బాపు సినిమాల వైభవం – కథానాయికలు - అచ్చంగా తెలుగు

బాపు సినిమాల వైభవం – కథానాయికలు

Share This
బాపు సినిమాల వైభవం – కథానాయికలు
- పోడూరి శ్రీనివాసరావు
98494 22239

శ్రీ బాపు బొమ్మంటే చిత్రకళారంగంలో, బాపు చిత్రకథానాయిక అంటే చలనచిత్రరంగంలో ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది. ప్రతి అమ్మాయీ.. ప్రతి యువకుడూ.. తనకు కాబోయే భార్య బాపు బొమ్మలా ఉండాలని కోరుకుంటాడు. సినీప్రపంచంలోకి అడుగిడబోయే ప్రతీ కథానాయికా, తాను బాపు సినిమా ద్వారా హీరోయిన్‍గా చిత్రరంగంలో కాలూనుకోవాలనుకుంటుంది. బాపు బొమ్మంటే ప్రత్యేకతే అది మరి!!! బాపు బొమ్మంటే రేఖామాత్రమైన రూపం, చక్కటి వదనం, సన్నని నడుము, పొడుగాటి జడ, విశాలమైన నేత్రాలు, సంపెంగ లాంటి కొనతేరిన ముక్కు, చిన్న లక్కపిడత లాంటి నోరు, శంఖం లాంటి మెడ, కనులు మూసుకున్నా కూడా కళ్ళముందే కదలాడే సుందర ప్రబంధ నాయిక రూపం గోచరిస్తుంది. బొమ్మల బ్రహ్మ బాపు చేతిగీతల టేకింగ్ చలనచిత్రరంగంలో మహత్యమే అది!! శ్రీ బాపు ఆరాధ్యదైవం శ్రీరామ చంద్రుడు. ఆయన కథానాయకులంతా శ్రీరామచంద్రునిలా ధీరోదాత్తులు. కథానాయికలంతా సీతాదేవిలా అత్యంత సౌందర్యవంతులు. అంతే కాదు, అందచందాలలోనే కాదు, ధీరత్వంలోనూ కూడా శ్రీ బాపు కథానాయికలంతా స్వశక్తి మీద ఆత్మగౌరవం మీద నమ్మకమున్నవాళ్ళే. ఇకపోతే… బాపు చలనచిత్రాలను పరిశీలనగా చూసే వాళ్ళకి ఒక సంగతి తేటతెల్లమౌతుంది. ఆ మహనీయుడు, సాంఘిక చిత్రాలలో కూడా పౌరాణికతను చొప్పించి, ఆ పాత్రల ద్వారా కథకు బలం చేకూర్చడమే కాక మన భారతీయ పురాణాల గొప్పతనాన్ని, ఔచిత్యాన్ని పెంపొందించడానికి ఆయన కేవలం భగవంతుడు నియమించిన ‘బ్రాండ్ అంబాసిడర్’ భారతీయతను, పురాణాల గొప్పదనాన్ని రాముడు, కృష్ణుడు, సీతామహాసాధ్వి లాంటి పురాణ పాత్రల గొప్పతనాన్ని శ్రీబాపు గారి కంటే, ప్రపంచానికి తెలియజెప్పే అవకాశం, అధికారం, వేరెవరికీ లేదు, ఆ ప్రత్యేకతే శ్రీబాపు గారికి ఇంతమంది ప్రేమికులను, ఆరాధ్యులను, శిష్యులను తయారుచేసింది. ఉదాహరణకు ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలను పరిశీలిద్దాం, ఆయన దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు రామాయణమే ఇతివృత్తం. శ్రీరాముడే కథానాయకుడు. చెడుపై మంచి గెలుపు; దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ప్రథానాంశాలు. వీటికి ఉదాహరణలు. సాక్షి; మనఊరి పాండవులు; గోరంతదీపం; కలియుగ రావణాసురుడు; మొదలైన సినిమాలు. మనవూరి పాండవులు, ముత్యాలముగ్గు, బుద్ధి మంతుడు, కలియుగరావణాసురుడు మొదలైన సినిమాలలో అయితే పురాణేతిహాసాలు రామాయణ మహాభారత కథలు, పాత్రలు మిళితమై ఉంటాయి. ఇక కథానాయికల విషయానికి వస్తే బాపు సృష్టించిన కథానాయికలు ప్రత్యేకంగా ఉంటాయి. చారడేసి కళ్ళతో, బారు జడతో, కోటేసిన ముక్కుతో సౌందర్యం అంటే ఇదేనేమో అనిపించేటట్లు ఉంటాయి. కొందరు కథానాయికలు అంతకు ముందే చిత్రసీమలో ఉన్నప్పటికీ లేక క్రొత్తగా చిత్రసీమలో ప్రవేశిస్తున్నప్పటికీ చిత్రసీమలో ఆ పాత్ర యొక్క చిత్రీకరణ ప్రత్యేకంగా ఉంటుంది. ‘ముత్యాలముగ్గు’ లోని సంగీత పాత్ర చిత్రీకరించిన విధానం చూడంది ఎంత గొప్పగా ఉంటుందో! లంకంత ఇల్లు.. రామాయణంలోని పాత్రధారుల్లా సినిమాలోని పాత్రలు. అందులోనే మిళితమైన పిల్లలద్వారా ఆంజనేయస్వామి కథలో, రామాయణంలో సీతకు సహాయం చేసినట్లు, కథాగమనంలో ముందుకు సాగటం, పల్లెప్రాంతపు ప్రదేశాలలో గోదావరి వడ్డున చిత్రీకరణ... అంతా మనలను ఎక్కడికో నిజజీవితంలోకి జీవితంలో ఎదురయ్యే అనేకపాత్రలతో ముడివడి ఉంతాయి. సంగీతపాత్రను గమనిస్తే పల్లెవాతావరణంలో మనకెదురయ్యే అమాయకముగ్థ కనిపిస్తుంది. మూర్తీభవించిన సౌందర్యం, ముఖంలో తొణికిసలాడే అమాయకత్వం ఆల్చిప్పల్లాంటి కళ్ళు ముగ్థమనోహర సోయగం అన్నింటికీ మించి మన సాంప్రదాయాలపట్ల ఆచారాల పట్ల గౌరవం, పెద్దలయెడ అభిమానం, భర్తంటే ప్రేమానురాగం వెరసి సంగీత పాత్ర. భర్త తనను అనుమానించి విడిచిపెట్టాడని తెలుసుకొన్నప్పుడు ఆ ఎడబాటు, ఆమెలోని దైన్యం, పుట్టిన పిల్లల యెడల పెంచుకొన్న ప్రేమ, అనురాగం, తిరిగి ఎలాగైనా తన సచ్ఛీలత్వం ఋజువు చేసుకొని భర్తను చేరుకొంటానన్న నమ్మకం – అన్నీ రామాయణంలోని సీత పాత్రను గుర్తుకు తెస్తాయి. అక్కడ కూడా భర్తకు దూరంగా లంకలో ఉండడం, తర్వాత చాకలి తిప్పడి మాటల వల్ల భర్త చేత త్యజించబడడం, వాల్మీకి ఆశ్రమంలో లవకుశుల జననం, ఏనాటికైనా శ్రీరామ చంద్రుడు తిరిగి తనని చేరదీస్తాడన్న నమ్మకం… ఇలా రెండు కథలూ అటు రామాయణం ఇటు ముత్యాల ముగ్గు. ఇక పోతే ‘గోరంతదీపం’ చూడంది. ఈ చిత్రంలో ప్రముఖంగా చెప్పుకోవాలంటే పాత్రధారుల ఆహార్యం. శ్రీధర్, వాణిశ్రీ ముఖ్యంగా ఏవిధమైన మేకప్ లేకుండా నేచురల్ గా నటించారు. అహఁ కాదు! వాళ్ళ వాళ్ళ పాత్రల్లో జీవించారు. మోహన్ బాబు పాత్ర ప్రత్యేకమైనది. భావగీతాలు, టుమ్రీలు వదులుతూ కథానాయికను రకరకాలుగా బాధిస్తూ ఉంటాడు. ఈ సినిమాలైట్ లో ఏవిధమైన మేకప్ లేకుండా శ్రీధర్, వాణిశ్రీ, మోహన్ బాబుల నటన, పాత్రలో జీవం చిత్రానికే క్రొత్తదనం. చిత్రీకరణలో నవీనత్వం, ఇదీ బాపు ప్రతిభ అంటే! ముఖ్యంగా శ్రీ దేవులపల్లి వారి రచన ‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా…’ అన్న పాట చిత్రీకరణ, ఆ చిత్రీకరణలో వాణీశ్రీ హావభావాలు.. చెప్పనలవి కానివి. వర్ణింప వీలు లేనివి.. అలాగే ‘మనవూరి పాండవులు’ సినిమా అంటే ఆధునిక భారతమే అది. భారతంలాగే పంచపాండవులూ, కృష్ణుడూ ఇందులోనూ ఉంటారు. కౌరవుల్లాగ ఊరిపెద్దలూ ఉంటారు. పల్లెటూరి అమ్మాయిగా ‘గీత’ను ఈ చిత్రంలో భలే అందంగా చూపించారు శ్రీ బాపు. కృష్ణంరాజు నటన ఈ చిత్రానికే హైలెట్. ‘సంపూర్ణరామాయణం’ సినిమా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతవరకు రాముడన్నా, కృష్ణుడన్నా, పౌరాణికపాత్రలన్నా నందమూరి తారకరామారావు గారిని తప్ప మరొకరిని ఊహించుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి చిత్రసీమలో నెలకొని ఉన్న రోజుల్లో సాంప్రదాయం నడుస్తున్న కాలంలో ఆ పరిస్థితులను కాదని శోభన్ బాబు రాముడిగా పూర్తి నిడివి చిత్రం దర్శకత్వం వహించడం శ్రీ బాపు గారికే చెల్లింది. అదేవిధంగా సీతంటే అంజలీదేవి తప్ప మరెవ్వరూ జీవించలేరనే నమ్మకమున్న రోజుల్లో చంద్రకళ చేత సాధ్వీమణి సీతవేషం వేయించడం సాహసమనే చెప్పాలి. ఆ సినిమా అత్యంత రమణీయంగా ప్రకృతి సిద్ధమైన అటవీ ప్రదేశాలలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించబడి ప్రేక్షకుల మన్ననలను పొందింది. అలాగే బాపు హీరోయిన్లలో చెప్పుకోవలసిన మరో నాయిక జయప్రద. ఆ చిత్రరాజం ‘సీతాకల్యాణం’ ఇందులో కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా శ్రీ రామారావు గారిని గానీ, శోభన్ బాబును కాకుండా ‘రవి’ని రాముని పాత్రకు సిద్ధం చేశారు. అలాగే జయప్రదతో సీత పాత్ర చేయించారు. ఈ చిత్రం సినీప్రేక్షకులనే కాక, జాతీయ, అంతర్జాతీయ సినీప్రముఖుల క్రిటిక్స్ యొక్క అభినందనలందుకుంది. ముఖ్యంగా గంగావతరణం సీన్ చిత్రీకరణ ఒక్క బాపుకే చెల్లింది. అనితరసాధ్యం. ఇప్పుడంటే గ్రాఫిక్స్ ఇటువంటి చిత్రీకరణలో ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్ పెద్ద పీట వేస్తున్నాయి. కానీ అలాంటివేమీ లేకుందా ‘గంగావతరణం’ చిత్రీకతించడం ఒక్క బాపుకే సాధ్యమేమో!! అందుకే ఆచిత్రం 1978వ సంవత్సరం బి.ఎఫ్.ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శింపబడి క్రిటిక్స్ ఆదరాభిమానాలను పొందడమే కాకుండా అనేక పురస్కారములు పొందింది. ఇకపోతే బాపు సినిమా ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో హీరోయిన్ దివ్యవాణి, సన్నని నడుము, పెద్దపెద్ద కళ్లు, పొడుగాటి జడ. ఆ జడా విసురు, సరిగ్గా బాపు బొమ్మకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేకూర్చింది దివ్యవాణి, అమాయకత్వం, ఆత్మాభిమానం మూర్తీభవించిన పాత్ర. ఎన్.టి.ఆర్ సీతారామకల్యాణం సినిమాలో ‘సీతారాముల కల్యాణం.. చూతము రారండీ!’ అన్న పాట ఎంత పాపులర్ అయిందో, పెళ్లిపుస్తకంలోని ‘శ్రీరస్తు! శుభమస్తు!! శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం!!!’ అన్న పాట కూడా విపరీతమైన ప్రాచుర్యం పొందింది. ఆంధ్రావనిలో ఏ ఇంటపెళ్లయినా ఈ రెండుపాటలూ మ్రోగనిదే పెళ్లి జరగనట్లే కాదు. తెలుగు ప్రజల గుండెల్లోకి అంతలా చొచ్చుకుపోయాయి. ఈ రెండు పాటలూ. బాపు గారి మరో సినిమా ‘మిష్టర్ పెళ్ళాం’ అందులో ఆమని పాత్ర, సగటు ఆంధ్రయువతి జీవితంలోంచి ఊడిపడినది. అందమైన అమాయకత్వంతో పాటు నిండైన ఆత్మాభిమానం ఆ పాత్రలో ప్రస్ఫుటించేలా తీర్చిదిద్దారు శ్రీ బాపు. తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ భర్త తూలనాడుతున్నా తనను కేవలం సగటు ఆడదానిగా భావిస్తున్నా – భర్త కష్టకాలంలో ధైర్యంగా నిలబడి, తన వ్యక్తిత్వాన్ని ఋజువు చేసికొని తన గౌరవాన్ని కాపాడుకుంటూ భర్తను కష్టాల బారినుండి బైటపడేలా చేసి, తన భర్తను మోసగించిన వారి గుట్టు బయటపెట్టేలా చేసిన పాత్రలో ‘ఆమని’ చక్కటి నటన ప్రదర్శించింది. హాస్యం ఎప్పుడూ కథలో మిళితమై ఉంటుంది. తప్పితే ఎక్కడా వెకిలిగా ప్రత్యేకంగా చొప్పించినట్లుండదు. ఆయన సినిమాలు ఏవి తీసుకోండి, ఏ పాత్రలు తీసుకోండి, ఏ ఒక్క పాత్ర ప్రత్యేకంగా, అనవసరంగా కథాగమనంలో అడ్డు పడదు. ప్రతి పాత్ర కథాగమనంలో తమ వంతు పాత్రను పోషిస్తాయి తప్పితే ప్రేక్షకులకు విసుగు కలిగించవు. ముఖ్యంగా చెప్పుకోవలసినది ఇంకోటి. ఒక్కో సినిమాలో ఒక్కో మేనరిజమ్. బుద్ధిమంతుడు సినిమాలో ‘తీ-తా’ అలాగే మిష్టర్ పెళ్ళాం సినిమాలో గోపాలకృష్ణపాత్ర (A.V.S) బాపు గారి పాత్రలను స్మరించుకోవడం అదో తుత్తి. ఇటీవలి సినిమా ‘రాధాగోపాలం’ లో రాధ పాత్రధారిణి స్నేహ. ఈమె అసలైన బాపు బొమ్మే! చక్కని ముఖవర్చస్సు, ఎంతో పొందికగా అమర్చబడిన అవయవ సంపద, ముఖాన ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వు అలకలో కూడా అందంగా కనిపించే వదనారవిందం, పైగా బాపు మార్కు పొడుగుజడ. అన్నట్లు ఈ సినిమాలో శ్రీ బాపు ఆరోప్రాణం ముళ్ళపూడి వెంకటరమణగారు మాటల రచయితగానే కాకుండా పాటరచయితగా కూడా అవతారమెత్తారు. ‘నీ వాలుజడ..’ అనే జడపాటతో. ఇది ఎంత ప్రజాదరణ చెందిందో వేరేగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కూడా భర్తది – భార్యకేం తెలియదు అన్న నైజం. సాటి స్త్రీకి అన్యాయం జరుగుతోందని భావించిన కోర్టుకేసులో భర్త గోపాలంకు వ్యతిరేకంగా వాదించి గెలుపొందుతుంది. అన్యాయన్ని సహించలేని వైఖరి, ఆడవారి వ్యక్తిత్వానికి అవరోధం కలిగించేలా చేసే కొందరు మొగవాళ్ల మనస్తత్వానికి ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తుంది. రాధపాత్ర చిత్రీకరణ ఆ పాత్రను బహుచక్కగా పండించారు శ్రీబాపు. ఆ పాత్రకు ప్రాణం పోశారు, పాత్రధారి స్నేహ. ఇలా ఏవేం సినిమాలు తీసుకున్నా బాపు మార్కు ప్రస్ఫుటితమౌతూనే ఉంటుంది. కథానాయికల ప్రత్యేకత, బాపు వాటిని మలచిన తీరు తేటతెల్లమౌతూనే ఉంటుంది. ఈ వ్యాసంలో ఏవో కొన్ని సినిమాలను తీసుకొని ఉదాహరించడం జరిగింది కానీ, శ్రీ బాపు తీసిన 51 సినిమాల్లోని కథానాయికలను తీసుకుని వాటి గురించి ప్రస్తావించి విపులీకరించడం అంటూ జరిగితే అది మహాగ్రంథం అవుతుంది. పరిశోధనా వ్యాసమవుతుంది. అందుకని, బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని పాత్రలను కేవలం ప్రస్తావించడం జరిగింది. ఆ పాత్రలను కూడా కేవలం పరిచయం చేయడం జరిగింది గాని వాటిని విశదీకరించడం జరగలేదు. క్షంతవ్యుడిని. ఇక బాపు ప్రతిభావిశేషాల విషయానికొస్తే 1967లోనే శ్రీ బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ సినిమాకు 1968లో తాష్కెంట్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనావకాశం కలిగింది. అదే విధంగా 1978లో ‘సీతాకల్యాణం’ సినిమా BFI లోనూ, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శింపబడటమే కాకుండా అనేకమంది అంతర్జాతీయ సినీప్రముఖుల క్రిటిక్స్ ప్రశంసలందుకుంది. చివరగా ఇటీవల విడుదలయిన శ్రీ బాపు దర్శకత్వ వహించిన చిట్టచివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’ కూడా 2011 నవంబరు లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెసివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శింపబడి ప్రశంసలందుకొంది. ప్రముఖ చిత్రకారుడు, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చలనచిత్రకారుడు శ్రీ బాపుకు భారతప్రభుత్వం ఏం గౌరవమిచ్చింది? 2013 లో కేవలం ‘పద్మశ్రీ’ పురస్కాఅం అది గూడా తమిళనాడు ప్రభుత్వ సిఫార్సుతో. తెలుగువాడిగా పుట్టిన బాపుకు ఆంఢ్రరాష్ట్రం ఇచ్చిన గౌరవమేమిటి? ఇదే మరేదేశంలోనైనా పుట్టి ఉంటేనా… అన్న ప్రశ్నకు చిరునవ్వుతో బాపు సమాధానం ‘నేను తెలుగువాడిగా పుట్టడమే నాకిష్టం అని’ అని. ఇంతెండుకు… అంజలీదేవి, చంద్రకళ, జయప్రద లాంటి వాళ్ళు ధరించిన సీతపాత్రను నయనతారచే వేయిస్తున్నందుకు బాపుకు మతిభ్రమించిందని వ్యాఖ్యానించిన ప్రముఖులే, ఆ పాత్రను మలిచిన తీరు, అ పాత్రకు నయనతార నుంచి రాబట్టుకున్న నటనను చూసి ముక్కున వేలేసుకున్నారు.. ‘బాపు’రే అంటూ... దటీజ్.......... బా... పు... 

నమస్కృతులతో కళాసేవారత్న, విశ్వకళావిరించి, రచనాప్రవీణ పోడూరి శ్రీనివాసరావు.

No comments:

Post a Comment

Pages