శివానందలహరి - 21 - 40 - అచ్చంగా తెలుగు
శివానందలహరి - 21 - 40  
మంత్రాల పూర్ణచంద్రరావు 


శ్లో: 21.  ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితామ్

స్మరారే! మచ్చేత- స్స్పుటపటకుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ ! శక్త్యా - సహ శివగణై స్సేవిత విభో ll
తా: కామునికి శత్రువు అయిన ఓ శివా ! ప్రమధ గణములచే సేవించ బడే ఓ హరా ! ధైర్యము అనే స్తంభము ఆధారముగా ఉన్నదియు,స్థిరమయిన తాళ్ళతో కట్టబడినదియూ, ఎక్కడికయిననూ తీసుకొని పోవుటకు వీలు అయినదియూ ఆశ్చర్యకరమయినదియూ , పద్మములతో కూడినదియూ,ప్రతి నిత్యమూ ఉత్తమ మార్గమున ఉంచబడినదియూ అయిన నా హృదయమను గుడారమును చేరి పార్వతీ దేవితో కలిసి అందు  నివసింపుము.
   
శ్లో: 22. ప్రలోభాద్యైరర్థాహరణపరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతి బహుధా తస్కరపతే
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ ll
తా: ఓ శివా ! దొంగలకు అధిపతివి అయిన ప్రభూ నా మనస్సనెడి దొంగ అత్యాశతో ఇతరుల ధనము అపహరించుటకు అనేక విధముల కొట్టుమిట్టాడుచున్నది. ఇట్టి స్థితిలో దీనిని నేను సహించ లేను . ఈ దొంగను నీ ఆధీనములో ఉంచుకొని నన్ను దోష రహితునిగా చేయుము.
శ్లో: 23. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా
మదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో ll
తా: ప్రభు ! ఓ శంకరా ! నీకు పూజలు చేసెదను,నాకు ఆ పూజకు మోక్షము అనే ఫలము మాత్రమె ఇమ్ము. అట్లు కాక బ్రహ్మత్వము గానీ, విష్ణుత్వము గాని యిచ్చెదవు ఏమో , అప్పుడు నిన్ను చూచుటకు హంసగా పుట్టి ఆకాశము అంతా తిరగలేను, వరహముగా పుట్టి భూమి అంతా వెదక లేను.  చివరకు నిన్ను చూడలేక ఆ బాధను ఎలా భరించను? కావున శీఘ్రమే మోక్షమును ప్రసాదించుము.
శ్లో: 24. కదా వా కైలాసే కనకమణిసౌధే సహ గణై
ర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటి తమూర్ధాంజలిపుటః
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహితి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః ll
తా: ఓ ప్రభూ ! కైలాస పర్వతమున మణులతో నిర్మింపబడిన భవనమునందు ప్రమధ గణములతో నీ ముందు నిలబడి తల పై చేతులు ఉంచి నమస్కరించుచూ  ఓ స్వామీ, ఓ సాంబా, ఓ పరమ శివా అని ప్రార్ధించుచూ అనేక బ్రహ్మ కల్పములు క్షణ కాలము వలె ఎప్పుడు గడుపుతానో కదా !
శ్లో: 25. స్తవైర్బ్రహ్మాదీనాం  జయజయ వచోభిర్నియమినాం
గణానాం కేళీభిర్మదకలమహోక్షస్య కకుది
స్థితం నీలగ్రీవం త్రినయన మమూశ్లిష్టవపుషం
కదా? త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్ ll
తా: ఓ శివా ! బ్రహ్మాదులు చేయు స్తోత్రములతోను, మహర్షులు చేయు జయ జయ ధ్వనులతోను, ప్రమథ గణములు చేయు క్రీడలతోను, అవి చూసి ఆనందముతో రంకెలు వేయుచున్న నందీశ్వరుని మూపురము పై కూర్చున్న వాడవునూ , నీల కంఠము గలవాడవునూ, మూడు కన్నులు కలవాడవునూ,  పార్వతి చే ఆలింగనము చేసుకొనబడిన దేహము కలవాడవునూ , లేడిని  చేతితో పట్టుకున్న వాడవునూ, పరశువు అనే ఆయుధమును ధరించిన వాడవునూ అయిన నిన్ను దర్శించే భాగ్యము ఎప్పుడు కలుగుతుందో కదా ?
శ్లో: 26. కదా వా త్వాం దృష్ట్యా - గిరిశ ! తవభవ్యాంఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం  - శిరసి నయనే వక్షసి వహన్
సమాశ్లిష్యాఘ్రాయ  - స్ఫుటజలజగంధాన్ పరిమళాన్
అలాభ్యాం బ్రహ్మద్యై  - ర్ముదమనుభవిష్యామి హృదయే ll
తా: ఓ పరమేశ్వరా ! నిన్ను దర్శించి నీ యొక్క పాద పద్మములను నా చేతులతో పట్టుకొని వాటిని నా తలయందు ఉంచుకొని, కళ్ళకు అద్దుకొని, ఎదపై పెట్టుకొని,వాటిని కౌగలించుకొని వాటి నుండీ వచ్చు పరిమళములను ఆఘ్రాణించి బ్రహ్మాదులకు లభింపని ఆనందమును నా హృదయములో ఎప్పుడు అనుభవింతునో కదా ! 
శ్లో: 27. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే
శిరస్థ్సే శీతాంశౌ చరణ యుగళసేఖిలశుభే
కమర్థం దాస్యే హం భవతు భవదర్థం మమ మనః ll
తా: ఓ ప్రభూ ! నీ చేతిలో మేరు పర్వతము ( బంగారు కొండ )  ఉన్నది. నీ పక్కనే కుబేరుడు ఉన్నాడు.కామధేనువు, కల్పవృక్షములు, చింతామణులు కుప్పలుగా ఉన్నవి.చంద్రుడు అలంకారముగా నీ శిరస్సున ఉన్నాడు.సకల శుభములు నీ పాదముల వద్ద ఉండగా ఇంకా నేను నీకు ఏమి ఇవ్వగల వాడను. నా మనస్సునే నీకు అర్పింతును. స్వీకరింపుము.
శ్లో: 28. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే
సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమసిద్ధ మత్రభవతి స్వామిన్ కృతార్థోస్మ్యుహమ్ ll
తా: ఓ పార్వతీ పతీ ! నీకు పూజలు చేయుచున్నప్పుడు సారూప్య ముక్తి ,శివా! మహాదేవా! అని నీ నామ సంకీర్తన చేయునప్పుడు సామీప్య ముక్తి ,నీ భక్తులతో సంభాషణ చేయునప్పుడు సాలోక్య ముక్తి ,స్థావర జంగమాత్మకమైన నీ రూపమును ధ్యానించునప్పుడు సాయుజ్య ముక్తియు నాకు ఇక్కడనే లభించు చున్నవి.కావున నేను ధన్యుడనైతిని .
శ్లో: 29. త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యస్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో
వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు ll
తా: ఓ జగద్గురు శంకరా ! ప్రతి దినము నేను నీ పాదపద్మములను ఆరాధించుచున్నాను . పరమపురుషుడవు అయిన నిన్నే ధ్యానించు చున్నాను .సర్వేశ్వరుడవు అయిన నిన్నే శరణు పొందుతున్నాను. వాక్కు ద్వారా నిన్నే యాచిస్తున్నాను.దేవతలచే చిరకాలము ప్రార్ధింప బడిన కరుణతో కూడిన నీ దృష్టిని నా పై ప్రసరింప చేయుము.శంభో- జగద్గురూ ! నాకు సౌఖ్యముగా ఉండు ఉపదేశములు చేసి నన్ను ఆనందముగా ఉంచుము. 
శ్లో: 30. వస్త్రోద్ధూతవిధౌ సహస్ర కరతా పుష్పార్చనే విష్ణుతా
గంధే గంధవహాత్మతా న్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా
పాత్రే కాంచన గర్భతాస్తి మయిచేద్బాలేందు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో ll
తా: ఓయీ ! సర్వ వ్యాపకా ఈశ్వరా ! నీకు వస్త్రము అర్పించుటకు సహస్ర బాహువులు గల సూర్యుడు కావలెను,నీకు పుష్పములు అర్పించుటకు సర్వ వ్యాపకుడు అయిన విష్ణుమూర్తి కావలెను.గంధము అర్పించుటకు వాయుదేవుడునూ, వంట చేసి నివేదన పెట్టుటకు ఇంద్రుడునూ కావలెను. అర్ఘ్య పాత్రను అర్పించుటకు బ్రహ్మ దేవుడు కావలెను.అట్లు కాగలిగినపుడే నీకు సేవ చేయ గల వాడినయ్యెదను.నీకు సేవలు చేయవలెనన్న వారే కావలెను. నాబోటి అల్పుడకు ఇది అలవి కాని పని .
శ్లో: 31. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాంపతే
పశ్యన్కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్
సర్వామర్త్యపలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణ మేవ త్వయా ll
తా: ఓ పశుపతీ ! ఓ దేవా ! నీవు కడుపులో ఉన్న చరాచర ప్రాణులనూ, బయట ఉన్న దేవతలూ మొదలయిన వారిని చూస్తూ అతి భయంకరమయిన హాలా హలమును గొంతులో వేసుకొని అక్కడనే ఉంచుకున్నావు.బయటకు ఉమ్మలేదు, కడుపు లోపలికి మ్రింగనూ లేదు. కడుపులో ఉన్న లోకములకూ, బయట ఉన్న దేవతలకూ గొప్ప ఉపకారము చేసితివి కదా ! ఈ కార్యము ఒక్కటి నీ యొక్క దయనూ, దేవత్వమునూ చాటుచున్నది .
శ్లో:32. జ్వాలోగ్రస్సకలామరాతిభయధః క్ష్వేళః కథం వాత్వయా
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలమ్
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధగుటికా వా కంఠదేశే భృతః
కిం తే నీలమణి ర్విభూషణమయం శంభో మహాత్మన్ వద ll
తా: మహాత్మా ! ఓ శివా! భయంకరమయిన మంటలు కక్కుతున్న కాల కూటమును ఎలా చూడగలిగావు, చూసి చేతితో తీసుకుని అరచేతిలో వేసుకున్నావు, అది ఏమయినా నేరేడు పండా ? అక్కడితో ఆగక దానిని నాలుక మీద వేసుకొని కంఠమునందు నిలుపుకొంటివి. ఇది నీకు ఆభరణముగా ఉండే నీల మణియా? చెప్పుము.
శ్లో: 33 నాలం వా సకృదేవ దేవ భవతస్సేవా నతిర్వా నుతిః
పూజా వా స్మరణం కథాశ్రవణ మప్యాలోకనం మాదృశామ్
స్వామిన్నస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కావాముక్తిరితః కుతో భవతిచేత్కింప్రార్థనీయంతదా ll
తా: దేవా! శివా! నిన్ను ఒక్కసారి సేవించినా, నమస్కరించినా, స్మరించినా, పూజించినా, దర్శించినా,నీ కధను విన్నా చాలును.దీనికంటే ముక్తి మరొకటి లేదు కదా .మా వంటి వారికి ఈ పైన చెప్పిన వాటి వల్ల ముక్తి కలుగుతూ ఉండగా అశాశ్వతులు అయిన ఇతర దేవతలను కష్టపడి సేవించుట వలన ఏమి లభించును ?
శ్లో:34. బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ
ద్థైర్యం చేదృశ మాత్మనస్థ్సితి రియం చాన్యైః కథం లభ్యతే
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ ll
తా: ఓ పశుపతీ ! ఓ శంకరా ! నీ యొక్క ధైర్యమును ఏమని చెప్పుదును.నీ సాహసమును ఏమని వర్ణింతును ?  నాశనమును తెలిసికొని దేవతలు పారిపోవుచుండగా, ఋషులు గడగడలాడి పోవుచుండ ప్రపంచమంతా నాశనము అయిపోవుచుండగా నీవు ఒక్కడివే పరమానంద పరిపూర్ణుడు అయి విహరిస్తావు.
శ్లో: 35. యోగక్షేమధురంధరస్య సకలశ్రేయః ప్రదోద్యోగినో
దృష్టాదృష్ట మతోపదేశకృతినో బాహ్యాంతర వ్యాపినః
సర్వజ్ఞస్వ దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా
శంభోత్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్ ll
తా: శివా! ఆశ్రితులయిన వారి యోగ క్షేమ భారమును వహించుట,వారికి సమస్త శ్రేయస్సులను అనుగ్రహించు వాడవును, ఇహ పరములకు సమ్మతములయిన బోధనలు చేయువాడవును, ఎక్కడ చూచినా నీవే నిండి యుండుట దయతో చూచుట అనునవి అన్నియు నీ గుణములే కదా.నీ గురించి నేను ఇంకా  ఏమి తెలిసికొందును. నీవే నాకు మిక్కిలి ఆత్మీయుడవు అని ప్రతి దినము హృదయమున స్మరింతును.
శ్లో: 36. భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలమ్
సత్వం మంత్రముదీరయన్ నిజశరీరాగారశుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ ll
తా: ఓ సాంబ శివా! భక్తుడయిన వాడు తన శరీరము అనే గృహమును శుధ్ధి చేసుకొని భక్తి అనెడి దారముతో చుట్టి, సంతోషము అనే నీటితో నింపి హృదయమనెడి కలశములో నీ పాదములనెడి చిగుళ్ళనూ, జ్ఞానము అనెడి టెంకాయను నిలిపి శివ మంత్రమును ఉచ్ఛరించుచూ పుణ్యహవచనము గావించు చున్నాడు.
శ్లో: 37. ఆమ్నాయాంబుధి మాదరేణ సుమనస్సంఘాస్సముద్యన్మనో
మంథానం దృఢభక్తి రజ్జుసహితం కృత్వా మథిత్వా తతః
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం
నిత్యానందసుధాం నిరంతర రమాసౌభాగ్య మాతన్వతే ll
తా: దేవతలు మంధర పర్వతమును కవ్వముగా చేసుకొని వాసుకిని తరిత్రాడుగా అమర్చి సముద్రాన్ని మధించికల్పవృక్షాన్ని, కామధేనువునూ, చింతామణిని,అమృతాన్ని,లక్ష్మి దేవినీ సంపాదించినట్లు విద్వాంసులు అందరూ కలిసి మంచి మనస్సుతో భక్తి అనెడి త్రాటితో మనస్సును కవ్వముగా చేసుకొని వేదము అనెడి సముద్రమును ఆదరముతో మధించి ఆ వేద సముద్రమునుండి భక్తి శాలురకు మోక్షము కలిగించు ఉమా సహితుడు అయిన ఈశ్వరుని పొందుతున్నాడు .

శ్లో: 38. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్నశ్శివ
స్సోమస్సద్గుణసేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః
చేతః పుష్కరలక్షితో భవతి చే దానందపాథోనిధిః
ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే ll
తా: పూర్వ పుణ్యము అనెడి పర్వతము యొక్క మార్గమున కనపరచినట్టి అమృత మయము అయిన ఆకృతి గల వాడునూ,నిర్మలుడునూ, సజ్జనులచే సేవింపబడు వాడునూ లేడిని ధరించిన వాడునూ,అంతటనూ నిండిన పూర్ణుడునూ చీకటిని పారద్రోలు వాడునూ అగు శివుడు హృదయమనే ఆకాశంలో చూడ బడితే ఆనంద సంద్రము మిక్కిలి ప్రతిభతో పొంగి పొరలును. అప్పుడు సజ్జనులు ఆ ఆనంద డోలికలలో మునిగి తేలును.
శ్లో: 39. ధర్మో మే చతురంఘ్రిక స్సుచరితః పాపం వినాశం గతం
కామక్రోధమదాదయో విగళితాః కాలాస్సుఖావిష్కృతః
జ్ఞానానంత్యమహౌషధి స్సుఫలితా కైవల్యనాథే సదా
మాన్యే మానస పుండరీకనగరే రాజావతంసే స్థితే ll
తా: పూజ్యుడు, చంద్రశేఖరుడు , రాజావసంతుడు, శివుడు నాహృదయమనెడి నగరమును పరిపాలిస్తుండగా ధర్మము నాలుగు పాదములతో నడుస్తున్నది.పాపము నశించెను , కామ క్రోధ మద మాత్సర్యములు పారిపోయెను.జ్ఞానముతో కూడిన మోక్షము అనే గొప్ప ఓషధి ఫలించెను.
శ్లో: 40. ధీయంత్రేణ వచోఘటన కవితాకుల్యోప కుల్యాక్రమై
రానీతైశ్ఛ సదా శివస్య చరితాంభోరాశి దివ్యామృతైః
హృత్కేదారయుతాశ్చ భక్తికలమా స్సాఫల్యమాతన్వతే
దుర్భిక్షా న్మమ సేవకస్యభగవన్విశ్వేశ భీతిః కుతః ll
తా: హే! భగవాన్ ! విశ్వేశ్వరా! బుద్ధి అనెడి ఏతముతో, స్తోత్ర వచనములు అనెడి కుండలచే,కవిత్వ మనెడి పిల్ల కాలువల ద్వారా పైకి తేబడిన పరమేశ్వరుడవు అయిన నీ యొక్క చరిత్రము అనెడి సముద్రము యొక్క మంచి నీటితో హృదయమునందు మొలకెత్తిన భక్తీ అనే వరి పైరులు మంచి పంట పండుతున్నాయి.సదాశివా నీ సేవకుడు అయిన నాకు కఱవు వలన భయము లేదు.  
***

No comments:

Post a Comment

Pages