శ్రీ వేంకటేశ్వర శతకము - యల్లాప్రగడ వెంకట సుబ్బారావు - అచ్చంగా తెలుగు

శ్రీ వేంకటేశ్వర శతకము - యల్లాప్రగడ వెంకట సుబ్బారావు

Share This
శ్రీవేంకటేశ్వర శతకము - యల్లాప్రగడ వెంకట సుబ్బారావు
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం:
 ఈశతక రచయిత యల్లప్రగడ వెంకటసుబ్బారావు గారు సిరిపూడి, రేపల్లె తాలూకా గ్రామ నివాసి. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. తల్లితండ్రుల వివరాలు తెలియలేదు. ఈకవి బహుగ్రంధకర్త. ఇతని ఇతర రచ్నలు 1. శ్రీసీతారామ శతకము, 2. శ్రీమల్లికార్జున శతకము, 3. శ్రీనరసింహ శతకము, 4. శ్రీరుక్మిణీ విజయము (ప్రబంధము), 5. శ్రీఆంజనేయ శతకము, 6. ఖండకావ్యముల సంపుటి, 7. రామేశ్వర యాత్ర, 8. ఘటికాచల క్షేత్ర మాహత్మ్యము,
శతకాంతములో ఈకవి తన గురించి ఇలా చెప్పికొనినాడు.

ఉ. రేపలితాలూకాను గల శ్రీసిరిపూడి నివాసి, నారువేల్
బాపలశాఖలోఁగడుఁ జెలంగితి యల్లయప్రగ్గడాఖ్యతో
రూపగువంశమందు, చతురుందనుఁ బేరు సుబ్బరాయుడన్
ప్రాపునెసంగి బ్రోవగదె పద్మవిలోచన వెంకటేశ్వరా

. ఈకవి గురించి యింతకంటే వేరే వివరాలు తెలియటం లేదు. 

శతక పరిచయం:
"వెంకటేశ్వరా" అనేమకుటంతో చంపకోత్పలమాల  వృత్తములలో రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది. మొత్తము 108 పద్యాలలో అలరారే ఈశతకంలోని భాష సరళం. సులభగ్రాహ్యం.

ఉ. నమ్మితి నీపదంబులను నాదగుసంకట సంచయంబులన్
వమ్మొనరించి నీవిమలభవ్యమనోజ్ఞసురూప దర్శనం
బిమ్ము నిరంతరంబు భవబీజములన్ మొలకెత్తనీక స
త్యమ్ము సుఖస్పదమ్మునగు దారినొసంగుము వెంకటేశ్వరా1
పద్యముల నడక మాత్రమే కాక భావము కూడా అత్యంత మనోహరమై చదివే వారికి వినేవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొన్ని పద్యాలను చూద్దాము.

ఉ. కొండలుమూడునాల్గుదరిఁ గూడనివాస్ము చుట్టు శైలముల్
మెండుగకోటగోడలుగ మేకొని దుర్గమమై జనాళి కు
ద్దండభరంబుగూర్పగ సతంబును శోధనచేసి భక్తులన్
దండిగఁ బ్రోచుదేవుడ వుదారత తిర్పతి వెంకటేశ్వరా!

ఉ. ఈమ్మహిఁగల్గు తీర్థములకెల్లను మేటియటంచు పాపనా
శమ్మను పుణ్యతీర్థమునస్నానమొనర్చి విశుద్ధులైత్వదీ
యమ్మగుపాదపద్మములనారమనమ్మున జేర్చు భక్తుల
బ్రమ్ముగ నీపాదంబునను వారకనిల్తురు వెంకటేశ్వరా!

ఈశతకంలో 10వ పద్యము నుంచి 20వ పద్యం వరకు దశావతార వర్ణనము చేయబడింది. వానిలో కొన్ని పద్యాలను చూద్దాము

ఉ. మున్నుసురాసురుల్ గలిసి మోదమునన్ తరిమందరంబుగా
పన్నగనాధుఁ ద్రాడుగనుపన్ని పయోనిధిఁ ద్రచ్చఁబూనగా
గ్రన్ననశైలమబ్ధిమునుగంగ మఠాకృతిఁబూని వీపుపై
తన్నగముద్దరించితి వుదారత తిర్పతి వెంకటేశ్వరా!

చం. జగతిఁగలట్టిక్షత్రియ సుగుంతతి నిర్వుదియొక్కమారు శౌ
ర్యగతి విరాజితోగ్రతఁగరాసి వధించి తదీయ రక్తమం
దొగి పితృదేవ తర్పణము నొప్పుగఁజేసితి భార్ఘవాఖ్యతో
నగునె నుతింప నీకథలు హారిమృదుక్తుల వెంకటేశ్వరా!

ఉ. కోసలకన్యగర్భమున కూర్మిజనించి వసుంధరాసుతన్
వాసిగపెండ్లియైదనుజ వారముసంహరణం బొనర్పగా
జేసిప్రతిజ్ఞదండకను చేరిచతుర్దశహాయనంబులన్
జేసితిదుష్టశిక్ష రఘుశేఖర తిర్పతి వెంకటేశ్వరా!

ఉ. ధర్మవిహీనవర్తనుల దండనసేయఁగ లోకసంచయం
బర్మిలిరక్షసేయఁగలికాకృతి మాన్వరూపమొంది స
త్కర్మలఁ బ్రోత్సహించి జనకాందముఁబ్రోచెద వార్తరక్షణా!
నిర్మధితారి! నీచరణనీరజముల్ విడ వెంకతేశ్వరా!

వెంకటేశ్వర లీలలు అటులనే  మహావిష్ణువు లీలలు ఈశతకంలో చోటు చేసుకున్నాయి.

ఉ. హేల ననేక దుష్కృతములెల్లపుడుంబొనరించు నాయజా
మీళుడు చావుకాలమున మిక్కిలి ప్రేమను నీదునామముం
బోలిననామముంగలుగు పుత్రునిబిల్వగ వానిపాపముల్
దోలియనుగ్రహించితివి దోయజలోచన వెంకటేశ్వరా!

ఉ. కాకము రూపుందాల్చి యొకకట్టడిరక్కసుఁడా ధరాత్మజా
స్తోకకుచాగ్రభాగమున తుంటరియై తనముక్కుతోడ బ
లీకను దాఁకుచుండఁగని పీచమడంపగ గడ్డిపోచనే
ప్రాకటధాతృబాణమటు రాజిలఁజేసితి వెంకటేశ్వరా!

సామెతలను, జాతీయములను ఈ కవి అనేకచోట్ల సమయానుచితముగా వాడినాడు. అంతియేకాక ఈశతకములో అనేక నీతిపద్యములను కూడా కవి చెప్పినాడు.
చక్కని సులభమైన భాషలో అందరికి అర్థమయ్యేరీతిలో చెప్పిన ఈ శతకం అందరూ చదువతగినది. మీరు చదవండి మీ మిత్రూల్చే చదివించండి.
***

No comments:

Post a Comment

Pages