మానసవీణ - 7 - అచ్చంగా తెలుగు
మానసవీణ - 7
విజయ మాధవి గొల్లపూడి



(జరిగిన కథ: ఎవరూ లేని మానస చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. సేవాభావానికి మారుపేరులా ఉండే మానస అంటే అందరికీ ఇష్టమే. ఒక బహుమతి ప్రదానోత్సవ సభలో మానసను చూసిన మంత్రి కృషీవలరావు, ఆ పాపలో తనకు తెలిసిన శ్రావణి అనే ఆవిడ పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. పదవ తరగతి మంచి మార్కులతో పాసయ్యి ప్రభుత్వ కాలేజీ లో చేరిన మానస అక్కడి విద్యార్ధులను కూడగట్టుకుని, పరిస్థితులు మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.)

ఎలక్షన్ల నోటిఫికేషన్ తో పాటు ఎన్నికల తేది కుడా ఖరారు అయ్యింది.. మానస అడుగుపెట్టిన వేళా విశేషమో ఏమో, ఇపుడు ఆ కళాశాల చదువుని భోదించే ఒక విద్యాలయంలాగా, యువత భవిష్యత్తుని నిర్ణయించే మందిరంలా ఉంది. గతానికి, వర్తమానానికి, భవిష్యత్కాలానికి ఏకైక సాక్షులు ఆ కాలేజ్ ఆవరణంలోని ఆ వటవృక్షాలు. గతంలో జరిగిన ఘోరకృత్యాలు, 
ర్యాగింగ్ పేరిట అవమానాలు, యాసిడ్ దాడులు ఇలా అన్నింటినీమౌనంగా భరించిన ఆ మర్రిచెట్లు మహా ఐతే గాలిదుమారంతో మాత్రమే నిరసన వ్యక్తం చేయగలిగేవి. అన్నింటికీ అతీతమైన ఆ వటవృక్షాలు ఆహ్లాదకరమైనగాలితో ఇపుడు వీవనలా వీస్తున్నాయి. 
ఎప్పుడూ ఆ మర్రిచెట్టు ఊడలక్రింద వచ్చి, పోయే అమ్మాయిలను చూస్తూ కామెంట్లు కొట్టే అల్లరి కుర్రకారు ఈ రోజు సీరియస్ గా కళాశాలలో మానస తీసుకొచ్చిన మార్పులను గురించి మాట్లాడుకుంటున్నారు. కాలేజ్ పేరు ప్రఖ్యాతులు, యువత భవిష్యత్వం మంచైనా, చెడైనా నిర్ణయించడంలోఇపుడు జరగబోయే ఎన్నికలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని నమ్ముతున్నారు అంతా. మన బంగారు భవితవ్యాన్నితీర్చిదిద్దుకోవటనికి ఇదొక చక్కటి అవకాశం.ఈ రౌడీ రాజేష్ పీడ వదిలించుకోవటానికి ఇదొక సదవకాశం. మానసను ప్రెసిడెండ్ గా ఎన్నుకోవాలని సగానికి పైగా విద్యార్ధులంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.
మరొక వైపు రాజేష్ అవమానభారంతో కృంగిపోతున్నాడు. ‘ఇన్నాళ్ళు తన ఆగడాలకు ఎదురు చెప్పే వారేలేరు’ అని భావించిన రాజేష్ మానస రాక తన ఆధిపత్యానికి ఒక ఆటంకం తెచ్చి పెట్టింది. నిన్న కాక మొన్న వచ్చిన మానస తన విశృంఖలమైన చేష్టలకు ఆనకట్టవేసే అపర కాళికాదేవిలా కనిపించింది. తనకున్న పగ్గాలు చేజారిపోకుండా ఏదో ఒకటి చేయాలి. తన తొట్టి గ్యాంగ్ తో కలిసి మానసని అవమానించి కాలేజీ నుంచి వెళ్ళగొట్టాలని పథకం వేస్తున్నాడు. ప్రెసిడెంట్ గా తన నామినేషన్ కి ముమ్మరంగా ఏర్పాట్లు కుడా చేసుకుంటున్నాడు. 
నాయకత్వ లక్షణాలు, తన జీవితంతో పాటు చుట్టూ ఉన్న వారిని కూడా బాగుచేయలి అని ఏ కొద్దిమందికో చింతన ఉంటుంది. మానస కూడా ఆకోవకి చెందిందే అని చెప్పవచ్చు. ఆమె మనో సంకల్పానికి, అనుకున్న పనులు నెరవేరడానికి మరింత నమ్మకాన్నిపెంచేది తను నమ్మే లలితాదేవి. ప్రతి శుక్రవారం విధిగా ఎంబ్రమన్నర్ కోవెలకి వెళ్ళి లలితా సహస్రనామాలని మనసులో ధ్యానించుకుని వస్తుంది. ఏమీ లేనివారికి భగవంతుడే దిక్కుఅన్నట్లుగా తను చిన్నతనం నుంచి తల్లికిదూరమైనా, అనాధశరణాలయంలో వార్డెన్ల ద్వారా అలవరచుకున్న సుగుణాలలో లలితోపాసన కూడా అమెకున్నశక్తి. 
జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నోమంచి గుణాలు అబ్బుతాయి, కాని వాటిని ఒకదశలో వదిలిపెట్టేస్తారు. వాటిస్థానంలో చెడు అలవాట్లు వచ్చిచేరితే మాత్రం పెంచి పోషిస్తారు. అదే పెద్ద ధౌర్భాగ్యం జీవితం అధోగతిపాలు కావటానికి. ఇంతవరకు మానసని వేలమందిలోకూడా ఒక ప్రత్యేకవ్యక్తిగా నిలబెడుతున్నవి ఆమెలో నిండి ఉన్నఈ సగుణాలే. ఆమెచేసే పనిలో, మాటలో భూతద్దం పెట్టి వెతికినా చెడుగాని, తప్పుగాని దొరకవు అని చెప్పటం అతిశయోక్తి కాదు.
మానస గుడి ప్రాగణంలోకి అడుగిడగానే మంటపం దగ్గిర మైక్ లోంచి శ్లోకాలు రాగయుక్తంగా వినిపిస్తున్నా, వేదాలలోని సారాన్నిమానవాళికి అర్ధమయ్యేరీతిలొ వివరించడానికి భగవంతుడు పంపిన ఒక వరం బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వరరావు గారు అక్కడ ఉన్నారు. తనకు కలిగిన అదృష్టానికి పొంగిపోయింది మానస. ఆయనచెప్పే విషయాలను వింటూ, ఆ సరస్వతిపుత్రుని వాక్ప్రవాహానికి మనసులోనే ప్రణామాలు చేసుకుంది. సరిగ్గా ఆమె మనసులో తను ఉన్న పరిస్థితి గుర్తుకువచ్చింది. కాలేజి భవిష్యత్ యువతరానికి కావలసిన సందేశం.
స్ఫూర్తి ఈమహనుభావుని ద్వారా అందించాలి. ఎన్నోజీవితాలలో ఒక ఆరోగ్యకరమైన మార్పు ఇలాంటి సజ్జనుల సాంగత్యం వల్లనే కలుగుతుంది. జీవితం అంతా అయిపోయాక అరవైలో తెలుసుకోవాల్సిన విషయాలుకావు, ఇరవైలోనే నేర్చుకుని జీవితాన్ని తిరగరాసుకునే ధైర్యం ఆయన మాటల్లో దాగుంది. ఆయన దగ్గిరకు వెళ్ళి, తన సహ విద్యార్థులకు భగవద్గీతలోని కర్మసారాన్ని వివరించే ఆవశ్యకతను ఆయనకు చెప్పింది. ‘బాగుంది. మీ కళాశాల యాజమాన్యంతో మాట్లాడి నీకు కలిగిన ఆలోచనను కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేయవచ్చు. నిస్వార్ధంగా అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నావు. నీకు మంచి భవిష్యత్ ఉంది’ అని కోటేశ్వరరావు గారు ఆశీర్వదించారు.
ఈ సమాచారాన్ని ప్రిన్స్ పల్ కి తెలియచేసి అనుమతి పొందింది. ఎన్నో వేలకి వేలు పోసి వ్యక్తిత్వ వికాస శిక్షణ కేంద్రాలలో చేరతారు. వారు చెప్పేది కూడా భగవత్గీతలోని కర్మ సిద్ధాంతాన్నే. ఆమె వివరణ నచ్చటంతో మిగతా విద్యార్థులాంతా ఆనందంగా అంగీకరించారు ప్రవచన తరగతులకు హాజరుకావడానికి.
ఇంకో వైపు రాజేష్ పగడ్బంది గా మానసను అవమానించటనికి రంగం సిద్ధం చేసుకుని, ఆలస్యంగా కాలేజ్ కి వచ్చాడు. కాని అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యాడు. తను ఊహించుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. తన నామినేషన్ల హడావుడి లో పడి ,రౌడీ గ్యాంగ్ తో వ్యూహం పన్నుతూ వచ్చాడు. స్టేజ్ దగ్గర ప్రిన్సిపాల్, మిగతా టీచర్స్, మానస, కోటేశ్వరరావుగారికి ఆసనం సిద్ధం చేసి, వారిని ఆహ్వానించారు వేదిక మీదకు. అసలు విద్యార్థిదశలో పూలబాట కావలసిన ప్రదేశంలో యెందుకు హీనమైన చర్యలు జరుగుతున్నాయి. ప్రేమ, ఆకర్షణ, వివాహ విలువలు, కట్టుబాట్లు తేడా ఎంతో చక్కగా వివరించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేప్పే విషయాలు వారి మనసులను సూటిగా తాకుతున్నాయి. మానవతా విలువలు, సమాజంలో స్త్రీకి ఇచ్చే గౌరవమర్యాదలు, కుటుంబంలో వరసలు, బాంధవ్యాలు, చదువుకున్న మనిషికి, చదువులేని మృగానికి ఉన్నతేడా, ధర్మాధర్మాలు ఇలా అన్నీ ఆయన విడమర్చి చెబుతుంటే ఆవాగ్ధారను మొత్తం అందరూ శ్రద్ధగా ఆలకిస్తూంటే, రాజేష్ పరిస్థితి చెప్పనక్కరలేదు. కొరడాతో ఛెళ్ళున కొట్టినట్లు సూటిగా తాకుతున్నాయి. కోటేశ్వరరావుగారు చెప్పే ప్రతిమాటా. కళ్ళవెంట నీళ్ళు తెప్పించాయి. ఈరోజు చాలా ఘొరమైన అపరాధం జరిగి ఉండేది కోటెశ్వరరావుగారు లేకుంటే. మానస ముఖంమీద కౄరంగా యాసిడ్ దాడి చేయాలని దుష్ట ఆలోచనతో వచ్చాడు. కాని ఆ పుణ్య పురుషుడు అడుగుపెట్టిన వేళా విశేషమో, లేక సాక్షాత్ ఆ శక్తి స్వరూపిణి ఈయన రూపంలో వచ్చి మాయాంధకారంతో నిండిన ఇతని మస్తిష్కంలో వెలుగు నింపిందోగాని ఎలాంటి వికృత చర్య అక్కడ జరగలేదు.
ఆనాటి సభ ముగిసింది .రాజేష్ మనసు ఇప్పుడు పశ్చాత్తాపంతో దహించుకుపోతోంది. మానసకి శతకోటి ధన్యవాదాలు మనసులోనే అర్పించుకున్నాడు.
మర్నాడు కాలేజ్ లో నామినేషన్ల హడావిడి మొదలైంది. అందరూ మానసపేరునే ఏకగ్రీవంగా ప్రతిపాదించారు.
సరిగ్గా అప్పుడే రాజేష్ అక్కడకు వచ్చాడు. తను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నాను అనిచెపుతూ, నామద్దతు కూడా పూర్తిగా మానసకేనని ప్రకటించాడు. అందరూ హర్షధ్వానాలతో, చప్పట్లతో అక్కడ వాతావరణం ఆనందంతో నిండిపోయింది. మానస మాత్రం అంగీకరించలేదు. ‘నేను నావంతు సలహాలను తప్పకుండా అందిస్తాను. నేను స్వచ్ఛందంగా నిర్వహించే ఎన్నో పనులు చేస్తాను.. పదవిని ఆశించి మాత్రం కాదు’ అన్నాడు రాజేష.
‘సమాజంలో సాటిమనిషిగా నాకర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. మనలో ఇంకా ఉత్సాహవంతులైనవారు ఉన్నారు వారిని ఎన్నుకుందాం. వారు ప్రభుత్వం నుంచి అందుతున్న వనరులను సద్వినియోగపరచండి’ అని మానస చెప్పే సరికి మరొకసారి అందరు మానసను ప్రశంశల వర్షంతో ముంచెత్తారు. సమాజంలో మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా కొద్దిపాటి తెగువ, చొరవ చూపే వారి వల్లే అది సాధ్యమౌతుంది. ఇక మంచా, చెడా అన్నది ఆవ్యక్తి పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న సమాజం మీద ఆధారపడి ఉంటుంది.
కళాశాలలో ఎన్నికలు లేకుండా ఇంత సామరస్యంగా పరిష్కారం ఐనందుకు ప్రతిఒక్కరు ఆనంద ఆశ్చర్యాలు ప్రకటించారు. ఇప్పుడు ఆకాలేజ్లో అమ్మాయిలు, అబ్బాయిలు, సీనియర్స్, జూనియర్స్ అనే భేధాలులెవు. అందరి లక్ష్యం ఒక్కటే. ఎంచుకున్నమార్గంలో విజయం సాధించాలి. ఆ కళాశాల పేరు నిలబెట్టాలి. 
మానస క్లాస్ అయి వెళ్ళబోతుంటే ప్యూన్ వచ్చి ‘అమ్మా ఎవరో కృషివలరావుగారంట, బయటకారులో మీకోసం వెయిట్ చేస్తున్నారు .మీకు ఈకాగితం ఇమ్మన్నారు’ అంటూవెళ్ళిపోయాడు.

No comments:

Post a Comment

Pages