ఇలా ఎందరున్నారు ?- (2 వ భాగం ) - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు ?- (2 వ భాగం )

Share This
ఇలా ఎందరున్నారు ?- 2
-అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ : తన తండ్రి స్నేహితుడైన శివరామకృష్ణ గారి ఇంట్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది సంకేత. ఆయన కొడుకు శ్రీహర్ష సంకేతకు సీనియర్. హిందూ, సంకేత, పల్లవి, శివాని స్నేహితురాళ్ళు. తన సెల్ ఫోన్ ను పి.టి.సర్ తీసుకోవడంతో దిగులు పడుతున్న శివాని ని నవ్వించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు మిగతావాళ్ళు.... పల్లవి సెల్ ఒక రోజుకి ఇమ్మని అడుగుతుంది శివాని... ఇక చదవండి...)   “అంత సీన్ లేదులే ! నేను ముందే చెబుతా ! పల్లవికి ఒబేసిటీ ప్రాబ్లం ఉంది అని...” అండి శివాని. ఒబేసిటీ నా శరీరానికి కాని, నా గొంతుకు కాదుగా ! ఏ అబ్బాయిలైనా ఎట్ట్రాక్ట్ అయ్యేది ముందుగా మనిషిని చూసి కాదు. ఎట్త్రాక్టివ్ గా మాట్లాడుతున్నట్టు గొంతు వినిపిస్తే చాలు ఫోన్ లో వదలకుండా వెంటబడతారు కొందరబ్బాయిలు .” అంది. “అలా అని నీకు నువ్వే డిసైడైపోయావా ? లేక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ?” అంది వ్యంగ్యంగా శివాని. “ఉంది. డిగ్రీ చేస్తున్న నా ఫ్రెండ్ లైఫ్ లోకి ఒకడు రాంగ్ కాల్ తో ఎంటరై దాన్ని చూడకుండానే దానితో మాట్లాడి, మాట్లాడి దాన్ని మెస్మరైస్ చేసాడు. ఆక్సిడెంట్ అయిందనో, హాస్పిటల్ లో ఉన్నాననో అబద్ధం చెప్పి అతని ఫ్రెండ్ ని పంపి దాని దగ్గర డబ్బులు తీసుకునేవాడు, ఒకసారి అది ఎక్షామ్ ఫీజు కోసం ఉంచుకున్న డబ్బుల్ని కూడా తీసుకున్నాడట. తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా, వాళ్ళ అమ్మకి పసికర్లు అయ్యి, హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా డబ్బులు కావాలని యెంత అడిగినా ఇవ్వలేదట. అది ఆ బెంగతో డిప్రెషన్ లోకి పోయి, అదే హాస్పిటల్ లో వాళ్ళ అమ్మకన్నా ముందే చనిపోయింది. అది తెలిసి వాళ్ళ కాలేజీ వాళ్ళు దాని పేరు పక్కన శ్రద్ధాంజలి అని రాసి ఉన్న ఫ్లెక్షి ని కాలేజీ ముందు పెట్టారు. ఒక రోజు సెలవు కూడా ప్రకటించారు. అది చూసి నేను షాక్. నా మనసులోంచి ఆ సన్నివేశం ఇంకా చెదిరిపోలేదు.” అని చెబుతూ వెంటనే సెల్ ఫోన్ ని చెవి దగ్గర పెట్టుకుని, “హలో! అమ్మా ! నాకు నిన్ను చూడాలని ఉంది, వస్తున్నా. నాన్నకి కూఒడా ఫోన్ చేసి చెబుతాను. మళ్ళి రేపు కాలేజీ టైం వరకూ వచ్చేస్తాలే !” అంటూ కాల్ కట్ చేసి, ఫ్రెండ్స్ వైపు తిరిగి, “ నేను మా ఊరు వెళ్లి రేపు వస్తానే.” అంటూ రోడ్ పై వస్తున్న ఆటో ను ఆపి ఎక్కి వెళ్ళిపోయింది పల్లవి. సంకేత, శివాని, హిందూ అవాక్కయ్యారు ! శివాని పల్లవి మాటల్ని పెద్దగా లక్ష్యపెట్టలేదు. సంకేత వైపు తిరిగి, “చూడవే సంకేతా ! ఎక్కడో ఏదో జరిగిందని, అన్ని చోట్లా అలాగే ఎందుకు జరుగుతుంది ? పల్లవి బాడీ కే కాదు, మనసుకు కూడా ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నట్లుంది. అందుకే అలా ఆలోచిస్తోంది.” సంకేతనే కాదు, హిందూ కూడా ఆ మాటలు విని, దాని మీద ఇంకేం మాట్లాడలేదు. ఏం మాట్లాడినా శివాని వినే స్థితిలో లేదు. సెల్ ఫోన్ లేకపోతే యెంత పిచ్చి లేస్తుందో, నిత్యం హాస్టల్ లో చూసే హిందూ కి బాగా తెలుసు. సంకేత తప్ప హిందూ, పల్లవి, శివాని ఒకే హాస్టల్ లో ఉంటున్నారు. హాస్టల్ లో ఉండే అమ్మాయిల్లో ఎవరూ, ఎవరిలాగా ఉండరు. ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైన అలవాట్లతో, ప్రత్యేకమైన తెగింపుతో, ఉంటారు. అది చదువు విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు.మాకు వ్యక్తిత్వం ఉంది. దాన్ని ప్రదర్శించుకునే స్వేచ్చ, స్వాతంత్ర్యాలు కూడా మాకు ఉన్నాయి, అన్నట్లు అన్ని విషయాల్లో ముందుంటారు. కాని పైకి కనిపించరు. ఏదైనా ఎవరికి వాళ్ళే సీక్రెట్ గా నిర్ణయాలు తీసుకుని, ఫాలో అవుతారు. ఏదైనా సెల్ల్ఫొన్ల తోనే వాళ్లకు పని.... ! నాలెడ్జ్ ని పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా తమకు సరియన ఆయుధం సెల్ ఫోనే అన్నట్లు వ్యవహరిస్తారు. అదీ కాక, సెల్ ఫోన్ లో మాట్లాడిన ప్రతి మాటకు డబ్బులేం పెద్దగా ఖర్చు కావు. ఎందుకంటే కొన్ని సెల్ ఫోన్ కంపెనీ లు మిడ్ నైట్ బాలన్స్ వేసుకుంటే చాలు... రాత్రి 11 గంటల నుండి, ఉదయం 6 గంటల వరకు ఫ్రీ గా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అదికూడా ఏ టైం లో ఏ సిం తో ఫ్రీ గా మాట్లాడుకోవచ్చో చూసుకుని, దానికి వీలుగా సిం లు మార్చుకుని మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. అందుకే కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు నైట్ అంతా నిద్ర మానేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో శివాని ఒకరు. హిందూ ని ఫోన్ అడగాలంటేనే శివానికి జంకుగా ఉంటుంది. హిందూ దగ్గర ఫోన్ ఉండేదే ఇంటికి ఫోన్ చేసి, వాళ్ళమ్మ త్రిపురమ్మతో మాట్లాడడానికి... ఆమె ఎప్పుడు కాల్ చేస్తుందో తెలీదు. ఒకవేళ తను మాట్లాడుతున్న టైం లో ఆమె కాల్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. ఎంగేజ్ వచ్చింది అంటే “ఎవర్తో మాట్లాడుతున్నావే అంతసేపు?” అంటూ హిందుని చంపేస్తుంది . అందుకే చూపులన్ని హిందూ సెల్ ఫోన్ మీద వున్నా మనసుని మాత్రం కంట్రోల్ చేసుకుంది శివాని . ఈ రాత్రికి సెల్ ఫోన్ లేకుండా ఎలా గడపాలన్నదే ఆమెకు గడ్డు సమస్య అయింది . అయినా ఈ కాలేజీ వాళ్లకి అదేం పాడుబుద్దో !పిల్లల దగ్గర వున్న సెల్ఫోన్స్ తీసుకుంటారు ,అని మనసులో తిట్టుకుంటూ వేరే అమ్మాయిలతో వెళ్లి కలిసింది . అక్కడికి వేరే అబ్బాయిల గుంపు వచ్చి చేరింది . వాళ్ళలో రాజీవ్ అనే అబ్బాయి శివాని వైపు చూసి ఎగతాళిగా నవ్వి " డోంట్ వర్రీ శివాని నేను వెంటనే వెళ్లి మన ప్రాబ్లంని మన కో ఆర్డినేటర్ తో చెప్తాను . వెంటనే దీన్ని మన హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకువెళతాను మన మొబైల్స్ మనకి వస్తాయి " అని అటుండగా వాళ్ళ సీనియర్ అనంత్ బైక్ మీద జెట్ వేగంతో వెళుతూ రాజీవ్ పక్కన ఆగి ఆ మాటలు విన్నాడు . వినగానే రాజీవ్ జబ్బమీద గట్టిగా చరిచాడు "ఒరేయ్ మామా కో ఆర్దినేటర్స్ వుండేది ఎందుకనుకుంటున్నావ్ ! జనరల్ నాలెడ్జి ఉండే మాట్లాడుతున్నావా ? రా బైక్ ఎక్కు వెళదాం !" అంటూ అతన్ని తీసుకు వెళ్ళాడు . శివాని వెర్రి  చూపులు చూసి " మరి ఇలాంటి ప్రోబ్లమ్స్ ని  ఎవరు చూస్తారు"  అంది . .... ఆ దారిలో నడుస్తున్న అబ్బాయిలు , అమ్మాయిలు ఫార్మల్ డ్రెస్ లో ఉన్నారు . 'వీళ్ళు మన కాలేజీ కి సంభందించిన విద్యార్ధులు " అని గుర్తింపు కోసం ఆ కాలేజీ వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ ని మెడలో వేసుకుని వున్నారు . వెంటనే వాళ్ళలో ఇంకో అబ్బాయి కల్పించుకుని "మన పిటి సర్ తీసుకు వెళ్ళిన మొబైల్స్ అన్ని మన వైస్ ప్రిన్సిపాల్ దగ్గర వున్నాయి . మనవాళ్ళు కొందరు వెళ్లి ఆయన్ని బాగా రిక్వెస్ట్ చేశారు . ఆయన ఇవ్వనన్నాడట , కనీసం రేపు అయినా ఇస్తాడో లేదో ! ఫైన్ ఎంత కట్టాల్సి వస్తుందో ఏమో ! నాదగ్గర ఒక్క రూపాయి కుడా లేదు ' అంటూ ఏడుపు ముఖం పెట్టాడు . అంతే కాదు ఈ పాటికి తన గర్ల్ ఫ్రెండ్ తనకి పంపిన మెసేజ్ లన్ని వైస్ ప్రిన్సిపల్ గారి దగ్గర వున్న తన మొబైల్ లోకి ఫీడ్ అవుతూ ఉంటాయన్నది  గుర్తు రాగానే అవన్నీఆయన ఎక్కడ చూస్తాడో అన్న బెంగతో ఆయన మీద వస్తున్న కోపాన్ని ఆపుకోలేక పోతున్నాడు . పైకే తిట్టుకుంటూ మన మొబైల్స్ అన్నీ ఆయన ఏమ్చేసుకుంటాడో మీలో ఎవరికైనా తెలుసా మామా ! రాత్రికి డోర్ పెట్టుకుని ఆ మెసేజ్ లన్ని తన గర్ల్ ఫ్రెండ్ కి పాస్ ఆన్ చేస్తాడు . అలా పంపి ఆవిడగారి దగ్గర యువకుడై పోదామని ! ఎంత ఆశ ఎంత ఆశ అంటూ అందరికి వినిపించేలా అరిచాడు . వెంటనే ఆ అబ్బాయి గూబ గుయ్యి మంది . ఎవరు కొట్టారో తెలియనంత బిత్తర పోయాడు . వాళ్ళలో శ్రీహర్ష వున్నాడన్నది అప్పటి వరకు ఎవరు గమనించలేదు . కొట్టింది శ్రీహర్షే . ఆ అబ్బాయి చెంప తడుముకుంటూ "ఎంత సీనియర్ వి అయితే మాత్రం కొడతావా"  అన్నట్లు చూశాడు . " తప్పు చేసేది కాక ఇది తప్పని దండించే వాళ్ళను ఇలాగేనా మాట్లాడేది ,ఇందుకేనా మనం చదివే ఈ చదువులు ? ఆయన విద్యాదానం చేసే దేవుడు . పిల్లల లైఫ్ బాగుండాలని, పిల్లలకి మేలు జరగాలని చూస్తాడు . ఆయనకీ పిల్లలకి పాఠాలు చెప్పే వ్యసనం తప్ప ఇలాంటి చిల్లర వ్యసనాలు లేవు . నువ్వు అలా అనడం నచ్చలేదు అందుకే కొట్టాను. నువ్వంటే నాకు ఎలాంటి కక్ష లేదు " అన్నాడు శ్రీహర్ష . ఆ అబ్బాయి వెంటనే సారీ చెప్పాడు . ఇది ఇలా జరుగుతూ వుండగా శివాని శ్రీహర్ష వైపు కోపంగా చూసి అక్కడి నుండి చక చకా నడుచుకుంటూ వెళ్లి సంకేత వాళ్ళతో  కలసింది . ఆమె అలా వెళ్లి సంకేత వాళ్ళని కలవడంలో ఉద్దేశం శ్రీహర్ష తన దారిన తను వెళ్ళకుండా తన క్లాస్ మేట్ ను కొట్టడం సంకేతకి , హిందూ కి చెప్పాలని ... ముఖ్యంగా సంకేతకి చెప్తే సంకేత వెళ్లి శ్రీహర్ష్ తల్లి కాంచనమాల తో "ఆంటీ శ్రీహర్ష కాలేజీ లో పిచ్చి పిచ్చి గా అందరితో గొడవ పెట్టుకుంటున్నాడు . ఒక్కోసారి చెయ్యి కూడా చేసుకుంటున్నాడు"  అని చెప్పాలని . కాని హిందూ . సంకేత శివానిని పట్టించుకోకుండా '2జి స్పెక్ట్రమ్ స్కాం ' అంటే ఏమిటో మాట్లాడు కుంటున్నారు ... దాని గురించి సంకేత  అడుగుతుంటే హిందూ చెబుతుంది . " స్పెక్ట్రమ్ అంటే రకరకాల ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు . గాలిలో అలలు అలలు గా వచ్చే శబ్దం . ఈ తరంగాలు వార్తలని అందించడానికి ఉపయోగిస్తారు . ఇందులో ముఖ్యమైన ఉపగ్రహం ద్వారా అందించే సమాచారం ముఖ్యమైన సాధనం . స్పెక్ట్రుణ్ అందులో అతి ముఖ్యమైనది . మొబైల్ ఫోనుల వాడకం విపరీతంగా పెరిగి పోవడం వాల్ల ఎన్నో కంపెనీలు లైసెన్సు ల కోసం పోటీ పడుతున్నాయి "   అంది . సంకేత శ్రద్దగా వింటోండి . " అదీ కాక మనదేశంలో ప్రచార సాధనాలు కేంద్ర ప్రభుత్వపు కంట్రోల్ లో వుండటం వల్ల ప్రభుత్వం టెలి కమ్యునికేషన్సు ను -ప్రభుత్వ మంత్రిత్వ శాఖకి కేటాయించింది . వేల కోట్లు ,లక్షల కోట్లు ప్రభుత్వ టెలి కమ్యునికేషన్ శాఖకి కంపెనీ లు లైసెన్స్ ఫీజులుగా చెల్లించాలి . లైసెన్స్ ఇచ్చే అవకాశం  టెలికం శాఖకి వుండటం వల్ల వందలు , వేలు కోట్లు దిగ మింగి   కొందరు  జైల్లో కూర్చోవడం మామూలైంది . మనదేశంలో ఇప్పటికి దాదాపు 80 కోట్ల మంది దాకా మొబైల్ ఫోన్లు వాడుతూ ఉన్నారట . ఎయిర్టెల్ ,రిలయన్సు , టాటా ,వోడాఫోనే , ఎయిర్సెల్ ఇలా చాలా కంపెనీ లు లైసెన్సు లు తీసుకుని విపరీతంగా సంపాదించు కుంటూ , అధికారం లో వున్నా వారికి ఈ లైసెన్సు ల కోసం వేల కోట్ల రూపాయలు లంచం గా ఇస్తున్నారు . అదే స్పెక్ట్రమ్ స్కాం అంటే " అంది హిందూ . ఆ తర్వాత వాళ్ళ టాపిక్ వేరే దాని మీదకి మళ్ళింది . శివాని వాళ్ళ వైపు విసుగ్గా చూసింది . ఎంతసేపు విన్నా చొప్పదంటు నమిలినట్లుగా అరుచిగా అనిపించాయి వాళ్ళ మాటలు . తను చెప్పాలనుకున్నది చెప్పే అవకాసం ఇవ్వడంలేదు వాళ్ళు . వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు . శివానికి క్షణం లో ఏదో ఆలోచన వచ్చినట్లు "హిందూ ! నేను హాస్టల్ కి రావడం లేదు . ఈ రాత్రికి మా ఫ్రెండ్ దగ్గర వుండి రేప్పొద్దున వస్తాను . తన దగ్గరికి వెళ్లి రికార్డు రాసుకునేది వుంది " అంటూ వేగంగా అడుగులు వేసుకుంటూ వేరే దారిలోకి వెళ్ళింది . సంకేత ,హిందూ ముఖాలు చూసుకున్నారు . తిరిగి నడుచుకుంటూ సంకేత శివరామ కృష్ణ గారింటికి , హిందూ హాస్టల్ కి వెళ్లి పోయారు .
*   *   *   *
శివరామ కృష్ణ తల్లి వరమ్మ . ఆమె పడక గది మూడేళ్ళుగా మెట్లకిందనే వుంది . ఆమె భర్త రామారావు చనిపోయి ఐదేళ్ళ పైనే అయింది. రామారావు బతికి ఉన్నంత కాలం ఆ దంపతులు ఇద్దరు చాలా కాలం హాల్లోనే పదుకున్నరు. కారణం శివరామ కృష్ణకి కాంచనమాలతొ పెళ్లయ్యాక కొడుకు , కోడలికి ప్రైవసీ ఉంటుందని రామారావు , వరమ్మ పడుకుంటున్న గదిని వాళ్లకి ఇచ్చి హాల్లోకి మారారు . ఆ తర్వాత వరమ్మ భర్త రామారావు చనిపోయారు . కాంచన మాల శివరామ కృష్ణతో ఏం చెప్పిందో ఏమో ...... " అమ్మా ! హాల్లో నీ పడక చూడటానికి బావుండదేమో ! మా సహా ఉద్యోగులు కూడా కొందరు అదే అన్నారు . వాయిదాల రూపంలో ఐనా ఓ సోఫా కొని వేసుకుంటే బావుంటుందేమో ! పైగా నాన్న కూడా లేదు కదా ! నాన్న వున్నప్పుడు అంటే మీరు పాడుకోడానికి ఇబ్బందిగా ఉంటుందని సోఫా , కుర్చీలు లాంటివేమీ కొనలేదు . శ్రీహర్ష పెద్దవాడవుతున్నాడు . ఆ మాత్రం మెయింటినెన్స్  లేకపోతే బాగుండదు . వాడిక్కుడా వాడి స్నేహితుల ముందు గౌరవం పెరగాలి . ఈ రోజుల్లో ముందు ఎవరైనా ఇంటిని ,ఇంటిలోని సామాన్లను చూసే మర్యాద ఇస్తున్నారు . నేనిలా అంటున్నానని శ్రీహర్ష కి చెప్పకు ..... వాడి అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలవక పోతే నీ కోడలితో గొడవలు వస్తాయి . ... ఇంతకీ నేనేం చెప్పబోతున్నానంటే ఎలాగూ మెట్ల కింద స్తలం ఖాళీగా వుంది . నువ్వు అక్కడ పడుకుంటే ఎలా వుంటుందో ఆలోచించు .... బావుంటుందనే నేను అనుకుంటున్నాను . ఇక్కడైతే అందరు తిరుగుతూ నీక్కూడా ఇబ్బందిగా వుంటుంది .!" అన్నాడు శివరామ కృష్ణ . కొడుకు మాటకు తిరుగు లేదు . కాదని కుడా ఎప్పుడు అనదు వరమ్మ . కొడుకంటే ఆమెకి ప్రాణం . ... అందుకే "అలాగే శివయ్యా ! నువ్వు చెప్పింది కూడా సబబు గానే వుంది . ఈ రోజే నా పడకను మెట్ల కిందకు మార్చుకుంటాను . హాయిగా నిద్ర పడితే చాలు . ఎక్కడ పడుకుంటే ఏముంది . అంతా మన ఇల్లే కదా! " అంది . అలా అనక పోతే కొడుకును బాధ పెట్టినట్లు అవుతుంది . కాంచన మాల రౌద్ర రూపాన్ని చూస్తూ క్షణ క్షణం చావాల్సి వస్తుంది. నిజానికి ఆ ఇల్లు కట్టేటప్పుడు ఆ స్తలమంతా తానే అయి తిరిగింది . కూలీలను ఎక్కువ పెడితే డబ్బు చాలక ఇంటి పని మధ్యలో ఆగిపోతుందని ఇటుకలు తడపడం , గోడలు తడపడం ,మాల్ అందివ్వడం లాంటి పనులు తనే చేసింది . తన భర్త వద్దన్నా వినేది కాదు . వంట గది , బెడ్ రూం , హాలు తన అభిరుచికి అనుగుణంగా కట్టించు కోవడం కోసం భర్తను నొప్పించకుండా చాలా సౌమ్యంగా " ఇదిగోండి ! ఇల్లు పూర్తయ్యాక మీరు ఉదయాన్నే ఇక్కడ కుర్చుని కాఫీ తాగొచ్చు , పేపరు చదవొచ్చు . కాస్త ఇటొచ్చి చూస్తే సూర్యోదయం కనిపిస్తుంది .... సూర్యాస్తమయాలు మనకు కనిపించవు . ఎందుకంటే మన ఇంటికి నైరుతిలో మన ఇంటికన్నా ఎత్తులో పెద్ద బిల్డింగ్ వుంది . దీన్ని బట్టి ఎప్పటికైనా మన శివరామ కృష్ణ గొప్ప వాడు అవుతాడు . ఇదిగో వాడి  బుక్స్ కోసం , వాడి  బట్టల కోసం ఇక్కడ  షెల్ఫ్ లు వస్తాయి .  మేస్త్రి తో మాట్లాడాను . మా బెడ్ రూం మాకే కాదు మా అబ్బాయి కి కుడా అనుకూలంగా ఉండేటట్లు కట్టమని ... ఏమంటారు ? నేను సరిగానే ఆలోచిస్తున్నాను కదా ! " అనేది . " నువ్వు ఏదైనా సరిగానే ఆలోచిస్తావు .... ఆలోచించే ముందు మన ఆర్ధిక పరిస్తితిని కూడా దృష్టిలో పెట్టుకో ...." అనే వాడు భర్త . "అందుకే మెట్ల దగ్గర పని ఆపేద్దాం ! మెట్లు కూడా ఖరీదుగా కట్టుకోవద్దు . ఏదో మేడ మీద ఎండేసిన వడియాల కోసమో , బట్టల కోసమో ఎక్కడానికి అనుకూలంగా వుంటే చాలు . అయినా అటు వైపు ఎవరు వెళ్తారు ? ఎవరు చూస్తారు . మెట్ల క్రింద నేల కూడా  సిమెంట్ చేయొద్దు . అలాగే వదిలేద్దాం అంది . ఆమె అన్నట్లుగానే అప్పటినుండి ఇప్పటివరకు నెల అలాగే వుంది . ప్రస్తుతమ్.... మేడపైకి వెళ్లాలని మనుష్యులు ఒక్కో మెట్టు చెకచెకా ఎక్కుతున్నప్పుడు చెప్పులకు అంటుకున్న దుమ్ము వచ్చి మెట్ల కింద పడుకున్న వర్మ మీద పడుతుంటుంది . ఈ మెట్లపై క్లీన్ చేసే ఓపిక ఆ ఇంట్లో ఎవరికీ లేదు . అప్పుడప్పుడు నీలిమ వెళ్లి శుభ్రం చేస్తుంది. అంతలోనే కాంచనమాల ఓ కేకేసి...”అదేమైనా షాపింగ్ కాంప్లెక్సా ! ఇంట్లో పని వదిలేసి అక్కడికి వెళ్ళావ్ ! ఇలాంటి పనులే నాకు నచ్చవు... “అంటుంది. నీలిమ నోరెత్తదు. కాంచనమాల బైటికేల్లినప్పుడు మాత్రం మెట్ల మీద, మెట్ల కింద ఉన్న వరమ్మ మంచం చుట్టూ శుబ్రం చేస్తుంది. అలా చేసినప్పుడు,” ఏ తల్లి కన్నబిడ్డవో తెలీదుకాని, పనిమనిషివైనా మనసు బంగారం నీలిమా నీది... దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. పెద్దవాళ్ళ దీవెనలు ఊరికే పోవు “ అంటుంది వరమ్మ. “చెయ్యకుండా అలాగే వదిలేస్తే మీరుండలేరు. ఇప్పటికే ఈగలు వస్తున్నాయ్. మీరు లేస్తే మీ పక్కబట్టలు మార్చి వాటిని ఉతికిస్తాను,” అంది నీలిమ. వెంటనే లేచింది వరమ్మ. ఈ మధ్యన ఎందుకో ఎక్కువగా తిరగలేక పోతోంది. తన పన్లు కూడాతాను చేసుకోలేక పోతోంది. వంట్లో జ్వరం ఏమైనా ఉందో ఏమో ! అది తెలియక నీలిమ “ అప్పుడప్పుడు లేచి కొంచెం తిరుగుతూ ఉండండి ! అలాగే పడుకుంటే నడుం పట్టేస్తుంది !” అంది. “నీరసంగా ఉంటోంది నీలిమా !” అంది వరమ్మ. “అలాగే ఉంటుంది, వయసు కూడా ఉంది కదా ! బాగా తింటే నీరసం తగ్గుతుంది. నేను బైటికేల్లినప్పుడు పళ్ళు తెచ్చిస్తా ! దాచుకుని అప్పుడప్పుడూ తిందురుగాని...” అండి నీలిమ. “ నువ్వు బైటికేప్పుడు వెళ్తావు ?” ఆశగా అడిగింది. “కాంచన మేడం నన్ను కరెంటు బిల్లులు కట్టమనో, సెల్ రీఛార్జి చేయించామనో, మార్కెట్ కనో పంపుతుంది కదా ! అప్పుడు వెళ్తాను.” అంది . “అప్పుడా !”అంది తనలో తానే నిరాశగా . “మరి మీ కోసం ప్రత్యేకంగా వెళ్తే, పని వదిలేసి వెళ్లానని తిడుతుందేమో ! తిడితే తిడుతుంది. అయినా వెళ్తాను .” అంది నీలిమ. “వద్దు, వద్దు ! తిట్లు పడేది నువ్వే అయినా, వాటిని తింటున్నత సేపు అవే గుర్తొచ్చి, తిండి మీదే విరక్తి పుడుతుంది...” అండి వరమ్మ. ఒక్క నిముషం వరమ్మనే చూస్తూ అవాక్కయ్యింది నీలిమ. వరమ్మ ఇంకేమి మాట్లాడకపోవడంతో ,” మరి ఆ చీరలు కూడా ఇవ్వండి, వీటితో పాటే వాటిని కూడా ఉతికేస్తాను, మీరు ఎలాగూ ఉతకలేరు. ఈ మధ్యన మీలో చాలా మార్పు వచ్చింది.... యోగాలు, ఆసనాలు చెయ్యకపోయినా కనీసం అటూ ఇటూ అయినా తిరగండి!” అంటూ నీలిమ తనే మంచం కిందకి వంగి, వరమ్మ ఇప్పిన బట్టలు తీసుకువెళ్ళింది. వరమ్మ కళ్ళు చెమర్చాయి. నీలిమ ఎవరు ? తానెవరు ? 4 సం. క్రితం ఒక అనాధాశ్రమంలో ఏదో “నిజం “ చెప్పిన నేరానికి బైటికి గెంటబడిన అనాధ పిల్ల నీలిమ. దిక్కుతెలియక రోడ్డు పక్కన ఏడుస్తూ ఉంటే తన భర్త రామారావు “మా ఇంట్లో ఉందూగాని రా !” అంటూ జాలిపడి తీసుకొచ్చాడు. అప్పుడు నీలిమకు 15 సం. ఉంటాయి. అప్పటినుండి హాల్ లో తమ పక్కనే చాప వేసుకుని పడుకునేది.... ఇప్పటికీ అదే చాపపై అదే హాల్ లో పడుకుంటోంది. తను మాత్రం మెట్ల కిందకి మారింది. అయితే, కొత్తగా శివరామకృష్ణ తన స్నేహితుడు నరసింహం కూతురు సంకేతను తెచ్చి, అదే హాల్ల లో నీలిమ పక్కన ఒక బెడ్ వేసి, షెల్టర్ కల్పించాడు... చదువుకునే అవకాశం కల్పించాడు. మానవత్వంతో ఏ పని చేసినా మంచిదే అనేవాడు తన భర్త రామారావు. మరి ఇప్పుడు మెట్ల కింద తెగిపోయిన నవారు మంచంలో పడుకుని ఉన్నానన్నది పైలోకాల్లో ఉన్న తన భర్తకి కనిపిస్తుందా ? ఏదైనా ఒక వాడనుండో, పేట నుండో, తండా నుండో వచ్చిన పనిపిల్ల అయితే గిన్నెలు కడిగి, నేల తుడిచి, బట్టలు ఉతికి, వెళ్ళిపోయేది. కాని నీలిమకు ఇల్లు లేకపోవడంతో అక్కడే తింటూ, అక్కడే ఉంటూ, ఇంట్లో ప్రతి పని తనకోసమే ఎదురు చూస్తున్నట్టు బాధ్యతగా చేస్తుంది. భయంగా మసలుకుంటుంది, కృతజ్ఞతగా ఉంటుంది. అనాధ ఆశ్రమంలో పదొవ తరగతి వరకూ చదువుకోవడం వల్ల తెలుగు బాగా చదువుతుంది. ఇంగ్లీష్ కూడా చదువుతుంది... మాటల్లో సభ్యత, సంస్కారాలు ఉట్టి పడుతుంటాయి. చెబితేనే తప్ప పనమ్మాయి అనుకోరు చూసేవాళ్ళు, గొప్ప అందగత్తె. అయినా తన హద్దు మరచి ఏనాడూ ప్రవర్తించాడు నీలిమ. వరమ్మ చీరలు ఉతికి, వాటిని గట్టిగా పిండి, 2 చీరలు భుజమ్మీద వేసుకుని, ఒక చీరను చేత్తో పట్టుకుని, మేడ మీద వేస్తే త్వరగా ఆరిపోతాయని, వెళ్తున్న నీలిమకు ఎదురైంది సంకేత.... సంకేతతో పాటు సంకేత క్లాసు మేట్స్ పల్లవి, శివాని ఉన్నారు. వాళ్ళ ముగ్గురూ కాలేజీ నించి వస్తున్నారు. పల్లవి వెంటనే ముక్కు మూసుకుని, “ చి, చి, ముసలి కంపు, వాటిని నువ్వే ఉతికావా?” అంది. ఎలా పడుకుంటావే దీని పక్కన అన్నట్టు సంకేత వైపు చూసింది. పల్లవి ముఖంలోని భావాన్ని చదివి నివ్వెరపోతూ... “అవును నేనే ! ఐతే ఏం ?” అంది దబాయింపుగా నీలిమ. “ నీకేం కాదు, నువ్వు పనిమనిషివి, సంకేత దగ్గర పడుకుంటావ్ చూడు, అదే ఇబ్బంది...” అయినా ఎలా పడుకుంటున్నావే సంకేతా దీని పక్కన “ అని లోలోన గొణిగింది శివాని. సంకేత మాటల్ని పట్టించుకోకుండా “ ఇప్పుడేగా కాలేజీ కి వెళ్ళింది, అప్పుడే వచ్చారేంటి ?” అని అడిగింది సంకేత వైపు చూస్తూ నీలిమ. “కాలేజీ లో సమ్మె నడుస్తోంది...” అండి సంకేత. “మరి మీరు పాల్గొనలేదా !” అడిగింది నీలిమ. “నీకు మాటలేక్కువయ్యాయి “ అన్నట్లు ఉరిమి చూసింది పల్లవి. ఈ మధ్య పనయ్యకా పేపర్ తిరగెయ్యడం అలవాటైన నీలిమ  వెంటనే 2 అడుగులు పల్లవి వైపు వేసి, “కంపు” అంటుందని, మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసి, “ మీ కాలేజీ లో సమ్మె చేస్తే ఇండియా లో ఉండే పేదరికం పోతుందా ? ఆహారం, నీరు, వైద్యం, విద్య, అందరికీ అందుబాటులోకి వస్తుందా ? మొన్న పేపర్ లో చదివాను. మనకు స్వాతంత్ర్యం వచ్చాకా సాధించింది ఏమీ లేదుట ! కొన్ని కోట్ల రూ. అవినీతి, 70 లక్షల కోట్ల రూ. కుంభ కోణాల్లో గల్లంతైనట్లు అంచనా వేసారట. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి కొన్ని కోట్ల పైమాటే నట ! ఈ సొమ్ముతో మన దేశానికి సంబంధించిన మొత్తం బాకీని వడ్డీతో సహా కొట్టి పారేయ్యచ్చుట... ప్రతి ఊరికి 3 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని సౌకర్యాలతో నెలకొల్ప వచ్చట... దేశంలో ప్రతి భారతీయుడికి 56,000 రూ. జీవన భ్రుతి కింద ఇవ్వచ్చుట... మన దేశ స్థూల ఆదాయం కంటే స్కాముల్లో పోయిందే ఎక్కువట. వీళ్ళెవరినీ జైల్లో పెట్టిన వాళ్ళు లేరట. మరి మీ కాలేజీ లో సమ్మెలు చేసి వీటిని లేకుండా చేస్తారా ? దేశం బాగుంటుంది..” అంది ఆశగా చూస్తూ. (సశేషం...)  

No comments:

Post a Comment

Pages