ఆ ‘పాటలు’ మధురం - అచ్చంగా తెలుగు
ఆ ‘పాటలు’ మధురం
-భావరాజు పద్మిని

అరచేత గోరింట ఎర్రగా పండాలంటే... మంచి సారం ఉన్న ఆకు దొరకాలి, కాస్తంత మజ్జిగ, చింతపండు వేసి మెత్తగా రుబ్బాలి. అది పెట్టుకునే చక్కటి చెయ్యి కావాలి... ఓపిగ్గా కాసేపు నిరీక్షించాలి... అప్పుడు అరచేత ఎర్రజాబిలి పంటను చూసుకుని, కొన్నాళ్ళు మురిసిపోతాం... ఒక సినిమా పాట పండాలంటే... మంచి సాహిత్యం కావాలి, ఆ సాహిత్యం మంచి సంగీత దర్శకుడి చేతిలో పడాలి, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల దర్శకుడికి మంచి అనురక్తి ఉండాలి.... నటీనటులు, లొకేషన్ లు అన్నీ బావుండాలి. అప్పుడు ఆ పాట చూసిన వాళ్ళ మనసుల్లో నిండుపున్నమిలా పండుతుంది. సున్నితమైన భావోద్వేగాలు, వీనులవిందైన సంగీతం, గోదావరి, సహజమైన లొకేషన్స్, తెలుగుదనం, చారెడేసి కళ్ళున్న వాలుజడ హీరొయిన్, సహజ నటీనటులు, పది కాలాలు గుర్తుండిపోయే సంగీత సాహిత్యాలు అన్నీ సమపాళ్ళలో కలిస్తే... బాపు సినిమా పాట అవుతుంది. బాపు ‘పాటలే’ ఎందుకంత మధురం... అంటే... బాపు సంగీత ప్రియులు. చిన్నతనంలో హార్మోనియం, మౌత్ ఆర్గాన్ వాయించేవారు. జాజ్ మ్యూజిక్ బాణీలను సైతం హార్మోనియం పై పలికించేవారు. బొమ్మలు వేయడం, చదవడం, సంగీతం, సినిమాలు, వెంకట్రావ్ ఇవి బాపు పంచప్రాణాలు. ఆయనకు బడేగులామ్ అలి, మెహదీ హసన్ అంటే ప్రాణం. భాష తెలియదు. కేవలం సంగీతం విని వాళ్లను ఆరాధిస్తాడు. మెహదీ హసన్‌కి ఇది తెలిసి షాకైపోయారు. వారేవా శభాష్ అన్నాడు. బాపు వేసి తెచ్చిన తన రేఖాచిత్రంపైన సంతోషంగా సంతకం చేశాడు. “మీరు ఇన్నాళ్ళలో ఏమి సంపాదించుకున్నారు?” అని ఎవరో బాపు గారిని అడిగితే... ఇలా చెప్పారట... “మెహదీ హసన్ కచేరీలు 150 గంటలు, బడే గులామ్ అలీ 90 గంటలు, హిందీ సినిమాలు - గులాం హైదర్, నౌషాద్, మదన్ మోహన్‌ల నుండి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ వరకు, అరవంలో మామ, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజాలు, తెలుగులో సాలూరి రాజేశ్వరరావు, లీలా, సుశీల, జానకి, జిక్కి, ఘంటశాల, మామ, రఫీ, లత, ఆశా, కిషోర్‌కుమార్ వగైరాలవి 200 గంటలున్నాయి. అన్నీ ఇండెక్స్ చేసి బైండ్ పుస్తకాల్లా ఉన్నాయి. ఇవికాక రవిశంకర్, హలీమ్ జఫర్‌ఖాన్, కరీమ్‌ఖాన్, బిస్మిల్లా, బీటిల్స్, లారీ అడ్లర్ (క్రోమోనికా), జెత్రోటుల్ గ్రూపు ఫ్లూటు, బితోవెన్, బాక్, వెర్దీ వైగరాలు క్లాసిక్ కచేరీలున్నాయి. “ బాపు సంగీత ప్రియుడే కాదు. సంగీతజ్ఞుడు కూడా. కుర్రతనంలో మౌత్ ఆర్గాన్ వాయించేవారు. ఆర్కెస్ట్రాలో ప్లే చేసే స్థాయి ఉంది. ఒకానొక సంగీత దర్శకుడి రికార్డింగ్స్‌లో పాల్గొంటూ ఉండేవారు. అయితే ఒకసారి ఆ మ్యూజిక్ డెరైక్టర్ కూర్చిన ట్యూనుల్ని తనెక్కడెక్కడ ఏయే భాషల్లో విన్నదీ సవివరంగా చెప్పారట. పైగా వాళ్లంతా మిమ్మల్ని కాపీ కొట్టేస్తున్నారని కూడా చెప్పారట. దరిమిలా ఆ మ్యూజిక్ డెరైక్టరు మౌత్ ఆర్గాన్‌ని మినహాయించి పాటలు రికార్డ్ చేయడం మొదలు పెట్టారట ! సంగీతం లో అభినివేశం ఉండడం, సాహిత్యం పట్ల మక్కువ, అన్నింటినీ మించి గొప్ప చిత్రకారుడు కావడం... ఇవే బాపు సినిమా పాటల్ని అద్భుతంగా మలచాయి. అటువంటి కొన్ని పాటల్ని ఇప్పుడు చూద్దాం. బాపు – రమణ గార్లు తీసిన సినిమాలలో ఒకవైపు భక్తి పరమైన సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, త్యాగయ్య లాంటి సినిమాలు, మరోవైపు సమాజంలో చెడుదారిని నడిచే దుర్మార్గుల కధలు, మంత్రి గారి వియ్యంకుడు, మన వూరి పాండవులు లాంటి సినిమాలు , పూర్తిగా వ్యంగ్యం, హాస్యం కలబోసిన సినిమాలు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం లాంటివి ఉన్నాయి. అల్లాగే, అవి అన్ని మేళవించిన సినిమాలు, అందాల రాముడు, బుద్ధిమంతుడు, భక్త కన్నప్ప లాంటివి కూడా ఉన్నాయి. వారి సినిమాలకి ఎక్కువుగా శ్రీ ఆరుద్ర, శ్రీ వేటూరి గార్లతోనే పాటలు వ్రాయించుకున్నారు. బాపురమణల మొదటి సినిమా “సాక్షి”లో ఆరుద్ర సాహిత్యం అందించి, కె.వి.మహదేవన్ స్వరపరచిన “అమ్మ కడుపు చల్లగా...” అనే పాట... ఎప్పటికీ మరువలేము. ‘గోరంత దీపం’ చిత్రం లోని పాటలకు , కె. వి.మహదేవన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా లోని సి.నారాయణరెడ్డి రాసిన టైటిల్ సాంగ్ ఆశావహ దృక్పధంతో సాగేది. అలాగే ఆ సినిమాలోని రాతి మనసుల్ని సైతం కరిగించగల ‘రాయినైనా కాకపోతిని...’ అనే ఆరుద్ర రాసిన పాట సందర్భానికి తగ్గట్టుగా ఉండి, ఆలోచింప చేస్తుంది. ముత్యాలముగ్గు సినిమాలో అన్ని పాటలు ఆణిముత్యాలే ! రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన ‘‘ముత్యాల ముగ్గు’’ చిత్రంలో నాటి రామాయణ కాలంనుంచి నేటి భారతంవరకు మనుధర్మశాస్త్రాన్ని మనసావాచా ఆచరించే మగజాతి స్త్రీ జాతిని ఎలా అవమానాలపాలు, ఆవేదనల పాలు చేస్తుందో, ఎలా కించపరుస్తుందో, ఎలా అణచివేస్తుందో చూపించారు. ఆ మాటకొస్తే బాపురమణల ఏ సినిమా చూసినా అది రామాయణాన్నే తలపిస్తుంది. ‘ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయా ... ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా...” అనే ఆరుద్ర గీతం ఇప్పటికీ ఇల్లాళ్ళకు ప్రాణం ! ఇదే సినిమాలో సి.నారాయణ రెడ్డి గారి “గోగులు పూచే “ పాట మరో అద్భుతం. ఉదయాన్నే జానపదులు పల్లె పదాలు పాడుతుంటారు... ప్రకృతిలో ఒక్కరైన జానపదులే జానపదులు. వాళ్ళను చూస్తూ మురిసిపోతుంటుంది సంగీత... చక్కటి ప్రకృతిలో మమేకమౌతూ వాళ్ళతో గొంతు కలుపుతుంది. ఈ లోపల శ్రీధర్ అవన్నీ చూసి మురిసిపోతున్న తన భార్యలోనే ఆ ప్రకృతిని దర్శిస్తూ, పాట పాడే సన్నివేశం ఎంతో హృద్యంగా ఉంటుంది. ఈ సినిమాలో మరో విశేషం... ఒక లవ్ సీన్ కోసం సాజ్జిద్ హుస్సేన్ గారు అందించిన మాండలిన్ సంగీతం. ఈ సన్నివేశం మొత్తం మాటలు లేకుండా, కేవలం మాండలిన్ బాక్గ్రౌండ్ లో నడుస్తూ మురిపిస్తుంది. అయిదు నిముషాలపాటు శ్రీధర్, సంగీత ల మధ్య సాగే ఈ దృశ్యాలు చూసేవారికి కొత్త అనుభూతిని మిగులుస్తాయి. గుంటూరు శేషేంద్రశర్మ గారు సినిమాలకు పాటలు రాయలేదు. కాని, ముత్యాలముగ్గు సినిమాకు ఆయన ఒక పాట రాసారు . వినే మనసుల్ని ఒక రకమైన భావోద్వేగానికి గురిచేసే ఆ పాట...”నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...”. ఈ పాట ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేస్తుంది. బాపు దర్శకత్వం వహించిన ‘తూర్పు వెళ్లే రైలు’కి బాలు సంగీత దర్శకులు. ఆరుద్ర సాహిత్యం ‘చుట్టూ చెంగావి చీర చుట్టావే చిలకమ్మా’ పాటకి బాలు ఇచ్చిన బాణి తోడై ఇప్పటికీ అది హిట్ లిస్టులో ఉంది. సంపూర్ణ రామాయణం ప్రారంభంలోనే వైకుంఠాన్ని చేరుకోవడానికి సప్తలోకాలకి ప్రతీకలుగా సప్త ద్వారాలను చూపుతూ, "రఘువంశ సుధాంబుధి చంద్రమ'' అనే త్యాగరాజ కీర్తనని సుప్రసిద్ధ వైణికుడైన చిట్టిబాబు గారి వీణానాదం ద్వారా వినిపిస్తారు. విష్ణుతత్వాన్ని వివరించే "శాంతాకారం భుజగశయనం పద్మనాభం'' శ్లోకం విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి పూర్తి అవుతుంది. ‘గుళ్ళో ఏముంది బళ్ళోనే వుంది’’అనే పాటలో గుడి మనిషిని మారుస్తుందో లేదో చెప్పలేము కాని బడి మాత్రం సమస్త మానవజాతిని మారుస్తుందని గొంతెత్తి ఉద్ఘాటించారు -! ‘‘అందాల రాముడు’’ చిత్రంలో పేద, ధనిక తారతమ్యాలపై, సనాతనాల బూజుపై, కులం మతం రివాజుపై, పురాణ నమ్మకాలపై తుఫాను రేపే సంభాషణలను వీలుదొరికిన చోట్లల్లా మొట్టికాయల్లా వేశారు! ‘‘రాముడేమన్నాడు... సీతారాముడేమన్నాడోయ్‌ ..’’ అనే పాటలో ‘‘మనుషుల్లారా మాయామర్మం వద్దన్నాడోయ్‌ ..!’’అంటూ తనదైన సౌమ్య బాటలోనే సామ్యవాదాన్ని వినిపించారు ! ‘‘ఎదగడానికెందుకురా తొందరా’’అనే పాటలో భావిభారత పౌరులైన విద్యార్థులను బానిసలుగా, బావిలోని కప్పలుగా మారుస్తున్న మెకాలే విద్యావిధానంపై, విద్యావ్యాపారంపై తిరుగుబాటును సెటైర్ల రూపంలో సంధించారు. “ భక్తకన్నప్ప’’లో భక్తిరసంతోపాటు అంతర్లీనంగా కొండజాతి గిరిజనుల బతుకుపోరు కూడా తొంగి చూస్తూ ‘‘కండ గెలిచింది... ’’ పాటలో స్పష్టంగా తెలిసొస్తుంది. ఇదే సినిమాలో కవి సార్వభౌముడు శ్రీనాధుడు వ్రాసిన ‘హరవిలాసం’ లోని ఒక గాధనూ సినిమా పాటగా మలచడం లో అనన్యసామాన్య ప్రతిభ కనపర్చారు శ్రీ వేటూరి. మూలం లోని కధ కి దీటుగా, భావార్ధాలు ప్రతిబింబిస్తూ , తెలుగు జాతీయత , నుడికారం లకు అనుగుణంగా నృత్య రూపకం గా అద్భుతంగా వ్రాసారు. ఈ పాటలో శ్రీ వేటూరికి భాష మీద ఉన్న సాధికారతను గమనించవచ్చు,. ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా .. నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే .. సవ్యసాచి కుడిఎడమై సంధించుట మరిచిపోయే.. శర పరంపర కురిపే హరుడు అయినా నరుని కంట మనోహరుడు .. ‘మిష్టర్ పెళ్ళాం, ‘పెళ్ళిపుస్తకం’, ‘గోరంత దీపం’, ‘వంశవృక్షం’, ‘రాధాకళ్యాణం’ చిత్రాలలో బాపు అనే సత్తిరాజు కెమెరా ఆడవారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, హక్కులను గురించే చర్చించింది! అక్కడక్కడ అప్పుడప్పుడు ఫెమినిజాన్ని బలపరుస్తూ పురుష దురహంకార వ్యవస్థపై మొట్టికాయలు వేసింది. కలియుగ రావణాసురుడు అనే సినిమాలో కధానాయిక శారద కళ్లపై చిత్రీకరించిన “నల్ల నల్లని కళ్ళు... “ అనే పాట బహుశా ఇప్పటివరకూ అమ్మాయి కళ్ళపై చిత్రీకరించిన పాటలలోనే ఒక అద్భుతం ! ఏ సమయంలో ఒక స్త్రీ కళ్ళు ఏ విధంగా కనిపిస్తాయి అనేది సి.నారాయణ రెడ్డి గారు గొప్పగా వర్ణించారు. శ్రీరామరాజ్యం చిత్రంలోని పాటలు కదిలే వెన్నెల శిల్పాలు. దృశ్యం, నటన, గానం, నాట్యం, సాహిత్యం అన్నింటి పరంగా సకల కళల సమాహారంగా కనిపిస్తూ, ఒక్కో పాట ప్రేక్షకులకు రాముడి పట్ల అనురక్తిని, రససిద్ధిని కలిగిస్తుంది. ఈ చిత్రంలోని ఒక్కో పాట సమ్మోహన సుస్వరాల నాదం ,ఒక అద్భుతం !! ఈ పాటల్లో, సినిమాల్లో ,కోనసీమలోని గోదావరి నదీ తీర అందాలను తన దర్శకత్వంలో రూపొందించిన పలు చిత్రాల్లో చిత్రీకరించారు. ఆత్రేయపురం మండలం పులిదిండిలో రాజుగారి తోట, ధవళేశ్వరంలోని నిడమర్తి వారి సత్రంలో వెండి తెరపై సంచలనమై ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన ముత్యాలముగ్గు చిత్రీకరించారు. వంశవృక్షం, పెళ్లిపుస్తకం, శ్రీరామరాజ్యం, అందాలరాముడుతో సహా అనేక చిత్రాలు బాపు దర్శకత్వంలో గోదావరి జిల్లాల్లో రూపుదిద్దుకున్నాయి. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ చూపరుల కళ్ళకు, మనసుకు విందు చేసే ఈ పాటలన్నీ ఆపాతమధురాలే !    

No comments:

Post a Comment

Pages