కరోనా వైరాగ్యం - అచ్చంగా తెలుగు

కరోనా వైరాగ్యం

Share This
 కరోనా వైరాగ్యం
 - శారదా తనయ 

తమ పక్క అపార్ట్ మెంట్ “ సీతా క్యాజిల్ “ లో ఎవరికో  కరోనా పాజిటివ్ రావడంతో పక్కనే ఉన్న తమ ఇద్దరికి కూడా వయసు పైబడి ఉండడం వలన కరోనా టెస్ట్ కోసం సర్కారు వారు తమ వాహనంలో తీసుకు పోతుంటే ప్రవీణ్ ఆలోచన పరిపరి విధాలుగా సంచరించ సాగింది. కానీ, ఎటు వెళ్ళి ఎటు వచ్చినా తమ ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలి తమకు కరోనా వైరస్ సోకి తామిద్దరు టపా కట్టేస్తేనే అన్ని విధాల బాగుంటుందని ప్రవీణ్ కు అనిపించసాగింది. 
**** 
ప్రవీణ్, పద్మజ ఇద్దరు మధ్య తరగతి దంపతులు. ప్రవీణ్  ప్రభుత్వ ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైరయ్యి పన్నెండు సంవత్సరాలు కావస్తోంది. అప్పుడే డెబ్భైవ పడిలో పడ్డాడు. పద్మజ బ్యాంకులో క్లర్క్ గా పని చేస్తూ, మధ్యలో వి ఆర్ ఎస్ స్కీము వచ్చినప్పుడు సర్వీసు నుండి తప్పుకుంది. ఇద్దరూ పద్ధతిగా తమ సంసారాన్ని నడుపుకుంటూ తాము సంసారం మొదలు పెట్టినప్పుడు కన్న కలల్ని సాకారం చేసుకున్నారు.  అందరి దంపతుల్లాగా ఒక చిన్న ఇల్లు, చుట్టూ తోట, పిల్లలకు మంచి చదువులతో పాటు బంధువుల్లో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం చేసుకోగలిగారు. ప్రజ్వల్, ప్రణీత పిల్లలు. వాళ్ళు ఉన్నంతలో బాగా చదివి ఇద్దరికీ పెళ్ళిళ్ళయి పోయి ఒకరు అమెరికా ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఇవన్నీ అయ్యేటప్పటికి వీళ్ళిద్దరూ సీనియర్ సిటిజన్లు అయిపోయారు. రిటైర్మెంట్ తర్వాత పిల్లల పిలుపు మేరకు అమెరికాకు ఒకసారి, ఆస్ట్రేలియాకు ఒకసారి వెళ్ళి వాళ్లతో ఆర్నెల్లు గడిపి వచ్చారు. పిల్లలు తమ తమ జీవితాలను బాగానే గడుపుతున్నారు అనిపించింది. వాళ్ళతో ఉన్నప్పుడు పద్మజ తన ఆత్రతను అణచకోలేక కొడుకుతో “ ఒరే ! మీరిద్దరూ ఇక ఇలా విదేశాల్లోనే ఉండిపోతారా ఏమిటి ? మేమిద్దరం పెద్దవాళ్లయపోతున్నాం. మీరు ఇండియాకు వచ్చేదెప్పుడు? ఇక్కడ పని చేసి అక్కడికి వస్తే మంచి ఉద్యోగమే వస్తుందటగా. మీరు వచ్చేస్తే మేము మీ పంచన చేరి హాయిగా ఉండగలుగుతాం. నాకెప్పుడూ మీ నాన్నదే బెంగ.” అని చెప్పి చూసింది. కొడుకు  తేల్చేస్తూ “ అమ్మా! మీరిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారుగా ! మీ స్వంత ఇంట్లో ఉన్నారు. మీ ఇద్దరి పెన్షన్ మీ ఇద్దరికి సరిపోతుంది. మీరిద్దరే హాయిగా ఉండండి. మా బాదరబందీ ఎందుకు ? ఎంతైనా అందరం కలిసుంటే మనస్పర్థలు, పొరపొచ్చాలు తప్పవు. దానికంటే ఇప్పుడు ఎవరకి వారు ఇలా బానే ఉంది కదా ! అప్పుడప్పుడు మీరు ఇలా వచ్చి పోతుంటే సరి “ అన్నాడు. మళ్ళీ మాట్లాడబోతే ’ అమ్మా! నాకు మాత్రం అంత బాధ్యత ఉండదా ? మీ ఇద్దరిలో ఎవరికేమైనా అయితే రెక్కలు కట్టుకుని వాలమా ఏంటి? ఎందుకలా ఇప్పట్నుంచే కంగారు పడతావు? నాన్నేమైనా పడుతున్నాడా చూడు “ అన్నాడు. పద్మజ “ ఆయన బయట పడరంతే. ఆయనకు కూడా బెంగే. “ అంది. కాని ఆ చర్చ అంతటితో ముగిసింది. అటు కూతురు కూడా ఇలాంటి భరోసానే ఇచ్చింది. ఏదైనా ఎమర్జన్సీ వస్తే తప్పకుండా వచ్చి చూసుకుంటామని. ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజు పద్మజ గుండెనొప్పి అంటూ కూలబడింది. ప్రవీణ్ వెంటనే ౧౦౮ కి ఫోన్ చేసి దగ్గరున్న కార్పొరేట్ హాస్పటల్ కి తీసుకెళ్ళాడు. ఆమెకు గుండెల్లోని ఒక వాల్వ్ బ్లాక్ అయ్యిందని తేలింది. ఆపరేషన్ చేసి స్టెంటు పెట్టాలి అన్నారు. అంతా కలిపి రెండు లక్షలదాకా అవుతందన్నారు. ప్రవీణ్ కొడుకుకు, అమ్మాయికి ఫోన్ చేసి రమ్మన్నాడు. కానీ ఇద్దరూ ఒకే మాట అన్నారు “ఇప్పుడు ప్రాబ్లెమ్ ఏమిటి అని తేలిపోయిందిగా నాన్నా ! డబ్బు గురించి మీరేం వర్రీ కాకండి. పంపుతాం. ఆపరేషన్ కానిచ్చెయ్యండి. “ అని.  ప్రజ్వల్ అదే ఊళ్ళో ఉన్న పెద్దమ్మ కొడుకుకి ఫోన్ చేసి కాస్త నాన్నకి సహాయ పడమన్నాడు.  ఆ అబ్బాయి అంతా చూసుకోవడంతో పెద్దగా ఇబ్బంది పడకుండానే అంతా సజావుగా అయిపోయి ఇంటికొచ్చి పడ్డారు. పద్మజకు నీరసంగా ఉండడంతో వాళ్ళ అక్కయ్య కొన్ని రోజుల పాటు ఉండి వండి పెట్టింది. కాని ఇలా ఎన్నాళ్ళు అనే ప్రశ్న బయలు దేరింది. ప్రజ్వల్ కు చెప్పగా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు ఫోన్ చేసి సంప్రదించి, వాళ్ల నుండి ఒక అమ్మాయి వీళ్ళతో పాటు ఉండే ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయి వచ్చాక పద్మజ అక్క వెళ్ళిపోయింది.

 ఆ అమ్మాయి ఒక ముప్ఫై ముప్ఫై రెండేళ్ళ మధ్యలో ఉంది. పేరు కల్యాణి అంది. తనకొక ఆరేళ్ళ కూతురుందని ఊళ్ళో తన తల్లి దగ్గర పెరుగతోందని చెప్పింది.  కూతురిని కన్నదని భర్త ఆమెను వదలేశాడట. అప్పడ్నుండి ఒంటరిగా ఈ సంస్థలో పనిచేస్తూ జీవితం నెట్టుకొస్తూంది. నెలకి పన్నెండు వేలిస్తారని చెప్పింది. తన భోజనం, వసతి ఇలా చూసుకునేవాళ్ల ఇళ్ళలోనే గడచిపోవడం వలన నెలకు ఎనిమిది వేలదాకా కూతురికోసం పంపుతోందని చెప్పింది. పద్మజ కూడా ఆ అమ్మాయిని బాగా చూసుకోసాగింది. ఇలా ఒక రెణ్ణెల్లు గడచిపోయాయి. కల్యాణి తన కూతుర్ని చూసి  రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు. ఒక పదిహేను రోజులు కష్టపడి ఎలాగో పనులన్నీచేసుకున్నాక పద్మజకు మళ్ళీ అలసట అనిపించసాగింది. ఈసారి ఆస్పత్రికి చెకప్ కు వెళ్ళి చూపిస్తే ఇంకో వాల్వ్  బ్లాక్ పెరిగిందనీ, మళ్ళీ దానికి కూడా స్టెంట్ వెయ్యాలని అన్నారు. మళ్ళీ అదే కథే రిపీట్ అయ్యింది. కానీ ఈ సారి పద్మజ అక్క రావడం కాస్త ఆలస్యం అయ్యేలా కనిపించేసరికి ప్రవీణే ఆ సంస్థకు ఫోన్ చేశాడు. వాళ్ళు మరో అమ్మాయిని పంపారు. ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు. ఎవ్వరూ లేరు. ఇరవై అయిదేళ్ళ వయసు. అంతా తెలుసుకున్నాక పద్మజకు ఈ అమ్మాయయితే ఎక్కడికీ వెళ్ళదులే అనిపించింది. కానీ ఆ అమ్మాయి పనుల్లో నిర్లక్షం, ఎంతసేపూ టివి చూడడం లేదా మొబైల్ పెట్టుకుని విడియోలు చూడడం నచ్చలేదు. వంట కూడా శ్రద్ధగా చేసేది కాదు. పెద్ద వయసువాళ్ళగా వంటలు తమకెలా ఉండాలో చెప్పినా పట్టించుకోకుండా తనకిష్టమొచ్చినట్టుగా చేసేసరికి ఇద్దరికీ కడుపులు చెడ్డాయి. దాంతో ఆ సంస్థకు ఫోన్ చేసి ఆ అమ్మాయిని పంపించేశారు. తీరా ఆ అమ్మాయి వెళ్ళిపోయాక చూసుకుంటే కొన్ని వస్తువులు కనబడలేదు.  సంస్థకు ఫోన్ చేస్తే ఆ అమ్మాయి వచ్చి చేరలేదు, వచ్చినాక ఎంక్వైరి చేస్తామని అన్నారు. మరో అమ్మాయిని పంపమంటారా అని అడిగితే పద్మజ ఇప్పడప్పుడే వద్దంది. ఈ అమ్మాయిలిద్దరూ వచ్చి వెళ్ళాక తమ ఇంట్లో తామే అతిథులై పోయినట్టనిపించింది ఇద్దరికీ. వాళ్ళు వేళకింత వండి పెట్టడం, పనులు చెయ్యడం చేసినా ఇంట్లోనే ఉండిపోవడంతో మాట్లాడుకోవడానికి లేకుండా పోయింది. పిల్లల గురించి చెప్పుకోవడానికి లేకుండా పోయింది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేక పోయేవారు. దాంతో మనసులో ఏదో వెలితిగా అనిపించసాగింది. ఈ పద్ధతి ఎందుకో నచ్చలేదు ఇద్దరికీ. 

ప్రజ్వల్ ఫోన్ చేసినప్పుడు ఈ మాట పద్మజ చెప్పింది.  కొడుకు తమ మనసును అర్థం చేసుకుని వచ్చేస్తానంటాడేమోనని ఆశపడింది. కానీ ప్రజ్వల్ “ అమ్మా! ఏదో ఒక ఏర్పాటు చేసి మిమ్మల్ని చూసుకునేటట్టు చేస్తే దాంట్లో వంకలు పెడతారేమిటి ? ఇక ఒకటే మిగిలిందమ్మా ! మీరిద్దరూ ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేరిపొండి. అక్కడ అన్నీవాళ్ళే చూసుకుంటారు. వేళకి వండిపెడతారు. మీ వయసువాళ్ళు స్నేహితులవుతారు. మీకు ఒంటరితనం అనిపించదు. మేము ఇండియా రావడం ఇప్పుడప్పుడే కుదరదు. ఉంటానమ్మా ! మీటింగుంది. దేనికీ నాన్నను కనుక్కుని నాకు చెప్పు. నేను ఇక్కడ్నుంచి ఆన్ లైన్ లో మంచి రేటింగ్ ఉన్న వృద్ధాశ్రమాన్ని చూసి మిమ్మల్ని చేర్చే ప్రయత్నం చేస్తాను. డబ్బు గురించి బాధపడద్దు. నేను చూసుకుంటాను. “ అని ఫోన్ పెట్టేశాడు. ప్రవీణ్ కు ఈ విషయం చెప్పి ఏం చేద్దాం అంది. ప్రవీణ్ వాళ్ళనీ వీళ్ళనీ కనుక్కుంటాను అన్నాడు. పద్మజ ఉండబట్టలేక ప్రణీత ఫోన్ చేసినప్పుడు ప్రజ్వల్ అన్నమాట చెప్పింది. ఆ అమ్మాయి కూడా తన అన్న చెప్పినట్టుగానే చెప్పింది. ఇంకో విషయం కూడా అంది. “ అమ్మా! చాల మట్టుకు వృద్ధాశ్రమంలొ మిమ్మల్ని చేర్చుకోకపోవచ్చు. ఎందుకంటే మీకు ఆస్తులున్నాయి. పెన్షన్ వస్తుంది. అలాంటి ఆశ్రమాలు ఏ దిక్కూ లేని వృద్ధులను చేర్చుకుంటాయి. ఏదైనా నాన్న కనుక్కుంటాను అన్నారుగా. చూడండి. “ అని గోడమీది పిల్లి వాటంగా చెప్పింది. తనేమైనా అన్నయ్యకు చెప్పి ఒప్పిస్తుందేమో లేదా కొన్ని నెలల పాటు తను వస్తానంటుందేమో అన్నఆశ అడుగంటింది వీరిద్దరికి.  ప్రవీణ్ వృద్ధాశ్రమంలోని వివరాలను సేకరించినా ఇద్దరికీ ఎందుకో అక్కడికి వెళ్ళి ఉండడానికి మనసొప్పలేదు. అలాగని చేసుకోను చేతకావడం లేదు. 

అంతలో కరోనా వైరస్ వలన దేశమంతా లాక్ డౌన్ ప్రారంభమవడంతో పనిమనిషి మానేసింది. పనంతా ఒక్కతే చేసుకోవాలని పద్మజ మథన పడసాగింది. ప్రవీణ్ తాను కూడా సాయపడసాగాడు. ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ రోజులు వెళ్ళదీస్తున్నారు. పిల్లలు రాకుండా ఉండడానికి ఈ లాక్ డౌన్ సమయంలొ అన్ని రవాణాలు ఆగిపోయింది ఒక మంచి సాకుగా మారింది. ఇద్దరూ రోజూ ఫోన్ చేసి కుశలం కనుక్కునేవారు. ఏదో సర్ది చెప్పడం అలవాటయిపోయింది ఇద్దరికీ. 

అంతలో ఒక రోజు ప్రవీణ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. అతి కష్టం మీద మంచం పైకి చేర్చింది పద్మజ. డాక్టర్ దగ్గరికి తనొక్కతే తీసుకుని వెళ్ళలేదు. రవాణా సౌకర్యం లేదు. అక్క కొడుకుకు ఫోన్ చేస్తే వాడు వచ్చినా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఆటో కానీ, ట్యాక్సీ కానీ లేవు. అందుకే వాడు కూడా రానన్నాడు. కాలనీలోని డాక్టర్ ను పక్కింటాయన నడుచుకుని వెళ్ళి తీసుకొచ్చాడు. డాక్టర్ చెకప్ చేసి ’షుగర్ తగ్గింది మరేం ఫర్వాలేదు. కొద్దిగా చక్కెర నీళ్ళు త్రాగించమని ’ సలహా ఇస్తూ, “ మీరిద్దరూ వయసైనవారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ” అన్నాడు. అలా ఆయన అన్నట్టుగానే మరుసటి రోజు అదే కాలనీలో వీళ్ల ఇంటినుండి మూడిళ్ళవతల ఉన్న అపార్ట్ మెంటులో ఒకాయనకు వ్యాధి లక్షణాలు కనిపించాయి. లాక్ డౌన్ కు ముందే ఆయన ఎక్కడికో బయట ఊరికి వెళ్ళి వచ్చాడట. వచ్చేటప్పుడు కరోనాను వెంటపెట్టుకుని వచ్చాడనిపించింది. వీళ్ళ కాలనీని సీల్ చేశారు. అందరినీ టెస్ట్ చేయాలి అని అంబులెన్స్ లో తీసుకెళ్ళి చేయిస్తున్నారు. ప్రవీణ్,పద్మజలను కూడా అంబులెన్స్ లో తీసుకెళ్ళేటప్పుడు ప్రవీణ్ మనసులో వచ్చిన ఆలోచన ఇది.
**** 

ప్రవీణ్ ఆలోచించసాగాడు. “ ఎలాగూ వీళ్ళిద్దరూ ఇప్పుడు రాలేరు. ఇంకా ఎన్నాళ్లు ఇలా లాక్డౌన్ ఉంటుందో తెలీదు. ఉన్నంత వరకూ ఇతర దేశాలవాళ్లు ఇండియాకు రాలేరు. అంటే తామిద్దరికీ ఏం జరిగినా తామిద్దరే కష్టపడాలి. ఇద్దరికీ చేతకావడం లేదు. మరి దీనికి పరిష్కారం ఏమిటి ? ఎలా ఈ పరిస్థితినుండి గట్టెక్కాలి ? వెళ్ళి టెస్ట్ లో తమిద్దరికీ నెగటివ్ వచ్చినా తమ కాలనీని పధ్నాలుగు రోజులు సీల్ చేసి ఉంచుతారు. ఎక్కడికీ వెళ్ళలేరు. ఎవరూ లోపలికి రాకూడదు. అక్కడ బయట కూర్చున్నవలంటీర్లు తెచ్చిచ్చిన వాటితో కాలం గడపాలి. ఇలాంటి సమయంలో జీవితం గడపడం ఎలా ? అందుకే కరోనా టెస్ట్ పాజిటివ్ అని వస్తే తమ ఇద్దరినీ ప్రభుత్వం వాళ్ళే చూసుకుంటారు. ఇద్దరూ ఆస్పత్రిలోనే ఉండొచ్చు. ఒకవేళ వ్యాధి ప్రబలి పోతే కూడా తమ వాళ్ళకు కూడా అప్పగించకుండా తమను కాల్చే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం వాళ్ళే చేస్తారు. అదే మంచిది కదా ! అంతా అయిపోయినాక పిల్లలు ఒక్క ఏడుపు ఏడ్చి ఊరుకుంటారు. తరువాత చెయ్యల్సినవి చేసుకుంటారు. ఏమి చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అన్నది తమకు సంబంధించని విషయం. ఎందుకంటే తాము ఎలాగూ ఉండరు కాబట్టి. ఇదేదో కొత్త వైరాగ్యం లాగుంది. కరోనా వైరాగ్యం “ అనుకుని విరక్తిగా నవ్వుకున్నాడు.

అంబులెన్స్ వీరిద్దరినీ ఆస్పత్రికి తీసుకుని సాగిపోతూ ఉంది. 

 ***

No comments:

Post a Comment

Pages