భక్తి మాల – 1
- మల్లాది వేంకట సత్యనారాయణ మూర్తి
విఘ్నేశ్వర స్తుతి
- కందము :
అనఘా ! ఘన గణపతి ! ఓ
యి ! నాగ వదనా ! సురమును లెల్లరు నిను వం
దనముల గొలువగ ముందుగ
ఘనతను పొందితి నగసుత గారా లసుతా !
తాత్పర్యము : ఓ పాపరహితుడా ! గొప్పవైన ప్రమధ గణముల నాయకా ! ఓ ఏనుగు ముఖము కలవాడా ! దేవతలు, ఋషులందరూ ముందుగా నిన్ను నమస్సులతో ఆరాధించగా, ఓ పార్వతి యొక్క ముద్దు బిడ్డడా ! నీవు కీర్తిని పొందినావు. ఆరోగ్య కారకుడు సూర్య స్తుతి 2. మత్తేభము
ఘన భూషాన్వితా ! కశ్యపాత్మ భవ ! కారుణ్య వారానిధీ !
వనజాత ప్రియ ! వాంచితార్ధ ఫలదా ! బ్రహ్మేంద్ర దేవార్చితా !
మునిశ్రేష్టుల్ సయితమ్ము గొల్చు వరదా ! మోక్షప్రదాతాగ్రణీ !
అనఘా ! నిన్ను భజింతు నా మది సదా ఆరోగ్యసంవృద్ధికై !
తాత్పర్యము : గొప్పవైన ఆభరణములు కలవాడా ! కశ్యపుని పుత్రుడా ! కరుణకు సముద్రము వంటివాడా ! పద్మ ప్రియుడా ! కోరిన ఫలముల నొసగువాడా ! బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే పూజింపబడే వాడా ! ఋషులు కూడా ఆరాధించు వరముల నొసగువాడా ! మోక్షమును ప్రసాదించుటలో మొట్టమొదటి వాడా ! ఆరోగ్యవృద్ధికి నేనెల్లప్పుడూ నా మనస్సులో నిన్ను పూజించెదను. సర్వవిద్యాప్రదాయిని సరస్వతీ స్తుతి 3. తేటగీతి
డంభములు పల్కు నర్భక డింభకులకు
తుంబురాది విద్వాంసుల కంబవగుచు
సర్వవిద్యల నొసగెడు సారసాక్షీ !
సకల సద్గుణ నికురంబ ! శారదాంబ !
తాత్పర్యము : విద్యాహీనులై ఉచితానుచిత విచక్షణ లేక పలికేవారికైనా , తుంబురుడు మొదలైన విద్వాంసులకైనా, అమ్మవలె నీవు అన్ని విద్యాబుద్ధులను ప్రసాదించెదవు. ఓ పద్మముల వంటి కన్నులు కలదానా ! సర్వ గుణములకు నిలయమైన ఓ సరస్వతీదేవి ! బ్రహ్మ స్తుతి 4. ఆటవెలది
సృష్టికర్తవయ్యి జీవుల సృజియించి
ప్రాణదాతవైన బ్రహ్మదేవ !
నీదుకరుణ జీవులాది యనాదిగా
వెలుగుచుండెజగతి వెలుగు చూపి !
తాత్పర్యము :సృష్టికర్తగా జీవులను పుట్టించి ప్రాణమునిచ్చు ఓ బ్రహ్మ దేవా ! నీ కరుణ వలన జీవులు ఆది –అంతము అనునది లేక, ఈ జగమునకు వెలుగు చూపుచూ వెలుగుచున్నారు. విష్ణు స్తుతి 5. ఆటవెలది
జీవులెల్లరకును స్థితి కారకుండవై
లోకమందు మనగ లోకులకును
చాకచాక్యమొసగు సరసిజనాభ ! యో
విష్ణుదేవ ! నిన్ను ప్రీతిగాంతు !
తాత్పర్యము : జీవులందరి మనుగడకు కారకుడిగా, ఈ లోకమునందు వసించుటకు తెలివితేటల నొసగే ఓ విష్ణుమూర్తీ ! పద్మము నాభియందు కలవాడా ! నిన్ను ఎంతో ఇష్టంగా చూచెదను.
No comments:
Post a Comment