స్వధ (అష్టవిధ నాయికలు ) - అచ్చంగా తెలుగు

స్వధ (అష్టవిధ నాయికలు )

Share This

స్వధ (అష్టవిధ నాయికలు )

- బల్లూరి ఉమాదేవి

జగమెరిగిన చిత్రకారుడు బాపు. బాపు గీచిన బొమ్మైనా,కథైనా ,కవితైనా అది ఏదైనా సరే అదో బృహత్కావ్యమే. ఏ చిన్న అంశమైనా అది పరిశోధనాంశమే. పరిశోధనార్హమే. బాపూగా చిరపరిచితులైన సత్తిరాజు లక్ష్మీనారాయణగారు 1933 డిసెంబరు15 న జన్మించారు.గీతలతోనే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించారు.వీరు చిత్రించిన అష్టవిధ నాయికలు సాహితీ ప్రపంచానికి రసగుళికలే. ముఖ్యంగా కందుకూరి రుద్రకవి రచించిన జనార్ధనాష్టకానికి బాపూగారు గీచిన చిత్రాలు పుష్టినిచ్చాయి. అలంకారశాస్త్రంలో "నాయికలు"అష్టవిధాలుగా వుంటారని చెప్పబడింది. సందర్భానుసారంగా నాయికల మనోభావాలు మారుతుంటాయి.కావ్యాలు కాంతాసమ్మితాలు.కనుక వాటిలో శృంగారమే ప్రధాన భూమిక వహిస్తుంది.16వ శతాబ్దానికి చెందిన కందుకూరి రుద్రకవి అష్టవిధ నాయికలను వర్ణిస్తూ "జనార్ధనాష్టకం"రచించారు.ఈకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో నొకడని పరిశోధకుల అభిప్రాయము.శ్రీబాపుగారు రుద్రకవిగారి "అష్టవిధ నాయికలకు"చిత్రాలను గీచి "లీలాజనార్ధనం"అని నామకరణం చేశారు. మరి ఆనాయికలెవరంటే:- 1.స్వాధీన పతిక:-నాయిక చెప్పనట్లె విని అలాగే నడుచుకొనే భర్త గల పడతి.2.విప్రలబ్ద:- చెప్పిన ప్రదేశానికి ప్రియుడు రాకపోతే,మోసం చేస్తే దూతికను రాయబారానికి పంపే స్త్రీ. 3.విరహోత్కంఠిత:-.చెప్పిన స్థలానికి ప్రియుడురాకపోవడంతో విరహంతో చింతించే వనిత. 4 అభిసారిక:-తనను తాను బాగా అలంకరించుకొని ప్రియుని కోసం సంకేతస్థలానికి వెళ్ళే యువతి.5ఖండిత:-ప్రియుడు పరకాంత పొందు చేసి వచ్చాడని తెలుసుకొని ఆచిహ్నాలు చూసి అసూయపడే స్త్రీ.6 .కలహాంతరిత:- భర్తను అవమానించి ఆతరువాత పరితపించే వనిత.7 వాసకసజ్జిక:- ప్రియుడు వస్తాడని ఎదురు చూస్తూ పడకటింటిని తనను అలంకరించుకొన్న స్త్రీ.8 ప్రోషిత(భర్తృక)పతిక:- కార్యసిద్ధికై భర్త దేశాంతరం వెళితే ఆందోళన చెందే వనిత.

proshita

ఇందులో ప్రోషిత(భర్తృక)పతిక కు బాపూగారు వేసిన చిత్రానికి నేను వ్రాసిన కవిత. ప్రోషిత(భర్తృక)పతిక :-- కాసుల కోసమంటూ కడుదూర మెళ్ళావు రేపు మాపంటూనే జాగు చేస్తున్నావు ఎదురు చూసీచూసి కళ్ళెర్ర బడ్డాయి నిను గానక మది ఉసురుసురంటుంది నిదురలోమైమరచి కలలు కందామంటె క్షణమైన కంటికి కునుకైన రాదే నిను వీడి గడియైన నే నోపలేను ఈ విరహమో స్వామి నే తాళలేను ఐనా ఆశ కెక్కడ అంతు ?అది లేనె లేదయ్య ఉన్నంతలో సర్దుకొందాము రావయ్య నీ వచట నే నిచట "సుఖ"మన్న దెచట నింపాదిగా నీవు చింతించ వయ్య నీవు లేవని పట్టె మంచ మేడ్చింది నీవు లేవని జాబిలి చిన్న వోయింది మలయమారుతమైన పండువెన్నల యైన తాపాన్ని పెంచుతూ తపియింప జేస్తుంది "సంతృప్తె"సంపదని యెరుగ లేకున్నావు ఎండమావుల వెంట పరుగు తీస్తున్నావు భ్రమవీడి ఒకసారి తిలకించుమో స్వామి బంగారు భవితవ్య ముందిగా మనకు నే నింత చెప్పేది నీ వెరుగవని కాదు నా ఆర్తి నెరిగి ఇక మరలి రావోయి.  

No comments:

Post a Comment

Pages