కచోరీలు - అచ్చంగా తెలుగు

కచోరీలు

Share This

కచోరీలు 

- ఉషారాణి నూతులపాటి 


ఈరోజుల్లో పిల్లలు స్కూల్ నుండి రాగానే అన్నం తినమంటే , ఎన్నిసార్లు తినాలి ? మేం తినం అని గొడవ చేస్తారు. పైగా వాళ్ళ జిహ్వ చాపల్యానికి తగ్గట్టు ప్రతి వీధికీ రెండేసి తోపుడు బండ్లు ,వాటిమీద ఛాట్ ,చైనీస్ నూడుల్స్ ,పానీ పూరీలు ..ఇలా నానారకాల జంక్ ఫుడ్ . వాటికి ఎగబడతారు. వర్కింగ్ మదర్స్ మనం అవన్నీ ఎలాగూ చేసి పెట్టలేమని డబ్బులు ఇచ్చేసి ,తినమంటారు. ఇక ఇంట్లో ఉండే అమ్మలు కూడా ..ఎన్నని చేస్తాం ఇట్లో అని కొనుక్కోమని ప్రోత్సహిస్తున్నారు. అందరికీ తెలుసు అనారోగ్యమని . అయినా "వాళ్ళు అవే తింటామని గొడవ ఏం చేయ్యమూ" అని సాగ దీస్తారు. నిజానికి చెయ్యడానికి బద్ధకం అంతే. మనమే ,ఇంటిలో చేస్తే ఎక్కువ సమయం పట్టేవికావు..పైగా ఆరోగ్యం కూడా. బండ్లమీద చేసే జంక్ ఫుడ్ వల్ల అమీబియాసిస్, వాంతులు, జాండిస్ లాంటి ఎన్నో అనారోగ్యాలు వ్యాపిస్తాయి. కొద్ది శ్రమతో చేసే ఇంటివంటలు ఎంతో రుచిగా ,శుచిగా ..పిల్లలకు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా వుంటాయి. చలికాలం కదా..పిల్లలు ఇంటికి రాగానే వేడి ,వేడి కచోరీలు చేసి పెడితే చక్కగా, ఇష్టం గా తింటారు. పెసరపప్పు తో చేసే కచోరీలు గుజరాతీ వంటకమే అయినా,మన తెలుగువారు కూడా ఇష్టంగానే తింటారు. పెరుగుతో కానీ, టమేటో సాస్ తో కానీ ,స్వీట్ చట్నీ తో కానీ తినవచ్చు. కాలరీలు కొద్దిగా ఎక్కువైనా, పిల్లలకు ఆరోగ్యమే.. కచోరీల తయారీ చూద్దామా ...కావలసిన పదార్ధాలు :- మైదా పిండి - 2 కప్పులు నెయ్యి/ నూనె - 1/4 కప్పు ఉప్పు - అరచెంచా వంటసోడా -చిటికెడు. ఫిల్లింగ్ కోసం కావలసిన పదార్ధాలు :- పెసరపప్పు- అర కప్పు ,4 గంటలు నానా బెట్టాలి. జీలకర్ర -1 చెంచా ఇంగువ -పావు చెంచా అల్లం+పచ్చి మిర్చి ముద్ద- 1 చెంచా కారం - 1 చెంచా గరంమసాలా- 1 చెంచా శనగపిండి -2 చెంచాలు ఆమ్ చూర్ - 1 చెంచా నూనె - 3 చెంచాలు ఉప్పు -తగినంతఇంకా కచోరీలు వేయించడానికి 2 కప్పుల నూనె అవసరమౌతాయి. చేయువిధానం :- మైదాపిండి లో ఉప్పు ,వంటసోడా,కొద్దిగా కరిగించిన నెయ్యి ,లేదా నూనె వేసి బాగా కలిపి, నీళ్ళతో పూరీ పిండిలా ,మృదువుగా తడిపి ,పల్చని తడిబట్ట కప్పి ,15 ని. నానబెట్టి ఉంచాలి. ఫిల్లింగ్ తయారీ :- నానబెట్టిన పెసరపప్పు వడగట్టి ఉంచాలి. నాన్ స్టిక్ పాన్ వేడి చేసి 3 sp ల నూనె వేసి వేడయ్యాక జీలకర్ర + ఇంగువ, సన్నగా తరిగిన కరివేపాకు+ పెసరపప్పు +చిటికెడు పసుపు వేసి బాగా కలిపి 2 ని. ఉడికించాలి. తరువాత అల్లం+పచ్చిమిర్చి ముద్ద + కారం+ఆమ్ చూర్ + గరంమసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి 5,6 నిముషాలు,పెసరపప్పు మెత్తగా,పొడిగా అయ్యేలా ఉడికించాలి. చల్లారిన తరువాత 12 సమాన భాగాలుగా చేసి ఉంచుకోవాలి. కచోరీలు :- మైదాపిండి ని కూడా 12 సమాన భాగాలుగా ఉండలు చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని ,మునివేళ్ళతో మృదువుగా వత్తుతూ ,వెడల్పుగాచేసి, మధ్యలో పెసరపప్పు ఫిల్లింగ్ పెట్టి జాగ్రత్తగా మూసేయాలి. ఫిల్లింగ్ బయటికి రాకుండా చపాతీ కర్రతో కానీ ,చేత్తో కానీ మందంగా వత్తుకొని,బొటనవేలితో మధ్యలో చిన్నగా వత్తాలి. అన్నీ ఇలాగే తయారుచేసుకుని , డీప్ ఫ్రై కి నూనె వేడి చేసి , సన్న మంట పైన కచోరీలను వేయించాలి. వేగడానికి కొద్దిగా ఎక్కువసమయం పడుతుంది.బంగారు రంగులో వేయించుకుంటే, ఇవి 4,5 రోజులు నిలవ ఉంటాయి కూడా. వేడి ,వేడి కచోరీలను పెరుగుతో కానీ ,టమాటా సాస్ తో కానీ అందించండి. చేస్తారు కదూ..

No comments:

Post a Comment

Pages