సమ్మోహన వేణుగానం – పండిట్ హరిప్రసాద్ చౌరాసియా - అచ్చంగా తెలుగు

సమ్మోహన వేణుగానం – పండిట్ హరిప్రసాద్ చౌరాసియా

Share This
సమ్మోహన వేణుగానం – పండిట్ హరిప్రసాద్ చౌరాసియా
-      భావరాజు పద్మిని


ఊపిరిని వాయులీనం చేసి, ప్రకృతి లోని వర్షానికి, సూర్యోదయానికి, వసంతానికి కూడా తన వేణువుతో ప్రాణం పోసి, అదే భావన వినే వారికి కలిగేలా మనసుల్ని సమ్మోహన పరుస్తూ, “ఔరా ! కృష్ణుడి వేణుగానం అంటే ఇలాగే ఉంటుందేమో !” అన్నంత మధురంగా  ‘వెదురును మురళిగా మలచే’ అద్భుతమైన వేణు వాదనా మాంత్రికుడు – పండిట్ హరిప్రసాద్ చౌరాసియా. వారి జీవిత విశేషాలు ఈ నెల ‘సంగీతం’ లో మీ కోసం...   
మల్లయోధుడైన తండ్రికి, తన కుమారుడు గొప్ప కుస్తీ క్రీడాకారుడు కావాలని కోరిక. ఆ కుర్రవాడికి సంగీతమంటే పంచప్రాణాలు. కాని, తండ్రికి ఎదురు చెప్పలేడు ! ఒక రోజు కుస్తీలు పట్టి ఇంటికి వెళ్తుండగా, పంట కాలువ గట్టున పిల్లవాడొకడు తన పిల్లన గ్రోవిని ఉంచి, నీళ్ళు తాగుతున్నాడు. అతనికి తెలియకుండా, అతని వేణువును పట్టుకుని ఉడాయించాడు కుస్తీ అబ్బాయి. నాటి నుంచి వేణువు అతని జీవితంలో అంతర్భాగమయ్యింది, అతని ఆరో ప్రాణంగా మారింది. అప్పుడా బాలుడికి పదేళ్ళు. అలా వేణువును కాజేసిన బాలుడే, నేటి విశ్వవిఖ్యాత వేణు వాదనా విశారదుడు హరిప్రసాద్ చౌరాసియా !!! హరిప్రసాద్ 1938 వ సంవత్సరంలో అలహాబాద్ నగరంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. తమ్ముడు కూడా చిన్నతనంలోనే మరణించడంతో ఆయన మనసులో ఎంతో వెలితి. తండ్రి ఆజ్ఞను అనుసరించి, కుస్తీ సాధన చేసేవారు. 
చిన్నప్పటినుంచి ఆయన ,ఎక్కడ సంగీత కచేరీలు జరిగినా అక్కడికి
వెళ్లిపోయేవారు. తనకి తెలియకుండానే తాళం వేసేవారు. ఒక్కోసారి కాలం కూడా తెలిసేది కాదు. తండ్రి ఇంట్లో లేని సమయంలో శాస్త్రీయ సంగీతాన్ని సాధనచేసేవారు. బెనారస్‌లో తన ఇంటి పక్కనే నివాసముండే పండిట్‌ రాజారాం వద్ద ఏకలవ్య శిష్యరికం చేశారు  హరిప్రసాద్‌ . అప్పటికి హరిప్రసాద్‌ వయసు 15 సంవత్సరాలు. పండిట్‌ రాజారాం శిష్యుని వద్ద ఏమీ తీసుకోకుండానే సంగీతంలో కిటుకులను చెప్పేవారు. ఏకసంథాగ్రాహి అయిన హరిప్రసాద్‌ అతి తక్కువ కాలంలోనే సంగీతాన్ని ఔపాసన పట్టారు. తరువాత వారణాసికి చెందిన పండిట్‌ భోలానాథ్‌
పర్యవేక్షణలో వేణువు వాయించడం నేర్చుకున్నారు. 19 సంవ త్సరాల వయసులో కటక్‌, ఒరిస్సా రేడియోలో శాస్ర్తీయ సంగీత కళాకారునిగా ఉద్యోగంలో చేరారు. కొన్నాళ్లపాటు ఉద్యోగం చేశాక హరిప్రసాద్‌కు బొంబాయి రేడియో కేంద్రానికి బదిలీ అయింది. ఉద్యోగ రీత్యా బొంబాయి చేరుకున్నారు. 

ముంబాయిలో రేడియో కేంద్రంలో పనిచేసేటప్పుడు హరిప్రసాద్‌ను అదృష్టం వరించింది. హరిప్రసాద్‌ వేణుగానానికి మురిసిపోని శ్రోతలు ఉండేవారు కాదు ఆ రోజుల్లో. దాంతో ముంబాయి రేడియో కేంద్రానికి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఆ సమయంలోనే ముంబాయిలో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దర్శకులతో ఏర్పడ్డ పరిచయాలతో, హరిప్రసాద్‌కు కొన్ని చిత్రాలలో పాటలకు తన వేణుగాన సహకారం అందించే అవకాశం వచ్చింది. క్రమంగా హరిప్రసాద్‌
చౌరాసియా వేణుగానానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. భారతదేశం గర్వించదగిన కళాకారులలో ఒకడిగా హరిప్రసాద్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆల్‌ ఇండియా రేడియోలో కచేరీలు ఇస్తున్నప్పుడు, ఆయనకు బాబా అల్లావుద్దీన్‌ ఖాన్‌ కూతురు అన్నపూర్ణాదేవి నుండి కొంత శిక్షణ లభించింది. ఆయన తన ప్రతిభానైపుణ్యంతో వేణుగానం లో శాస్ర్తీయపద్ధతులనూ, ఆధునిక పోకడలనూ అవలంబించారు. సంతూర్‌ వాద్య సంగీతకారుడు పండిట్‌ శివకుమార్‌ శర్మతో కలిసి ఆయన ఎన్నో కచేరీలు చేశారు. వారి జుగల్‌బందీ శివ-హరి గా ప్రసిద్ధినొందినది. హరిప్రసాద్‌ చౌరాసియా ప్రఖ్యాత
గాత్రసంగీతకారిణి అనూరాధను వివాహం చేసుకున్నారు. 1984లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. వివిధ పాశ్చాత్య సంగీత కళాకారులతో కలిసి హరిప్రసాద్‌ వైవిధ్య భరితమైన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ విడుదల చేశారు. రిపబ్లికన్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ దేశం నుంచి కూడా అత్యున్నత అవార్డును అందుకున్నారు. ఆయన హిందుస్థాన్‌ సాంప్రదాయ వేణుగానంలో నేర్పరి. 

వేణువులో అనేక ప్రయోగాలు చేసారు. కొండను చుట్టి వచ్చే గాలులు ధ్వనించే రాగం ‘ మల్హార్’ లో ఆయన నిపుణులు. వర్షరుతువును తనతో జుగల్‌బందీకి ఆహ్వానిస్తారు, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా! ఉత్తరాది వెదురుతో చేసిన
పొడవైన వేణువు, దక్షిణాది వెదురుతో చేసిన చిట్టి వేణువులతో ఆయన వినిపించే రాగాలు, శ్రోతల మనసుల్లో  వర్షపుధారలు కురిపిస్తాయి. తన మురళీగానంతో శ్రోతల మదిలో కృష్ణుడి భావచిత్రాన్ని సాక్షాత్కరింపజేసే చౌరాసియా ముంబై, భువనేశ్వర్‌లలో ‘బృందావన్ గురుకుల్’ నిర్వహిస్తున్నారు. తనకు చిన్నతనం నుంచి కూడా వేణు గానానికి స్ఫూర్తినిచ్చిన భగవంతుడు వేరెవరో కాదు…… శ్రీకృష్ణపరమాత్ముడంటారు హరిప్రసాద్‌. ఈ జగత్తు అంతా కూడా శ్రీకృష్ణుని వేణుగాన మాధుర్యంపైనే జీవించివుంది. పశువులను, శిశువులను సమానస్థాయిలో ఆకట్టుకునేది కేవలం వేణుగానమేనంటారు హరిప్రసాద్‌. పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడైన శ్రీకృష్ణుడి పుట్టినరోజు పండుగ అయిన ‘జన్మాష్టమి’ రోజు హరి ప్రసాద్‌ తన శిష్యగణంతో కూర్చుని 24 గంటలూ తన వేణువు గానంతో ఎక్కడెక్కడినుంచో వచ్చిన అభిమాన శ్రోతలందరికీ వినిపిస్తాడు. కృష్ణాష్టమి పర్వదినమంటే ఆయన బృందావనంలో శిష్యగణానికి నెలరోజులనుంచి హడావిడి మొదల వుతుంది. మళ్లీ వచ్చే జన్మాష్టమిదాకా వారు చేసిన కార్య క్రమం గుర్తుండిపోయేలా చేస్తారు. అటువంటి గొప్ప శిష్యులను సంతరించుకున్నారు హరిప్రసాద్‌ చౌరాసియా. తన తర్వాత తన గానం వేయి వేణువులతో బృందగానం చేయాలనే ఆయన ఆకాంక్షను శిష్యులు ఇప్పటికే సఫలం చేశారు. 
అవార్డులు : 1984 సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. 1992లో కోణార్క్‌ సమ్మాన్‌ పురస్కారాన్ని పొందారు. భార త కేంద్ర ప్రభుత్వం హరిప్రసాద్‌ను గౌరవిస్తూ 1992 సంవత్సరంలో పద్మభూషణ్‌ 2000 సంవత్సరంలో ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారా లతో సత్కరించింది. విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ అకాడమీ వారు ‘నాద విద్యాభారతి’ బిరుదునిచ్చి ఆయనను సత్కరించారు. నార్త్‌ ఒరిస్సా యూని వర్సిటీ హరిప్రసాద్‌ చౌరాసియాకు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించింది. 2003లో హరిప్రసాద్‌ ఏర్పాటుచేసిన గురుకుల్‌ నాద పాఠశాలకు మహారాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఎన్ని అవార్డులు వచ్చినా…లెక్కలేనన్ని రివార్డులు వచ్చినా హరిప్రసాద్‌ చౌరాసియాకు కించిత్‌ కూడా గర్వమనే ఛాయలు రానీయరు. అదే ఆయన గొప్పతనం. 
ముఖ్యమైన ఆల్బమ్‌లు హరిప్రసాద్ చాందిని, డర్‌, లంహే, సిల్సిలా, ఫాస్‌లే, విజయ్‌, సాహిబాన్‌ వంటి విజయవంతమైన హిందీ చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌ వేణు సంగీతాన్ని అందించారు. 
తెలుగు సినిమా సంగీతం : సిరివెన్నెల సినిమాలో పాటలకు వేణుగాన సహకారం అందించింది హరిప్రసాద్‌ చౌరాసియానే. బాలరాజు కథ సినిమాలో ప్రజాదరణ పొందిన ‘గున్నమామిడి కొమ్మ మీద ’ అనే పాటకు వేణుగాన సహకారం అందించింది కూడా హరిప్రసాద్‌ చౌరాసియానే… సిరివెన్నెల చిత్రానికిగాను దర్శకుడు కె.విశ్వనాధ్‌ అప్పట్లో ఎంతో బిజీగా ఉండే హరిప్రసాద్‌ చౌరాసియాను ఒప్పించి తన చిత్రం బ్యాక్‌డ్రాప్‌ సంగీతానికి, పాటలకు ఆయన వేణుగాన సహకారం కోరారు. ఆ సినిమాలో పాటలు ఎంతగా పాపులరో… ప్రతి ఇంటా ఆ క్యాసెట్లు అప్పట్లో మార్మోగాయి. పాత్రపరంగా హీరో ఆ సినిమాలో అంధ వేణుగాన విద్వాంసుడు. ఆ పాత్ర రక్తికట్టడానికి హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానమే కారణం అంటారు సినీ విశ్లేషకులు. ఇండియన్‌ మ్యూజిక్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రస్థుతం ఆర్టిస్టిక్‌ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తానొక గొప్ప విద్వాంసుడిగా అందరూ భావించినప్పటికీ తానెప్పుడు నిత్య విద్యార్థినేనని ప్రముఖ వేణుగాన విద్యాంసుడు, పద్మభూషణ్‌ పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా అంటారు. ఏడుపదుల వయసులోనూ ఉర్రూతలూగించే వేణుగానాన్ని అభిమాన శ్రోతలకు పంచుతున్నారు. “సిరివెన్నెల” చిత్రానికి ఆయన అందించిన ఈ అద్భుతమైన వేణుగానం బహుశా సినిమాలో ఉందని, మనలో చాలామంది విని ఉండరేమో... మిస్ కాకుండా క్రింది లింక్ లో వినండి    

No comments:

Post a Comment

Pages