శివం -8 (శివుడు చెబుతున్న కధ ) - అచ్చంగా తెలుగు

శివం -8 (శివుడు చెబుతున్న కధ )

Share This
శివం -8 (శివుడు చెబుతున్న కధ )
-      ఫణి రాజ కార్తీక్
(రావణుడి శివభక్తి యెంత గొప్పదో చెబుతూ ఉంటాడు శివుడు...)

రావణుడు పొరపాటున అక్కడ కాలిన శవచితాభస్మాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అందుకే అతగాడికి నొప్పి పుట్టినది. కానీ రావణుడు మాత్రం “ప్రభూ!  క్షమించయ్యా, ఈ చితితో నిన్ను అభిషేకిస్తే నీకు నొప్పి పుడుతుంది” అని అన్నాడు. వెనువెంటనే ఆ కాలుతున్న చితి మంచుముద్దలాగా మారింది. ఆనందంగా తీసుకువచ్చి రావణుడు ఆ మంచుతో నాకు అభిషేకం చేయసాగాడు. అక్కడ ఉన్న ఒక ప్రేతం రావణుడు అభిషేకం చేస్తుండగా “ఓ ప్రభూ! భూతాలకు భూతపతి, పశువులకు పశుపతి వయిన నీవు, మంచులాగా మార్చినది నా శరీరభస్మాన్నే తండ్రి! ప్రపంచంలో నిన్ను మంచుతో అభిషేకించిన భాగ్యం నాకు ప్రసాదించావు స్వామి, జన్మ జన్మలకు నీ మీద భక్తి నిశ్చలంగా ఉండేలా నాకు అనుగ్రహించు మహేశా !” అని ఆర్ధించింది. అక్కడ ఉన్న ప్రేతాలన్ని, “స్వామీ మమ్ము ఒకసారి నిన్ను తాకే విధంగా స్పర్శజ్ఞానం ఇవ్వమని ఆర్ధించాయి. నేను తథాస్తు అన్నాను. రావణుడు మరికొంత మంచు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మలు అన్ని నన్ను తాకుతూ “శివయ్యా” ఎన్నో జన్మలు తపస్సు చేసినా రాని అదృష్టం మాకు వచ్చిందయ్యా అంటూనే , ప్రభూ! మిమ్ము ఆలింగనం చేసుకుంటాము అని ఆర్ధించాయి. నేను చిరునవ్వు నవ్వాను. అవి అన్నీ నన్ను పట్టుకొని “హరహర మహాదేవా” అని ఆర్తితో బిగ్గరగా నినాదం చేసాయి. కానీ, వాళ్లకి ఎదురుగా ఒక బాలుని ఆత్మ నిల్చొని ఉంది. అతడు భుంగమూతి వేసుకొని ఏడుస్తూ నా వైపు చూస్తూ “స్వామీ, నా తల్లిదండ్రులకు నన్నెందుకు దూరం చేశావు, నీ కెవ్వరూ తల్లితండ్రీ లేరని నాకు అంతే చేసావు కదా, నా పిలుపులు మా అమ్మకి నాన్నకి వినబడుట లేదు” అని అరచేతిని కళ్ళమీద తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నేను “ఇటు రా నాయనా”! అని పిలిచాను. రావణుడు అభిషేకకోసం మంచు ఇంకా సేకరిస్తూనే ఉన్నాడు. ఆ బాలుని ఆత్మ ఏడుస్తూ వచ్చి “ స్వామీ నీ పూజ చేయకుండా కనీసం ఏమి తినము కదా!”,  అలాంటపుడు ఎందుకు నన్ను మా అమ్మకి దూరం చేశావు అని వచ్చి నా పాదాల దగ్గర చతికిలబడి ఏడుస్తున్నాడు. ఆ బాలున్ని లేవదీసి... నేను “ నీకు సంక్రమించే వ్యాధిని చూసి నీవారు బ్రతికుందాము అని ఆశ ఉంచుకోరు, నీ బాధని చూడలేక. వారి బాధ వారే తట్టుకోలేక నరకవేదన అనుభవిస్తారు నాయనా, అందుకే నీకు సునాయాస మరణం ఇచ్చి నింద నా మీద వేసుకున్నాను. ఇప్పుడు, నాకు మనసు లేదు అనుకుంటారు గానీ, నా కోసం వారు పరితపిస్తారు.” మిగతా ప్రేతాలు కూడా నా వైపు ఏమి చెబుదామని చూస్తున్నాయి, ఆ బాలుడు “ స్వామి అన్నిటికి సమాధానం మరణమా?” అని అడిగాడు. “లేదు కుమారా! భక్తితో వచ్చే మరణం నా చెంతకు పరమపదం, మామూలు చావు మాత్రం వేరొక లౌకిక జన్మకు పయనం, నీ బాధ చూడలేక, నీకు మరణం ప్రసాదించాను, నీవు నన్ను కలుస్తావు అని తెలుసుగనుకే, నీ కోసం వేచి చూస్తున్నా”  దాంతో ఆ బాలుడు “ నా కోసం నీవు చూస్తున్నావు? నిజమా! శివయ్యా!” అని అన్నాడు. “ అంతేకాకుండా నీ కోక బహుమతి కూడా ఇస్తున్నాను అని చెప్పగానే, “ఏమిటి అది శివయ్యా” అన్నాడు బాలుడు. “ నీవు మళ్ళీ నీ తల్లిదండ్రులకే జన్మిస్తావు, వారు కూడా మళ్ళీ నీవే పుట్టావు అని ఆనందపడతారు, ఈసారి సకల ఐశ్వర్యాలు అనుభవించి భక్తి మార్గాన నన్నుఅనుసరించి నన్ను చేరుకుంటావు” అని అనేసరికి ఆనందంతో బాలుడు నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. “ మా నాన్న నాకు చెప్పాడు శివయ్యా, నీవు చాలా మంచివాడివని నీకు ఏమి చేయాలో తెలుసు అని, కోరుకున్నది తీరుస్తావు అని”, “మరి వెళ్తావా? మీ అమ్మ దగ్గరికి” అన్నాను. దాంతో ఆ బాలుని ఆత్మ “హహహ” అని ‘సరే సరే’ అన్నాడు. ‘వెళ్ళు’ అనేసరికి నా దగ్గరికి వచ్చి, కూర్చున్న నా మీదకి ఎక్కి నాకు ముద్దు పెట్టాడు. నాకు ఏమన్నా నచ్చితే మానాన్నకు ఇలానే ముద్దు పెడతా స్వామీ, నీవు కూడా మా నాన్న లాగానే? అని అన్నాడు. ఆ బాలుని ఆత్మని మళ్ళీ వాళ్ళ అమ్మ గర్భాన ప్రవేశపెట్టాను”. అక్కడ ఉన్న ప్రేతాలు అన్నీ “ ప్రభూ నీవు ఎంతటి కరుణామూర్తివో, దయామూర్తివో ఇప్పుడు తెలుసుకున్నాము, మా అందరికి కూడా అలాంటి జన్మ ఇవ్వు అని ఆర్ధించాయి” నేను “మీరు అడగపోయినా నేను చేసేది అదే” అని అన్నాను. “మహాదేవ్, మహదేవ్, మహదేవ్” అని భక్తి ఉన్మాదంతోనృత్యం చేయసాగాయి. ఈ లోగా వచ్చాడు రావణుడు “గరళకంఠ, నీ పూజ కొన్ని వేలజన్మల పంట” అని పాడుతూ నాకు మంచుతో అభిషేకం చేయసాగాడు. రావణుడు “స్వామీ నీవెందుకు శ్మశానంలో ఉంటావు తండ్రీ చెప్పు అన్నాడు. నేను నవ్వి “ రావణా! ఇది తప్ప ఇంకేది మిగులుతుంది, ఏదైనా ఇక్కడకి రావాల్సిందే, వచ్చిన వాటిని అక్కున చేర్చుకోనటానికి నేను ఇక్కడ ఉంటాను, ఇదియే నిజమైన అంతిమజ్ఞానం “ దాంతో అక్కడి ప్రేతాలు సైతం “హరహరహర” అని నిశ్చేష్టాజ్ఞానముఖవర్చస్సుతో ప్రణామం చేశారు. (ఇంకా ఉంది...)  

No comments:

Post a Comment

Pages