ఇలా ఎందరున్నారు ?
- అంగులూరి అంజనీదేవి
ఎవరినైనా గొప్పగా ప్రేమించగలిగితే ఆప్రేమ మనిషిలోని అణువణువును ప్రకాశింపజేస్తుంది. ప్రతి కణాన్ని మాధుర్యంతో నింపుతుంది. మనసుని సన్నగా తట్టి పలకరిస్తుంది. కానీ ప్రేమంటే అర్ధం తెలియనివాళ్ళకి ఆ ప్రేమ వెళ్ళి అడుగు దూరంలో నిలబడుతుంది. కష్టాల్లో కూడా దగ్గిరకి రాదు. పొరపాట్లను క్షమించదు. శ్రేయస్సును కోరదు. అసలు తనంటూ ఒకటి వుందన్న సంగతి కూడా గుర్తు చెయ్యదు. ఆఫ్ట్రాల్ నువ్వెంత నా దృష్టిలో అన్నట్లు చాలా నిర్లిప్తంగా చూస్తుంది. నిర్జీవం చేస్తుంది. చివరికి జీవితం ఏమిటి? అన్నప్రశ్న తలెత్తేలా చేస్తుంది. నన్ను ఎవరు యిలా శపించారు? అన్న ప్రశ్న వేసుకునేలా చేస్తుంది. అంతేకాదు..."ఇది నీకు తప్పనిసరిగా కావాలి. నేనిస్తాను తీసుకో!"అని తీసికొచ్చి ఎవరూ దోసిట్లో వెయ్యరు. అలా వేసినా దాని విలువ తెలియనప్పుడు అది దోసిట్లో ఎంతోసేపు వుండదు. అందుకే ఎవరికి ఏంకావాలో ఏం వద్దో వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకోవాలి. వాళ్ళకి వాళ్ళే ఎంచుకోవాలి. కావాలనుకున్నదాన్ని కష్టపడి సాధించుకోవాలి. దేన్ని సాధించుకోవాలన్నా ప్రపంచాన్నే మరచి అదే ప్రయత్నంలో ఉండాలి. ఏ సమస్యా లేని జీవితం వుంటుందా? జీవితం అంటేనే ఒక సమస్య నుండి ఒక సమస్యకు ప్రయాణం. అదొక పెద్ద అన్వేషణ! ఆ అన్వేషణ లేకుండా జీవితాన్ని ఎంతమంది దాటెయ్యగలరు?
ఆ రోజు కాలేజి క్లాస్ రూంలో రెండవ వరుస బెంచీలో కూర్చునివున్న హిందూ తన స్నేహితురాలు సంకేతతో.... "ఇవాళ నెట్ కి వెళ్దామనుకుంటున్నాను. నువ్వొస్తావా?" అని అడిగింది. సంకేత ఏ ఆలోచనలో వుందో ఏమో మౌనంగా వుంది. హిందూ అదేం గమనించకుండా టేబుల్ పైన ఉన్న పుస్తకాన్ని కాలేజి బ్యాగ్ లో పెట్టుకుంటూ "ఇప్పుడు కాలేజినుండి హాస్టల్ కి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయి వెళ్తాను. నువ్వు వస్తానంటే దారిలో నిన్ను పిక్ అప్ చేసుకుంటాను. ఓకేనా?"అంది. సంకేత మాట్లాడకుండా హిందూవైపు తిరిగి అనాసక్తంగా చూసింది.. హిందూ ఆ చూపుల్ని గ్రహించి.... "ఏం! రావా?" అంది హిందూ.. "రాను. బోర్!"అంది సంకేత. హిందూ ఆశ్చర్యపోతూ "నెట్ కెళ్ళటం బోరా! ప్రపంచంలో ఏది కావాలన్నా అందులో కనిపిస్తుంది కదే! బోరేంటి? చిన్నపిల్లలు కూడా సాయంత్రం వేళలో నెట్ కి వెళ్తుంటారు...” అంది. "వెళ్ళనీ! నాకేం?"అంది సంకేత.
హిందూ సంకేతవైపు సూటిగా చూస్తూ "నిజం చెప్పు సంకేతా! నీకు నీ ప్రపంచాన్ని విశాలం చేసుకోవాలని, తక్కువ సమయంలో జ్ఞానాన్ని పెంచుకోవాలని లేదా! నెట్ వల్ల కొత్త కొత్త ఆలోచనలు, టెక్నిక్స్, లాజికల్ స్కిల్స్ పెరుగుతాయని నువ్వేగా అన్నావ్! కొత్త ప్రాజెక్ట్ ని హ్యండిల్ చేయాలన్న ఆలోచనలు కూడా వస్తాయన్నావ్! టెక్నాలజి స్కిల్స్ ని వంటబట్టించుకోవచ్చు అని కూడా అన్నావ్!"అంది. “అన్నాను. అంతేకాదు. అత్యధిక సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించుకోవచ్చు. ఆ సేకరణలో భాగంగా పరిశోధనలు కూడా చెయ్యచ్చు. ఏదైనా గాలివార్త, తప్పుడు సమాచారం కనిపిస్తే ఇంకా ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తితో దానికే బానిస కావచ్చు. అయితే ఏంటట ? ఎవరు ఏది కావాలనుకుంటారో అది అవుతూనే ఉంటారు. అందరూ అలాగే అవ్వాలని లేదుగా... !” అంది సంకేత. సంకేత వైపు అదోలా చూసి, “దేనికైనా ఇది ఉండాలి. అదే లేనప్పుడు...” అంటూ నుదుటి మీద అటునుండి ఇటుకి గీతగీసినట్లు వేలితో తిప్పి చూపించింది హిందు. సంకేత ఏ మాత్రం చలించలేదు. “ఇంతకీ నువ్వు వస్తావా ?రావా? “ అండి హిందూ. “రానని చెప్పానుగా !” “సరే ! నువ్వెందుకు రానంటున్నావో నాకు అర్ధమైంది. నువ్వుండేది శ్రీహర్ష వాళ్ళ ఇంట్లోనేగా ! అతని లాప్టాప్ వాడుకుంటున్నావేమో! అదేదో ముందే చెప్పచ్చుగా ! మీ ఇద్దరూ ఇంత దగ్గరగా ఎప్పుడయ్యారే ?” అంది హిందు. శ్రీహర్ష శివరామకృష్ణ గారి అబ్బాయి. వెంటనే సంకేత కనుబొమ్మలు ముడిపడ్డాయి. హిందూ వైపు కోపంగా చూసింది... “శ్రీహర్ష వాళ్ళ ఇంట్లో అంతబిల్డ్అప్ ఉందని నువ్వెందుకు అనుకుంటున్నావో నాకు అర్ధం కావట్లేదు. ఒకప్పుడు అతని తల్లిదండ్రులు చదువు చెడిపోతుందని అతన్ని టీవీ కూడా చూడనిచ్చేవాళ్ళు కాదట ! మా నాన్న చెప్పాడు. అలాంటిది లాప్టాప్ కొనిస్తారా ? ఏ ఇంట్లో అయినా కంప్యూటర్, ఇంటర్నెట్ ఉండటం ఒక హోదాలా భావిస్తారు. కాని శ్రీహర్ష వాళ్ళు అలా కాదు. మరీ చాదస్తం. ‘ఇమెయిల్ , చాటింగ్ ‘ అంటూ కంటికి కనిపించని వ్యక్తులతో సంభాషించడం, వాళ్ళు చెప్పేవన్నీ నిజాలని నమ్మటం అవివేకం అనుకుంటారు. ఆన్లైన్ ఫ్రెండ్స్ ని లైన్లోకి తెచ్చుకోవడం కన్నా బంధుమిత్రుల పరిచయాలు పెంచుకోవడం మంచిదనుకుంటారు. పోనీ ఆడినా చేస్తారో లేదో నాకు తెలీదు.” అంది సంకేత.
సంకేత మాటల్ని శ్రధ్ధగా విన్నది హిందూ.
శ్రీహర్ష తల్లిదండ్రుల అభిప్రాయంలో కూడా తప్పు లేదు. వాళ్ళకి శ్రీహర్ష ఒక్కడే కొడుకు...అతను ఎక్కువసేపు నెట్ ముందు గడిపితే ఎవరితో కలవలేక నిరాశ, నిస్పృహలకి లోనవుతాడని భయం కావచ్చు...కానీ ఇంటెర్ నెట్ అనేది 'గుప్పిట్లో బంధించిన శక్తి... ఆ శక్తిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. లేకుంటే గంటలు గంటలు నెట్ సెర్చింగ్ చేస్తూ మానిటర్ ముందే సెటిల్ అయిపోతే సమస్యలు వస్తాయ్...'ఏం నేర్చుకోవాలి?ఎంత నేర్చుకున్నాం?'అని సిస్టం ని ఉపయోగించటానికి ముందు తర్వాత ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోవాలి. శ్రీహర్షకి లాప్టాప్ లేదన్న విషయం తనకి తెలియదు. తెలిసుంటే అలా అడిగేది కాదు. "శ్రీహర్షకు నీ అభిప్రాయం చెప్పవే సంకేతా!"అంది హిందూ.. ఎన్నోరోజులుగా అడగాలనుకున్న ప్రశ్న అది. "తలిదండ్రులు ఎలా చెపితే అలా వింటాడు. చెప్పకపోయినా ఏం చెబుతారో ముందే ఊహించి మౌల్డ్ అవుతాడు. సొంత అభిప్రాయాలు వున్నాయో లేవో తెలియదు ,కానీ ఎక్కడికక్కడ అడ్జస్ట్ మాత్రం అవుతాడు. నాకు తెలిసి సినిమాలకి వెళ్ళడు. బేకరీలకు వెళ్ళడు. స్నేహితులతో ఎంజాయ్ చెయ్యడు. అమ్మయిలతో పొరపాటున కూడా మట్లాడడు. ఇప్పుడున్న కల్చర్ లో యింత ముసలి గెటప్ అవసరమా! ఎప్పుడు చేస్తాడే ఎంజాయ్! పళ్ళూడి, బట్టతల వచ్చాకనా!"అంది సంకేత. "శ్రీహర్ష మన సీనియర్! మన సీనియర్స్ లో శ్రీహర్షలాంటివాళ్ళు చాలామందే వున్నారు. వాళ్ళంతా ముసలిగెటప్ లో వున్నట్లా! నాకెందుకో నీ అభిప్రాయం తప్పనిపిస్తోంది..."అంది హిందూ.
"తప్పొ,ఒప్పో నాకు తెలియదు హిందూ! నాకెందుకో ఆ యింట్లో వుండాలనిపించటం లేదు. ఆ యింటి వాతావరణం నాకు బొత్తిగా నచ్చటం లేదు.....నాకు మీతోపాటు కలిసి హాస్టల్లో వుండాలనిపిస్తోంది "అంది సంకేత. "హాస్టల్లో వుంటే నువ్వు చెడుస్నేహాలు చేస్తావని మీ నాన్నగారి భయం...అదీ గాక ఆయన వ్యవసాయదారుడు కాబట్టి నెలనెలా హాస్టల్ ఫీజు కట్టలేనంటున్నారు. ఆయన్ని కూడా అర్ధం చేసుకొవాలి కదా! ఆయనకొచ్చే ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా! నిజానికి నన్నడిగితే శ్రీహర్ష నాన్నగారు మీ నాన్నగారి మాట కాదనలేకనే నిన్ను వాళ్ళ ఇంట్లో వుంచుకున్నారు...దీన్ని బట్టి వాళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులో మనకు అర్ధమైపోతోంది. అందుకే అంటారు 'స్నేహాన్ని పంచుకుంటూ పెంచుకున్ననాడే జీవితానికి ఒక అర్ధం' అని" అంది హిందూ. "అది కరక్టే! మా నాన్నగారి ఆర్ధికపరిస్థితి బాగలేకనే ఆయన శివరామకృష్ణ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంచారు. నిజంగానే ఆయన మానాన్నగారికి మంచి స్నేహితుడు. నేను దాన్ని కాదనను. కానీ మానాన్న ఆయన ఆర్ధికపరిస్థితి చూసుకోకుండా నన్నెందుకు కనాలి...?" అంది సంకేత. వెంటనే హిందూ " ఛ ... ఛ ..కన్నతండ్రి గురించి అలా ఆలోచిస్తారా ఎవరైనా ?" అంది మందలింపుగా. "మా నాన్నను విమర్శించడం లేదు. నన్ను కని అనవసరంగా బరువు పెంచుకున్నారు ఆయన. నాకది కష్టంగా వుంది."అంది సంకేత. "అంతకష్టం ఏమొచ్చిందిప్పుడు"అంది హిందూ. కాలేజీ టైం అయిపోవడంతో విద్యార్ధులంతా క్లాసుల్లోంచి బయటికి నడుస్తున్నారు. "మానాన్న కష్టం నా కష్టం కాదా? నా కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో నేను అర్ధం చేసుకోగలను..."అంటూ లేచి కాలేజీ బ్యాగ్ భుజానికి తగిలించుకుంది. సంకేతతో పాటూ హిందూ, పల్లవి కూడా తమ కాలేజీ బ్యాగులు భుజానికి తగిలించుకొని బయటకు నడిచారు..
శివాని కూడా అదేకారిడార్లోవున్న చివరిగదిలోంచి బయటకొచ్చింది. గబగబా నడుచుకుంటూ వెళ్ళి సంకేత వాళ్ళను చేరుకుంది. శివాని బ్రాంచ్ మెకానికల్. సంకేత, పల్లవి, హిందూ, సేం బ్రాంచ్ అంటే కంప్యుటర్ సైన్స్ థిర్డ్ ఇయర్. శివాని కూడా థర్డ్ ఇయరే! అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లాగే ఆ కాలేజీలో కూడా స్టూడెంట్స్ కి కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.అత్యంత అధునాతనమైన విద్యాబోధనతోపాటు, ఆడుకోవడానికి పెద్దగ్రౌండ్, తినటానికి క్యాంటీన్ ప్రాక్టికల్స్ కోసం మంచి ల్యాబ్స్ వున్నాయి. చదివితే ఇంజనీరింగే చదవాలి ఇంకేం వద్దు... అన్నట్టుగా ఇంజనీరింగులో చేరి,క్లాసులోకి అడుగు పెట్టాక కొందరు విద్యార్ధులకు చదువుపట్ల ముందున్న అంకితభావం వుందా? లేదా?అన్నది వాళ్ళ ఆలోచనా విధానం పై ఆధారపడి వుంటుంది. శివాని ఎందుకో రోజులాగా లేకుండా చాలా నీరసంగా కనిపిస్తోంది. శివాని కాలేజీలో తప్ప బయట ఎప్పుడైనా తలను,ముఖాన్ని స్కార్ఫ్ తో కవర్ చేసుకుని, చెవిలో బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతూ కనిపిస్తుంది. ఎవరివైపూ కూడా పలకరింపుగా చూడదు,నవ్వదు. తనలోతనే గిలిగింతలు పెట్టినట్లు నవ్వుతుంది. వెంటనే సీరియస్ అవుతుంది. ఆ తర్వాత కళ్ళని చక్రాల్లా తిప్పుతూ చాలా హుషారుగా మాట్లాడుతుంది. కూర్చున్నా అదేపని. నిలబడినా అదేపని, నడుస్తున్నా అదే పని....అవతలవైపు నుండి ఫోన్ లో ఏవరు మాట్లాడుతున్నరన్నది మిస్టరీ. అడిగితే చెప్పదు. గట్టిగా అడిగితే 'మా అయనతో...' అంటుంది. ఆశ్చర్యపోయి 'పెండ్లి చేసుకోబోతున్నావా?'అంటే.... "యా!"అంటుంది. ఏది అడిగినా "యా!"అనడంతప్ప ఇంకేం మాట్లాడదు. కుదురుగా ఒకచోట నిలబడదు. ఒక పక్షిపిల్ల రెక్కలు కదిలించి నేలమీదనే అటు ఇటు ఎగిరినట్టు గమ్మత్తు గమ్మత్తుగా తిరుగుతుంది. పొరపాటున కూడా సెల్వార్ కమీజును వెయ్యదు. జీన్స్ డ్రెస్స్ లోనే వుంటుంది. కాలేజీలో వున్నంతసేపు మాత్రమే ఫార్మల్ డ్రెస్స్ లో వుంటుంది. కానీ ఈరోజు ఎందుకో శివాని ముఖం విచారంగా వుంది. "ఇదేమైనా సమస్యలో ఇరుక్కుందా? ఇరుక్కుంటే అదెలాంటిది? ఎలాంటి సమస్య వచ్చినా భయపడాల్సిన పని లేకుండా ఈ మధ్యన ఆ కాలేజీ విద్యార్ధులు ఓ చక్కటి వాతావరణాన్ని సృష్టించుకున్నారు. సీనియర్స్,జూనియర్స్ అన్న తేడాల్లేకుండా, భయాలు లేకుండా,చాలా స్నేహ పూర్వకంగా మెలుగుతున్నరు. ఏ సందేహం వచ్చినా టక్కున వెళ్ళి ఒకరితో ఒకరు చెప్పుకునేటంత చనువుగా వుంటున్నారు. అదీగాక తమ కాలేజీలో చదివేందుకు వచ్చిన వాళ్ళు గ్రామీణ ప్ర్రాంతం నుండి వచ్చినవాళ్ళు కావటంతో వాళ్ళకి ఇంటర్నెట్ అంటే ఏమిటో తెలియదు కాబట్టి.... 'అరె! టెన్షన్ ఎందుకు? నేనున్నాను కదా'అంటూ నెట్ గురించి వివరంగా చెపుతున్నారు సీనియర్లు. అబ్బాయిలు కానీ,అమ్మాయిలు కానీ... అంతేకాదు ఇంజనీరింగ్ కాలేజీలలో పోటీల్లో ఎలాంటి వైవిధ్యాన్ని ప్రదర్శించాలి, పేపర్ ప్రజంటేషన్ ఎలా ఇవ్వాలి, లోపాలను ఎలా అధిగమించాలి, ఎలా నడుచుకోవాలి అన్నది ఖాళీ సమయంలో ముందుగానే వివరించేలా ఓ ప్రణాళిక వేసుకుని భయాన్ని పోగొడ్తున్నారు.
విద్యాపరంగా కాలేజీ పరంగా అడ్డంకులు, పోటీపరంగా వెనుకబాటు, ఇలా సమస్య ఏదైనా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకబృందంగా ఏర్పడ్డారు విద్యార్ధులు. సీనియర్ బృందం నుండి యిద్దరు,జూనియర్ బృందం నుండి యిద్దరు కో-ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. విద్యార్ధుల నుంచి వచ్చిన అన్ని సమస్యల్ని నేరుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరకు తీసుకెళ్ళి చర్చిస్తారు. ....మరి దీని సమస్య ఏమిటో అని ఆలోచిస్తూ శివానివైపు చూసి "ఎందుకే అలా వున్నవ్? ఫేసేంటి అలా అయింది?" అనడిగింది హిందూ. మాట్లాడలేదు శివాని.... పల్లవి, హిందూవైపు చూస్తూ "నువ్వు తప్పుకో!అది నీకు చెప్పదు."అంటూ హిందూ రెక్క పట్టుకుని పక్కకిలాగి శివాని వైపుకి చేరింది..."చెప్పు శివా! ఎందుకంత విచారంగా వున్నావ్?సపొజ్ ఏదైనా బాధ వుంటే దాని ఎంజాయ్ చెయ్యలి కానీ ఫేస్ పైకి తెచ్చుకోకూడదని నీకు తెలియందేముంది చెప్పు. మంచివాళ్ళకే కదా కష్టాలు వస్తాయి...కన్నీరు, కోపం, ఆనందం, విషాదం అన్నీ మనిషికి తప్పవు. అనుభవించాల్సిందే! ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓ గాయమే అయిందనుకో దాన్ని కాలం మాన్పదా! దానికింతగా వర్రీ అవ్వాలా? ఏది కావాలో,ఏది వద్దో స్పష్టం గా తెలిసినా కూడా ఒక్కోసారి సవాళ్ళూ ఎదురవుతాయి...
జీవితం అంటేనే ఆశ్చర్యం,అద్భుతం కదా! దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోకపోతే ఎలా! అంది చాలా ప్రశాంతంగా. ఆ మాటలు వినగానే శివానికి చిర్రెత్తుకొచ్చి అటు ఇటు చూస్తూ తన చూపుల్ని ఓ పెద్ద రాయిపై నిలిపింది. పల్లవికి శివాని చూపులు ఎక్కడ నిలిచాయో అర్ధమై కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ "వామ్మో! ఇది నన్ను రాయితో కొట్టి చంపేసేలా వుందే! నువ్వు ఇటు రావే సంకేతా! ఏదైనా తేడా వస్తే నువ్వయితేనే కాస్త గట్టిగా సాక్ష్యం చెబుతావు....లేకుంటే ఎంతోకాలం బ్రతకాలనుకుంటున్న నేను దీని చేతిలో ఇప్పుడే పొయ్యేలా వున్నాను."అంటూ సంకేతను లాగి అటువైపుకి వెళ్ళింది పల్లవి. అసలే లావుగా వున్న పల్లవి ఎవర్ని లాగినా అంత దూరాన వెళ్ళి ఆగుతారు. సంకేత పరిస్థితి కూదా ఇప్పుడు అలాగే అయ్యింది. సంకేత పల్లవి వైపు ఉక్రోషంగా చూస్తూ"మరి నువ్వు సమయం సందర్భం గురించి ఆలోచించకుండా నీ కొటేషన్స్ తో దాన్ని కొడితే అది వూరుకుంటుందా? ప్రస్తుతం వున్న పరిస్థితిని బట్టి నీ విషయం లో అది చెయ్యలనుకునేదే కరెక్ట్!" అంది. పల్లవి ముఖం మాడ్చుకుని రోషం గా అటువైపుకు తిరిగి చూస్తూ నడవటం ప్రారంభించింది. హిందూ అది చూసి"దారి సరిగ్గా చూసి నడువు. అసలే ఉదయం నుండి రెండుసార్లు కింద పడ్డావు. పడితే పడ్డావు..నీ బరువుకి ఎక్కడ పగిలేది అర్ధం కాక చస్తున్నాం...." అంది. స్నేహితురాళ్ళు కాబట్టి తన ఒబెసిటీ మీద ఎలా మాట్లాడినా ఏమీ అనుకోదు పల్లవి. అదే ఇంకెవరైనా అలా మాట్లాడితే కొట్టి మరీ వస్తుంది.
పల్లవికి ఏదో గుర్తొచ్చినట్లు సంబరంగా చూస్తూ,"ఇవాళ మా డాడీ నాకు సెకెండ్ హ్యాండ్ స్కూటీ కొని తెసున్నాడు. ఈ పాటికి హాస్టల్ దగ్గిరకి తెచ్చేవుంటాడు. ఇకనుండి నాకు కాలేజీ నుండి రోడ్డు వరకు నడిచే బాధ వుండదు. ఆటో కోసం వెయిట్ చేసే అవసరమూ వుండదు."అంది. "ఆ సందర్భంగా పార్టీ ఇవ్వలి మరి...." అంది హిందూ. "పార్టీ గోల తర్వాత, దాని సంగతేంటో చూడు" అంటూ హిందూ భుజం మీద గిల్లి శివానిని గుర్తు చేసింది పల్లవి. "మనకెందుకు, అది చెబితేనే విందాం! లేకుంటే లేదు."అంది అనాసక్తిగా హిందూ.. వెంటనే శివాని తలతిప్పి హిందూ ని చూస్తూ"ఫ్రెండ్స్ అంటే ఇలానే వుంటారానే? చెప్పేదాకా ఆగరా? నా మొబైల్ ని మన పి.టి.సార్ తీసుకుని రెండు గంటలవుతోంది. నేను మాట్లాడాల్సిన ఫొన్ కాల్స్, చెయ్యవల్సిన మెస్సేజెస్ అన్నీ ఆగిపోయాయి. ప్రాణం తేలిపోతోంది తెలుసా!"అంది. "ఓస్! ఇంతేనా! ఇదేనా నీ బాధ?అయినా మొబైల్స్ నాట్ అలౌడ్ అంటూ కాలేజీ ఎంట్రన్స్ లోనే బ్యాగ్ లు చెక్ చేస్తున్నారు కదే! ఇంత సీరియస్ కండిషన్ లో మొబైల్ ఎలా తీసుకెళ్ళావ్! తీసుకెళ్ళేముందు ఏదైనా సీక్రెట్ ప్లేస్ లో పెట్టుకోవద్దా!"అంది. ఎక్కడని పెట్టుకోనే..అబ్బయిలైతే షూస్ లో పెట్టుకుంటారు. మనమెక్కడ పెట్టుకుంటాం? కాలేజీ బ్యాగ్ లో,టిఫిన్ బాక్స్ లో తప్ప...."అంది నీరసంగా.... "ఇవ్వాళ మాక్లాస్ రూం లో చెకింగ్ జరగలేదు. అవునూ! నీ మొబైల్ ఒక్కటేనా! మీ క్లాస్ బాయిస్ వి కూడా తీసుకున్నారా?"అని అడిగింది సంకేత. "మా క్లాసులో ఎవరెవరు మొబైల్ తెచ్చుకున్నారో వాళ్ళవి మాత్రమే తీసుకెళ్ళారు. నా మొబైల్ దొరకడానికి కారణం అది స్విచ్ ఆన్ లో వుంది." "అయితే నో ప్రోబ్లం. బయటికి వచ్చి ఈపాటికే ఆ సార్ ని సీక్రెట్ గా తిట్టుకోవడమో,రిక్వెస్ట్ చెయ్యడమో చేసి వుంటారు. నువ్వెంత బాధ పడ్డా ఈ రోజు మాత్రం నీ సెల్ల్ ఫొన్ నీకు రాదు. రేపు తప్పకుండా ఫైన్ వేసో ,వార్నింగ్ ఇచ్చో ఇస్తారు. మాక్లాస్ లో కూడా ఒకసారి ఇలాగే తీసుకున్నారు. క్లాస్ రూం లో కూర్చుని క్లాస్ వినకుండా బెంచీ చాటున మొబైల్ పెట్టూకుని మెసేజ్ లు ఇస్తున్నారని"అంది పల్లవి. "అయితే రేపటివరకు నీ సెల్ ఫోన్ ఇవ్వవా ప్లీజ్!"అంది శివాని. పల్లవి దడుసుకున్నట్లు చూసి బ్యాగ్ లో స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని వున్న తన మొబైల్ ని తడుముకుంటూ, "అందులో బ్యాలెన్స్ లేదు"అంది. "నాకు బ్యాలెన్స్ తో పని లేదు.రింగ్ ఇస్తే చాలు. అవతలివైపు నుండి నాకు కాల్ వస్తుంది. నేను మాట్లాడుతాను. నీకు అందులోంచి ఒక్క పైసా కూడా మిస్ కాదు."అంది హామీ ఇస్తూ. పల్లవి భయంగా ముఖం పెట్టి"అలాంటి రింగ్ లతో యమ డేంజర్ తెలుసా! వాడికి నీమాటలతో బోరెత్తిందనుకో! నావెంట పడతాడు. నేను ఇవ్వను."అంది. శివాని పల్లవిని కొట్టబోతూ"నా బాయ్ ఫ్రెండ్ నీకు వాడానే! ఇదేనా నువ్విచ్చే రెస్పెక్ట్ ?"అంది. "ఏదో తొందర్లో అనేశాన్లే! నా సెల్ల్ ఫోన్ మాత్రం ఈ రాత్రికి అడక్కు..అలా అని మాటివ్వు. లేకుంటే నేను హాస్టల్ కి రాకుండా సంకేతతో వెళ్ళి దాని పక్కన పడుకుంటాను."అంటూ బెదిరించింది. శివాని నవ్వి"దాని పక్కన యింకొకరికి ప్లేస్ కూడానా!నువ్వెళ్ళి పడుకుంటే శివరామకృష్ణ గారి పనమ్మాయి నీలిమ ఎక్కడ పడుకుంటుంది?" "నీలిమ పడుకునేది సంకేత బెడ్ మీద కాదు. కింద చాప వేసుకుని పడుకుంటుంది. నేను వెళ్ళి సంకేత బెడ్ మీద పడుకుంటాను."అంది పల్లవి. శివాని మళ్ళీ నవ్వి "వాళ్ళకుండేది ఒక్కతే పనమ్మాయి. నువ్ నిద్దట్లో దానిమీద పడ్డావనుకో ...అది పైలోకాలకెళ్ళిపోతుంది. ఆ ప్రయత్నం మానుకుని నాకు సెల్లివ్వు. నీకేంకాదు.” అంది. "ఇదెక్కడి ఖర్మే హిందూ.."అంది బేలగా చూస్తూ పల్లవి. "నీకేం కాదంటుందిగా! ఇవ్వు" అంది సంకేత శివాని వైపు మాట్లాడుతూ.. "అయ్యేది, కానిదీ దాని చేతిలో వుందా? నీ చేతిలో వుందా? నా నెంబర్ వెళ్ళి వాడి సెల్ ఫోన్ లో ఫీడయ్యిందనుకో ..ఆటొమటిక్ గా నా జుట్టు వాడి చేతిలోకి పోయినట్లే!"అంది.
(సశేషం...)
No comments:
Post a Comment