ఓ ఇల్లాలి పెళ్ళిపుస్తకం - అచ్చంగా తెలుగు

ఓ ఇల్లాలి పెళ్ళిపుస్తకం

Share This
ఓ ఇల్లాలి పెళ్ళిపుస్తకం
 - పెయ్యేటి రంగారావు
' ఏం చెప్పను వదినా! అందరు ఆడవాళ్ళలాగే నాకూ పెళ్ళి అయింది. ఆయనని చూడగానే మా ఆయన బంగారం అని నేను మురిసిపోయాను. ఆయన నా మెడలో పూలదండ వేసేసరికి నా స్నేహితురాళ్ళు అందరూ చప్పట్లు కొట్టారు. ఆయన చాలా బక్కగా వుండేవారు వదినా. నేను ఆయన మెడలో దండ వేసేసరికి, అది ఆయన ఒంటిమీద నిలబడకుండా కిందకి జారిపోయింది. నా స్నేహితురాళ్ళందరూ గొల్లుమని నవ్వేసరికి నేను చాలా సిగ్గు పడిపోయాను. నేను వేసిన దండ కింద పడిపోయేసరికి నాకేదో అపశకునంగా తోచిందమ్మా. తరవాత్తరవాత నా భయం నిజమే అని తేలిపోయింది. 

 నా బాధలు ఏం చెప్పుకోను వదినా!  పెళ్ళైనప్పట్నించీ చూస్తున్నా.  మా ఆయనకి పొరుగింటి పుల్లకూర అంటే ఎంతో రుచి.  ఐనా ఏం చేస్తాను?  ఏళ్ళ తరబడి అల్లాగే సర్దుకు పోతున్నాను.

 వదినా!  ఒకసారి బాపుగారి సంపూర్ణరామాయణం సినిమాకని బయలుదేరి బస్టాప్ దగ్గర నుంచుంటే, అదెవత్తో టక్కులాడి అక్కడ కనపడింది.  అంతే, ఆయన అక్కడ్నించి కదలరు.  సినిమాకి టైమయిపోతోంది, రండీ అంటే, ' ఉండు.  ఆ అమ్మాయికెంత టెక్కో చూడు.  మనకేసి తిరిగి కనీసం 
ఒక్కసారన్నా నవ్వటల్లేదు.  ఆ అమ్మాయి తిక్క కుదిర్చేదాకా నేనిక్కడ్నుంచి  కదలను.' అని భీష్మించుకు కూర్చున్నారమ్మా.  ఇంక వేరే గతిలేక ఆ పిల్లని ' అమ్మా, ఒక్కసారి మా ఆయన్ని చూసి నవ్వమ్మా' అని బతిమాలాల్సి వచ్చింది.  ఏం చెయ్యను మరి?  అవతల సినిమా టైమయి పోతోందాయె!


ఆయన ఆగడాలు మరీ మితిమీరిపోతుంటే ఇంక భరించడం నా వల్ల
కాదనిపించిందమ్మా.  సతీసుమతి లాగు మహా పతివ్రత అనిపించుకోవడం కన్న, తిరగబడి మా ఆయన్ని దార్లోకి తెచ్చుకోవడమే మంచిదనిపించిందమ్మా.  ఆయన ఆఫీసు కాంగానే ఇంటికి రాకుండా బస్ స్టాప్ లో వెధవ్వేషాలేస్తున్నారని అనుమానమొచ్చి, అలా చేసారంటే ముక్కు పిండి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తానని హెచ్చరించాను.  అల్లా బెదిరించమని మా పక్కింటి సూరేకాంతమత్తే నాకు సలహా ఇచ్చింది.  ఆవిడ నాకు సలహా ఇవ్వడం ఆయన చాటుగా వుండి విన్నట్టున్నారు.  నేను హెచ్చరించే సరికి, నన్ను '
పోపోస్, సూరేకాంతం!  వ్వె వ్వె వ్వె!' అని వెక్కిరించి వెళిపోయారు.  

ఆరోజు మళ్ళీ మామూలు పధ్ధతిలోనే ఆలీసెంగా వచ్చారు.  నాకు వళ్ళు మండిపోయింది.  దాంతో నేనన్నంత పనీ చేసాను.  ఆయన లబోదిబోమంటూ నా మీద అక్కసునంతా తన స్నేహితుడి దగ్గర వెళ్ళగక్కుకున్నారు.

సూరేకాంతం అత్తయ్య గారి మూలానే ఇదంతా జరిగిందని ఆవిడ మీద కక్ష పెంచుకున్నారు మా ఆయన.  ఒకసారి ఆవిడ మా ఇంటికి వచ్చింది. '
కూచోండి పిన్నిగారూ.  మీకు కాఫీ తీసుకు వస్తాను.' అని చెప్పి నేను లోపలికి వెళ్ళాను.  లోపల కాఫీ కలుపుతుండగా బైటినించి ప్రళయం వచ్చినంత పెద్ద శబ్దం వినిపించింది.  నేను కాఫీగ్లాసుతో హడావిడిగా బైటికి వచ్చి చూద్దును కదా, ఆవిడ కుర్చీలో కూచోబోతుంటే, నా మొగుడు మహారాజుగారు వెనకనించి కుర్చీ లాగేసినట్టున్నారు.  ఆవిడ పాపం ఢామ్మని వెల్లకిలా పడిపోయింది.

నాకావేశం ఆగలేదమ్మా.  ఆవిడ కుంటుకుంటూ తన ఇంటికి వెళిపోగానే
దూకుడుగా మా ఆయన మీదకెళ్ళి చెయ్యి చేసుకున్నానమ్మా.  అప్పుడు కూడా ఆయన తెలివితేటలు చూడు.  కాలుస్తున్న చుట్ట అడ్డు పెట్టుకున్నారు.  దాంతో ఆ చుట్ట నాకంటుకుని నా చెయ్యి కాలిపోయింది కాని, ఆయనకి కొంచెమైనా దెబ్బ తగల్లేదు.


ఇలా ఆయన ఆగడాలు ఎన్నని చెప్పనమ్మా?  వేసంకాలం వస్తోంది, ఒక ఫేను కొని తగలెయ్యండి అని మొత్తుకుంటే, పాతసామాన్ల దుకాణానికెళ్ళి, ఇక్ష్వాకుల కాలం నాటి పంకా కొనుక్కొచ్చి నా మొహాన్న పడేసారమ్మా.  అది ఇచ్చే గాలి తక్కువ, చేసే చప్పుడు రెండో ప్రపంచ యుధ్ధమంత.  నేను ఆయన మీద గయ్యిమన్నాను.  అప్పుడు ఆయన నల్లటి ఇంజినాయిలు కొని తీసుకువచ్చి, ఆ ఫేనునిండా ఒంపేసారు.  నేను స్విచ్చి వేసుకుందును కదా, మొత్తం ఆ ఆయిలంతా నా మొహం మీద చిందింది.  అప్పుడు నా అవతారం గురించి ఏం చెప్పనమ్మా?

 ఆయనకి అమ్మాయిల పిచ్చే కాదు, పేకాట పిచ్చి కూడా ఉందమ్మోవ్!  ఒకసారేమయిందో తెలుసా?  మేము తిరుపతికని బయలుదేరాం.  రైలెక్కగానే
ఎదర బెర్తులోను, సైడు బెర్తులోను దౌర్భాగ్యులు ఆయనకి దొరికారు.  అందరూ కూచుని ఒహటే పేకాట.  తిరుపతి స్టేషనులో దిగేసరికి ఆయన వంటిమీద డ్రాయరు తప్ప అన్నీ ఓడిపోయారు.   స్టేషనుకొచ్చిన మా తమ్ముడు ' ఏమిటి బావా?  మళ్ళీ పేకాట ఆడావేమిటి?' అని అడిగేసరికి సిగ్గుపడి చచ్చాననుకో.

 ఆయనతో నాకెప్పుడూ చచ్చే చావేనమ్మా.  ఒహటో తారీకు వచ్చింది.  '
ఏవండీ, ఇవాళ ఒహటో తారీఖు.  జీతాలిచ్చే రోజు.  పెందరాడే ఆఫీసుకెళ్ళండి ' అని బతిమాలా.  రాత్రంతా పేకాడుతూ కూచున్నారో ఏమో, బండ నిద్దరోతూ, ' నేనివ్వాళ ఆఫీసుకెళ్లనూ, కావాలంటే నువ్వెళ్ళూ' అంటూ ముసుగు తన్నేసారమ్మా.  ఇంక చేసేదేముంది?  

గత్యంతరం లేక, ఆయన కోటు, ఫేంటు వేసుకుని, నేనే ఆఫీసుకి పరిగెట్టాల్సొచ్చింది.  మరి జీతంరాళ్ళు చేతిలో పడకపోతే నెలంతా ఎల్లా గడుస్తుందో నువ్వే చెప్పు వదినా?

ఇల్లాగే ఆయనతో రోజూ నానా అవస్థలూ పడుతూనే ఏభై ఏళ్ళు సంసారం
వెలగబెట్టానమ్మా.  మరేం చెయ్యను?  హిందూపతివ్రత పెళ్ళాన్ని కదా?  విడాకుల లాంటివి మనకి చేతకాదు కదా!  సంసార జీవితమంటే రాజాలా బతకడం కాదూ, రాజీ పడి బతకడం అని నన్ను నేనే సమాధాన పరుచుకుని, ఆయనతో కాపరం చేసానమ్మా.


నా కష్టసుఖాలన్నీ ఎప్పుడేనా బాపూ అన్నయ్య గారికి, రమణ అన్నయ్య గారికీ చెప్పుకుంటూ వుంటానమ్మా.  నాకు వాళ్ళు తప్ప
ఆప్తులింకెవరున్నారమ్మా?  వాళ్ళు చాలా బాధ పడి, ' ఉండమ్మా.  నువ్వు పడ్డ బాధలు నలుగురికీ తెలియాలి.  అలా తెలియాలంటే ఒకటే మార్గముంది.  ఆడవాళ్ళ కష్టాలకి స్పందించి, ఏమైనా చెయ్యాలని తాపత్రయ పడే అచ్చంగా తెలుగింటి ఆడపడుచు ఒకావిడ మాకు తెలుసు.  ఆవిడకి చెబుతాము' అన్నారమ్మా.


అల్లా అని వారంటే ఎవరో అనుకున్నానమ్మా.  తీరా ఎవరా అని చూద్దును కదా, ఆవిడ భావరాజు పద్మిని గారు.  ఆవిడ కసలే ఆవేశం ఎక్కువ.  ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎండగట్టే దాకా ఆవిడ ఊరుకోరు.  ఇప్పుడావిడ మా ఆయన్ని ఏం చేస్తుందో అని భయంగా వుందమ్మా.  ముందు ఆవిడ్ని కలిసి, ఆవిడని సమాధాన పర్చాలి.  ఉంటాను వదినా.  మళ్ళీ కలుస్తాను.
 సుమారు ఎనభై సంవత్సరాల క్రితం దేవలోకపు నందనవనం నించి ఒకే ఒక్క
పారిజాత కుసుమం రాలి ఆంధ్రదేశంలో పడింది.  ఆ ప్రసూనం రెండు మానవరూపాలుగా పరిణతి చెంది, ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోను, రెండవది తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం లోను అవతరించింది.  ఆ పారిజాత కుసుమం శ్రీ బాపు గారైతే, ఆ కుసుమం తాలూకు సుగంధం శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు.  

వారిరువురూ ఆంధ్రదేశంలో జన్మించడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం.  వారిది కళారంగంలో ఒక శకం.  ఆ మహానుభావులిద్దరికీ ఈ చిన్ని కథను భక్తిపూర్వకంగా అంకితమిచ్చుకుంటున్నాను.

No comments:

Post a Comment

Pages