జీవన పోరాటం - అచ్చంగా తెలుగు
జీవన పోరాటం
పి.మంగరత్నం 

ఆ హాస్పిటల్ ఆవరణలో ..
ఉదయం తొమ్మిది గంటలకి సైకిల్ స్టాండు వేస్తూ అనుకున్నాడు గోపాలరావు ‘ఇంకో నాలుగురోజుల్లో ఈ కొలువుకీ  తనకూ ఋణం తీరిపోతుందని’.  నిన్ననే  తనకి ‘పని’ చూపించిన ఎకౌంటెంట్ రాజేంద్రప్రసాద్ చెప్పలేక చెప్పాడు “మా డీన్ చెప్పమన్నారు అంకుల్ ” అంటూ.
ఈ నెలాఖరు తరువాత తనిక్కడికి రాడు. 
అయినా, ఎప్పటిలాగానే ఈ పరిసరాలు ఇలాగే ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళే వాహనాలూ, బస్సులూ అలాగే, దూసుకుపోతుంటాయి.  హాస్పిటల్ గేటు బయట ఉన్న దివాకరం మిర్చి బండీ, యల్లారావు చెరకురసం. సోములు పళ్ళ దుకాణా౦ అలాగే ఉంటాయి.
సాయంత్రం ‘ టీ’ త్రాగేవాళ్ళలో దివాకరానికే ఓ మనిషి తగ్గుతాడు. అంతే.
అంతా యధాతధం.
తనూ వాళ్ళలాగే అసంఘటిత కార్మికుడే.
గోపాలరావు ఆ హాస్పిటల్లో ఏడాదిగా పని చేస్తున్నాడు.
అందులో అతనో డాక్టరూ కాదు,  క్లర్కూ కాదు. కనీసం అదే కంపౌండులో ఉన్న మెడికల్ షాపులోని అసిస్టెంటూ కాదు. 
ఆ హాస్పిటల్కి కనిపెట్టుకుని ఉండే జీతగాడు అంతే. 
గోపాలరావు వయసు డెబ్బై సంవత్సరాల పై మాటే.
చాలా మృదుస్వభావి. తానొవ్వక .. నొప్పించక తన పనేదో తను చేసుకుపోయే మనిషి. ఇంకా చెప్పాలంటే, మనవలతో ఇంటి పట్టునే ఉండి సుఖపడాల్సిన వయసులో బ్రతుకు బండిని .. ఎలా  నడిపించాలా అని మధన పడుతున్న వాళ్ళలో ఒకడు.
చదువుకోవాల్సిన  వయసులో చదువుని సరిగా .. వంటబట్టించుకోక పోవడంతో, ఇల్లు గడవడం కోసం .. జీవితం అంతా చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
కొడుక్కీ, కూతురుకీ పెళ్ళిళ్ళు అయి హైదరాబాదులో ఉండడంతో స్వంత ఊరిలో .. దొరికిన చిన్నాచితకా ఉద్యోగాలతో రోజులు నెట్టు కొస్తున్నాడు.  భార్య సరోజిని మేనమామ కూతురే కావడంతో పరిస్థితి అంతా కొట్టిన పిండే.
అప్పటివరకూ, ఉంటున్న ఇల్లు మారి ..
ముప్పై పోర్షన్లు ఉన్న ‘భాస్కర అపార్టుమెంటు’లోకి కొత్తగా అద్దెకు దిగాడు. 
దిగిన రెండు నెలలో .. 
మాటల సందర్భంలో ఆ ఫ్లాట్ ఓనరు రాజేంద్రప్రసాద్ తో తన పరిస్థితి ఏకరువు పెట్టాడు.
తను అప్పటి వరకూ పని చేస్తున్న టీ. వీ షోరూమ్లో కంప్యుటర్ తెలిసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడంతో తనలాంటి వాళ్ళకి ఇచ్చే జీతం తక్కువగా ఉంటుందనీ, తెలిసిన చోట .. ఏదైనా ‘పని’ ఉంటే చెప్పమని.
ఆ వయసుకి అతను చెయ్యగలిగే ఉద్యోగ౦ ఏమీలేకపోయినా .. 
తను పని చేసే హాస్పిటల్లో ఉన్న ఓ సమస్య గుర్తుకు వచ్చింది రాజేంద్రప్రసాద్ కి. విషయం హాస్పిటల్ డీన్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు. 
అన్నీ విన్న డీన్ ‘సరే’ అన్నాడు.
అది ఓ మోస్తరు హాస్పిటల్ కావడంతో .. ఉన్న అరడజను మంది డాక్టర్లూ మధ్యాహ్నం భోజనాలు వెళుతుంటే .. ఆ సమయంలో హాస్పిటల్ని కనిపెట్టుకుని చూసుకునే వాళ్ళు ఉండడం లేదు. అందుకని ఎవరో ఒకరు వంతుల వారీగా అక్కడ ఉండాల్సి వస్తుంది.
దాంతో, ఆలశ్యంగా ఇళ్ళకు వెళ్ళిన వాళ్ళు .. ఆలశ్యం తిరిగి రావడంతో వచ్చిన పేషెంట్లు పడిగాపులు పడాల్సివచ్చేది.   
దాన్ని అదిగ మించడం కోసం ఎవరో ఒకర్ని భాద్యతగా ఉండేవాళ్ళని నియమించుకోవాలనుకున్నా  ఇచ్చే ‘ఎనిమిది వేల’ జీతానికి వస్తామన్న వాళ్ళు ఎవరూ లేరు. 
అలాంటి సమయంలో గోపాలరావు తగలడం  అదృష్టంగానే భావించింది హాస్పిటల్. 
అక్కడ గోపాలరావుకి చెప్పుకోదగ్గ పనేం లేదు.
హాస్పిటల్ ఎంట్రన్సులో ఉన్న కౌంటరులో కూర్చోవడమే. అవసరం అయితే, అక్కడే ఉన్న రిసెప్షనిస్టుకి చీటీలు వ్రాయడంలో సహాయపడడం. లేదంటే  అదీ లేదు.
అక్కడ ఓ పెద్ద దిక్కు అంతే. 
వయసులో అందరి కన్నా పెద్దవాడు కాడవడంతో .. అటెండర్ల దగ్గర నుంచి డాక్టర్ల వరకూ అందరికీ ‘ అంకులే’ అయ్యాడు. 
“అంకుల్ .. భోజనానికి వెళ్ళొస్తా౦” చెప్పి వెళ్ళేవాడు డీన్. 
“ అయ్యో! మీరు ఉద్యోగం ఇచ్చిన  పెద్ద డాక్టరు పేరుతొ పిలవొచ్చునన్ను” చెప్పేవాడు గోపాలరావు నోచ్చుకున్తున్నట్లు.
ఏడాదిగా..
క్రమపద్దతిలో నడుస్తుంది హాస్పిటల్ అన్నట్లు బాగానే ఉన్నా ..
కొత్తగా మరో ఇద్దరు యువ డాక్టర్లు వచ్చి చేరడంతో గోపాలరావు చేసే పనికి ఎసరొచ్చి౦ది. స్టాఫ్ ఎక్కువైయ్యార౦టూ. 
రాజేంద్రప్రసాద్ విషయం చెప్పినప్పటి నుంచి దిగులు పడుతున్నాడు గోపాలరావు. ఈ వయసులో మళ్ళీ తనకి పని ఎక్కడ దొరుకుతుందని.
***
కేలండరులో కొత్త కాగితం మారడంతో .. ఇంటికొచ్చేసాడు గోపాలరావు.  
జీతం ఇచ్చి పంపారు కాబట్టి, కొద్ది రోజులు ఫర్వాలేదు. అది పూర్తి అయ్యేలోపు ఏదైనా పని వెతుక్కోవాలి.
సంపాదన లేదని .. ఉన్న ఊరిని వదిలేసి కొడుకు ఇంటికి పోయి కూర్చోగలడా? బంధువులు అంతా పిలిస్తే పలికేంత దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళని కాదని ఎక్కడికి వెళ్ళడం. 
కాబట్టి, ఏదో ప్రయత్నం చెయ్యాలి అనుకుంటుండగానే,   
మిర్చి బండి దివాకరం నుంచి ఫోను.
“ సార్! ఊరిలొ చందనా బ్రదర్స్ వాళ్ళు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసారు కదా! మెయిన్ రోడ్డు మీద.  ఆ షాపింగు మాల్ వాళ్ళు క్రింద ఫ్లోర్లో దేవుడిని పెట్టారట. ప్రతిరోజూ ప్రసాదాలు తయారు చేసే ఇస్తారా? అని .. నా దగ్గరకు వచ్చారు. నాకు పులిహోరలూ, దద్దోజనాల వాటివి రావనీ చెప్పి .. మేడంగారి విషయం గుర్తుకు వచ్చి నా దగ్గరున్న మీ ఫోన్ నెంబరు వాళ్ళకు ఇచ్చాను” అంటూ.
       ***         
అప్పట్లో ..
సాయంత్రం అయ్యేసరికి ..
కాళ్ళు సాగడం కోసమన్నట్లు గోపాలరావు బయటకు వెళ్లి దివాకరం దగ్గర వేడిగా ఓ మిర్చిబర్జీనో, సమోసానో తిని .. టీ త్రాగి వస్తుండేవాడు.  అలాగే పళ్ళ దుకాణం సోములుతోనూ, చెరకు బండి యల్లారావుతోనూ మాటలు కలిపేవాడు. 
ఓ రోజు అలా ‘టీ’ త్రాగుతూ అన్నాడు “ మా ఆవిడ బాగా స్వీట్లు తయారు చెయ్యగలదయ్యా. అవసరం అనుకుంటే ‘అడిగిన’ వాళ్ళకి చేసి ఇస్తుంది కూడా ” అని.    
ఆ మాటకి ప్రాణం లేచి వచ్చిన దివాకరం “ మీదేదైనా విజిటింగు కార్డు ఉంటే ఇవ్వండి సార్! అమ్మగారితో మాట్లాడతాం” అన్నాడు ఆశగా. 
ఇంటి నుంచి వచ్చేటపుడు, బాగుచేసిన ఉల్లిపాయలూ, బర్జీ మిరపకాయలు, టమాటాలు, మరమరాల వంటి సరంజామాతో పాటు ..  భార్య చేసే మడత కాజాలు, బాదుషాలు వెంట తచ్చుకుంటాడు. 
స్వీట్లు ఆ రెండు రకాలే కాకుండా మరో రెండు రకాలు ఉంటే, తన వ్యాపారం ఇంకా బాగాసాగుతుందని దివాకర్ ఉదేశ్యం. అవి చేసే వంట వాడు దొరకక ఆ ప్రయత్నం మానుకున్నాడు.
జేబులో ఉన్న విజిటింగు కార్డు తీసి ఇచ్చాడు గోపాలరావు.
***
అన్నట్లు గానే దివాకరం నుంచి ఫోన్ అందుకున్న సరోజినమ్మ “ అబ్బే! జిలేబీలు, మైసూరుపాక్ లు రావు బాబూ! ఇంటి వంటకాలైన సున్నుండలూ, పులిహోర, చక్కెరపొంగలీ, పాయసం, దద్దోజనం,  సేమ్యా ఉప్మా, రవ్వలడ్లు లాంటివి చెయ్యగలను” అంటూ చెప్పింది.
“ మాకు అలాంటివి అవసరం లేదు మేడం గారూ! మీరు స్వీట్లు బాగా చెయ్యగలరని సార్! అంటే .. విషయం తెలుసుకోవాలని అనుకున్నాను” చెప్పాడు దివాకరం.
***
కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు ఆ షాపింగు మాల్ తో..
అట్టే, బేరసారాలు చెయ్యకుండా అందివచ్చిన అవకాశాన్ని అందుకుంది సరోజినమ్మ. దేవుడే దారి చూపించాడు అనుకుంటూ.
అందుకే, ప్రతిరోజూ సాయంత్రాలు ఒక కేజీ ప్రసాద౦ చొప్పున చేసి ఇచ్చేలా. 
సోమవారం .. పులిహోర,
మంగళవారం .. ఉడికించిన శెనగలూ,
బుధవారం .. రవ్వకేసరి,
గురువార౦ .. సేమ్యా పాయసం, 
శుక్రవారం .. క్షీరాన్నం,
శనివారం .. చక్కెర పొంగలి,
ఆదివారం .. ఉప్పుపిండీ లాంటివి చేసి ఇస్తూ ఏ రోజు ‘పే’మెంటు  ఆరోజు ఇచ్చేలా ఒప్పందం. సరోజినమ్మ ప్రసాదాలకి దేవుడు సుంత్రుస్తుడైనట్లున్నాడు ..
వారం రోజులు తిరిగేసరికి ..
రాజేంద్రప్రసాద్ మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పాడు సంతోషంగా “ అంకుల్. వచ్చి పనిలో చేరమన్నారు మా డీన్” అంటూ. ఆ మాటలకి దేవుడు తన వైపే ఉన్నాడు అనుకున్నాడు గోపాలరావు
***

No comments:

Post a Comment

Pages