నీరుప్మా - అచ్చంగా తెలుగు
నీరుప్మా
-శ్రీనూ వాసా

అర్థరాత్రి పన్నెండింటికి మొదలెట్టింది.. ఒకటే వాంతులు, విరేచనాలు లలితమ్మకి. బాత్రూం అంతా గందరగోళం చేసేసింది. నీళ్ళల్లో సోడా పొడుం దగ్గరనుంచి వామరుకు వరకూ తనకు తెలిసిన చిట్కావైద్యాలెన్నిచేసినా ఏమాత్రం ఉధృతి తగ్గలేదు. కొత్తఊరు. ఏం చెయ్యాలో ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలీలేదు రాజప్పకి. రెండు వీధుల అవతలున్న కజిన్ కి ఫోన్ చేసి అడిగితే “ఏం కంగారు పడకు, నీరుప్మా కి తీస్కెళ్దాం, బండి తీసుకుని రడీగా ఉండు. నేను వస్తాను ఐదు నిమిషాల్లో అన్నాడు. నీరు ఉప్మానా? ఇదేం పేరో అనుకొని అలోచించే స్థితిలో లేక, ఏదోటిలే అని తీసుకెళ్ళడానికి లలితమ్మను తీసుకుని బయటికొచ్చి తాళమేసాడు. అప్పటికే తెల్లవారుఝామున మూడైంది.

ఎమర్జెన్సీ గేటు దగ్గర సెక్యూరిటీ ఫార్మసీ వైపు చూపించి, మాస్కులు శానిటైజర్ కొనుక్కుని రండి, డ్యూటీ డాక్టర్ని లేపుతాను అన్నాడు.

డాక్టరు, ఇద్దరు నర్సులు లలితమ్మని పరీక్షించి, ఒకరోజు ఉంటే మంచిది, అడ్మిట్ చెయ్యండి అన్నారు. మందులు రాసి కొనుక్కురమ్మన్నారు. 

మాస్కులు అమ్మడానికి లేచిన ఫార్మసీ వాడు తిరిగి నిద్రకుపక్రమిస్తుండగా మళ్ళీ లేపాల్సొచ్చింది. చాంతాడంత ఉన్న లిస్ట్ చూసి విసుక్కుంటూ తీసిచ్చాడు.

"ఏడువేల నాలుగు వందలు" అన్నాడు. కార్డ్ తీసి ఇవ్వబోతే, మెషీన్ పనిచెయ్యట్లేదు, కేష్ ఇమ్మనాడు. 

ఇంతలో నర్స్ దగ్గరకొచ్చి, మంచినీళ్ళ బాటిల్ తీసుకురండి, పేషెంట్ కి టాబ్లెట్ వెయ్యాలి అంది. ఏంటమ్మా మీ హాస్పిటల్లో తాగడానికి నీళ్ళుకూడా ఇవ్వరా అన్నాడు ఆశ్చర్యపోతూ. త్రాగునీరు ఉంటుంది సార్. బాటిల్ మాత్రం మీరు తెచ్చుకోవాలి అంది నవ్వుతూ.. "

“నాయమ్మే! ఎమర్జెన్సీ పేషెంట్ ని తీసుకొస్తూ ఖాళీ బాటిల్ తెచ్చుకోవాలా”? అని తిట్టుకుని ఫార్మాసిస్ట్ వైపుతిరిగి, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అన్నాడు.

"ఇది మందులషాపు సార్.. వాటర్ బాటిళ్ళుండవ్ అన్నాడు" చిరాగ్గా!
"వాటర్ బాటిల్ కూడా లేని మందులషాప్ ఏంట్రాబాబూ" అనుకొని చేసేది లేక బయటికి పరుగెట్టాడు రాజప్ప.

గంటలో రూం కి షిఫ్ట్ చేసి, ఫ్లూయిడ్స్ అవీ పెట్టేసారు. 

"ఏంటి సిస్టర్ ఒక్క రోజుకి ఇన్ని మందులా" అని అడిగారు కేజువల్ గా. "లేదు సార్, డాక్టర్ గారు మూడురోజులకి రాసారు. ఒకవేళ అవసరం లేనివి, వాడనివి ఉంటే డిస్చార్జ్ అప్పుడు రిటర్న్ ఇచ్చెయ్యొచ్చు అంది. 

ఫ్లూయిడ్స్ ఎక్కించుకొంటూ బెడ్ మీద హాయిగా నిద్రపోతోంది లలితమ్మ. కుర్చీలో కూర్చుని కునిపాట్లు పడుతున్నాడు రాజప్ప. ఒకటే ఉక్కపోత. చెమటతో చొక్కా తడిచిపోతుంటే  ఆరబెట్టడానికి దాని శక్తి కొలది వేగంగా తిరుగుతోంది ఫేన్.

ఉదయాన్నే కూడా ఎందుకింత ఉక్కగా ఉంది అని చుట్టూ పరీక్షగా చూసాడు. అది సెంట్రల్ ఏసీ బిల్డింగ్, ఏమాత్రం వెంటిలేషన్ లేదు, ఏసీ పనిచెయ్యట్లేదు. సిస్టర్ పిలిచి అడిగాడు రాజప్ప. సారీ సార్ ఏసీ రిపేరొచ్చింది సార్. అయినా ఫేనుంది కదండీ అని పళ్ళికిలించింది.

ఏడవలేక తనూనవ్వాడు చేసేదిలేక!

రాత్రి తెల్లవార్లూ నిద్రలేదు. ఆకలేస్తోంది. కేంటీన్ ఎక్కడ అని ఎంక్వైరీ చేస్తే తెలిసిన నిజం.. సెల్లార్ లో ఉందని, కాని ఇప్పుడు లేదని! కేంటీన్ కాంట్రాక్ట్ అయిపోయిందట.. కొత్తవాడు రావల్సి ఉందట, ఎప్పుడొస్తాడో తెలీట్ట!

బయట ఎదురుగా ఉన్న కేంటీన్లో టిఫిన్ చేసి, పక్కనే ఉన్న షాపులో కొబ్బరి బొండం కొట్టించి లలితమ్మ కివ్వడానికి తీసుకువెళ్తుంటే సెక్యూరిటీవాడు “ఏంటది?” అన్నట్టు చూసి, "బయటి ఫుడ్ నాట్ అలౌడ్" అన్నాడు దబాయిస్తూ.

“డాక్టర్ గారు పేషెంట్ కి ఇవ్వమని చెప్పారు” అన్నాడు అంతే దబాయిస్తూ. “ఆగ్లాస్ ఇక్కడ పెట్టి వెళ్ళి సిస్టర్ తో ఫోను చేయించండి. ఆయమ్మ చేత పైకి పంపిస్తాను” అన్నాడు. పైకివెళ్ళి సిస్టర్ తో ఫోను చేయించి, ఎవరి చేతులు పడటమో ఎందుకు అని పరుగెట్టుకుంటూ కిందిగి దిగేసరికి, గ్లాసు చుట్టూ ఈగలు ముసిరేసి ఉన్నాయ్. దాన్ని డస్ట్ బిన్ లో పడేసి ఇంకోటి కొట్టించాల్సి వచ్చింది.

లంచ్ టైం లో కూడా ఇలాంటిదే ఇంకో ప్రహసనం ఎదుర్కోలేక ముందుగానే ఫోను చేయించాడు సిస్టర్ చేత.

మొత్తానికి సాయంత్రం డిస్చార్జ్ టైం అయింది. 

రిటర్న్ ఇవ్వాల్సిన మందులు చీటీ సిస్టర్ చేత రాయించుకుని ఫార్మసీ దగ్గర అరగంట లైనులో నిలబటి కౌంటర్ దగ్గరకొచ్చాకా మందులు కొన్నప్పుడు ఇచ్చిన చిట్టీ అడిగింది. అదేంటి? కంప్యూటరైజ్డ్ హాస్పిటల్ కదా? మాకేం మందులు ఇచ్చారో మీ సిస్టం లో తెలీదా? " అని విసుగ్గా అడిగితే “సిస్టెం పనిచెయ్యట్లేదండీ. మన్యువల్ గా చెయ్యాలి. మీరు బిల్లు తేకపోతే నేనేం చెయ్యలేను” అంది, తరువాత నుంచున్న వాణ్ణి పిలుస్తూ.

పైకొచ్చి చీటీ వెతుక్కుని మళ్ళీ వె ళ్తే మూడువందలు చేతిలో పెట్టింది. "ఇదేంటమ్మా నాకు ఆరువందలు రావాలికదా" అంటే "రిటర్న్ చెసే మందులకి ఫిఫ్టీ పెర్సెంటే ఇస్తామండి" అంది. "ఈవిషయం ముందెందుకు చెప్పలేదు" అన్నాడు కోపంగా.
"మీకిచ్చిన బిల్లులో రాసారుకదండీ.. స్టార్ పెట్టి, టర్మ్‌స్ అండ్ కండిషన్స్ అప్ప్లై అని. బిల్లు వెనక చదవండి" అంది. 

నాపేరు రాజప్పా? లేక వెర్రి వెంగళప్పా? అని మనసులో అనుకొని నిస్సహాయంగా తిరిగి వచ్చేసాడు.

బిల్లులు చెక్ చేస్తున్న రాజప్ప "శానిటైజేషన్ చార్జెస్ -  1500" అని ఉండటం చూసి "మాస్కులు శానిటైజర్ మేమే కొనుక్కున్నాం కదా? మరిదేంటి" అనడిగాడు అయోమయంగా.  “అది స్టాఫ్ కోసం ఇంకా హాస్పిటల్ శానిటైజేషన్ కోసం సార్” అంది.

రూం కి ఇచ్చిన అడ్వాన్స్ లో మిగిలిన అమౌంట్ తెచ్చుకోడానికి తలప్రాణం తోక్కొచ్చింది రాజప్పకి. "నేను పే చెయ్యాల్సిన బిల్లులో అడ్జస్ట్ చేసుకోవచ్చుగా" అంటే, “చెప్పాను కదండీ సిస్టం పనిచెయ్యట్లేదని, అంతా మన్యువల్ గా చేస్తున్నాం. హాస్పిటల్ బిల్లు, రూం బిల్లు వేరువేరు అకౌంట్లు సార్. మీరు కట్టాల్సిన బిల్లు కట్టెయ్యండి. రూం అడ్వాన్స్ మాత్రం వారం రోజుల్లో మీ అకౌంట్లో పడతాయి. పడకపోతే రండి, ఈ ఫారం మీద మీ అకౌంట్ నంబర్, ఐఎఫ్సెస్సీ కోడు వేసి సైన్ చేసి ఇవ్వండి" అంది నవ్వుతూ.. 

"వద్దులే నువ్వే ఉంచుకో" అని అరచి వచ్చెయ్యాలనిపించింది.. కాని ఐదువేలు తక్కువేం కాదని, చేసేది లేక ఓపిగ్గా ఫారం నింపి సైన్ చేసి లలితమ్మని తీసుకుని బయటికి వచ్చి బండితీసి స్టార్ట్ చేస్తూ హాస్పిటల్ పేరు, దాని ప్రత్యేకతలు రాసున్న బోర్డ్ చూసి “నిజంగానే దీనిసాటి ఇంకెక్కడా ఉండదు, నిరుపమానమే!” అని నిర్వేదంగా నవ్వుకున్నాడు రాజప్ప:

నిరుపమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
24/7 ఎమర్జెన్సీ సౌకర్యం
24/7 ఫార్మసీ, కేంటీన్ సౌకర్యం 
సెంట్రలైజ్డ్ ఏసీ
ఆల్ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ ఆక్సెప్టెడ్
కంప్యూటరైజ్డ్, ఫుల్లీ ఆన్లైన్ 
పేపర్ లెస్స్ అడ్మినిస్ట్రేషన్ 
***

No comments:

Post a Comment

Pages