పీరప్ప ఇనాకమయ్య మండపం - అచ్చంగా తెలుగు

పీరప్ప ఇనాకమయ్య మండపం

Share This
పీరప్ప ఇనాకమయ్య మండపం
అఖిలాశ, 7259511956    



ఏరా నజీర్ ఏమైంది అట్టుండావు? ఇస్కూల్ లో ఎవరైన కొట్టినారా? టీచరు ఏమైనా అనిందా? ఎందుకట్లా ముఖం దిగేసుకొని ఉండావని తల్లి పక్కిరమ్మ కొడుకును అడిగింది.   

 నజీర్ తల గోక్కుంటూ అమ్మి పక్క ఈదిలో లాగా మనం కూడా మండపం పెడదామా అన్నాడు.

 మండపం ఏందిరా! మనం అలాంటివి చేయకూడదు కావాలంటే అక్కడ కొంచేపు ఆడుకొని రాపో అన్నది పక్కిరమ్మ.

***
ఇనాకమయ్య మండపం దగ్గరకి నన్ను రానిడంలే, ఆడ.., పిల్లోలందరికి ఆటల పోటీలు కూడా పెట్టినారు. నేనూ ఆడుతానని నా పేరు తీసుకోమంటే నువ్వు తురుకోనివి మీ నాయనకు తెలిచ్చే మమ్మల్ని నానా మాటలు అంటాడు. పోరా నాయన పో.., ఇక్కడి నుండి వెళ్లిపో అన్నారు.


రాజుగాడు, సురేష్ గాడు, వెంకన్న ఆటల పోటీలో గెలిచినందుకు బాక్సులు, కప్పులు, బ్యాట్లు ఇంకా చాలా ఆడుకునే బొమ్మలు ఇచ్చండారు. నన్ను మాత్రం రానీడం లేదు అమ్మి. అందుకే మనం కూడా ఒక మండపం కట్టి అందులో ఇనాకమయ్యను పెడదాము. వాళ్ల లాగా కాకుండా అందరికి పోటీలు పెడదామని కళ్ళు రుద్దుకుంటూ గబా గబా తన మనసులో ఉన్నది చెప్పాడు నజీర్.

***

పక్కిరమ్మకు ఇషయం మొత్తం అర్థమయ్యింది. నజీర్ ని తీసుకొని పక్క ఈదిలో ఉన్న బలిజ సంఘం వారి ఇనాకమయ్య మండపం దగ్గరికి పొయ్యి ఏంటయ్యా? నా కొడుకును పోటీల్లో తీసుకోవడం లేదంటా, తురుకోల్లు ఇనాకమయ్య దగ్గరికి రాకూడదని ఎవరన్నారు? ఏం మీరు మా పీర్ల పండగకు రాడం లేదా సదింపులు ఇయ్యడం లేదా? అయినా పిల్లోన్ని పట్టుకోని తురుకోనివి కాబట్టి వెల్లిపో అంటారా? అని గట్టిగా నిలదీసింది.

 సాల్ సాలెమ్మ బాగానే మాట్లాడతాండావు నువ్వేమో ఇట్టంటావు, నీ మొగుడేమో మేము ఇనాకమయ్య పండగ పేరు చెప్పి రాత్రంతా పాటలు పెడతాండమని  పోలిసోల్లకు చెప్పి పాటలు పెట్టకుండా చేసినాడు. నీ మొగునికి మేమంటే కోపం అందుకే అలా చేసినాడు. అందుకే మీ పిల్లగాన్ని మేము పోటీల్లో తీసుకోలే.

 నీకు, నీ మొగునికి ఒక దండం. ఈడ గొడవ చెయ్యకుండా వెళ్ళు తల్లి పండగను మనశ్శాంతిగా చేసుకోనీయండని గదురుకున్నాడు. చేసేది లేక పక్కిరమ్మ నజీర్ ని తీసుకొని ఇంటికి వచ్చేసింది. వచ్చిన వెంటనే పీరప్పకు జరిగిన ఇషయం మొత్తం చెప్పింది.

***
మరుసటి రోజు తెల్లవారగానే పీరప్ప లేచి ఇంటి ముందు ఒక చిన్న మండపం కట్టాడు. మట్టితో చేయించిన ఇనాకమయ్యను మండపంలో పెట్టి బాపనయ్యతో పూజ కూడా చేయించాడు.

 ఒరే నజీర్ నీ ఇస్కూల్ దోస్తులందరిని పిలుచుకురా రేపు కప్పలాట, పరుగు పందెం, కుర్చీలాట పెడదాము. గెలిచినోల్లకి బొమ్మలు ఇచ్చామని చెప్పు అన్నాడు తండ్రి పీరప్ప.

 చెప్పినట్టే పోటీలు పెట్టి నజీర్ చేతుల మీదగానే గెలిచినోల్లకి బొమ్మలు ఇప్పించాడు పీరప్ప. నజీర్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది.

 ఇదంతా అర్థం కాని పక్కిరమ్మ నా మొగుడేంది ఇనాకమయ్య మండపం పెట్టడం ఏంది? అనుకుంటూ ఉండగానే పక్క ఈది బలిజ సంఘం వాళ్ళు వచ్చినారు.

***
ఏంటి పీరప్ప? నువ్వేనా మండపం పెట్టింది. మేము పాటలు పెట్టామని పోలీసోల్లోకి చెప్పినావు కదా మళ్లా ఇదేందని అడిగారు.

 చూడన్న.., రాత్రి పది దాటిన తర్వాత పాటలు పెట్టకూడదు, అది కూడా దేవుని పాటలు పెట్టుకోవాలి కానీ సినిమా పాటలు ఎందిన్న ఇంట్లో చిన్న పిలోల్లు, ముసలోళ్లు ఉంటారు వాళ్లకి ఇబ్బంది అవుతుందని అలా చేసినాను. నేనేమి మీకు వ్యతిరేకిని కాదు భక్తి అనేది కేకలు వేసి, గట్టిగా అరిచి, ఆడంబరంగా ఉండకూడదు అన్న మనసులో ఉంటే సరిపోతుంది.

 మన కులాలు, మతాలు వేరే కావచ్చు కాని మనమంతా ఒక ఈది వాళ్లము, ఒక ఊరు వాళ్లము అంతకు మించి ఒకే దేశం వాళ్లము. మనం అన్నదమ్ములము నాకెందుకు మీ మీద కోపం ఉంటుంది చెప్పు.., అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పెట్లు కొట్టినారు.

బాగా చెప్పినావు పీరప్ప తప్పైపోయింది. నువ్వు చెప్పింది నిజమే ఇప్పటి నుండి నీవు చెప్పినట్టే చేద్దాము అన్నారు బలిజ సంఘం వాళ్ళు.

 పక్కిరప్ప మండపంలో ఉన్న ఇనాకమయ్యను తీసుకుపోయి బలిజ సంఘం వారి మండపంలో పెట్టినారు.

 గమనిక : ఒక వీధిలో ఒక గణపతి మండపం ఉండాలి. మనమంతా ఒక్కటై పండగ చేసుకోవాలి కాని సమూహాలుగా విడిపోయి కాదు. 

***


No comments:

Post a Comment

Pages