ఆ కళ్ళు - అచ్చంగా తెలుగు
  ఆ కళ్ళు
దొండపాటి కృష్ణ     

     
నేను పుట్టగానే ‘మహాలక్ష్మి’ పుట్టిందన్నారు. ఆ విషయం నలుగురికి తెలియగానే ఊహాగానాలు మొదలయ్యాయి. మంచిదని ఒకరు, భారమని మరొకరు ఏవేవో అన్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లను పెంచడం కష్టమన్నారు. కూతురు పుట్టిందన్న సంబరాల్లో ఒకరుంటే, కోడలు పుట్టిందని, బంధుత్వాలు కలుపుతూ ఆశలు పెంచేసుకునేవారు కొందరు నా వంకే చూస్తున్నారు. అప్పుడా కళ్ళు కర్కశమైనవిగా అన్పించింది.
    అమ్మానాన్నల అడుగుజాడల్లోనే నడుస్తుంటే సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. మంచి జీవితం అందివ్వాలన్న ఆలంబన వారిది. రాక-పోకల ఖర్చులు గురించి లెక్కలేసుకున్నప్పుడా కళ్ళు మేల్కొన్నట్లు కన్పించింది. పెద్దదాన్నవుతున్న కొద్దీ నన్ను చూస్తున్న ఆ కళ్ళు ఆనంద పడుతున్నాయ్. తప్పు చేస్తున్నప్పుడల్లా ఆ కళ్ళు ఎర్రబడుతున్నాయ్. తప్పును ఒప్పుగా మారుస్తున్నప్పుడల్లా ఆ కళ్ళు సమర్దిస్తున్నాయ్.
    సమాజంలోకి అడుగుపెట్టి, నలుగురిలో కలిసినప్పుడు నన్ను నేను నిరూపించుకునే క్రమంలో ఆ కళ్ళు కవ్విస్తున్నాయ్. లోకజ్ఞానం తెలుసుకునే క్రమంలో ఎదురైన సంఘటనలకు, అనుభవాలకు, అనుమానాలకు బాధ పడుతున్నాయ్. విషయమేదైనా పీకలమీద కొచ్చినప్పుడు మాత్రం బరి తెగిస్తాయ్. యౌవనంలోకి ప్రవేశించినప్పుడు ఆ కళ్ళు వర్ణాలద్దుకుంటాయ్. మాయలో పడతాయ్. మాయ చేస్తాయ్. పరువాలను చూసి ఎవరైనా ప్రశంశించినప్పుడు మురిసిపోతాయ్ (పడతికి ప్రశంశలే ఆయురారోగ్యాలు). అంగీకారాన్ని తెల్పుతాయ్. ఆనందంతో మైమరచిపోతాయ్. అప్పుడా కళ్ళల్లో భావాలు కన్పిస్తాయ్.
    అదేంటో అప్పుడే పరిపక్వత సాధించుకున్న రోజునుంచి ఆంక్షలు మొదలవుతాయి. నాన్న నియత్రిస్తుంటాడు. అమ్మ కనిపెట్టుకుంటూ ఉంటుంది. విషయమేంటో చెప్పరు. నన్నెలా కాపాడుకోవాలో అని మధన పడుతుంటారు. బయట తిరగనివ్వరు. అబ్బాయిలతో చనువుగా ఉండనివ్వరు. టీవీ కాస్త ఎక్కువసేపు చూడనివ్వరు. గట్టిగా నవ్వనివ్వరు. వంటలు నేర్చుకోమని అమ్మ గోల చేస్తుంది. ఇంట్లో పని చేయమని తిడుతుంది. నాన్నకు చెబితే, అమ్మ చెప్పినట్లే నడుచుకోమంటాడు. లెక్క చేయకపోతే కొత్త పద్ధతులు ఎక్కడివంటారు.? నేర్పిందేవరని ప్రశ్నిస్తారు..?
    అత్యంత సన్నిహితులకూ నేను నచ్చాల్సిందేనంటారు..! ఇంటర్నెట్ చూస్తుంటే అమ్మ పక్కనే ఉంటుంది. ఫోన్ మాట్లాడుతుంటే నాన్న పక్కనే కూర్చుంటాడు. రాత్రి రూమ్లో లైట్ ఎక్కువసేపు వెలిగితే ఆరా తీస్తారు. అప్పుడా కళ్ళను చూస్తుంటే విసుగొస్తుంది. ఒంటరిననిపిస్తుంది. బయటకేళ్తానంటే అన్నయ్యనో, తమ్ముడినో తోడిచ్చి పంపుతారు. వాళ్ళేమో పక్కనే వస్తూ ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు. బయట పనేంటని అడుగుతుంటారు. అసలలా అడగమని వాళ్ళకెవరు చెప్తారో మరి. అప్పుడా కళ్ళు అనుమానించినట్లుంటాయ్. నామీద నాకే అనుమానాన్ని కల్గిస్తాయ్.
    ఈ బాధలు పడలేక ‘పర్సనల్’ అనే చెప్తే, తర్వాతనుంచి తెలిసిన అమ్మాయినెవరినైనా పంపిస్తారు. స్టోర్లో ఏమేమి కొంటున్నానో ఆమె చూస్తూ ఉంటుంది. అవే ఎందుకు కొన్నావని ఆరా తీస్తుంది. తనకవి లేవని ఒకవైపు బాధపడుతూనే, మరోవైపు తనకి తెలియనవి లేవంటుంది. ఇక్కడేం జరిగిందో పూసగుచ్చినట్లు ఇంటికొచ్చాక అమ్మకు చెప్పేస్తుంది. అప్పుడా కళ్ళను చూస్తుంటే కోపమొస్తుంది. స్వాతంత్ర్యం లేదా అన్పిస్తుంది.
    మంచి మార్కులతో పాసయ్యితే, బడ్జెట్ ప్రాబ్లమని పెద్ద చదువులకు పంపించడం ఆపేస్తారు. పొరపాటున మంచి మార్కులు రాకపోతే నన్ను కనడమే దండగంటారు. ఏం చేసినా దానికో కారణం చెప్తారు. నా మాటకు విలువలేనట్లు మాట్లాడతారు. నోరెత్త కూడదంటారు. నాలో నేనే మ్రగ్గిపోవాలన్నట్లు ప్రవర్తిస్తారు. తప్పులెం చేశానో నాకాలు అర్ధం కాదు. అప్పుడా కళ్ళు పరాయివాళ్ళతో సమానమనిపిస్తుంది. వాళ్లకి, వీళ్ళకి తేడా లేదనిపిస్తుంది. అత్తెసరు మార్కులతో పాసయ్యాను. పొగడనూ లేదు, అలాగని విమర్శించనూ లేదు. ఒకరోజు నాన్నగారు, అమ్మతో అంటుంటే విన్నాను. “అమ్మాయి పాసయ్యింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పెద్ద చదువులు చదువుతాననేది. తప్పినట్లయితే మన పరువు పోయేది.” అని అన్నాడు.
“ఆడపిల్ల కదండీ.. దాని ఇష్టానిష్టలు కూడా ఉంటాయి కదా.. డబ్బుకు అంత లోటు లేదు కదా... చదివిస్తే...” తటపటాయిస్తూ అంది అమ్మ. నేను దగ్గర లేనప్పుడు అమ్మ నన్నే సమర్దిస్తుందని అర్ధమైంది. తల్లి పడే వ్యధ గోచరించింది. అప్పుడా కళ్ళల్లో మాతృత్వ భావన కన్పించింది.
“దాన్ని పెద్ద చదువులు అంటూ చదివిస్తే అంతకన్నా పెద్ద చదువులు చదివిన వాడినిచ్చి కట్టబెట్టాలి. పైగా సమాన హక్కులంటూ గొడవలు. వచ్చేవాడేమన్నా పెద్ద చదువులు చదివిందని కట్నం తీసుకోకుండా ఉంటాడా..? అంత నిజాయితీ పరుడా.! కాదు కదా.. అది అదే.. ఇది ఇదే... ఈ ఖర్చులు, ఆ ఖర్చులు ఎన్నని భరిస్తాం చెప్పు రమ..? ఇప్పుడు పెట్టె ఖర్చునే దాచుకుంటే, దాన్నే రేపు కట్నంగా ఇవ్వొచ్చు. అన్నీ దీనికే ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళేం అయిపోతారు.” అన్నాడు నాన్న. అప్పుడా కళ్ళల్లో కలిగిన వర్ణాలు వర్ణణాతీతం. సమాజంలో గొప్ప కుటుంబంగా తీర్చిదిద్దడానికి ఆయనేన్ని త్యాగాలు చేస్తున్నారో తెల్సింది. ఆ కళ్ళు త్యాగాలతో నిండిన జ్ఞాపకాలు.
ఆ కళ్ళు అప్పుడో కర్తవ్యబోధను చేసినట్లనిపించింది. చిన్నదైనా ఏదో ఒక ఉద్యోగం చేస్తాననేసరికి విమర్శించిన వాళ్ళే, ఏం లెక్కలేసుకున్నారో కాని చిన్న ఉద్యోగాన్ని చూపించారు. అప్పుడా కళ్ళు కరుణించినట్లనిపించింది. పొంగిపోయాను. కాని - ఆఫీసుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు బండిమీద అన్నయ్యే తోడుంటాడు – అచ్చం కాలేజీ రోజుల్లానే.! లోకాన్ని మనస్పూర్తిగా చూడనివ్వరనిపించింది. దానికి కూడా ఓర్చుకుని ఆఫీసులో పనిచేస్తుంటే, పుస్తకాల్లో చదివిన చదువులు అక్కరకు రావని తెలిసొచ్చింది. నీతినిజాయితీలు పనిచేయవు. రిఫరేన్సులే పనిచేస్తాయి. టాలెంట్ కాకుండా కుల మతాలే పెద్ద పాత్రలు పోషిస్తాయి. ఎవరికి వారికి వారి సామాజిక వర్గాల్నే పైకి తీసుకురావాలనే ఆరాటం. ఆ కళ్ళల్లో అదెప్పుడూ కనిపిస్తూ ఉంటుంది.
పాఠశాలల్లో చదువుకునేటప్పుడు, ఎప్పుడైనా మొదటి ర్యాంక్ సాధిస్తే అమ్మా నాన్నలు ఎంతో సంతోషించేవారు. స్నేహితులందరూ గొప్పగా చూసేవారు. ఆఫీస్ అందుకు భిన్నం. ఇక్కడ మనం ముందుంటే వెనకనున్న ఆ కళ్ళన్నీ కుళ్ళుకుంటాయి. విమర్శలు చేయడానికి ప్రేరేపిస్తాయి. కలవడానికి ఒప్పుకోనివ్వవు. ఒక లెవెల్ ను మోసుకోస్తాయి. గుర్తింపు రావడం కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప మనిషి మనస్సులోకి కాదు. అప్పుడా కళ్ళు క్రూరంగా కనిపిస్తాయ్. ఎందుకంటే నేను ఆడపిల్లను. 
ఆడపిల్లంటే – ఆడపిల్లే..! ఎదురించలేని బొమ్మే..! లింగ భేదం రావడానికి కారణాలేంటో తెలుస్తుందిప్పుడే..! చదువులన్నీ మన మనస్సును మసి పూసి మారేడు కాయను చేస్తున్నాయ్. చదువుకున్నదోకటయితే జరుగుతున్నది మరొకటి. అమ్మెందుకు నన్ను సమర్దిస్తుందో తెలిసిపోయింది. ఆమె కూడా ఆడదే కదా..!!
సమాజం మీద ఏవగింపు మొదలౌతున్న రోజుల్లో మన నిర్ణయాలు మన చేతుల్లో ఉండని సదర్భమే పెళ్లి. నా కన్నా తక్కువ చదువుకున్న వాడిని పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టారు. “అబ్బాయి నచ్చాడా..?” అని అమ్మ అడిగేసరికి తెగ సంబరపడిపోయాను. 
నేను నోరు విప్పే లోపునే “అమ్మాయి సిగ్గు అంగీకారమే.! నిన్ను అభిప్రాయం అడిగినట్లు మా రోజుల్లో అడిగేవారు కాదమ్మా.! అది పాత తరం. అబ్బాయిది మంచి కుటుంబం. పొలం ఉంది. సుఖంగా బ్రతుకుతావ్..... అమ్మాయికి అబ్బాయి నచ్చాడు.” అంటూ చక చకా మాట్లాడేసి వెళ్ళిపోయింది. నా ఆనందమక్కడ సిగ్గే అయ్యింది. ఆ సిగ్గే అంగీకారమంటా..! పాతతరం ఇంకా మారలేదనిపించింది. ఆఫీసులో అన్ని అపవిత్రమైన కళ్ళమధ్య పనిచేయడం కన్నా ఆ పొలం, ప్రకృతి కళ్ళల్లో హాయిగా ఒదిగిపోవచ్చనిపించింది. అదే ఊరట..!
నా కన్నా తక్కువ స్థాయే అయినా, అమ్మ వాళ్లకి తన అభిప్రాయాన్నే, నా అభిప్రాయంగా చెప్పేసరికి మాట్లాడలేక ‘సరేనని’ ఒప్పుకోవాల్సిన దీనస్థితిలోకి వెళ్ళిపోయాను. వాళ్ళ పరువు పోవడం నాకిష్టం లేదు. పుత్రుడు పున్నామ నరకం నుండి కాపాడితే, పుత్రిక పరువు ప్రతిష్టలు కాపాడుతుంది. ఎంతగొప్ప కుటుంబమైనా ఆ ఇంటి ఆడపడుచులు పద్ధతిగా నడుచుకున్నప్పుడే వారికి గౌరవ మర్యాదలు. కాదని తప్పటడుగు వేస్తె, ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు మంటకలిసి సమాజం కళ్ళల్లో దోషులుగా నిలబడతారు.
పెళ్లి చేసుకుని వెళ్లేముందు పెళ్ళికూతురు అవతారంలోనున్న అమ్మాయి బాధతో ఏడవడం చాలాశార్లు చూశాను. నా విషయంలో మాత్రం నాకా ఏడుపు రాలేదు. అది చూసి జనం నోళ్ళు వెళ్ళబెట్టారు. ఏడవమని అమ్మ చెవిలో సణుగుతున్నా ఏడవడం లేదని, కనిపించని చోట గట్టిగా గిల్లేసి, నన్ను ఏడిపించేసి, ఆమె కూడా ఏడ్చేసింది. 
మెట్టినింటికి వెళ్లాకగాని తెలీలేదు, అమ్మాయిలేందుకు ముందే ఏడుస్తారో..! ఇక్కడికొచ్చాక అభిప్రాయభేదాలతో పడే బాధలతో ఏడవాల్సి ఉంటుందని ముందే రిహార్సల్స్ గా అప్పుడు ఏడుస్తారని అర్ధమైంది. నా కళ్ళల్లో నీళ్ళు బయటకు రావడం లేదుకాని ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడా కళ్ళు కన్నీళ్ళతో నిండి ఉన్నాయి.
ఎవరైన నా వంక చూస్తూ వెళ్తే అది నా తప్పే.! నేనేవరినైనా చూస్తే అదీ నా తప్పే..! చెప్పిన పని ఆలస్యమయితే తప్పే.! కొంచం బద్ధకించినా తప్పే.! పొలం నుండి రావడం ఆలస్యమయినా తప్పే.! వాళ్ళల్లో కలవడం లేదని కంప్లయింట్స్. మంచికి చెడుకి భేదం గురించేప్పుడైనా మాట్లాడితే తాతకు దగ్గులు నేర్పోద్దంటారు. ఇల్లాలు ఇంటికి వెలుగంటారు. అది ఆమె సామ్రాజ్యమంటారు కాని నేను వేరే సామ్రాజ్యంలో అపరాధిలా మిగిలిపోతున్నాను. ఆఫీసులో పనే నయం. ఏం చేయాలో, ఏం చేయకూడదో కొన్ని నియమాలుంటాయ్. ఇక్కడవేం ఉండవు. వారి మూడ్ ను బట్టి ఉండాలి. బావుంటే మంచిది. లేకపోతే చెడ్డదంతే..! అది కనుక్కోవడమే అసలైన పరీక్ష. అప్పుడీ కళ్ళు అలసిపోయినట్లనిపిస్తాయ్.
ఇలాంటి వాటినుంచి కాస్త విశ్రాంతి కోసమని పుట్టింటికి వెళ్తారని తెలిసింది. నేనూ వెళ్లాను. నాలుగు రోజులు గడిచేసరికి రాయబారాలు మొదలయ్యాయి. వచ్చెయ్యమని ఫోన్లమీద ఫోన్లు. ఇంకో రెండు రోజులు ఉంటానంటే, మెట్టినింటి వారిని చూసి అమ్మానాన్నలు చెప్పే వేదాంతాలు.
శాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు నాలుగు రకాలు. మొదటిది పద్మినీలు – ఇంటికేవరైనా అతిధులు వస్తే వెంటనే మర్యాదలు చేసి, యోగక్షేమాలు కనుక్కునేవారు. రెండొవది హస్తినీలు – భర్త చెప్పగానే వచ్చి మర్యాదలు చేసి, యోగక్షేమాలు కనుక్కునేవారు. మూడోవది చిత్రిణీలు – భర్త బ్రతిమాలి, బ్రతిమాలిన చాలాసేపటి తర్వాత వచ్చి మర్యాదలు చేసి యోగక్షేమాలు కనుక్కునేవారు. ఆఖరిది శంఖిణీలు – వీరు ఎవ్వరు చెప్పినా వినరు. ఏమీ చేయరు. అతిధులు వస్తే పక్కకు తప్పుకుంటారు. వారితో వీరికి సంబంధం లేనట్లుంటారు. కాబట్టి ఇప్పటి ఆడవాళ్ళు అన్నీ కలబోసుకుని ఉండాలని, సందర్భాన్ని బట్టి, మనిషిని బట్టి నడుచుకోవాలని అమ్మ శాస్త్రాల్ని తిరగేస్తుంది. ‘సంప్రదాయ కుటుంబం’ అనే ట్యాగ్ లైనును తగిలించి ఆడదాన్ని మెషీన్ లాగా పనిచేయించుకునే సమాజంతో వాదించేదేలా..!!
అలా వాదించకుండా కుక్కిన పెనులాగా ఉండాలనే పిల్లల్ని ప్రసాదిస్తారు. వారి పోషణ, సంరక్షణే అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. పెద్దయ్యేకొద్దీగా వాళ్ళు నా మాట వినడం లేదు. నేను అమ్మానాన్నల అడుగుజాడలు దాటలేదు. కాని వీళ్ళు మాత్రం నన్ను లెక్కచేయడం లేదు. అంటే నాతొ మారని పాతతరం ఇప్పుడు నా బిడ్డల దగ్గరకొచ్చేసరికి మారిపోయి కొత్త తరమైపోయింది. అప్పుడా తరం కళ్ళు గర్వాన్ని నిపుకున్నట్లు అన్పిస్తుంది.
కోడలిననే ఒక పదవి, భార్యననే ఒక తోడు, తల్లిననే ఒక బాధత తప్ప నాకంటూ ఏదీ లేదనిపిస్తుంది. వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తుంది. మెట్టినింటికొచ్చే రోజున ఏడవనందుకు నాకీ శిక్ష అన్పిస్తుంది. భర్త అడగడు. అత్తామామలు పట్టించుకోరు. బిడ్డలు బిక్కమొహం వేస్తారు. చెప్పినా వాళ్ళకర్ధం కాదు. నోరుండి మాటరాని జీవులు, నోరులేని వస్తువులే నా గోడును రోజూ వింటూ, చూస్తూ విసిగిపోకుండా నన్ను భరిస్తున్నాయి. అప్పుడా కళ్ళల్లో నిస్సహాయత కన్పిస్తుంది.
పెద్దదైందని అమ్మాయికి ఫంక్షన్ చేస్తే చాలా సంబరపడిపోయింది. “పెద్దదాన్ని అయిపోయానా అమ్మా..? నేనిక పెద్దదాన్నా..? ఇక నన్ను తిట్టరుగా..! కొట్టరుగా..!” అంటూ అమాయకంగా అడుగుతుంటే జాలేసింది. దగ్గరికి తీసుకుని హత్తుకున్నాను. వాళ్ళ అవసరాల కోసం మనల్ని పెద్దవాళ్ళని చేస్తారని చెప్తే అర్ధం చేసుకునే వయసు కాదు. ఏ తల్లీదండ్రులకైనా తమ బిడ్డలు మంచి స్థాయిలో, తాము పడిన కష్టం పడకుండా ఉండాలని కోరుకుంటారు. వారు సాధించలేకపోయినవి, కోరుకుని తీరకపోయినవి, తమ బిడ్డల విషయంలో జరగకూడదని స్వేచ్చనిస్తారు. ఎవరి స్థాయి వారిది. మా అమ్మ నా పట్ల ప్రవర్తించినట్లుగా నా బిడ్డల ముందు నేను ప్రవర్తిస్తుంటే చాధస్తమంటూ నన్ను పక్కన పెట్టేస్తున్నారు. పెట్టేయ్యేక ఇంకేం చేస్తారు.? తరం మారింది కదా.! నేనాశించిన దానికంటే బాగానే ఉన్నారు.
తెలిసీతెలియక మాయలో పడి సర్వం అర్పించుకున్న రోజున గుండెలదిరేలా బాధపడినప్పుడు ఆ భావాన్ని కళ్ళే వ్యక్తపరుస్తున్నాయ్. యౌవనాన్ని దాటాక పరిపక్వత సాధించడం ఆ కళ్ళల్లో కన్పిస్తుంది. అప్పుడు మళ్ళీ నేనే నా బిడ్డ కళ్ళల్లో కన్పిస్తున్నాను. మగ, ఆడ అనేది లింగ భేదమే కాని మరేమీ కాదని అందరూ సమానమేనని గుర్తెరిగిన రోజున ఆ కళ్ళు ధైర్యాన్ని నింపుకుంటాయ్.
నింపుకున్న ఆ ధైర్యాన్ని తడారనివ్వకుండా కాచేది తల్ల్లీదంద్రులే.! మనం చేసే ప్రతి పనినీ కప్పిపుచ్చుకోవడానికి ‘సమాజం’ పేరు చెప్పడం సహజం. వయసొచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోకూడదంటారు. తన ఉనికిని చాటుకోవడానికి ఒక మగాడికిచ్చి తోడుగా పంపించాలని సమాజమే నిర్దేశించిందంటా..! మగాడికి తోడుగా ఉండాలని చెప్పిన ఈ సమాజం ఆడదానికి మగాడు తోడుగా, రక్షణగా ఉండాలని చెప్పకుండా వంశాభివృద్ధినే పెంచుకోమని చెప్పిందేమో.! అలా అని ఎవరైనా వాదిస్తే మాత్రం నా మనస్సు తట్టుకోలేదు. వాళ్ళ కళ్ళల్లో క్రూరత్వం ఛాయలు కన్పిస్తాయ్.
ఇంత మంచి సమాజంలో బ్రతకలేక, బ్రతుకును చెడగోట్టుకున్న సంఘటనలెన్నో. వాటిపై పోరాటాలుండవు. పొరపాటున ఎవరైనా ధైర్యం చేసి ముందుకొస్తే ‘మహిళా సంఘాల’ గోల రోజురోజుకు పెరిగిపోతుందంటారు. కాలం చేసిన వారివైపు చూస్తూ ఆ కళ్ళు నిర్యాణమిస్తాయ్. మళ్ళీ ఈ జీవితచక్రం అలసిపోకుండా తిరుగుతూనే ఉంటుంది నిర్విరామంగా..!
ఈ సమూలాగ్ర మార్పులకు, పరిణామాలకు కారణమొక్కటే.! మేమే..!! అంటే ఆడది.. ‘ఆడది’ అని తెలిస్తే చాలు చాలామంది కళ్ళు విప్పారతాయి. తెలియని క్రోదం మొదలవుతుంది. వాదోపవాదాలు..! ఆడదాని వలెనే రామాయణం జరిగిందంటారు. మహాభారతానికీ ఆడదే మూలమంటారు. మగాడు ఆత్రానికి మేమే కారణమంటా..! ఏంటో ఈ లోకం..! మగాడు మాత్రం దేనికీ కారణం కాదు. తాగొచ్చి కొట్టినా నోరెత్తకూడదు. దుబారా ఖర్చులు చేసినా చూస్తుండిపోవాలి. గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా సర్దుకుపోవాలి. సర్వరోగాలు (ఇబ్బందులు) ఆడవారి వలనే కలుగుతాయని వితండ వాదన చేస్తారు. మాకు కలిగే ఇబ్బందులకు మాత్రం కారకులేవ్వరూ ఉండరు. మాకు మేమే కారణం. మాకు మేమే సృష్టి. అందరికీ మాతో ఒక్కటే ‘పని’. అది కూడా అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు...!!!
-: సమాప్తం :-

No comments:

Post a Comment

Pages