చిన్నారి చెల్లెలు
- సుసర్ల నాగజ్యోతి
మణికంఠ కు ఎప్పుడూ ఆశ్చర్యమే ...తమ ఇంట్లో దాదాపు 10 మంది అక్కచెల్లెళ్ళూ ,అన్నదమ్ములూ ఉండంగా తనకు చిన్న చెల్లెల్ని చూస్తే అస్సలు అర్ధం కాని విషయం ...అంత పెద్దరికం గా ...అచ్చూ అమ్మలా ...అమ్మ పోలికలన్నీ పుణికి పుచ్చుకుని ఉండటం ఎలా సాధ్యమా అని ...ధైర్యమూ శాంతమూ రెండూ ఎక్కువే దానికి మా అమ్మలాగా.....
అసలు ఇంట్లో తనే చాలా ఆలస్యముగా పుట్టాడు అనేవారు....తనకన్నా 4 ఏళ్ళు తరువాత చెల్లాయ్ పుట్టింది....అప్పుడు తమ ఫామిలీ డాక్టర్ బామ్మని బెదిరించిందిట ...పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించక పోతే మీ కోడలింక బ్రతకదు అని...అదే జరిగితే పోలీసులకు మీమీద నేనే కంప్లైంట్ చేస్తాననీ ...అప్పుడు బామ్మ పాపం చేస్తున్నాను అంటూ చాదస్తం చూపిస్తూనే ఒప్పుకుందట గతిలేక .....
అలా అక్షరాలా నాలుగేళ్ళ నెలరోజుల తేడాతో పుట్టింది చెల్లాయ్..అది పుట్టిన పదకొండవ రోజున పురిటి స్నానం అయ్యాక చెల్లెల్ని మంచం మీద పడుకోబెట్టి అమ్మ అవతలి పక్కన కూర్చోని భోజనం చేస్తోంది. ఈ లోపల చెల్లాయ్ కాస్త కదిలింది ..అంతే తను చెల్లాయిని బొమ్మలాగాపట్టుకుని పొట్టకు కరిచేసుకుని అమ్మ దగ్గిరకు వెళ్ళి ..."అమ్మా మరేమో బుజ్జిపాపాయి ఏడుస్తోందే ...అందుకనే ఎత్తుకొచ్చేసా" అన్నాడు...ఈ లోపల మూడో అక్కయ్య హడలిపోతూ పరిగెత్తుకొచ్చి ...హారి బడుద్దాయ్ ..అంటూ చెల్లెల్ని తన చేతినుండి తీసేసుకుంది....అందరూ కోప్పడ్డారు. ఏం పనిరా ఇదీ అంటూ...కానీ చెల్లాయి బుజ్జి బుజ్జి కళ్ళు మెరుస్తూ ఎంత ఆనందంగా తనవంక చూసిందనీ....అప్పుడే అనిపించింది చెల్లాయి "నాది " అని ...దాని గులాబీ రంగు పిడికిళ్ళూ , పాదాలూ అచ్చంగా మా పెరట్లో పూసిన గులాబీ పువ్వుల్లానే ఉన్నాయి....చెల్లాయి బోసి నోటి తో ఆవలిస్తూ ఉంటే అబ్బా నన్ను పిలవటానికే నోరు తెరుస్తోందేమో అనిపించేది నాకు .
తరువాత చెల్లాయి అమ్మ ఒడిలో ఉన్నాతను ముట్టుకుంటూ ,ఆడుకుంటూ వుండేవాడు తను ... అయినా చెల్లాయి ఎప్పుడూ విసుగ్గా ఏడవలేదు ...పాపాయి కి నేనంటే ఎంత ఇష్టమో అనుకునేవాడు తను .
చెల్లాయి అన్నప్రాసనరోజు దానిముందు...పెన్నులూ,పుస్తకా లూ, అద్దమూ,పూలూ ,బంగారమూ ,పాయసం గిన్నె ఎన్నో పెట్టారు....అది నవ్వు మొహం తో కాళ్ళూ చేతులూ తపతప లాడిస్తూ అమ్మ కొంగుపట్టుకున్న నా వైపు వచ్చేసింది ...తనకెంత గర్వం వచ్చిందనీ? అప్పుడు నాన్న గారేమో ...కాసేపు వీడిని పక్కకు తీసుకెళ్ళండర్రా...అది వాడి వైపే వస్తుందన్నారు ...నన్ను అన్నయ్య ఎత్తుకున్నాక పాపాయి పుస్తకము ముట్టుకుంది.
కొంచెం పెద్దయ్యాక ...అమ్మ కార్తీక మాసంలో సోమవారాలు ఉపవాసం ఉంటుంటే నేనూ అక్కలూ కూడా ఉండేవాళ్ళం...అన్నయ్యలు ,నాన్న అన్నం తినేసేవారు ...చిన్నది కదా చెల్లాయి ఉండలేదనుకునేవాడు ...కానీ అది అచ్చూ అమ్మ లాగానే ఒకే ఒక్క జామపండు తిని ఉపోషం ఉండేది...సాయంకాలానికి అమ్మ చెయ్యి పట్టుకుని ఆరిందాలాగా శివాలయములో దీపారాధన చెసొచ్చేది . అమ్మ దానివంక ప్రేమగా చూసి తల నిమిరితే చాలు ...దానికి ఇంక ఆకలీ దప్పులూ కూడా తెలియవేమో అనిపించేది నాకు .
నాన్న ఎప్పుడైనా చెరొక పావలా ఇచ్చేవారు ...నేనేమో రెండు కమలా పళ్ళు కొనుక్కుని వచ్చేవాడిని...ఒకటి నాకూ, ఒకటి మా అమ్మకూ అంటూ ....చెల్లాయి మాత్రం ఒక డబ్బాలో వేసుకునేది.... ఒకసారి నాన్న నా చెప్పుల జత పోతే కొత్తవికొనిచ్చారు....అదేమి చిత్రమో కానీ మర్నాడే రెండొదీ పోయింది....మా నాన్న కు కోపం వచ్చి వెధవాయ్ నీకసలు జాగ్రత్త లేదు ఇంక కొన్ని రోజులు చెప్పులు లేకుండా తిరుగు అని కోప్పడ్డారు . అప్పుడు వెంటనే మా చెల్లెలు దాని డబ్బుల డబ్బా నాముందు పెట్టి ఒరేయ్ అన్నయ్యా ఇవిగో డబ్బులు కొత్త చెప్పులు కొనుక్కో అంది.అప్పుడది అందరికీ ఎంత ముద్దొచ్చిందో...నాకు కూడా నూ .....
కాస్త పెద్దవుతూ ఉందగానే నా చెయ్యో, అన్నయ్య చెయ్యో పట్టుకుని స్కూల్ కి వచ్చేది....స్కూల్ లో నా NCC పీరియడ్ అవ్వంగానే ఇడ్లీ పొట్లాలు ఇచ్చేవారు...నేను వెంటనే చెల్లాయి క్లాస్ కి వెళ్ళి ...ఇడ్లీ తిందాం రమ్మనేవాడిని...అది గబ గబా వచ్చి ఒరేయ్ అన్నయ్యా నాకు పచ్చడి చాలు ఇడ్లి నువ్వే తినేయ్ అనెది....నాకు ఆకలిగా ఉంటుందని దానికెలా తెలుసో నాకిప్పటికీ అర్ధం కాదు
అందరికన్నా ఎంతో పెద్దయిన మా పెద్దన్నయ్యని కూడా ఒరేయ్ పెద్దన్నయ్యా అనేది...వాడు అప్పటికే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు...అయినా వాడికి ముద్దో....లేకపోతే చెల్లాయ్ పిలుపు లోని ఆత్మీయతో వాడు దాన్ని ఏమీ అనేవాడే కాదు. ఇంట్లో తనతరువాత పిల్లలందర్నీ గడగడ లాడించే అన్నయ్య ....దాన్ని ఏమీ అనేవాడే కాదసలు.
ఇహ మా నాన్న అయితే చిన్నమ్మా! చిట్టితల్లీ అనిపిలిచి ముద్దు చేసేవారు... మా ఇంట్లో మా నాన్నగారి జేబులో చెయ్యిపెట్టి డబ్బులు తీసే స్వాతంత్ర్యం చెల్లాయికొక్కత్తికే ఉండేది.
ఈ లోపల బామ్మ కాలం తీరి దేవుడి దగ్గరకు వెళ్ళింది
రోజులు గిర్రున తిరిగాయి ఇంట్లో అందరికీ తాము చదవగలిగినంత చదువులూ,పైవాళ్ళకు పెళ్ళిళ్ళూ,పేరంటాలూ ....నాన్న రిటైర్మెంట్ ..పెన్షన్ లేని ఉద్యోగం.... ఉన్న కాస్త ఆస్తిపాస్తులూ కూడా కరిగిపోయాయి .నేనూ చెల్లాయీ మిగిలాము అమ్మా నాన్నలకు ఇంకా....అందివచ్చిన సంసారాలతో అన్నయ్యలు బాధ్యతలు అంతగా పంచుకోలేక పోయారు నేనేదో కాలేజీ లో లెక్చరర్ గా జేరి పట్నవాసినయ్యాను .చెల్లాయ్ అమ్మా నాన్న లతో పాటే ఊరిలో .....ఖాళీగా ఎందుకూ ఏదొ కాస్త చదువుకున్నానుగా అంటూ ఒక స్కూల్ లో టీచర్ గా జేరింది....మధ్యలో అప్పుడే ఊపందుకున్న కొన్ని కంప్యూటర్ కోర్స్ లు కూడా చేసేసింది .అది కూడా దాని డబ్బులు సగం ఇంట్లో
ఇచ్చి మిగతా సగం ఫీజ్ కట్టుకునేది ...ఒక కోర్స్ అయ్యాక....తన తరువాత బాచ్ కి క్లాస్ తీసుకుని....తను డబ్బులు కట్టకుండా ఇంకోక కోర్స్ చేసేసేది ....కానీ చివరి అక్కయ్య పురుటికి రావటముతో పని అంతా అమ్మ ఒక్కత్తే చేసుకోలేదని ఉద్యోగం మానేయాల్సి వచ్చినా చెల్లాయ్ మొహం లో అసంతృప్తి కనపడేది కాదు ...
ఉన్నట్టుండి నాన్న హడావిడిగా పైనుండి పిలుపొచ్చిందంటూ వెళ్ళిపొయ్యారు, అమ్మా చెల్లాయీ మిగిలారు.....వాళ్ళని తీస్కెళ్ళి తమ దగ్గిర ఉంచుకోవాలని అన్నయ్యలు తీర్మానించుకున్నా...ఎవరి దగ్గర అన్నది ప్రశ్న అయ్యింది....నేను చివరి వాడినీ, చిన్న ఉద్యోగస్తుడినీ కాబట్టి
వాళ్ళను నాదగ్గిర ఉంచితే అన్నలకు అవమానం....మనలో మాట నా కొచ్చే జీతానికి బాధ్యత వహించలేనని నేను మిన్నకున్నాను .ఎవరు వాళ్ళని తీసుకెళ్ళినా చెల్లెలి పెళ్ళిబాధ్యత వారి నెత్తిన ఎక్కువగా పడుతుందని అందరికీ భయమే .....అయినా ఏమాటకామాట చెప్పుకోవాలి మా చెల్లెలు చక్కని చుక్క...ఎవరు చూసినా దాన్ని కళ్ళకద్దుకుని పెళ్ళి చేసుకుంటామంటారు ....
చివరికి రెండో అన్నయ్యావదినల దగ్గరుండేలా ఒప్పందం కుదిరింది...అందరూ అన్నయ్యలూ కాస్త కాస్త చందాలు నెల నెలా వాడికి ఇచ్చేస్తారు.వాడి పిల్లలకు కాస్త ఇంట్లో చూసుకునేవాళ్ళు ఉన్నట్టు ఉంటుంది ...మరి దంపతులిద్దరూ ఉద్యోగస్తులే....
వదిన వైపు చుట్టాలు వచ్చినప్పుడల్లా చెల్లాయిని గుదిబండ లానే చూసేవాళ్ళు ..అయినా దాని నిర్మలమయిన కన్నుల్లో ఏ భావమూ ఉండేది కాదు ...పై పెచ్చు అమ్మకి కష్టం కాకుండా వంటకూడా తనే చేసేది జనాలు ఎక్కువగా వచ్చినప్పుడు.....దానికి ఒకటే కోరిక అమ్మని కష్టపెట్టకుండా చూసుకోవాలని. అయిన వ్యంగాలూ ,వెటకారాలూ అమ్మకీ, చెల్లెలికీ మామూలు అయిపోయాయి...అమ్మ బాధల్లా ఒక్కటే తనుకూడా పోతే చెల్లాయ్ వంటమనిషో, పనిమనిషో అయిపోతుందేమో అని.....అది ఉద్యోగం చేసి ఊళ్ళేలక్కరలేదని తెచ్చేటప్పుడే అన్నయ్య గట్టి వార్నింగ్ ఇచ్చిమరీ తెచ్చాడు
ఒకరోజు వదినా వాళ్ళ అమ్మా , అక్కయ్యా వచ్చారు....మాటలసందర్భములో ఒక జంతువు పేరుచెప్పి ...అలా పదిమందిని కనటము కాదు...ముందూ వెనుకా చూడగలమా లేదా అన్నది చూసుకోవాలి అంటూ అమ్మని ఎద్దేవా చేసినట్టు మాట్లాడారు ...అమ్మ కళ్ళల్లో గిర్రున నీళ్ళు.....అక్కడే ఉన్న అన్నయ్య ఏమీ అన్లేదు...వదిన చిద్విలాసముగా చూస్తోంది.ఆ రోజు అక్కడికి చూడటానికి వచ్చిన నేను కూడా ఏమీ అనలేకపొయ్యాను.....
ఎందుకంటే ఒంటరిగా ,స్వేచ్చగా బ్రతకటానికి అలవాటు పడ్డాను కదా ...బాధ్యత తలకెత్తుకోవాల్సి వస్తుంది ఏమైనా అంటే ...అమ్మ కళ్ళల్లో నీళ్ళు చూసిన చెల్లాయ్ మాత్రం తట్టుకోలేక పొయ్యింది ...అవునవును అంతమందిని కన్నారు కాబట్టే మీ అమ్మాయి లాంటి వారికి మొగుడు దొరికాడు అంది.అందరికీ నషాళానికంటిది. అయినా కానీ అంతమాట తనతల్లిని అంటున్నప్పుడు అన్నయ్య ఎరగనట్టు ఊరుకోవటం దానికసలు నచ్చలేదు ....వెంటనే వదినా వాళ్ళమ్మ అందుకుని...మరేనమ్మా తిని కూర్చునే వాళ్ళకి ఇలాంటి మాటలే వస్తాయి....ఉద్యోగం చేసి మీ అందరికీ పోస్తున్నది నా కూతురు ...బాధ నాకే ఉంటుంది అంది...అన్నయ్య నూవ్వుర్కోవే మా అత్తగారు పెద్ద తప్పేమీ అనలేదు..నోరుమూసుకుని లోపలకు పో అన్నాడు ..అంతే చెల్లాయి లోపలనుండి తమ బట్టల సూట్కేస్ తెచ్చి అమ్మ చెయ్యి పట్టుకుని...ఒరేయ్ అన్నయ్యా నీ ఇంట్లో చేస్తున్నంత పని ఏ గుడి లోనో ...ఆశ్రమం లోనో చేస్తే కూడా మా బ్రతుకులు బాగానే వెళ్ళమారిపోతాయ్....ఇంతకాలం ఉంచుకున్నారు అదేపదివేలు రా....అమ్మా ...నా పైవాళ్ళందరినీ పనికిరాని వాళ్ళని కన్నావని నేనేనాడూ వేలెత్తి చూపకుండా నిన్ను పోషించుకుంటాను ...వస్తాము రా అంటూ అన్నయ్యా వదినా కాళ్ళకు దణ్ణం పెట్టి మరీ అమ్మ చెయ్యి పుచ్చుకుని .....ఒరేయ్ చిన్నన్నా కనీసం మా సూట్కేస్ ని ఆటో దాకా అన్నా తేవటానికి ప్రయత్నించు అంటూ అమ్మ చెయ్యి పట్టుకుని బయటకు అడుగులు వేసింది.....అమ్మ కూడా అక్కడ ఇమడలేక పోయిందేమో చెల్లెలి వెంట బొమ్మలా కదిలింది....ఏదో తిట్టబోయిన అన్నయ్య నోరు చెల్లెలి చూపు తాళం తో ఆగిపోయింది .
చెల్లెలిది మొండితనము కాదు ఆత్మాభిమానం అనిపించింది. ఒక్క నిమిషమని చెప్పి స్థాణువులా నిలబడ్డ అన్నయ్య భుజం తట్టి వాళ్ళకు నేనున్నానన్నట్టు బైటకొచ్చాను.చెల్లెలు అమ్మ చెయ్యిపట్టుకుని ధైర్యం గా అడుగులు వేస్తుంటే ...వారి వెనకాల నేను....చిన్నప్పుడు దాని చెయ్యి పట్టుకుని తప్పటడుగు వేయించాను...అది నేనేం చెయ్యొచ్చో చెప్పకనే చెపుతూ నా "తప్పుటడుగులను" సరిదిద్దింది అనిపించింది....చిన్నప్పుడు చెల్లాయ్ నాది అని మురిసిన నేను...ఇప్పుడు అమ్మా చెల్లాయీ నావాళ్ళు అని అనుకునేలా చేసింది.....
మార్నాడు అదే వూరిలో ఉంటున్న అన్నలు అందరూ నా రూం కి రానే వచ్చారు....కోప్పడ్డారూ ,బ్రతిమాలారు..అమ్మ నీకు ఒక్కత్తెకే అమ్మ కాదన్నారు కూడా, అక్కలు కూడా ఫోన్ చేసి మాట్లాడారు ...అయినా అది ఒప్పుకోలేదు...ఒక రెండేళ్ళు సమయం ఇవ్వండి...నేను ఆ తరువాత మీరు చెప్పినట్టు చేస్తాను .....అంది....అమ్మ కూడా అది చెప్పినట్టు వినటానికే తను నిశ్చయించుకున్నానంది.....
చెల్లాయ్ ఏమి చేసిందో తెలుసా.....? పక్కనే ఉన్న కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో ట్యూటర్ గా చేరింది.... అంతే కాక అక్కడ తన స్టుడెంట్ గాచేరిన ఒక బాంక్ ఆఫీసర్ కూతురితో మాట్లాడి
ఆయన ష్యూరిటీ ద్వార చిన్న లోన్ తీసుకుని నాలుగు కంప్యూటర్ లు కొంది.... కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలకెళ్ళీ ,కష్టపడి సబ్‌కాంట్రాక్ట్ లు తెచ్చింది ....అవి తన స్టూడెంట్ల తో కలిసి పూర్తిచేస్తూ...వారికి కూడా జీతమిచ్చేది ...దానితో పిల్లలు కూడా ఉత్సాహముగా పని పూర్తి చేసేవారు ..చిన్న స్థాయి సాఫ్ట్‌వేర్ కంపెనీ గా మార్చేసింది.... ఇప్పుడు తనే నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉంది.
అక్కడితో ఆగలేదు.....మధ్యలో నాకు కూడా తనకొచ్చిన కోర్సులన్నీ నేర్పించింది.చివరికి అమ్మ కోరికపై పెళ్ళికి ఒప్పుకుంది.....పెళ్ళికి ముందే ఒరేయ్ అన్నయ్యా ఇటురా అంటూ ...ఆ కంపెనీ ని అమ్మ పేరునా, నా పేరునా మార్చిన కాయితాలు నా చేతిలో పేట్టి....నాతో పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీల చుట్టూతా తిరిగావు కదా నాకోసం...అందుకే ఇది నీ కోసం అంది ....
పెళ్ళి అయ్యి మొగుడితో కలిసి ఆయన ఉద్యోగం చేస్తున్న దేశానికి వెళ్ళిపోయింది .....వెళుతూ ఒకేమాట అన్నయ్యా మళ్ళీ నీ పెళ్ళికి వస్తాను....ఈ లోపల అమ్మకు పేపర్లు పంపుతా వీసా కు.... రెడీ గా ఉండు...కానీ అమ్మ జాగ్రత్తరా అని ఏడ్చేసింది.....
నాకళ్ళవెంట కూడా నీళ్ళు ....చెల్లాయ్ కి ఉన్న ఆత్మవిశ్వాసం నాకు లేక పోయిందే ఒకప్పుడు అనీ ....కానీ నా చిన్నారి చెల్లికి ఎప్పుడూ తెలుసు నాకేం యివ్వాలో ....
అందుకే అన్నగా నా దీవెనలు " అమ్మకడుపుచల్లగా....చిన్నారి చెల్లిగా.....కలకాలం ఉండాలి ....బంగారు తల్లిగా " అని.....
(పిల్లల నిరాదరణకు గురి అయిన తల్లిదండ్రులకు అంకితం. )
No comments:
Post a Comment