చిత్రకళా ‘మణి’ – ఆర్టిస్ట్ పాణి - అచ్చంగా తెలుగు

చిత్రకళా ‘మణి’ – ఆర్టిస్ట్ పాణి

Share This
చిత్రకళా శిరో ‘మణి’ – ఆర్టిస్ట్ పాణి
-      భావరాజు పద్మిని.

కళలు దైవదత్తమనీ , నేర్చుకుంటే రావనీ అంటారు. అలా అక్షరాభ్యాసం రోజునే ఏనుగు బొమ్మ వేసి, తండ్రితో దెబ్బలు తిని, తన జీవితంలో ఎన్నో పున్నములను, అమావాస్యలను చూసి, గొప్ప కళాకారుడిగా ఎదిగిన ఆర్టిస్ట్ ‘పాణి ‘ గారితో ముఖాముఖి... ఈ నెల తెలుగు బొమ్మ లో ప్రత్యేకించి... మీ కోసం... 
మీ బాల్యం, స్వస్థలం గురించిన సంగతులు చెబుతారా ? 
మా నాన్నగారి స్వస్థలం గుంటూరు జిల్లా భట్టిప్రోలు. అది ఘంటసాల గారి అత్తగారి ఊరు. నేను అక్కడే 1952 లో పుట్టాను. తాతగారిది ఉమ్మడి కుటుంబం, పెద్దపులివర్రు గ్రామం. అమ్మ సత్యవతి, కాశీనాధుని కనకయ్య. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాష్టరు గా చేసేవారు. మేము ముగ్గురు పిల్లలం . నేను మొదటి సంతానం. నాకెందుకో విద్యాభ్యాసం అంతగా అబ్బలేదు. అప్పట్లో ఐదేళ్లకు అక్షరాభ్యాసం జరిగేది. అక్షరాభ్యాసం అప్పుడు పలక మీద ‘ఓం నమః శివా యః ‘ అని రాసే బదులుగా, నేను ఏనుగు బొమ్మ వేసాను. ఆయనకు వెంటనే కోపమొచ్చి , అక్షరాభ్యాసానికి తెచ్చిన కొబ్బరికాయ నా నెత్తిన కొట్టి, లేచిపోయారు. ఆ తర్వాత 5 వ క్లాసు వరకూ చదువుకున్నాను. అప్పుడు నా తల పగిలి, రక్తం చిమ్మింది. ఇలా నా అక్షరాభ్యాసం జరిగింది. అలా నెట్టుకుంటూ పి.యు.సి వరకూ వచ్చాను. విజయవాడ కె.బి.ఎన్ కాలేజి లో 1968 లో పి.యు.సి పూర్తి చేసాను. 
ఈ పెద్దపులివర్రు నుంచి విజయవాడ ఎలా వచ్చారు ? 
నాన్నగారు స్వతంత్ర భావాలు కలవారు. తెనాలి లో 9 వ తరగతి చదువుతూ, పోతా రామకృష్ణయ్య గారనే పండితుడి వద్ద వయోలిన్ నేర్చుకున్నారు. మెట్రిక్యులేషన్ తర్వాత,  ఉమ్మడి కుటుంబం నుంచి బయటికి వచ్చి, ఆయన
ఉపాధ్యాయ వృత్తి కోసం అన్వేషిస్తూ ఉండగా, నేను, అమ్మ, నాన్న - కనగాల అనే ఊరికి వచ్చాము. 
ఆ ఊరి పెద్దలు నాన్న గారి ఇంటర్వ్యూ లో ఆయన్ను ‘ఉపాధ్యాయుడు అంటే అరగదియ్యడం ఒక్కటే కాదు, నీకు ఇంకా ఏమి వచ్చు ?’ అని అడిగారట. వేర్వేరు రాగాల్లో వయోలిన్ వాయించడం వల్ల, నాన్నగారి కంటే విద్యాధికులు వచ్చినా, ఆయనకే ఆ ఉద్యోగం ఇచ్చారు. మొదటి జీతం 25 రూపాయిలు. ఇక రెండవ సమస్య – ఉండడానికి ఇల్లు... అప్పట్లో( 1956 ప్రాంతాల్లో ) ఇల్లు కట్టుకోవడం తప్ప, అద్దెకు ఇల్లు ఇవ్వడం అన్నది ఎవరికీ తెలియదు. 
మరి ఇంటి సమస్య ఎలా తీరింది ? 
ఊరి పెద్దలు అంతా కలిసి, ఊరి పొలిమేరల్లో ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లో, శుభ్రంగా ఉంచాలనే నియమంపై, మాకిచ్చారు. ఆ ఇల్లు మాల్గుడి డేస్ లో ఉన్న ఇల్లులా ఉంటుంది. ఇంటిముందు పెద్ద చింతచెట్టు, దాన్నిండా పక్షులు ఉండేవి, ఆ ఇల్లు నాకింకా గుర్తే ! ఎవరో ఆ ఇంట్లో చనిపోతే,  అప్పటి నియమాల ప్రకారం 3 ఏళ్ళు పాడుపెట్టాలన్న నియమంపై  ఉంచారట. అది తెలిసి దెయ్యాలు కనిపిస్తాయని, భయపడే వాళ్ళం. ఆ ఇల్లు ఖాళీ చేసి,
నెమ్మదిగా విజయవాడ వచ్చాము. తర్వాత ఆయన జీతం 65,75 రూ. లకు పెరిగింది. తర్వాత ఆంధ్ర సిమెంట్ కంపెనీ లో చేసి, రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు 85 ఏళ్ళు, అమ్మ, నాన్న, ఇప్పుడు నాతోటే ఉంటున్నారు. ప్రస్తుతం నేను భార్య రమాదేవి, నా తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నాను. నాకోక్కడే కొడుకు, మా అబ్బాయి సిటీ లో ఆర్టిస్ట్ గా ఉన్నాడు. 
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ? 
నా పియుసి పూర్తయ్యాకా, మా అమ్మమ్మతో కలిసి మేనమావ ఇంటికి మద్రాస్ వెళ్లాను. నాకు విపరీతమైన బిడియం, మొహమాటం, చొరవ లేదు, ఒక్క ఇంగ్లీష్ ముక్క రాదు, కాని తమిళ్ రాసేవాడిని. మా అమ్మమ్మ నా గురించి చెప్తూ, ‘వీడు ఎప్పుడూ యేవో బొమ్మలు వేస్తూ ఉంటాడు, ఏదో ఒక ఉద్యోగం చూపించు, ‘ అని అడిగింది. నేను మా మేనమామ చేర్పించిన ఉద్యోగాలు వేటిలోనూ ఇమడలేదు. వాళ్ళు చెప్పినట్టు కాకుండా నాకు తోచినట్టు చేసేవాడిని. అందుకే వాళ్ళూ తీసేసేవారు. నాకు గురువు లేరు. నేనే సొంతంగా ప్రాక్టీసు చేసుకునేవాడిని. నచ్చిన అందరు ఆర్టిస్ట్ ల బొమ్మలూ చూసి వేసేవాడిని. అప్పుడు మొదట చందమామ రామారావు గారు నా బొమ్మలు చూసి, అందులో ఉద్యోగం ఇచ్చారు. అందులో చేస్తూ చేస్తూ, నెమ్మదిగా ‘వనిత’ అనే ప్రముఖ పత్రికకు  బొమ్మలు గీసేవాడిని. రావికొండలరావు గారు ఆ పత్రికకు సబ్ ఎడిటర్ గా, విశ్వనాథరెడ్డి గారు ఎడిటర్ గా ఉండేవారు. వనితలో ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే జలంధర గారి నవలకు నేను వేసిన బొమ్మలు చాలా ప్రసిద్ధి పొందాయి. సంప్రదాయంగా
ఉండే ఆ పత్రికలో ఎంతో మంది గొప్ప రచయతలకు బొమ్మలు వేసాను. కాని ఎందుకో హఠాత్తుగా దాన్ని మూసేసారు. 
అప్పుడు మీరు ఏం చేసారు, చిత్రకళా రంగంలోనే కొనసాగారా ? 
లేదమ్మా, తర్వాత నేను సినిమాలకు పబ్లిసిటీ డిసైనర్ గా పని చేసాను. నా మొదటి సినిమా ‘ఓ సీత కధ’. తర్వాత తెలుగు, తమిళ్ లో దాదాపు 70,80 సినిమాలకు పని చేసాను.  మా బాబాయ్ అయిన కె. విశ్వనాథ్ గారితో కలిసి, సిరివెన్నెల, సప్తపది వంటి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసాను. ఇవన్నీ చేస్తూనే ఇల్లుస్త్రేషన్ లు ఫ్రీ లాన్సర్ గా వేసేవాడిని. 
మీరు పొందిన అవార్డులు ఏమైనా ఉన్నాయా ? 
విశ్వనాథ్ గారి సినిమాలు – శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం వంటి సినిమాలకు అవార్డులు అందుకున్నాను. అలాగే దాసరి నారాయణ రావు గారి స్వర్గం- నరకం  సినిమాకు అవార్డు అందుకున్నాను. తమిళ్ లో కూడా నేను మంచి సినిమాలకు పని చేసాను. భారతీరాజా, ఎ.వి.యం చెట్టియార్ గారబ్బాయి శరవణన్ వంటి ప్రముఖ దర్శకులతో పని చేసాను. 10 ఏళ్ళు ఎ.వి.యం స్టూడియో ఆర్టిస్ట్ గా పని చేసాను. అప్పుడు ఎ.వి.యం వారు హెచ్.ఎం.వి రికార్డులను కొనుక్కున్నారు. ఆ సమయంలో నేను అనేక మంది విద్వాంసులను నేరుగా కలిసి, మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. కాసేట్ పై బొమ్మల ప్రింటింగ్ కు గాను, వాళ్ళ పోర్త్రైట్స్ వేసాను. చందమామలో పనిచేస్తుండగా కొడవగంటి కుటుంబరావు గారి, దాసరి హనుమంతరావు గారు వంటి అనేకమంది గొప్ప గొప్ప రచయతలను కలిసాను.  బరాగో, ధనికొండ హనుమంతరావు, వంటి వారితో పని చేసాను. నా రూమ్మేట్ గా ఉండే రాంబాబు అనే అతను ఎం.ఏ పి.హెచ్. డి. అతను సినిమాల మోజుతో వచ్చి, త్యాగయ్య సినిమాలో రాముడి వేషం వేసారు. ఇలా నా జీవిత గమనంలో అనేకమంది గొప్ప వారిని, అభిరుచి కలవారిని కలిసాను. మీరు మర్చిపోలేని ఒక గమ్మత్తైన సంఘటన గురించి చెప్పండి... అప్పట్లో ‘బుజ్జాయి’ అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవారు. వారి బొమ్మలు బాపు గారి పద్ధతిలో ఉండేవి. పంచతంత్రం వంటి వాటిపై అద్భుతమైన కామిక్స్ వేసి, 35 ఏళ్ళ క్రితమే చాలా పాపులర్ అయ్యారు. నాకు 22, 23 ఏళ్ళు ఉండగా, నేను బాలానందం అనే పత్రికకు పనిచేస్తున్నప్పుడు, నన్ను బుజ్జాయి గారి వద్ద నుంచి ఇల్లుస్త్రేషన్ లు తీసుకురమ్మని పంపారు. ఇంతకీ ఆ ‘బుజ్జాయి ‘ ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కొడుకు. ఆయన కాన్సర్ తో గొంతు మూగబోయింది. ఆయన మెళ్ళో వేసుకున్న చీటీ లపై పెన్సిల్ తో రాసి చూపేవారు. వారిని, వారి శ్రీమతిని అలా కలిసే అదృష్టం కలిగింది. సాహిత్యప్రియులు అనేకమందితో నాకున్న అనుబంధం వల్ల నాకు సాహిత్యం అంటే కూడా చాలా మక్కువ. ‘లత సాహిత్యం’ రాసిన తెన్నేటి హేమలత గారు కూడా మా బంధువు. ఆవిడ నవలలకు కూడా నేను బొమ్మలు వేసాను. సాధారణంగా ఆర్టిస్ట్ లకు సాహిత్యం పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాని, ఇటువంటి వారి పరిచయం వల్ల, నాకు సాహిత్యం పట్ల మంచి అభిరుచి ఏర్పడింది. ఆ అభిరుచితో మీరు కూడా ఏవైనా రచనలు చేసారా ? ఒక్కటే ఒక్క కధ రాసానమ్మా. దాని పేరు ‘శిశిరం’, వనితలో ప్రచురించారు. ఈ కధ రాయటం వెనుక ఒక గొప్ప అనుభూతి ఉంది. అది మీతో పంచుకుంటాను... ఆర్టిస్ట్ కు మంచి అబ్సర్వేషన్ ఉండాలి. నేను రోజూ సాయంత్రం చెన్నై పాండి బజార్ లోని పనగల్ పార్క్ కు వెళ్లి కూర్చునేవాడిని . అక్కడికి రోజూ ఒకమ్మాయి వచ్చి, ఒక గంట నా ఎదురుగుండా ఉన్న బెంచి మీద కూర్చునేది. ఆ అమ్మాయితో ఎవరూ రారు... ఆమె ఒక్కత్తే వచ్చివెళ్ళేది. ఆమె ఒకరోజున ఒక మర్రిచెట్టు పండుటాకును తదేకంగా చూస్తోంది. ఆ ఆకు ఊగుతోంది, రాలదు. దాన్ని తోసుకు వచ్చేందుకు ఒక చిగురుటాకు ప్రయత్నిస్తోంది. ఒక ఋతువు లోంచి ప్రకృతి మరొక ఋతువుకు మారేటప్పుడు ప్రకృతిలో ఒక స్పందన ఉంటుంది. ఉన్న ఋతువును ఒదులుకోలేదు, కొత్త ఋతువుకు మారలేక మధన పడుతూ ఉంటుంది. ఇదంతా మాంసనేత్రాలకు కనిపించదు. ఆ పండుటాకు స్థితి నాకు ఆ అమ్మాయి మానసిక స్థితిలా అనిపించింది. వయసులో ఉండి, ఒకరిని ప్రేమించి, మోసగించబడిన ఒక ముగ్ధ, ఒక సందిగ్ధంలో ఉంది. తాను యవ్వనంలో ఉన్నా, ఆమె మరొక పురుషుడిని ప్రేమించలేదు. ఎందుకంటే, స్త్రీ మనసుకు ప్రకృతి సిద్ధంగా అది అలవడుతుంది. అప్పుడు ఆమె ఆకును చూస్తూ, తన జీవితం ఏమౌతుందో అని ఆలోచిస్తుంది. ఆమె బొమ్మ గీసేందుకు ఆమెను చూస్తున్న ఆర్టిస్ట్ కాన్వాస్ పై కుంచె పెడతాడు... అలా ఆ కధ పాఠకుల ఊహకే మిగిలి అంతమౌతుంది. చాలా బాగుందండి.... 
మరి విజయవాడ వచ్చాకా మీ కెరీర్ ఎలా సాగుతోంది ? 
నేను ఇప్పుడు వెళ్ళినా, నాకు స్టొరీ బోర్డు ఇల్లుస్త్రేషన్ కు అవకాశాలు వస్తాయి. అయితే, నాకు పరుగెత్తి పాలుతాగే మనస్తత్వం కాదు. అమ్మానాన్నల కోసం విజయవాడ వచ్చాకా, చిన్న చిన్న పబ్లికేషన్స్ వారి నవలలకి బొమ్మలు వేసాను. అలా బొమ్మను చూసి, మరొక బొమ్మ ఆర్డర్ వచ్చి, బాగా పేరొచ్చింది. ఆ సమయంలో ఒకతను వచ్చి, ధన్వంతరి బొమ్మ అడిగితే వెసిచ్చాను. అతను తర్వాత తిరిగొచ్చి, మిమ్మల్ని ఒక కంపెనీ వారు పిలుస్తున్నారు, అన్నాడు, వెళ్లాను. ఆయనే అగ్రిగోల్ద్ చైర్మన్ రామారావు గారు. అగ్రిగోల్ద్ వారు వైజాగ్ వద్ద ఉన్న ‘యారాడ ‘ లో వారికి సముద్రపు ఒడ్డున ఉన్న 120 ఎకరాల స్థలంలో, 12 ఎకరాలలో చండికా పరమేశ్వరి ఆలయం కడుతున్నారు. అదే ప్రాంగణం లో ఈశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, వినాయకుడి ఉపాలయాలు కడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ లో భాగంగా వారు నన్ను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల,  8 వ శతాబ్దం లో కట్టిన ఆలయాలన్నీ   సందర్శించి, వాటి స్కెచ్ లు గీసుకు రమ్మని, మనిషినిచ్చి పంపారు. ఆ బొమ్మలు చూసాకా, వారు నన్ను తమ ఉద్యోగిగా చేర్చుకున్నారు. గత ఏడేళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నా. అయితే ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగంలో ఆర్టిస్ట్ గా మీ పాత్ర ఏమిటి ? ‘కాశ్యప శిల్ప శాస్త్రం’ అనే శిల్ప సాముద్రిక శాస్త్రం ఉంది. ఇందులో రాయి ఎంపిక నుంచి, మలిచేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు, విగ్రహాల వివరాలు ఉంటాయి. అది చూసి, బొమ్మలు వెయ్యాలి. ఇక్కడ నేను కష్టపడి వెయ్యటం కాదు, ఇష్టపడి బొమ్మలు వేస్తున్నాను. ఇప్పటికి 600 స్కెచ్ లు వరకు వేసాను. విగ్రాహాల కిరీటాల(అమ్మవారు/అయ్యవారు) నుంచి డీటెయిల్స్ చాలా వివరంగా బొమ్మలు వేసి, శిల్పులకు పంపాలి. దాన్ని చూసి, వారు శిల్పాలు చెక్కుతారు. ఇప్పటికి రెండు మూడొందల విగ్రహాల దాకా చెక్కారు. 
మరి ఇల్లుస్త్రేషన్ లు ఇప్పుడు మానేసారా ? 
లేదమ్మా... అట్లాంటా తెలుగు అసోసియేషన్ వారు కధలను ఈమెయిలు లో పంపుతారు. నేను బొమ్మలు గీసి, స్కాన్ చేసి పంపుతాను. అలాగే ‘వంశీ కి నచ్చిన కధలు’ అనే 52 కధలకు బొమ్మలు వేసాను. మనలోని క్రియేటివిటీ అనేది పదునుగా ఉండాలి అంటే, మనం పని చేస్తూనే ఉండాలి అని నా అభిప్రాయం. మన పరిస్థితి బాగోకపోయినా, మన వద్ద ఉన్న కళను ఆవిష్కరించేటప్పుడు ఒక యోగ నిష్ఠలా చెయ్యాలి. అయితే, ఇప్పుడు కంప్యూటర్ లో వేసే ఇల్లుస్త్రేషన్ లు వంద శాతం భావాన్ని పలికించలేవని బాపు గారు అన్నారు. నేనూ అదే నమ్ముతాను. ఎందుకంటే, భగవంతుడు మనిషికి ఒక 6 త్ సెన్స్ ఇచ్చాడు. కంప్యూటర్ అనేది ఒక పరికరమే కాని, దానికి ఫీలింగ్స్ ఉండవు కదా ! అందుకే ప్రతీ కధా చదువుతా. పిచ్చి కధలు చదివితే నాకు మాచెడ్డ కోపం వచ్చేస్తుంది. ఫోన్ చేసి మరీ రచయతను కోప్పడతా. ఎందుకంటే చెడ్డ సాహిత్యం ఒక ఇన్ఫెక్షన్ లాంటిది. అటువంటిది వ్యాపించడం నాకు ఇష్టం ఉండదు. 
మీరు గురువుగా ఎవరిని భావిస్తారు ? 
నాది ఏకలవ్య విద్య... ఈ సృష్టిలో గురువులు అనంతంగా ఉంటారు. ఉదాహరణకు... మీరు మెట్లు ఎక్కుతుంటారు. ఒక మెట్టు ఎక్కగానే, మరొక మెట్టు కనిపిస్తుంది. అది మీకు గురువు. వేర్వేరు కళాకారుల్ని పరిశీలిస్తూ, వారి వద్ద ఉన్న మంచి విషయాలు నేర్చుకుంటూ, ఉంటే, క్రమంగా మన ఆలోచనలు ఒక ఆకృతి దాలుస్తాయి. ఒక కళాకారుడికి సాధనతోపాటు, సహనం కూడా ఉండాలి. సహనం మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది. అయినా మనం తట్టుకుని, మనల్ని , మన తప్పుల్ని అన్వేషించుకుని, ముందుకు సాగాలి.  అలాగే, యెంత చేసినా, ఒక అసంతృప్తి ఉండాలి .అప్పుడే మనం మరింత పట్టుదలతో ముందుకు సాగగలం. చాలా చక్కగా చెప్పారండీ... 
మీ ఇతర హాబీ లు ఏమిటి ? 
నాకు మంచి సంగీతం, సాహిత్యం అంటే ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా , నా వంటి మనస్తత్వం ఉన్నవారినే ఎంచుకుంటాను. చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆర్టిస్ట్ అన్వర్ గారు , నేను ఇంతవరకు కలవకపోయినా, ఈ మధ్యనే పరిచయమైన మంచి మిత్రులు. అలాగే బాపు గారి నిరాడంబరత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎంతటి మహానుభావులైనా ఒదిగి ఉండేవారు. అటువంటి వారు ఇప్పుడు చాలా అరుదు... ఇప్పుడు ‘యూస్ అండ్ త్రో ...’ జమానా ! అంతా డబ్బు ఉన్మాదంలో పరిగెడుతున్నారు, వృత్తి పట్ల అంకితభావం పోయింది. 
ఆర్టిస్ట్ తన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకు లను ఎలా ఎదుర్కోవాలి ? 
ఒడిదుడుకు అనేది ఒక కళాకారుడికి ఇంటి పేరు వంటిది. ఏ కళాకారుడైనా ఇవన్నీ ఎడుర్కున్నవారే. మైఖేల్ అంజిలో, రెంబ్రాన్ నుంచి వడ్డాది పాపయ్య గారు వంటి వారి దాకా ఎన్నో కష్టాలకు ఓర్చినవారే ! రెంబ్రాన్ అనే అతను రాసిన బ్లాక్ అనే నవల చదివితే, వెనిస్ నుంచి తరిమివేసాకా, అవమానంతో అతను ఎలా ఉరివేసుకున్నాడో తెలుస్తుంది. కాని, ఇప్పుడతని బొమ్మలు కొన్ని కోట్ల విలువ చేస్తాయి. చాలా మంది ఇలా అసంతృప్తి తోనే పోయారు. ఎన్ని కళాఖండాలు గీసినా, ఒక కళాకారుడికి బ్రతికి ఉండగా కీర్తి రాదు. అయితే, చనిపోయే ముందు మాత్రం... ఇక నీ కధ అయిపొయింది... అన్నట్లుగా పిలిచి, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు. బాపు గారికి రామోజీ ఫిలిం సిటీ లో ఈ అవార్డు ఇచ్చి, మాట్లాడమన్నప్పుడు... ఆయన ఒకే ఒక మాట అన్నారు...” ఇప్పుడేం చేసుకోను ఈ వెన్నెల ?( అంటే అడవి కాచిన వెన్నెల ...అన్న భావంతో...). వడ్డాది పాపయ్య గారు... నాకు సన్మానాలు, సత్కారాలు వద్దు. నా బొమ్మల్ని ఆదరించండి చాలు, అంటూ మీడియా కు దూరంగా ఉండేవారు. కాలానుగుణంగా కళను మార్చుకున్న వాడు రాణిస్తాడు, లేనివాడు అక్కడే ఉంటాడు. ముందుగా ఆర్టిస్ట్ మొహమాటం వదలాలి. చాలా మంది లక్షలు, కోట్లు సంపాదించిన వారూ ఉన్నారు. వీరు ఘోస్ట్ ఆర్టిస్ట్ లను పెట్టుకుని, పేరసైట్ లు  గా రాణిస్తున్నారు. అయినా... కళకు విలువ ఎప్పటికైనా దక్కి తీరుతుంది. ఇది ప్రతి కళాకారుడు గుర్తుంచుకోవాలి. సహనంతో సాధన చేస్తుండాలి. కాన్వాస్ నుంచి సినీ రంగంవరకూ... కేవలం తన ప్రతిభ, సాధనతో ఎదిగి, అయినా ఒదిగి ఉంటూ, ఇప్పటికీ తన చిత్రకళా ప్రస్థానం కొనసాగిస్తున్న పాణి గారి జీవన విధానం,  భావి కళాకారులకు ఎందరికో ఆదర్శం !  

No comments:

Post a Comment

Pages