివారు కావాలని, సంకల్పించారు. మొదట తండ్రివద్ద, తర్వాత పెదనాన్న వద్ద, తర్వాత చిలకలూరిపేట ఆదం సాహెబ్ గారి వద్ద నాదస్వర వాద్యాన్ని అభ్యసించారు. పదేళ్ళ వయసులోనే కరవది ఆలయంలో కచేరీ చేసారు. ఆపై అనేక కచేరీలు చేస్తూ, చిన్న పిల్లలకు పాఠాలు చెప్తూ, తమిళనాట నాదస్వర చక్రవర్తి పిళ్ళై గారి రికార్డు విని, ముగ్ధులై, ఎలాగైనా వారివద్ద నాదస్వర వాద్యంలో మెళకువలు అభ్యసించాలన్న సంకల్పంతో వారి గురుకులంలో చేరారు. ఏడాదికి రెండు నెలలు వారి గురుకులంలో గడిపేవారు. ఆయన తమిళనాట తొలి కచేరి 1960 లో కచేరీ చేసారు. దానితో తమిళనాట ఆయన కచేరీల పరంపర మొదలయ్యింది. అది ఓర్వలేని కొందరు తమిళ విద్వాంసులు, ఆయనకు ఎవరూ డోలు వాయించకూడదని నిబంధన విధించారు. అయినా, ఎ. షణ్ముగ సుందరం పిళ్ళై మాత్రం ఆయన ఔనత్యం చూసి, ఆయనకు వాద్యసహకారం అందించారు. అప్పటి నుంచి ౩౦ ఏళ్ళు వారి అనుబంధం కొనసాగింది. పుట్టడం ముస్లిం గానే నయినా, ఆయన ఇల్లూ, ఆచార్యవ్యవహారాలూ వైదిక సాంప్రదాయాన్ని ప్రతిబింబించేవి. వారి ఇంట్లో ఖురాన్ కు సంబంధించిన ఫొటోలతో పాటు శ్రీరంగనాధ స్వామి, శ్రీ రామ పంచాయతనం ఇత్యాది ఫోటోలు ఉండేవి. పర్వీన్ సుల్తానా చక్కగా కుంకుమ బొట్టు పెట్టు కునేది. పట్టుబట్ట కట్టడం, కుంకుమ బొట్టుపెట్టడం, భక్తిగా రాముడికి దణ్ణం పెట్టడం, ఏమిటని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయన నాదోపాసకులకు మతభేదమేమీలేదు,తరతరాలుగా సంగీతం, నాదోపాసన ఇవే మా ఆరాధ్య దైవాలు, అంటారాయన. శ్రీరంగనాధుని , మొదట్లో నన్ను ద్వేషించిన వారే, నా అభిమానులై ఎన్నో కచేరీలు చేయించారని చెబుతారు. భగవత్ సాక్షాత్కారానికి వివిధ మార్గాలున్నా నాకు సంగీతమే శరణ్యం. దాన్లో పై స్థాయికి వెళ్ళడమే నా లక్ష్యం. అన్ని మతాల్లోనూ సంగీతానికి, భక్తికి సంబంధం ఉంది. మేము అనుదినం చేసే నమాజు అల్లాహు అక్బర్ అనే బేంగ్ (నినాదం) మాయా మాళవగౌళరాగం! సంగీతం నాకు ఎంత ప్రాణమైపోయిందంటే కరవదిలో మాకు మళ్ళూ మాన్యాలూ, ఇళ్ళూ వాకిళ్ళు ఉన్నా కేవలం సంగీతం కోసం, సంగీత వాతావరణం కోసం శ్రీవైష్ణవుల 108 దేవాలయాల్లో ప్రధానమైన ‘శ్రీరంగం’ లోనే స్థిరపడ్దాను. శ్రీరంగం కలియుగ వైకుంఠంగా విఖ్యాతమైనది. ఆళ్వారుల్లో పెక్కుమంది శ్రీరంగ వైభవాన్ని గానం చేశారు. తిరుప్పాణాళ్వారు, నాచ్యార్ రంగనాథుని పాద సన్నిధిలో లీనమయ్యారు. ఎంతోమంది సంగీత విద్వాంసులు ఈ శ్రీరంగ ద్వీపంలో జన్మించారు.ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఉంటూ నిత్యం నాదస్వరార్చన చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అంటూ కళ్ళనుండి ఆనంద బిందువులు దొర్లిస్తారు చినమౌలా! ఆయన 1982 లో శ్రీరంగంలో “శారద నాదస్వర సంగీత ఆశ్రమం” నెలకొల్పి ఎందరికో నాదస్వర వాద్యంలో శిక్షణ ఇచ్చారు. ఆయన ఏప్రిల్ 23 న శ్రీరంగంలో పరమపదించారు. చిన్నమౌలా వంటి విద్వాంసులు తెలుగునాట ఉదయించడం నిజంగా మన అదృష్టం. వీరి నాదస్వర ఆడియో ను క్రింది లింక్ లో వినండి. (ఇందులోని కొన్ని అంశాలు వీకీపీడియా నుంచి సేకరించాడమైనది...)

No comments:

Post a Comment

Pages