శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి - అచ్చంగా తెలుగు

శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి

Share This
శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 
 1 నుండి 20 వరకు 
మంత్రాల పూర్ణచంద్రరావు 


 శ్రీ గురుభ్యోనమః    
 శ్రీ గం గణపతయేనమః
శ్లో: 1. కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే

శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున

ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్ ll
తా: శివా ! శ్రీ విద్యా స్వరూపులును,చంద్ర రేఖలు సిగలపై అలంకరించుకొనిన వారునూ,ఇరువురూ తపస్సులకు ఫలితములుగా ఏర్పడిన వారునూ,భక్తుల కోరికలు నెరవేర్చు వారునూ,ముల్లోకములకూ అధికమయిన క్షేమ కారణముగా ఉండు వారునూ ధ్యానము చేయు వారి హృదయమున మరల మరల సాక్షాత్కారమగు వారునూ,ఆనందముతో పాటు కలుగు అనుభవ రూపులును అయిన పార్వతీపరమేశ్వరులకు ఇదే నా నమస్కారము.
శ్లో: 2. గళంతీ శంభో త్వచ్చరిత సరితః కిల్బిష రజో

దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్

దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం

వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ ll
తా: శంభో శంకరా ! నీ యొక్క చరిత్ర అనే మహానదులనుండిప్రవహిస్తూ పాపములు అనే దుమ్మును అణచి వేయుచూ బుద్ధి అనెడి పిల్లకాలువను చేరి సంసార తాపాన్ని శాంతి పరుస్తూ  నా హృదయమనెడి లోతు మడుగున పడిన  ( యీ ) శివానందలహరి కి విజయమగు గాక .
శ్లో: 3. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం

జటాభారోదారం చలదురగహారం మృగధరమ్

మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం

చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే ll
తా: శివా ! మూడువేదములతో తెలుసుకొన దగిన వాడును, మనోహరమైన ఆకారము కలవాడును, త్రిపురాసురులను సంహరించిన వాడును, సృష్టికి ముందే యున్నవాడును, మూడు కన్నులు కలవాడును, గొప్ప జటాజూటము, ఔదార్యము కల వాడును,కదులుతున్న పాములు కలవాడును, లేడిని ధరించిన వాడును, మహాదేవుడు అనబడు పరబ్రహ్మ స్వరూపుడైన వాడును, నాయందు దయతో ఉన్న వాడును, సకల జీవులకు అధిపతి అయి జ్ఞానమునకు ఆధారమైన వాడును పార్వతీ సహితుడు అయిన పరమేశ్వరుని నా హృదయమున సేవించు చున్నాను.
శ్లో: 4. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః

న మన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్

హరిబ్రహ్మాదీనామపి నికటభాజా మసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనమ్ ll 
తా:  శివా! జగత్తులో కొద్ది ,కొద్ది ఫలములు ఇచ్చు దేవతలు ఎందఱో ఉన్నారు.వారిని అనుసరించడం గానీ, వారిచ్చే ఫలములు గానీ నేను ఆశించను. ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో ఉండే బ్రహ్మ,విష్ణువు వంటి వారికి కూడా దొరకని మీ పాద సేవనే నేను చిరకాలము వేడుకొనుచున్నాను.
శ్లో: 5. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగానఫణితౌ

పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్యచతురః

కథం రాజ్ఞాం ప్రీతి ర్భవతి మయి కోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో ll
తా:శివా! మనుస్మ్రుతుల వంటి వాటి యందు గాని,వ్యాకరణముల యందు గాని,కవిత్వము అల్లుట గాని,సభలలో సంగీతము పాడుట యందు గాని,పురాణ కాలక్షేపములు చేయుట యందు గాని,మంత్ర ప్రయోగము నందు గాని, ఇతరులను స్తుతి చేయుట యందు గాని,హాస్యము చెప్పుట, నాట్యము చేయుట యందు గాని నాకు ప్రవేశము  లేదు .ఇటువంటి నా యందు రాజులకు ఎట్లు ప్రేమ కలుగును.నేను పశువును,నీవు పశుపతివి .కావున నన్ను దయతో కాపాడుము.


శ్లో: 6. ఘటోవా మృత్పిండో ప్యణురపి చ ధూమోగ్ని రచలః

పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్

వృథా కంఠ క్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజ సుధీః ll
తా: ఓ శాస్త్ర పండితుడా ! కుండ గాని, మట్టి ముద్ద గాని, అణువులు గాని,అగ్ని గాని,పర్వతము,వస్త్రము మొదలగు తర్క శాస్త్ర పదములలో ఏవైనా కూడా భయంకరమయిన మృత్యువును తొలగింపలేవు . నీవు తర్క శాస్త్రముల కొరకు ఏల గొంతు చించుకొందువు? శీఘ్రముగా దయాసముద్రుడు అయిన శివుని పాదపద్మములను భజింపుము.గొప్ప ఆనందము అనుభవించి మోక్షమును పొందుము.
శ్లో: 7. మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ

కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథా కర్ణనవిధౌ

తవ ధ్యానే బుద్ధి ర్నయన యుగళం మూర్తి విభవే
పరగ్రంధా న్కైర్యా పరమ శివ జానే పరమతః ll
తా: ఓ పరమ శివా! నా మనస్సు నీ పాద పద్మముల యందు నా గొంతు నీ స్తోత్రములు పారాయణ చేయుటకు, హస్తములు నిన్ను పూజించుటకు,కర్ణములు నీ కధలు వినుటకు,బుద్ధి నిన్ను ధ్యానించుటకు,కన్నులు నీ దివ్యమంగళ స్వరూపమును చూచుటకునూ ఇష్టముగా ఉన్నవి.నేను ఇంకా వేటితో వేరే గ్రంధములు తెలుసుకో గలను.ఆ గ్రంధములలో కూడా నీ తత్వమే ఉండును కదా!కావున ఇతర గ్రంధములను చదివి ఏమి సాధించను? 
శ్లో: 8. యథా బుద్ధి శ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణిః
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్
తథా దేవభ్రాంత్యా భజతి భవధన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే ll
తా: ఓ మహాదేవా ! పశుపతీ!  మంద బుద్ధి గల నరుడు ముత్యపు చిప్పను చూసి వెండి యని, గాజు పూసను చూసి రత్నమని,పిండి కలిపిన నీటిని చూసి పాలు అని, ఎండమావులను నీళ్ళు అనుకోని భ్రమ పడుచున్నాడు. దేవ దేవుడివి నీవు అని మనస్సులో తలపెట్టక అన్యులను దేవుడు అని భ్రమించి సేవిస్తూ ఉంటాడు.

శ్లో: 9. గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః
సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో ll
తా: ఓ పార్వతీ పతీ ! మందబుద్ధి కలవాడు నీ పూజకు పువ్వుల  కొఱకు లోతైన చెరువులలో దిగుతాడు,  దట్టమయిన అడవులలో తిరుగుతాడు, విశాల మయిన కొండలయందు, గుట్టల యందు తిరుగుతాడు అతడు తనలో ఉన్న తన మనస్సు అను పద్మమును నీకు సమర్పించి , ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండుట లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది . మనస్సు పెట్టి భక్తితో పూజించడము ముఖ్యముకదా  
శ్లో: 10. నరత్వం దేవత్వం నగ వన మృగత్వం మశకతా

పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్

సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ
విహారాసక్తం చేద్ధృదయ మిహ కిం తేన వపుషా ll
తా: శివా ! నాకు నరుడుగా గాని,దేవత గా గాని,గుట్టగా గాని,చెట్టు, పుట్ట, కీటకము, జంతువు, పక్షి మొదలగు జన్మలు కలుగవచ్చు. నేను ఏ రూపముగా పుట్టిననూ నా హృదయము ఎల్లప్పుడూ నీ పాదపద్మముల స్మరణ  అనెడి ఆనంద ప్రవాహములో ఈదులాడుచూ ఉన్న ఏ జన్మము అయినా ఏమియూ హాని లేదు.
శ్లో: 11వటుర్వా గేహి వా యతిరపి జటీ వా తదితరో

నరో వా యః కశ్చి ద్భవతు భవ కిం తేన భవతి

యదీయం హృత్పద్మ్ం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి ll
తా: పశుపతీ! ఓ శివా ! నరుడు బ్రహ్మచారి గాని, గృహస్థుడు గాని, సన్యాసి గాని, యతి గాని, వేరు ప్రవృత్తి కలవాడు గాని మరియు ఎటువంటి వాడైనా గాని అందువలన విశేషము ఏమీ ఉండదు. ఎవరి హృదయ పద్మము నీయందు నిలుచునో నీవు వారి వాడవు అవుతావు. మరియు వారి సంసారభారము అంతా నీ మీదనే వేసుకుంటావు కదా.
శ్లో: 12 గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రి శిఖరే
జలే వా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలమ్
సదా యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే
స్థితంచే ద్యోగో సౌ సచ పరమయోగీ స చ సుఖీ ll
తా:ఓ శివా ! ఈ మనుజుడు యోగి అయి గుహల యందు గాని,వెలుపల గాని, అడవి యందు గాని, పర్వతముల మీద గాని, జలమునందు గాని,అగ్ని యందు గాని నివసింపవచ్చు.అందువలన ప్రయోజనము ఏమియు ఉండదు. అట్లు గాక ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నీ పాదపద్మముల యందు నిలకడగా ధ్యానము కలిగి ఉండునో అతడే ఉత్తమ యోగి కదా ! 
శ్లో: 13. అసారే సంసారే నిజభజనదూరే జడధియా
భ్రమంతం మామంధం పరమకృపయా పాతు ముచితమ్
మదన్యః కో దీనస్తవ కృపణరక్షాతినిపుణః
త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే ll
తా:ఓ పశుపతీ ! శివా! నీ సేవకు దూరమయినదియు, సారము లేనిదియు అగు సంసారమునందు తిరుగుతూ మంద బుద్ధితో ఉన్న నన్ను దయతో రక్షించడం నీకు తగిన పని. ముల్లోకములలోను నాకంటే దీనుడు వేరొకడు నీకు లభింపడు. మరి నాకు నీకంటే దీనుల రక్షించుట యందు మిక్కిలి నేర్పు గల వారు ఎవ్వరునూ లభింపరు. నీవు దీనులకు రక్షకుడవు.నేను అత్యంత దీనుడను.కావున నన్ను నీవే తప్పక రక్షించ వలయును .
శ్లో: 14. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యో హం తేషామపి కిముత బంధుత్వమనయోః
త్వయైవక్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్కర్తవ్యం మదవన మియం బంధుసరణిః
తా: పశుపతి అయిన ఓ శివా ! నీవు దీనులకు దగ్గర చుట్టమువు కదా , నేను దీనులలో అగ్రేసరుడనయి ఉన్నాను.మన ఇద్దరికీ ఇంత దగ్గర చుట్టరికము కలదు కదా. కావున ఓ ప్రభూ నా నేరములు అన్నిటినీ క్షమించి, నన్ను నీవే కరుణించి రక్షించ వలయును కదా, ఇది బంధువుల పద్ధతి.
శ్లో: 15. ఉపేక్షా నోచేత్కిం న హరసి భవద్ధ్యానవిముఖాం
దూరాశాభూయిష్ఠాం విధిలిపి మశక్తో యది భవాన్
శిరస్తద్త్వెధాత్రం న నఖలు సువృత్తం పశుపతే 
కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్ ll
తా: పశుపతీ ! నీకు నాయందు ఉపేక్షా భావము లేనిచో నీ ధ్యానమునందు విముఖత కలిగి ఉండు నట్లున్నూ,మిక్కిలి దురాశతో కూడి యుండేటట్లున్నూ  బ్రహ్మ వ్రాసిన రాతను ఎందుకు  తుడిచి వేయవు? అలా తుడిచి వేయుటకు నీవు అసమర్దుడవు కావు కదా .  నీవు ఆ శక్తి లేని వాడవు అయితే బ్రహ్మ యొక్క నాలుగు తలల మధ్యలో మిక్కిలి ధృఢమైన అయిదవ తలను అవలీలగా చేతి గోటి కోనతో ఎలా త్రుంచి వేసితివి .నా నుదుటన ఉన్న బ్రహ్మ రాతను తుడిచి వేయుమని ప్రార్ధించు చున్నాను.

శ్లో: 16. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్షం స ఖలు భువి దైన్యం లిఖితవాన్
విచారః కో వా మాం విశదకృపయా పాతి శివ తే
కటాక్ష వ్యాపారః స్స్వయమపి చ దీనావనపరః ll
తా: ఓ శివా ! బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడు గానే ఉండ వలెను,ఆయన నాలుగు తలలూ రక్షించతగినవే. మానవుల యొక్క తల రాతలు ఆయనే కదా వ్రాయవలసినది. దాని వలన విచారము ఏదియు లేదు.బ్రహ్మ నీ కడగంటి చూపులు నాకు దక్క వలెనని వ్రాయుట వలననే కదా, నేను నిన్ను తలచు చున్నది, నీవు నన్ను కాపాడు చున్నది.కావున బ్రహ్మ చిరాయువై ఉండవలసినదే.


శ్లో: 17. ఫలద్వా పుణ్యానాం మయి కరుణయా వాత్వయి విభో
ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం
కథం? పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం
నిలింపానాం శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైఃll
తా:ఓపరమాత్మా ! పరమ శివా ! నేను చేసిన పుణ్యము వలన గానీ, నీకు నా యందు కలిగిన దయ వలన గానీ నీవు నాకు ప్రసన్నుడవు అయినా నీ పాద పద్మములు దర్శించ లేకున్నాను , ఎందువలన అనగా నిన్ను దర్శించుటకు వచ్చిన దేవతల గుంపులు తమ తమ కిరీటములు తీసి అడ్డముగా పెట్టి నీకు పాదాభివందనము చేయుచున్నారు కదా, ఆ గుంపులు తొలగి నీ పాద దర్శనము అయిన గానీ నేను ధన్యుడను కాలేను కదా 
శ్లో: 18. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం
వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః
కియద్వా? దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
 కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా ll
తా: శివా! ఓ పరమాత్మా !మూడు లోకములకునూ మోక్షమనెడి మహా ఫలములు ఇచ్చువాడవు నీవు ఒక్కడివే కదా , నీవు అనుగ్రహించి స్వర్గాది పదవులు ఇచ్చిన ఇంద్రాది దేవతలు కూడా అంత కంటే ఉత్తమ ఫలముల కొరకు మరలా నిన్నే సేవించు చున్నారు . భక్తుల మీద నీకు ఎంత దయయో కదా, శివా ! సంపూర్ణ కటాక్షముతో నా యొక్క అహంభావమును పోగొట్టి నన్ను రక్షింపుము.
శ్లో: 19. దురాశాభూయిష్టే దురధిపగృహద్వారఘటకే
దు‌రంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే
మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే 
వదేయం ప్రీతిశ్ఛేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ ll
తా: ఓ శంకరా! దురాశతో నిండినదియూ,దుష్టుల దగ్గర నిలబడేట్లు చేసేదియూ, అసౌకర్య మయినదీ,అంతు లేనిదియూ, పాపములకు నిలయమై కష్టములు కలిగించు ఈ సంసారమునందు ఉన్న నా కష్టాన్ని ఎందుకు తొలగింపవు? బ్రహ్మ దేవునికి ఉపకారము చేయుటకా? ఇదే నీకు ఇష్టము అయితే మేము కూడా క్రుతార్ధులమే కదా !
శ్లో: 20. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః
కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో? ll
తా: శివా! ప్రభూ! కపాలధారీ! ఆదిభిక్షూ!  నా మనస్సనెడి కోతి ఎల్లప్పుడూ మొహమనెడి అడవి యందు తిరుగుతూ జవ్వనుల వెంట పరుగెడుతున్నది. మిక్కిలి చంచలమయిన నా మనస్సు అనే కోతిని భక్తి అనెడి తాడుతో బంధించి నీ స్వాధీనము చేసుకో. శివా! దయ చూపి ఈ పుణ్యము కట్టుకో,బ్రహ్మ పుర్రె నీ చేతిలో ఉన్నది, దానితో పాటు ఈ కోతిని కూడా నీతో పాటు తిప్పుకుంటే నీకు భిక్ష అధికముగా వచ్చును కదా . నాకునూ నీ సాన్నిధ్యము లభించును.
***

No comments:

Post a Comment

Pages