సితార్ మధుధార – అనుష్క శంకర్ - అచ్చంగా తెలుగు

సితార్ మధుధార – అనుష్క శంకర్

Share This
సితార్ మధుధార – అనుష్క శంకర్
-      భావరాజు పద్మిని


ఆమె... 2000 సంవత్సరం ఫిబ్రవరిలో కోల్‌కతాలోని రామకృష్ణ సెంటర్‌లో సంగీత ప్రదర్శనిచ్చిన మొదటి మహిళగా పేరు తెచ్చుకున్నారు. 2006 గ్రామీ అవార్డు వేడుకలలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయురాలు. సంగీతంలో హద్దులు దాటి ప్రయోగాలు చేసి, పాశ్చాత్య, భారతీయ శైలిని మేళవించి, అద్భుతాలు సృష్టించడంలో... సిద్ధహస్తురాలు. అప్పటివరకూ, పురుషులే సితార్ వాద్యంలో నైపుణ్యం చూపగాలరన్న వాదనను ఆమె తన అసమానమైన ప్రతిభతో తుడిచివేసింది. ఆమే... సితార తంత్రులపై అనన్య సామాన్యమైన రాగ విన్యాసాలతో భారతీయ సంగీతానికి ప్రపంచ ఖ్యాతి నార్జించిపెట్టిన విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ కుమార్తె అనుష్క. ఆమె సితార్ వాదన వింటే, తండ్రి సంగీత ఉపాసనకు మెచ్చి, ఆ వాగ్దేవే స్వయంగా ఆయన పుత్రికగా అవతరించిందా... అనిపించక మానదు. ఆమె ప్రసిద్ధ సితార్‌ కళాకారుడు రవి శంకర్‌, బ్యాంక్‌ ఉద్యోగిని అయిన సుకన్యా రాజన్‌ దంపతులకు జూన్ 9, 1981 లో  జన్మించారు. ఆమె లండన్‌లో జన్మించగా కొంతకాలం లండన్‌లో, మరికొంతకాలం ఢిల్లీలో ఆమె బాల్యం గడిచింది. ఆమెకు ఏడేళ్ళ వయసు వచ్చేవరకు, తల్లివద్దనే పెరిగింది, తండ్రిని చూడలేదు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అనౌష్కకు చిన్నతనం నుంచే సంగీతమంటే ప్రాణం.  ఏడేళ్ళ వయసు నుంచే, ఆమె కోసం ప్రత్యేకించి తయారు చేయించిన చిట్టి సితార్ పై,  వారానికి రెండు క్లాస్సుల చొప్పున ఆమె తండ్రి వద్ద సితార్ అభ్యసించేవారు. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఢిల్లీ లోని ‘సిరి ఫోర్ట్ ‘ లో  సంగీత ప్రదర్శన నిర్వహించడం విశేషం. టీనేజీ వయస్సులో ఆమె క్యాలిఫోర్నియాలో ఉంటూ సాన్‌ డిగిటో మ్యూజిక్‌ అకాడమీలో సంగీతంలో శిక్షణ పొందారు. తండ్రి ఆలపించిన రాగాలను వింటూ, వాటిని సాధన చేస్తూ, తర్వాత వాటిని సితార్‌పై వాయించేవారు అనుష్క. అలా ఓపిక, సాధన తో తండ్రి వద్దనే అన్ని మెళకువలు ఆకళింపు చేసుకున్నారు. అంతేగాకుండా, వెల్ష్ నిర్వాహకుడు మర్ఫీ సహాయంతో నొటేషన్స్‌పై అవగాహన పెంచుకున్నారు. ఆ తర్వాత 16 సంవత్సరాల వయస్సులో మొదటి రికార్డు కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు. 1998లో విడుదలైన తన మొదటి మ్యూ జిక్‌ ఆల్బమ్‌ ‘అనౌష్క’  ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. 2000 సం. లో ‘అనురాగ్’ అనే ఆల్బం చేసారు. 3 వ ఆల్బం ‘లైవ్ ఎట్ కార్నిజీ హాల్’ కు ప్రపంచ సంగీతం లోనే నామినేట్ చెయ్యబడ్డ అతి చిన్న వ్యక్తిగా పేరు పొందారు. ఇంతవరకు 7 ఆల్బం లను తయారు చెయ్యగా, వాటిలో ‘ట్రేసెస్ ఆఫ్ యు...’ చివరిది. ఏ స్వరకల్పన మొదలు పెట్టినా, సితార్ పై కూర్చి, తర్వాత మెరుగులు దిద్ది, పాశ్చాత్య శైలికి అన్వయించడం ఆమె ప్రత్యేకత. నేటి కళాకారుడికి ప్రతిభతో పాటు మంచి అలంకరణ కూడా ముఖ్యమని, ఆమె నమ్ముతారు. కాంజివరం చీరల నుంచి హిప్‌స్టర్స్‌ వరకు వివిధ రకాల దుస్తులను ధరించడాన్ని బట్టి ఆమె అభిరుచిని తెలుసుకోవచ్చు. విదేశాల్లో చాలా కాలం గడిపినా వస్తధ్రారణ విషయానికి వస్తే భారతీయ సంప్రదాయానికే ఆమె ఓటు. ఫ్యాషన్‌ను గుడ్డిగా ఫాలో అవ్వడం కన్నా ఆకర్షణీయంగా కనిపించే వాటిని ఎంచుకోవాలనేది ఆమె స్టైల్‌ ఫిలాసఫీ. ఆమె కేవలం ఒక సితార్ వాద్య నిపుణురాలే కాదు. పేరొందిన నర్తకి... ‘ డాన్స్ లైక్ అ మాన్’ అనే చిత్రంలో 2004 లో నటించి అందరినీ మెప్పించారు. ఆమె నాట్యం వీడియో ను క్రింది లింక్ లో చూడవచ్చు. అలాగే, ఆమె గొప్ప రచయిత్రి కూడా ! ఆమె తండ్రి జీవిత చరిత్ర ను ‘బాపి : ద లవ్ ఆఫ్ మై లైఫ్ ‘ అనే పుస్తకంగా రచించారు. అంతే కాదు, ఆమె హిందూస్తాన్ టైమ్స్, ఫస్ట్ సిటీ మగజైన్ వంటి ప్రముఖ పత్రికలకు కొన్నేళ్ళు కాలమిస్ట్ గా ఉన్నారు. యెంత పనిఒత్తిడి ఉన్నా, సామాజిక కార్యకలాపాలలో ఆమె పాల్గొనేందుకు ఖచ్చితంగా ముందుకు వస్తారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, అనౌష్క ఢిల్లీలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థులను చైతన్య పరిచారు. మహిళా ట్యాక్సీ డ్రైవర్లు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రామీ అవార్డులను- ఆమె సింగర్‌ నోరా జోన్స్ తో కలిసి అందుకొని ఎంతో ఖ్యాతిని సంపాదించారు. ఇవే కాక, 2003 లో ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’ వంటి అనేక అవార్డులను అందుకున్నారు.   ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ను రూపొందించేందుకు నడుం బిగించారు. ఈ బ్యాండ్‌లో చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండియా నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేయనున్నారు. భారత్ నుంచి ఎంపిక చేసే విషయంలో అనుష్క ను ఎన్నుకున్నారు. తండ్రి ఆధ్వర్యంలో 20 ఏళ్ళ కఠిన సాధన,  అందం, ప్రతిభ, సామాజిక బాధ్యత, మంచి వ్యక్తిత్వం కలబోసిన ఈ పుత్తడి బొమ్మ, మరిన్ని విజయాలను స్వంతం చేసుకుని, భారత్ కు తలమానికంగా నిలవాలని ఆశిద్దాం. ఈమె సితార్ మధుధార ను క్రింది లింక్ లలో విని, ఆనందించండి...
 
   

No comments:

Post a Comment

Pages