కాస్తంత శ్రద్ధ వహించండి... - అచ్చంగా తెలుగు

కాస్తంత శ్రద్ధ వహించండి...

Share This
కాస్తంత శ్రద్ధ వహించండి...
-      భావరాజు పద్మిని

నిలబడి నీళ్ళు త్రాగితే ఏమొస్తుంది ? అంటూ, త్వరత్వరగా ఎదిగేందుకు పరుగెత్తి పాలుత్రాగే రోజులివి... పొద్దున్న లేస్తే గడియారం ముల్లుతో సమానంగా ఉరుకులు, పరుగులు... వేళకు తినరు, తగినంత నిద్రపోరు. దేన్నీ లెక్కచెయ్యకుండా ఒక్కటే ఆరాటం, మనుగడ కోసం పోరాటం ... ఇంత ఒత్తిడి ఇదివరకు లేదే ! అసలు ఎలా మొదలయ్యింది... ఎప్పుడైనా ఒక్క క్షణం ఆలోచించారా ? ఇదివరకు బ్రతకడానికి మనకు కనీస అవసరాలుంటే సరిపోయేవి. కానీ ఇప్పుడు బ్రతకడానికి ‘విలాసాలు’ కావాలి. తను ఎదుటి వాడికంటే గొప్పగా బ్రతకాలి. అతనికంటే ముందే మంచి ఇల్లు, కార్, సోఫాలు, మిగతా సౌకర్యాలు, అన్నీ జీవితపు తొలిదశ లోనే, త్వరత్వరగా అమరాలి. అందుకోసం యెంత శ్రమ అయినా పర్వాలేదు. సంపాదించే భార్య ఉంటే, ఆ పని ఇంకా సులువు అవుతుంది. తన గొప్ప, దర్జా అందరికీ ప్రదర్శించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ, తాను ఇతరులకంటే ఒక మెట్టు పైనే ఉండాలి కాని, తగ్గకూడదు. తాను ఇతరులు అసూయ పడేంత స్థాయికి చేరుకోవాలి... ప్రతి ఒక్కరిలోనూ ఇదే తపన. అంటే, మనిషి తనకోసం తను కంటే ,ఎదుటివాడి మెప్పు కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అసలు ఈ చిక్కంతా మొదలయ్యింది ఇక్కడే ! మరి త్వరత్వరగా ఎదగాలంటే... ఒకే కంపెనీ లో ఎక్కువ కాలం ఉద్యోగం చెయ్యకూడదు, మారుతూ ఉండాలి. కొత్త సవాళ్లు, కొత్త పని ఒత్తిడి... అయితే, యెంత చెట్టుకు అంత గాలి అన్నట్లు...యెంత ఆదాయం పెరిగితే, అంత ఖర్చు పెరుగుతుంది. ఇది చాలామంది గుర్తించరు. పని ముగించుకుని ఇంటికి వచ్చినా, మనసులో ఇవే సమస్యలు మెదులుతూ, అది అణచి ఉంచి బయటకు చెప్పకపోవడం వల్ల, చాలామంది తమ  కోపాన్ని కుటుంబసభ్యులపై ప్రదర్శించడం జరుగుతోంది. చిన్న వయసు, పెద్ద పదవులు విపరీతమైన పని ఒత్తిడి, ప్రయాణాలు, అర్ధరాత్రి దాకా సాగే పని వేళలు... ఫలితం... నిద్రలేమి, వేళకు తినకపోవడం వల్ల, అనారోగ్యం, ముప్ఫైల్లో తల పండిపోవడం, గుండె జబ్బులు, ఒత్తిడి వల్ల షుగర్ వంటి వ్యాధులు, ఆసుపత్రుల పాలు కావడం,  కనీసం 60 ల దాకా సాగాల్సిన జీవితం, ఇప్పుడు నలభై లలోనే అర్ధాంతరంగా ముగిసిపోతోంది. ఒక్కో ఆరోగ్యం పాడైతే, ఇన్నేళ్ళూ మీరు కూడగట్టిన లక్షలు, కోట్లు... ఆసుపత్రుల పాలు అవుతున్నాయి. ఇలా నిన్నమొన్నటి వరకూ మనతో ఉన్న ఆప్తులు, ఉన్నట్లుండి గతించడం వింటే, మనసు వికలం అయిపోతుంది. ఇవి అతిశయాలు కాదు, కళ్ళముందు జరుగుతున్న వాస్తవాలు ! నిజానికి ‘విలాసం’ అన్న పదానికి అంతు అంటూ ఉండదు. ఇదే పదాన్ని చెరిపేసి, ‘తృప్తి’ అన్న పదాన్ని మన మనసులో రాసుకుంటే, చాలా వరకూ ఇటువంటి ఇబ్బందులు తలెత్తవు. మీరు యెంత గొప్ప ఉద్యోగి అయినా, ఇంటికి దీపమైన ఇల్లాలు అయినా... యెంత పని ఒత్తిడి ఉన్నా,మొహమాటాలు వదలండి , వేళకు భోజనం చెయ్యండి. ‘నేను అన్నం తిని వస్తా,’ అని మీరు తెగేసి చెప్పి వెళ్తే, ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. అలాగే నిద్ర విషయంలో కూడా ఖచ్చితంగా ఉండండి. రోజుకొక అరగంట మీకోసం ప్రత్యేకించి కేటాయించుకుని, వీలుంటే కాస్త వ్యాయామం, ఇష్టమైన వ్యాపకం , మిత్రులతో ముచ్చట్లు వంటి వాటిలో పాల్గొంటే, మీ ఒత్తిడి చాలావరకూ తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు... మిమ్మల్ని పది కాలాలు పచ్చగా ఉంచుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, అందుకే మీ గురించి, మిమ్మల్నే నమ్ముకున్న మీవాళ్ళ గురించి, కాస్తంత శ్రద్ధ వహించండి. సప్తవర్ణాల హరివిల్లులా మీ ముందుకు వచ్చిన మీ ‘అచ్చంగా తెలుగు’ డిసెంబర్ సంచికలో... ఎప్పటిలాగే మీలో ఆలోచనల్ని రేకెత్తించే కధలు, ఉత్సాహభరితమైన సీరియల్స్, ప్రత్యేక శీర్షికలు, ఉన్నాయి. వంశీ గారి వెన్నెల్లో లాంచి ప్రయాణం చివరి భాగం, గాయకులు- సంగీత దర్శకులు శ్రీనివాస రాజు గారితో ముఖాముఖి, ఆర్టిస్ట్ పాణి గారి పరిచయం, సితార పై మధుధారలు పలికించే అనుష్క శంకర్ ను గురించిన విశేషాలు, భారతీయ నృత్య రీతుల గురించి తెలిపే ‘నెమలికి నేర్పిన నడకలవి’, అనే వ్యాసం, ఉయ్యాలవాడ సూర్యచంద్రులను గురించిన విశేషాలు ఈ సంచికలో ప్రత్యేకించి మీ కోసం ! ఇక పూర్ణిమ సుధ రచించిన కధ ‘శ్రీ అమ్మ రక్ష’ మాత్రం తప్పక చదవండి. ఇందులో వివరించిన సాంకేతిక విశేషాలు, భావి అమ్మలకు ఎంతగానో ఉపయోగిస్తాయి. నాగేంద్రబాబు గారి బొమ్మలు సంచికకు కొత్త సొబగులు అద్దాయి. మరింకెందుకు ఆలస్యం ? వెంటనే మీ అభిమాన పత్రికను చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలను, ‘అభిప్రాయాలు’ శీర్షికలో, ప్రతి పోస్ట్ దిగువన అందించండి. మా అందరినీ ప్రోత్సహించి, మరింత మెరుగు పరుచుకునేలా దీవించండి. శుభం.  

No comments:

Post a Comment

Pages