నెత్తుటి పువ్వు -19 - అచ్చంగా తెలుగు
నెత్తుటి పువ్వు - 19
మహీధర శేషారత్నం(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. కడుపుతో ఉన్న పార్వతికి సాయంగా బయలుదేరుతుంది సరోజ. ) 
“ఇదుగో! నేను అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళి వదిన కోలుకునేదాకా నాలుగు రోజులుండొస్తా! ఊఁ! వెళ్ళనా?“అంది ఆటో ఎక్కి కూర్చున్నాక శంకరం ఆనందంగా” నాలుగు రోజు లుండి వస్తుందిలేరా!” అన్నాడు. నాగరాజు తల ఊపాడు. ఆటో కదిలింది. పక్కనే శంకరం లూనా కూడా. ఇలా సరోజ తనకంటూ ఒక ఆత్మీయ కుటుంబాన్ని సంపాదించుకుంది. నాలుగు రోజులన్నది పదిహేను రోజులు ఉంది. శంకరం ఉత్సాహంగా సరోజ గురించి మంచిగా చెబుతూనే ఉన్నాడు. సరోజ లేదని తెల్సినా నాగరాజు రెండుసార్లు సరోజ గది దగ్గరకు వెళ్ళి చూసొచ్చాడు. ఏదో అసంతృప్తి ఆవరించిందతనికి. అమ్మాయి ఏదో ఒకచోట క్షేమంగా ఉందని తెలిసికూడా నాకెందుకీ ఆరాటం? అని తనని తనే మందలించుకున్నాడు. చివరకు ఒకరోజు శంకరం సరోజను తన గదిలో వదిలిపెట్టేడు. పార్వతి పంపేటప్పుడు చీర, జాకెట్టూ పెట్టి మరీ పంపింది. ఆరోజు స్టేషనులో శంకరం చెప్పేడు. “థాంక్స్రా! సరోజని రూమ్లో దిగబెట్టాను. మా ఇంటికి దగ్గరగా ఏదైనా గది చవకగా దొరికితే మార్చేద్దాం” అని కూడా అన్నాడు.
నాగరాజు నవ్వుతూ “సాయం చేయడానికి కూడా హద్దు ఉండాలి. ఆడపిల్లలకి అసలు చేయకూడదు” అన్నాడు.
“ఊఁ! దెబ్బకొడితే కొట్టావు గాని మంచి అమ్మాయిరా పాపం!”
లక్ష్మి ఇంకా అన్నగారింటి నుంచి రాలేదు. చేసేదేముందిలే ఒకసారి చూసొద్దామనుకుంటూ సరోజ రూమ్! వెళ్ళాడు. పదిహేను రోజులు లేకపోయేసరికి గదంతా మట్టికొట్టుకుపోయింది. అంతా చిమ్మి తడిగుడ్డపెట్టి బట్టలు ఉతుక్కుని శుభ్రంగా స్నానం చేసి కూర్చుంది.
నాగరాజుని చూస్తూనే “ఏమయిపోయావు? అన్నయ్య వాళ్ళింటికి రావచ్చుగా ఒకసారి” అంది నిష్టూరంగా.
నాగరాజు కొత్తగా చూస్తున్నట్టు సరోజనే చూస్తున్నాడు మాట్లాడకుండా. సరోజ నెమ్మదిగా వచ్చి నాగరాజుని అనుకుని నిలబడింది. నాగరాజు చేతులు అప్రయత్నంగా ఆమెను చుట్టేసాయి. “నీకు నేను అలవాటుపడిపోయాను. నిన్ను చూడకపోతే తోచలేదు” చిన్నగా అంది అతని నడుము చుట్టూ చేతులేస్తూ.
అతను ఏం మాట్లాడకుండా అలాగే నుంచున్నాడు. ఆమె మెల్లిగా అయినా గట్టిగా అతన్ని హత్తుకుపోయింది. నాగరాజు తన వశంలో తాను లేకపోయాడు.
అతన్ని లొంగ తీసుకోవడం తేలిక కాలేదు కాని అనుకున్నంత కష్టం కూడా కాలేదు. భావుకుడైన అతను వెన్నముద్దలా కరిగిపోయేడు. ఆమెను హత్తుకుని తలమీద ముద్దు పెట్టుకున్నాడు. .
“నీకు అన్యాయం చేసానా?” అన్నాడు గొణుక్కున్నట్లుగా. ఆమె మునికాళ్ళెత్తి అతని నుదుటిపై ముద్దు పెట్టింది అదే తన జవాబన్నట్టు.
అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆమెకేదో మేలు చేయాలని తీసుకొచ్చి తనే అన్యాయం చేసినట్టు ఫీలయ్యేడు. తప్పు చేసాను అని పదే పదే అనుకున్నాడు.
“సారీ! నీ జీవితాన్ని పాడుచేసాను.” తలవంచుకున్నాడు. తలొంచు కోవాల్సినంత తప్పు నువ్వేం చేయలేదులే. నేను వద్దంటే నువ్వా తప్పు చేయగలిగేవాడివి కావు.”
అతని భుజంపై తలవాల్చింది.
“అవునన్న కాదన్నా తప్పుతప్పే” గిల్టీ ఫీలింగ్ వదలలే దతనిని.
“పోలీసోడికి మదమేకాని మనసుండదనుకున్నాను.” చెవిలో గుసగుసలాడింది.
అతను మతిపోయినట్టుగా మంచంమీద అడ్డంగా పడుకున్నాడు. “నాకో కొడుకు కావాలి - వాడునీ లాంటివాడే కావాలి. అందుకే నేనే..... కిసుక్కున నవ్వింది.
కోపంగా తలెత్తి చూసాడతను.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages