చౌడప్ప శతకము-కుందవరపు చౌడప్ప - అచ్చంగా తెలుగు

చౌడప్ప శతకము-కుందవరపు చౌడప్ప

Share This
చౌడప్ప శతకము-కుందవరపు చౌడప్ప : దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవిపరిచయం
"కవి చౌడప్ప"గా ప్రసిద్ధి చెందిన "కుందవరపు చౌడప్ప" నియోగి బ్రాహ్మణుడు. ఈయన కడప జిల్లాలోని కుందవరం లేదా పుల్లూరు గ్రామవాసి కావచ్చును. మట్టి అనంత భూపాలుని చేతనూ, తంజావూరు రఘునాధ రాయల చేతను సన్మానించబడతం చేత ఈతను బహుశా 1580-1640 మధ్య కాలం వాడై ఉండవచ్చును. ఈకవి కుందవరం గ్రామానికి కరణంగా కూడా పనిచేసేవాడిని కొంతమంది పండితుల అభిప్రాయం. ఐతే కుందవరపు అనేది ఇంటిపేరాకాదా అనేది నిర్ణయించాలి. క్రిందిపద్యంలో పుల్లూరుని ప్రస్తావించటంవలన బహుశా ఈ కవి పుల్లూరు నివాసి కావొచ్చును.
శ్రీపతి పుల్లురి పట్టణ
గోపాలుఁడు సదయుఁడగుచుఁ గుంతీసుతులన్
గాపాడు నటులు మమ్మును
గాపాడును గుందవరపు కవి చౌడప్పా!
ఈయన "కవి చౌడప్ప" మకుటంతో ఒక శతకాన్ని రచించాడు. ఈ పద్యాలలో నీతి, శృంగారంతో పాటు బూతులు కూడా వాడటంతో, ఈ శతకం బూతు శతకం అని, చౌడప్ప బూతు కవి అని, పేరు సంపాదించాడు. నిజానికి చౌడప్ప రాసిన పద్యాలలో ఎక్కువగా నీతి పద్యాలే ఉన్నాయి. ఐతే కొన్ని బూతు పద్యాలు కూడా లేకపోలేదు. నీతులైనా బూతులైనా  తను చెప్పదలచుకొన్నది చాలా సూటిగా నిఖచ్చిగా చెప్పాడు.
నీతులకేమి యొకించిక
బూతాడక దొరకు నవ్వు బుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా
(నీతులకేమి చాలానే ఉన్నాయి. కానీ కొంచం అయినా బూతులు లేకపోతే నవ్వు ఎలా పుడుతుంది? నీతులు బూతులూ లోకంలో ఖ్యాతి చెందినవి కదా?)
పది నీతులు పదిబూతులు
పది శృంగారములు గల్గుపద్యములసభన్
చదివినవాడె యధికుడు
గదనప్ప కుందవరపు చౌడప్పా
(పది నీతులు, పది బూతులు, పది శృంగార పద్యాలు సభలో చదివినవాడే గొప్పవాడు)
హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజుల్లో జన్మించిన కవి చౌడప్ప, పద్యాలలో అక్కడక్కడ బూతులూ, అశ్లీల శృంగారం కనిపించినా, వేమనలాగానే ధర్మకోపంతోనే అతడు సంఘాన్ని తిట్టినట్లు కనపడుతుంది. నీతులు భోదించటంలో కవి చౌడప్ప చమత్కారంగా తిట్లను కూడా జోడించాడు. ఈ శతకంలో"పస" పద్యాలు, "పదిలము" పద్యాలు చాల ప్రసిధి పొందాయి. మచ్చుకి కొన్ని క్రింద ఇస్తున్నాను.
పప్పే పస బాపలకును
యుప్పే పస రుచులకెల్ల నువుదలకెల్లం
గొప్పే పస దంతములకు
కప్పే పస కుందవరపు కవి చౌడప్ప
వానలు పస పైరులకును
సానలు పస వజ్రములకు సమరంబులకున్
సేనలు పస మృగజాతికి
కానలు పస కుందవరపు కవి చౌడప్పా
(పైరులకు వానలు, వజ్రానికి సాన, సమరానికి సేనలు, మృగాలకి కానలు పస)
మాటలు పస నియ్యోగికి
కోటలుపస దొరలకెల్ల ఘోటకములకున్
దాటలుపస బొబ్బులులకు
కాటులు పస కుందవరపు కవి చౌడప్పా
(నియోగులకు మాటలు, దొరలకు కోటలు, గుఱ్ఱాలకు గెంతటం, బొబ్బిలి పులులకు చారలే పస)
వాజ్యము పస దాయాదికి
నాజ్యము పస భోజనమున కవనీశునకున్
రాజ్యముపస పెండిండ్లకు
కజ్జము పస కుంద కవి చౌడప్పా
(దాయాదులకు వాజ్యమూ, భోజనమునకు నెయ్యి, రాజుకు రాజ్యం, పెళ్ళిళ్ళలో గిల్లి కజ్జాలే పస)
చెప్పులు పస పాదములకు
పప్పులు పస విడెముకెల్ల వనితలకెల్లన్
గొప్పులు పస ఇలుమీదట
గప్పులు పస కుంద చౌడప్ప
(పాదములకు చెప్పులు, తాంబూలంలోకి చారపప్పు, స్త్రీలకు కొప్పులు, ఇంటికి కప్పులు పస)
కవి చౌడప్ప కంద పద్యాలు చెప్పటంలో చాల ప్రసిద్ధుడు. ఈ క్రింది పద్యం చూడండి.
ముందుగచను దినములలో
కందమునకు సోమయాజి ఘనుడందురు నే
డందురునను ఘనుడందురు
కందమునకు కుందవరపు కవిచౌడప్పా
(పూర్వకాలంలో కందపద్యానికి తిక్కన్న సోమయాజి ఘనుడు కానీ, ఈ రోజుల్లో కంద పద్యనికి నేను ఘనుడను అంటారు)
కందము నీవలెజెప్పే
యందము మరిగానమెవరియందున గని సం
క్రందనయ సదృశనూతన
కందర్పా కుందవరపు కవి చౌడప్పా
(ఓ ఇంద్రునితో సమానమైన వాడా! నీలా కందమును అందముగా చెప్పే నేర్పు ఇంకెవరిలోను కనపడదు)
కందముల ప్రాసగణయతు
లందముగా కవితనెందరల్లరువినినీ
కందంబురససన్మా
నందంబులు కుందవరపు కవిచౌడప్పా
(ఇదివరలో ఎంతోమంది గణ, యతి, ప్రాసలతో కంద పద్యాలను చెప్పారు కానీ, నీ కందం మాత్రం జిహ్వకు రుచికరం)
కవి చౌడప్పకు పూర్వ కవులపై భక్తి అభిమానం ఎక్కువ.
విను భారవీ బిల్హణనా
చనసోముని మాఘకవిని చతురత శ్రీనా
ధునుతింతును కవితకు ది
క్కనదలతును కుందవరపు కవి చౌడప్పా
(భారవిని, బిల్హణుని, నాచనసోముని, మాఘకవిని, ప్రతిభాశాలి శ్రీనాధునీ, కవిత్వానికి తిక్కన్ననూ స్తుతిస్తాను)
పండితముఖ్యులు ధారుణి
దండియు భవభూతి కాళుదాసులనుతి యె
వ్వండునిడు కృతులవారిన
ఖండితయశ కుందవరపు కవి చౌడప్పా
(దండి, భవభూతి, కాళిదాసుల్ని లోకంలో పండితులైన పెద్దలు స్తుతిస్తారు. అలాంటి కృతులు వ్రాసినవారు అఖండ కీర్తి పొందుతారు)
పెద్దన వలె కృతిజెప్పిన
పెద్దనవలె నల్పకవిని పెద్దనవలెనా
ఎద్దనవలె మొద్దనవలె
గ్రద్దనవలె కుందవరపు కవి చౌడప్పా
(అల్లసాని పెద్దనలాగా కృతి చెప్పినవానిని పెద్ద అనాలిగాని అల్పుడైన కవిని పెద్ద అనాలా? ఎద్దు అనాలి, మొద్దు అనాలి, గ్రద్ద అనాలి)
చౌడప్ప ఏవిషయాన్నైనా సూటిగా నిర్మొహమాటంగా చెప్పాడు. అతని భాష సరళం. అచ్చతెలుగులో రచించిన శతకంలో కొన్ని బూతు పద్యాలు పక్కన పెడితే,మిగిలిన పద్యాలు చాలా చక్కగా ఉంటాయి. తనదైన శైలిలో కందంలో అందంగా కవి చౌడప్ప చెప్పిన పద్యాలు అందరూ ఒక సారి చదివి ఆనందించవలసినవి. మీరూ చదవండి.

No comments:

Post a Comment

Pages