శివం (శివుడు చెప్పిన కధ -6 ) - అచ్చంగా తెలుగు

శివం (శివుడు చెప్పిన కధ -6 )

Share This
శివం (శివుడు చెప్పిన కధ -6 )
-      ఫణిరాజ కార్తీక్
(రావణుడి శివభక్తిని గురించి చెప్తుంటాడు శివుడు...)

"మహేశ్వరుడి మహత్యం వినగా ఆయన్ని కన్నుల్లారా చూశాక యిక ఈ జన్మకు ఏమి కావాలి"అని రావణుడు నా గూర్చి చెప్పసాగాడు.. ఎంతో శాంతపరుడైన రావణుడు తన రాక్షస ప్రవృత్తిని వదిలిపెట్టి కైలాసవాసిలాగ వుండేవాడు. నన్ను ఎప్పుడూ స్మరిస్తూ ఉండేవాడు. అతని స్మరణకు,చింతనకు,నేను కూడా అతనివెంటే వుండేవాణ్ణి...భక్తులు నన్ను ఎంత స్మరిస్తారో వారికి నేను అంత చేరువౌతాను.. "అసలు నన్ను ఎందుకు పుట్టించావు శివయ్యా? చక్కగా నీ దగ్గిరే వుంచుకోవచ్చుగా! చెప్పావుగా నాలోనే నువు వున్నావని.. మరి ఎందుకు ఈ జన్మ.. నాకు మోక్షం అంటే ఏంటో తెలియదు.. ఎల్లప్పుడూ నీ దగ్గిరే వుండేటట్లు అనుగ్రహించవయ్యా!"అని రావణుడు నన్ను తదేకంగా ప్రార్ధించేవాడు.."జయ పరమేశ్వరా, జయ విశ్వేశ్వరా"అని ఎన్నో కీర్తనలు ఆలపించేవాడు.. నన్ను ఎవరు పిలుస్తారో వారికే అన్నీ పిలవనట్లు చేయటమే కదా నా తత్వం.. రావణుడి భక్తి  తన్మయత్వంలో ఉన్నాడు. అతను స్మశానానికి వెళ్ళి అక్కడ వున్న చితాభస్మంతో శివలింగమును చేసేవాడు.ఆ శివలింగమును నన్నుగా తలస్తూ "ప్రభూ! శాశ్వత బంధువు నీవు, అన్ని బంధాలు హరిస్తావు, నిన్ను ప్రేమించమంటావు, ప్రేమిస్తే పరీక్షిస్తావు, ఏమనగా అది పద్ధతి అంటావు, పుట్టించమని ఎవరు అడిగారు, బంధాలు ఇవ్వమని ఎవరు అడిగారు? జన్మ జన్మలు నీలో కలవటం కోసం ఎందుకు ఉండాలో,అన్నిటికీ కారణమైన మనస్సును ఎవరు సృష్టించారు?” అని ఆరాధనగా అడిగేవాడు. "ప్రభూ!ఎప్పటికైనా ఇక్కడికి రావలిసింది తప్పదుగా, అప్పుడు నీవు నన్ను తీసుకెళ్తావా నీతోపాటు" అని కళ్ళవెంట నీళ్ళతో నన్ను అడిగేవాడు." అసలు నీవు వుండేది ఇక్కడే కదయ్యా, శివాలయం అని అంటారు కానీ, అదే కదా స్మశానం..స్మశానం అనేదానికి నిజమైన అర్ధం చెప్పు స్వామీ!ఈ స్మశానానికి వచ్చినపుడూ, శాశ్వతనిద్రలోకి జరుకున్నపుడూ నన్ను నీతో తీసుకెళ్తావా? చెప్పు తండ్రీ!" అని రోదించసాగాడు. మోకాళ్ళమీద కూర్చొని "తీసుకెళ్తానని మాట యివ్వు శివయ్యా!.." "నాకు యోగిని కావాలని లేదు. ముని, మహర్షి, తపస్వి కానక్కరలేదు.యివన్నీ వున్నది నీలో కలవటానికేగా.. అందుకే అడుగుతున్నా.. నేనేమీ సన్యాసిని కాదు, నిన్ను పూజించటం కన్నాయివి ఏవీ ఎక్కువ కాదు. చనిపోయిన తర్వాత నీలో ఐక్యం ఐతే యిక చావు గూర్చి భయం ఎందుకు.. ప్రమాణం చెయ్యి శివయ్యా"అంటూ ఆ శివలింగం వైపు చేతులు చాచాడు ప్రమాణం చెయ్యమని..  అలా అంటూ  మరణం కాదు మహేశ్వరుని చెంతకు పయనం అని కీర్తన ఆలపించాడు. ఆకాశం మేఘావృతమయ్యింది. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం మొదలయ్యింది. అది స్మశానం..ఒక శవం కాలుతూనే వుంది. కానీ అతడు "ప్రమాణం చెయ్యి శివయ్యా" అని చేయి చాచి మోకాళ్ళమీదే నిలబడి వున్నాడు. ఆ చితి కాలుతూనే వుంది. ఎవరైనా ఎప్పటికైనా అంతేగా అని రావణుడు దానివైపు శివలింగం వైపు చూస్తున్నాడు. వర్షం బాగా పెద్దదయ్యింది. కానీ రావణుడు కదలలేదు.పట్టు వదలలేదు.... (సశేషం...)  

No comments:

Post a Comment

Pages