కత్తుల వంతెనను దాటిన ‘కళ్యాణి’ - అచ్చంగా తెలుగు

కత్తుల వంతెనను దాటిన ‘కళ్యాణి’

Share This
కత్తుల వంతెనను దాటిన ‘కళ్యాణి’
జాని తక్కెడశిల 

మహీధర రామమోహనరావు ప్రముఖ తెలుగు రచయిత. ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అంగీకరించిరచనల్లోనూజీవితంలోనూ కమ్యూనిజాన్ని అనుసరించారు. రామమోహనరావు తెలుగులో పలు చారిత్రక నవలలు రాశారు. రామమోహనరావు నవలల్లో కొల్లాయి గట్టితేనేమి? ప్రసిద్ధి పొందిన నవల. 1960వ దశకం మొదటి భాగంలో రాసిన ఈ నవలకు 1968 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య పీఠం పురస్కారం దక్కింది. రామ్మోహన్ రావు తూర్పు గోదావరి జిల్లాముంగండ అగ్రహారంలో జన్మించారు. తన ఐదో ఏట చదువు ప్రారంభించారు. బడికి వెళ్ళిన మొదటి రోజునే ఉపాధ్యాయుడు తొడ పాశం పెట్టడంతో తండ్రి అతన్ని బడికి మాన్పించి ఇంట్లోనే చదువు చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళ చావడిలోనే ఊరి గ్రంథాలయం ఉండేది. అందులోనే ఏడేళ్ల వయసుకే వావిలకొలను సుబ్బారావుసెట్టి లక్ష్మీ నరసింహంచిలకమర్తి లక్ష్మీనరసింహంగాడిచర్ల హరిసర్వోత్తమరావు లాంటి ప్రముఖులు రచించిన పలు పుస్తకాలు చదవడం అలవాటు అయ్యింది. పద్నాలుగేళ్ల వయసులో ఆయనకు వివాహమైంది. స్వాతంత్ర్యోద్యమంలో కృషిచేసి జైలుకు వెళ్ళారు. కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి పనిచేశారు. ఆయన విశాలాంధ్ర దినపత్రికలో జర్నలిస్టుగాపత్రికా సంపాదకునిగా పనిచేశారు.
కత్తుల వంతెన శీర్షికతో రాసిన నవల 192 పుటలు ఉన్నది. బాల్య వివాహం చేసుకున్న ఒక స్త్రీ దాన్ని ఎదిరించి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. ఇది ప్రధానంగా సాగే పాయ. అయితే రచయిత కేవలం ఆ విషయం మాత్రమే కాకుండా అనేక విషయాల ప్రస్తావన నవలలో ఉన్నది. నవల సాగిన ప్రాంతం బెజవాడ. పుస్తకం మొదటి ముద్రణ 1961 లో జరిగింది. ఈ నవల ఆ కాలానికి చెంది నదిగా మనం గుర్తించాలి. నవల అనేక ప్రాంతాలు తిరగలేదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అనేక సమస్యలను ఈ నవలలో రచయిత ప్రస్తావించారు. లంచం పెరిగిపోయిందని. అధికారులలో నిర్లక్ష్యం కారణంగా పనులు సకాలంలో జరగడం లేడని ఆక్రోశించారు. ముందు అమ్మాయిలకు చదువు ఎందుకు? పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్లి ఇంటి పని చేసే ఆమెకు చదువు అవసరం లేదు. మహిళలు బయటకి వెళ్ళాల్సిన అవసరంలేదు. స్త్రీలు ఇంటి చాకిరికి తప్ప ఎందుకు పనికి రాదనే ఆలోచించే వారు.
ఆ తర్వాత కాస్త కాస్త మార్పు వస్తూ వచ్చింది. ఆ మార్పును రచయిత ఈ నవలలో చూపించారు. చదువుకున్న అమ్మాయి అయినా పర్వాలేదు కాని కులం తక్కువ అమ్మాయి పెళ్ళికి పనికి రాదని ఒక పాత్ర మాట్లాడుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే కుల పిశాచి మనల్ని ఎంతగా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే కట్నం వదులుకోవడానికైనా సిద్ధం కాని కులం తక్కువ వారిని చేసుకోవడం మహా పాపం అనే ఆలోచన ఉన్న పాత్రలు ఇందులో ఉన్నాయి. ఈ నవలలో పాత్రలు కేవలం పాత్రలు మాత్రమే కాదు. ఆ పాత్రలు నాడు జరిగిన సంఘటనలకు ప్రతినిధులు.
ఈ సమాజం కొత్త నియమాలు, నీతులు సృష్టించుకుంటుంది. కాని మళ్ళీ మాములుగానే సాగిపోతుందని చెప్పారు దానికి ఉదాహరణగా మొదట భార్య భర్తల బంధాన్ని ధర్మం పేరుతో ఒక్కటీగా చేసి ఎన్ని కష్టాలు ఉన్న అతను/ ఆమెతో ఉండాల్సిందే అన్నారు. నేడు జరుగుతున్నది కూడా ఒక్కటే కాకపోతే దానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నారు. ప్రేమలో కూడా నిర్బంధం ఉన్నదనే విషయాన్నీ మర్చిపోకూడదు అన్నది రచయిత ఉద్దేశం. దీన్ని తప్పు పట్టడానికి లేదు. అయితే ఇష్టంతో, ప్రేమతో వచ్చే నిర్భందం ఎలా అవుతుంది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ప్రేమ నిర్భందాన్ని కోరదు. కాని నేడు జరుగుతున్నది ఏంటో అందరికి తెలిసిందే. స్త్రీ పురుషుల మధ్య వాంఛ ఉంటే దాన్ని కామం అనే వారు దాని నేడు ప్రేమ అంటున్నారు అన్నట్లు ఒక పాత్ర నవలలో మాట్లాడింది. పేరు ఏదైనా అంతిమంగా స్త్రీ పురుషుల మధ్య ఉండేది శారీరక అవసరాలే. అవే మొదట జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు ఆధారపడేలా చేస్తాయి. ఇద్దరినీ కలిపే మూల కారకం శృంగారమే దానికి బహిరంగ సమాజంలో ప్రేమ అని పేరు పెట్టుకున్నాము అంతే.
అయితే ఈ నవల వస్తువు ప్రధానంగా సాగిన నవల కాదు. వస్తువు ఇందులో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే నవల మొత్తం అనేక విషయాలను చర్చిస్తుంది. వస్తువు నుండి పక్కకు తప్పి పచారులు చేస్తుంది. అయితే రచయిత ఒక వస్తువును తీసుకొని అనేక విషయాలను చెప్పడానికే ఈ నవల రాశారన్నది మర్చిపోకూడదు. ముప్పై ఎనిమిది ప్రకరణలుగా సాగిన నవలలో అనేక సంభాషణలు ఉన్నాయి. అయితే కొన్ని సంభాషణలు పేలవంగా ఉంటే కొన్ని సంభాషణలు విజ్ఞాన కరంగా సాగాయి. కొన్ని చోట్ల ఈ సంభాషణ నేను ఎందుకు చదువుతున్నానా అని రీడర్ ఫీల్ అవుతాడు. దానికి కారణం వస్తువుకు అతకని సంభాషణలు ఉండటమే. నవలలో ఒక సంభాషణ జరిగేటప్పుడు అన్ని పాత్రలు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పడానికి ఆ పాత్రల తాలూకు కదలికలు రచయిత చెప్పారు. అయితే ఆ కదలికలు ఎక్కువగా ఉంటే విసుగు పుడుతుంది. అందుకే సంభాషణలో అవసరమైన పాత్రలే ఉండాలి కాని అనవసరమైన పాత్రలు ఉండ కుంటేనే మంచిది. 
మూడు వంతుల నవల సంభాషణల మీదనే ఆధారపడింది. మొదటి మూడు భాగాలలో అనేక విషయాలు చర్చించి చివరి భాగంలో ప్రధాన వస్తువు తాలుకు నవలను సాగించి నారు రచయిత. కళ్యాణికి ఆనంద రావుతో బాల్యంలో వివాహం జరిగి ఉంటుంది. అతడు విదేశాల్లో ఉండి వస్తాడు. భార్యను తీసుకుపోవాలను కుంటే కళ్యాణి దానికి అంగీకరించదు. ఎప్పుడో నాకు తెలియనప్పుడు పెళ్లి చేసి ఈరోజు తనతో ఉండటం కుదరదు. నేను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో ఎదిరిస్తుంది. కళ్యాణికి తమ్ముడు మద్దతు లభిస్తుంది. అయితే ఆనంద రావు బలవంతం చేస్తాడు. ఆ తర్వాత కళ్యాణి తమ్ముడు చాకచక్యంగా వ్యవహరించి కళ్యాణికి పెళ్లి చేస్తాడు.
ఆడపిల్లల తల్లిదండ్రులు నేడు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. వారికీ కట్నాలు కూడా ఎక్కువగా ఇస్తున్నారు. అయితే ఇది నేడు మాత్రమే కాదు 1960లలో కూడా ఉన్నదనే విషయం నవల రుజువు చేస్తుంది. అయితే రకరకాల ఉద్యోగాలు చేసేవారికి రకరకాల కట్నాలు ఉంటాయి. అయితే మొత్తం మీద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఎక్కువగా కట్నం ఉంటుంది. ఈ కట్న పిశాచి నేటికి భారతీయ సమాజాన్ని తన కబంధ హస్తాలలో బంధించుకోనే ఉన్నది. పైగా నేడు పెళ్ళిలో ఆర్భాటాలు ఎక్కువగా అయిపోయాయి. కార్పొరేట్, దోపిడీ సమాజం పెళ్లి అంటే ఇలానే చేసుకోవాలి అనేలా శాసిస్తోంది. ఖర్చును అమాంతం పెంచేసి పెళ్లి ఇలానే ఉండాలని లేదంటే అది పెళ్లి అనిపించుకోదని చాటి చెప్తుంటే. ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతున్నారు. పిల్లను పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత కూడా సంవత్సరాల పాటు పెళ్ళికి చేసిన అప్పులను తీర్చుకోలేని స్థితి ఉన్నది. ఇది మారాలంటే వ్యవస్థలో మార్పును ఆశించకుండా మనిషి ఆలోచన తీరులో మార్పు తెచ్చుకోవాలి.
చివరికి కళ్యాణి తాను ఇష్టపడిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. ముగింపు ఈ విధంగా ఇవ్వడం వల్ల రచయిత బాల్య వివాహాలు వ్యతిరేకించారు. స్త్రీ తనకు ఇష్టమున్న వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉన్నదని బల్ల గుద్ది చెప్పారు. మహిళలను బానిసలుగా చేసిన వివాహ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపారు. ఇష్టం లేకపోతే కలిసి ఉండటం కంటే విడిపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. పాత్రకు కళ్యాణి అని పేరు పెట్టడంలో రచయిత ఏమి కోరుకుంటున్నారో, రచన దేని మీద సాగుతుందో చెప్పకనే చెప్తుంది. స్త్రీ స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన నవలే ఈ కత్తుల వంతెన. 


జాని తక్కెడశిల 
ప్రతిలిపి వెబ్సైట్ మేనేజర్ 
7259511956

***

No comments:

Post a Comment

Pages