‘మరపు’ - శాపమా? వరమా? - అచ్చంగా తెలుగు

‘మరపు’ - శాపమా? వరమా?

Share This
మరపు’  - శాపమా? వరమా?
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

అందమైన పచ్చటి కొండల మధ్యనుండీ ప్రవహిస్తోంది ఒక సెలయేరు. కదంబవనం అనే ఊరు ఆ ప్రాంతానికి అతి దగ్గరలో ఉంది. అక్కడి ప్రజలు ప్రకృతి సౌందర్యానికి ఇబ్బంది కలుగకుండా తమ ఊరిని అభివృద్ధి చేసుకున్నారు. ఆ ఊరిలోని ఒక ఇంటర్నెట్ బ్రౌసింగ్ సెంటర్ జనంతో కిటకిటలాడుతోంది. అందుక్కారణం ఆ రోజు ఇంటర్ ఫలితాలు వెలువడడం. అక్కడున్నవారంతా కంప్యూటర్లలో తమ తమ ఫలితాలు చూసుకునే పనిలో ఉన్నారు.

అర్జున్ కూడా ఆ ఏటి ఇంటర్ పరీక్షలు రాశాడు. కానీ అది అతను ఇంటర్ పాస్ అవ్వడానికి చేసిన రెండో ప్రయత్నం. ఫలితమెలా ఉంటుందోనని అసలే కంగారుగా ఉన్న అర్జున్ కు అక్కడి వాతావరణం మరింత దడ పుట్టించింది. సెంటర్ లోపలికెళ్లిన కొందరు ఆనందంగా బయటికొస్తూ ఉంటే మరి కొందరు మాత్రం దిగులుతో ,ఏడుపు ముఖాలతో వస్తున్నారు. అది చూసిన అర్జున్ కు మరింత భయంవేసి చేతులు చల్లబడ్డాయి. తన వంతు రానే వచ్చింది. 

కంప్యూటర్ ముందు కూర్చుని హాల్ టికెట్ లోని ఒక్కొక్క నెంబర్ టైపు చేస్తూ ఉంటే తన గుండె వేగం పెరుగుతూ వచ్చింది. ఫలితం "ఫెయిల్" అని చూసి ‘ఛ!’ అంటూ నిట్టూర్చాడు అర్జున్. 

ఇంట్లో తన ఫలితాల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న అమ్మ గుర్తుకు వచ్చింది అర్జున్ కి. 

‘నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మకు పరీక్షల్లో తప్పానన్న విషయం ఎలా చెప్పను? నా ముఖం ఎలా చూపించను? ఈ అవమానం భరించడంకన్నా ఏట్లో దూకడం మేలు’, అని అనుకున్న అర్జున్ నేరుగా వారి ఊరి పొలిమేరల్లో ప్రవహిస్తున్న సెలయేటి వైపుకు వెళ్ళాడు.  

సెలయేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందులో దూకితే ప్రాణాలతో బయటకు రావడం ఎంతటి గజ ఈతగాళ్ళకైనా కష్టమే! ఆవేశంగా వెళ్లి సెలయేటి పక్కనున్న బండరాళ్ళపై నుంచున్న అర్జున్ కు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది.

‘నా తోటి వారంతా పై చదువులకు వెళ్ళిపోతే నేనొక్కడినే ఎందుకిలా మిగిలిపోయాను?’, అని తనలో తాను కుమిలిపోతున్న అర్జున్ కు, ‘నీకేదీ గుర్తుండదేం? అంత మతిమరుపైతే ఎలా? చదివినవి పరీక్షలో గుర్తురాలేదంటే ఏంచేసేదీ?’, అని అమ్మ కోప్పడిన క్షణాలూ, ‘ఒట్టి మట్టి బుర్ర. ఏదీ జ్ఞాపకం ఉండదు. ఇంకా ఎన్నేళ్లు ఇంటర్లోనే గుంటపూలు పూస్తావురా?’, అని నాన్న పెట్టిన చీవాట్లూ, ‘పాఠాలు మరిచిపోతే మంచి భవిష్యత్తును కూడా మర్చిపో’, అని అన్న మాస్టారి తిట్లూ, ‘వీడికికూడా కర్ణుడల్లే శాపం ఉన్నట్లుందిరా. పరీక్షల్లో అన్నీ మర్చిపోతాడు’, అని ఎగతాళి చేస్తూ తన స్నేహితులన్న మాటలూ గుర్తుకొచ్చాయి.

కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఉంటే  అర్జున్ చేతికున్న తాయత్తులు ముఖానికి తగిలాయి. 

‘అవును. నిజమే నాకేదో శాపం ఉన్నట్లుంది. అందుకే పరీక్షల్లో ఏదీ గుర్తుండదు. నేను మొక్కని దేవుడు లేడు. భగవంతుడి పై నమ్మకమున్నా నాకు విజయం దక్కలేదంటే ఈ సెలయేరొక్కటే నాకు గతి’, అని అనుకుంటూ సెలయేటి వంక చూశాడు అర్జున్.

అంతలో, “తప్పు నాయనా! అలా ఆలోచించడం చాలా తప్పు. మరణం సమస్యకు పరిష్కారం కాదు”, అని ఒక గంభీరమైన కంఠస్వరం వినబడేసరికి ఉలిక్కిపడి పక్కకు చూశాడు అర్జున్. అక్కడొక సాధువు నుదిటినిండా విభూతిరేఖలు పెట్టుకుని, మెడనిండా రుద్రాక్షలు ధరించి, కాషాయ వస్త్రం లో కనిపించాడు. ఆ సాధువు అర్జున్ కు దాదాపు అనుకున్నంత దగ్గరగా ఉండేసరికి ముందు కొంచెం భయపడిన అర్జున్ తన మనసులో అనుకుంటున్న విషయం ఆయనకెలా తెలిసిందబ్బా అని తర్వాత ఆశ్చర్యపోయాడు.  

“సందేహంలేదు. మీరెవరో మహానుభావులు. మీరే నాకు పరిష్కారం చూపాలి”, అంటూ ఆయన పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసాడు అర్జున్.

ఆ సాధువు చిరునవ్వుతో, “లే నాయనా! అన్ని సమస్యలకూ ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. నీకేంకావాలీ?”, అని అర్జున్ ను  ఓదారుస్తూ అడిగాడు సాధువు. 

“మీరు నేనేమడిగినా ఇవ్వగలరని నాకు తెలుసు. నా మతిమరుపు నన్ను తిప్పలు పెడుతోంది. అసలా భగవంతుడు ఈ మరపును మనుషులకు ఎందుకిచ్చాడో! నాకస్సలు మరపే లేకుండా అన్నీ గుర్తుండేలా చెయ్యండి స్వామీ! నేను మర్చిపోయిన అన్ని విషయాలూ నాకు గుర్తుకొచ్చేయాలి. అలాగైతే మళ్ళీ చదవక్కర్లేకుండానే నా పరీక్షలు పాస్ అయిపోవచ్చు”, అంటూ మళ్ళీ సాధువు పాదాలపై పడ్డాడు అర్జున్.

“ఇదిగో నాయనా! ఈ తీర్థం తీసుకో!”, అంటూ అర్జున్ చేతిలో ఒక ద్రావకం పోశాడు ఆ సాధువు. 

అర్జున్ కళ్ళకద్దుకుని ఆ ద్రావకం తాగేశాడు. 

“ఇక నువ్వేదీ మర్చిపోవు. నువ్వు కోరుకున్న విధంగానే మర్చిపోయినవి కూడా నీకు గుర్తుకొచ్చేస్తాయి”, అని సాధువు చిరునవ్వుతో అర్జున్ ను ఆశీర్వదించి ఎటో వెళ్ళిపోయాడు.  

ఆనందంతో అర్జున్ ఇంటికెడదామని అనుకుంటూ లేచాడు. కానీ బాగా మత్తుగా అనిపించడంతో అక్కడే ఒక చెట్టు కింద నిద్రపోయాడు. 

***



చాలా సేపటి తరువాత ఎవరో తట్టి లేపినట్లయ్యి లేచాడు అర్జున్. చుట్టూ చూసిన అర్జున్ కు ఎందుకో అంతా కొత్తగా కనబడింది. 

‘నాకసలేమయ్యింది? నా పేరు త్రిలోకేశం. నేను సీతాపురం గ్రామ సర్పంచిని. నేను మా ఊళ్ళో కదా ఉండాలి? ఇక్కడెందుకున్నాను?’, అని తనవంక తానొకసారి చూసుకుని ఆశ్చర్యపోయాడు అర్జున్. ఎందుకంటే తన వయసు అరవై నాలుగనుకుంటే దేహం మాత్రం యవ్వనంలో ఉన్న యువకుడిది. అప్పుడు తనకు సాధువిచ్చిన ద్రావకం గుర్తుకు వచ్చి దాని మహిమ వల్ల తన గత జన్మ జ్ఞాపకం వచ్చిందన్న విషయం అర్ధమయ్యింది అర్జున్ కి. ఆనందాశ్చర్యాలతో తన ఒళ్ళంతా గగుర్పొడిచి వెంటనే సీతాపురం వెళ్లాలని అనిపించి బయలుదేరాడు అర్జున్. 

‘సీతాపురం’ అన్న గ్రామం తమ ఊరికి దగ్గర్లో ఉండటంవల్ల దాని గురించి ఎన్నో సందర్భాలలో అర్జున్ విన్నాడు. కానీ తనకు ఆ ఊరితో ఇలా గత జన్మ సంబంధం ఉంటుందని మాత్రం ఏనాడూ అనుకోలేదు.

సీతాపురం గ్రామంలోకి అడుగుపెట్టిన అర్జున్ కి ఆ గ్రామంలోని వీధులు సుపరిచితంగా తోచాయి. అక్కడి నగల దుకాణం చూడగానే పూర్వ జన్మలో తన భార్య శాంతమ్మ గుర్తుకొచ్చింది. 

‘నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న శాంతం..ఇప్పుడెలా ఉందో ఏమిటో! నన్నిలా చూస్తే ఎలా స్పందిస్తుందో చూడాలి. వెంటనే వెళ్లి ఆమెను కలవాలి. నేనున్న ఇంటికి దారి కూడా గుర్తుగానే ఉందే!’, అని అనుకుంటూ అర్జున్ గతంలో తనున్న ఇంటివైపు నడిచాడు. దారిలో శివాలయం కనబడేసరికి, ‘అరె! ఊరిలో చాలా మార్పులే వచ్చాయి! ఈ ఆలయానికి రాజగోపురం కట్టించారే! రాఘవ శాస్త్రిగారు ఇంకా ఇక్కడే ఉన్నారో లేరో. ఓసారి పలకరించి వెడతాను', అని గుడిలోకి ప్రవేశించాడు అర్జున్.

మధ్యాహ్నం కావస్తూ ఉండటంవల్ల గర్భగుడి మూసి ఉంది. కానీ ఆ పక్కనే ఎవరో ఒక ముసలాయన రశీదులు లెక్క చూసుకుంటున్నారు. అర్జున్ ఆయన దగ్గరికెళ్లి, ఆయనే రాఘవశాస్తి అని గుర్తించి, “నమస్కారమండీ! నా పేరు అర్జున్. మీకు త్రిలోకేశంగారు గుర్తున్నారా?”, అని అడిగాడు. 

ఆ పేరు వినగానే రాఘవశాస్త్రి ముఖం చిట్లించి, “త్రిలోకేశమా? ఆయన పోయి చాలా కాలమయ్యింది కదా? ఇంతకీ మీరెవరు?”, అని అడిగాడు.

“నాకు ఆయన బాగా తెలుసునండీ! వారి ఇంటికెడుతూ ఇలా వచ్చాను. వారి ద్వారా మీ గురించి కూడా విన్నాను. పరిచయం చేసుకుందామని వచ్చాను”, అన్నాడు అర్జున్.

ఆ మాటలకు రాఘవశాస్త్రి నవ్వి, “ఇంకెక్కడి ఇల్లూ? మీకు తెలిసే ఉంటుంది. త్రిలోకేశం గ్రామ సర్పంచిగా ఉండేవాడు. మంచి మనసున్న మనిషి కాడాయన. ఈ గ్రామంలో సరైన బడి లేదని, అన్ని వసతులతో బడి కట్టిస్తానని గ్రామ ప్రజలందరినీ ఒప్పించి చందాలు వసూలు చేసి, ఆ వచ్చిన సొమ్మంతా తన స్వార్ధానికి వాడేసుకుని ఉన్న బడిని కూడా మూయించేసాడు. ఆయనున్నన్నాళ్ళూ బడికి సంబంధించిన పనులేవీ మొదలుకాకపోయేసరికి ఇంకా సరిపడా డబ్బు పోగు కాలేదేమోనని అనుకున్నారంతా. ఆయన పోయాక ఆయన చేసిన మోసం బయటపడి అందరూ తిట్టుకున్నారు. పాపం ఆయన భార్య శాంతమ్మ ఆ అవమానం భరించలేక త్రిలోకేశం పోయిన ఏడాదికే కన్ను మూసింది. వారికి పిల్లలు లేరు. అందుకే వారి ఇల్లు ఎవరో వారి దూరపు బంధువులు తీసుకుని కూలగొట్టి దాని స్థానంలో వేరే భవనాలు కట్టుకున్నారు. పోయి ఏలోకానున్నాడో కానీ ఆ త్రిలోకేశం కనబడితే అప్పుడు డబ్బిచ్చిన వారెవ్వరూ ఊరికే  వదిలిపెట్టరు”, అని అన్నాడు

అది విన్న అర్జున్ గతుక్కుమన్నాడు. తను గత జన్మ లో చేసిన పనికి చాలా సిగ్గనిపించింది. ఆ గ్రామ ప్రజలకు కలిగిన అన్యాయం, అమాయకురాలైన తన భార్య శాంతమ్మ పరిస్థితి తలచుకుంటే తనకు విపరీతమైన బాధ కలిగింది. 

‘ఛి! నేనింత స్వార్ధంగా ఉండేవాడినా? నేనే త్రిలోకేశమన్న సంగతి తెలిస్తే ఈ గ్రామ ప్రజలు ఊరుకుంటారా? ఇటువంటి పాపం చెయ్యబట్టే నెమో నాకు ఈ జన్మలో సరైన చదువు అబ్బకుండా శాపం తగిలింది’, అని మనసులో అనుకున్నాడు అర్జున్.

ఆలోచనలో పడిన అర్జున్ ను చూసి రాఘవ శాస్త్రి, “ఏం నాయనా? ఇంతకీ నీకు త్రిలోకేశంగారి సంబంధీకులతో ఏమిటి పనీ?”, అని అడిగాడు.

“ఏమీ లేదండీ! ఊరికే చూసి పోదామనుకున్నా! అంతే. ఇంతకీ ఇప్పుడు ఈ ఊళ్ళో మంచి బడి ఉంది కదండీ?”, అడిగాడు అర్జున్.

“ఆ! లేకేం? ఉంది నాయనా. కానీ పేరుకు మాత్రమే అది బడి. అక్కడ వసతులేవీ పెద్దగా లేవు సరికదా అక్కడ పనిచేసే టీచర్లకూ పాఠాలు చెప్పే శ్రద్ధ లేదు. అందుకని పిల్లలందరినీ వేరే ఊళ్లలో పెట్టి చదివించుకుంటున్నారు ఇక్కడి వారంతా. మారు మూల గ్రామం కాబట్టి ఈ సమస్య గురించి ఎవ్వరికీ పట్టదు. ఎవరైనా ముందడుగు వేద్దామనుకున్నా, త్రిలోకేశం లాంటి స్వార్ధపరుడిని చూశాక అటువంటివారి మాటలు నమ్మడం ఇక్కడి జనాలకు కష్టం!”, అని నిట్టూరుస్తూ రశీదుల కట్ట పట్టుకుని ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు రాఘవ శాస్త్రి.

అర్జున్ కు ఇక అక్కడ ఉండాలని అనిపించలేదు. తను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తే బాగుండు అని అనుకుంటూ అక్కడి నుండీ తమ ఊరు వెళ్లే బస్సు ఎక్కాడు అర్జున్. చల్ల గాలికి చిన్న కునుకు పట్టింది. తను దిగవలసిన స్టాప్ వచ్చాక కండక్టర్ వచ్చి అర్జున్ ని తట్టి లేపాడు. కంగారుగా లేచిన అర్జున్ బస్సు దిగి, ‘ఎక్కడున్నా?’, అని చుట్టూ చూశాడు. 

మళ్ళీ అర్జున్ మనసులో ఏవో జ్ఞాపకాలు రావడం మొదలయ్యాయి.  

‘నేను కుటిలేంద్ర అనే జమీందారుని. మాది స్వర్ణవరం. ఇదేంటి? ఇవికానీ నా అంతకు ముందు జన్మకు సంబంధించిన విషయాలు కాదు కదా? ఎన్నో ఏళ్ళ క్రితం ఆ కుటిలేంద్ర చేసిన దుర్మార్గాలు, అరాచకాలూ ఇప్పటికీ అందరూ కధలు కధలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయ్యబాబోయ్! నేనే ఆ కుటిలేంద్ర అని తెలిసిందో నా పనిక అంతే!! ఒక్కడు కూడా నన్ను చితకొట్టకుండా వదిలిపెట్టడు! నేనేదో ఈ జన్మలో వచ్చిన సమస్యను పరిష్కరించుకునే మార్గం చూసుకోక అనవసరంగా మర్చిపోయినవన్నీ జ్ఞాపకం రావాలని కోరుకున్నాను. జన్మజన్మలలో నేను చేసిన తప్పులు ఒక్క జన్మలో సరిదిద్దుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రతి క్షణం ఆ తప్పులు గుర్తుకొస్తూ ఉంటే ఇక ప్రశాంతంగా జీవించడం అసాధ్యమైపోతుంది.  నేను వెంటనే ఆ సాధువును కలవాలి’, అని అనుకుంటూ సాధువును వెతుక్కుంటూ సెలయేరు దగ్గరకు వెళ్ళాడు అర్జున్.

ఆ సమయానికి సాధువక్కడ ఒక చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు. ఆయనను చూస్తూనే అర్జున్, “స్వామీ! రక్షించండి! నేను నా గత జన్మ లు మర్చిపోయేలా చెయ్యండి! ఇక నా వల్ల కాదు. నేను చేసిన తప్పులను సరి దిద్దుకోవడం నా తరం కాదు. మీరే నన్ను రక్షించాలి”, అని అన్నాడు.

“చూశావా అర్జున్! పరమాత్ముడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు. మనిషికి మరపు కూడా ఒక వరమే. లేకపోతే గత జన్మ స్మృతులు మనుషుల మనసులను అల్లకల్లోలం చేసేస్తాయి. నువ్వు పరీక్షలు పాస్ అవ్వడానికి కారణం నీ మతిమరుపు అని నువ్వనుకుంటున్నావు. కానీ ఆ మతిమరపుకు మూల కారణం చదివేటప్పుడు శ్రద్ధ పెట్టకపోవడమని గ్రహించు. ఏ కార్యమైనా సఫలం కావాలంటే భగవద్భక్తితోపాటూ స్వయం కృషి కూడా ఉండాలి. చేసే పని ఇష్టంతో చేస్తే ఏకాగ్రత అదే కుదురుతుంది. ఏకాగ్రతతో చదివితే నువ్వు తప్పక విజయం సాధిస్తావు. మిగతా పరిస్థితులను అనుకూలంగా చెయ్యగలిగే శక్తి ఆ భగవంతుడికుంది అని నమ్ము”, అన్నాడు సాధువు.

“స్వామీ! నాకు సత్యం బోధపడేలా చేశారు. సందేహం లేదు. నేను నమ్ముకున్న ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చాడు. నేను మళ్ళీ మునుపటిలా పాత విషయాలన్నీ మర్చిపోయేలా చెయ్యండి. మీరు చెప్పిన ఈ ఉపదేశం మాత్రం నేనెన్నటికీ మరువకూడదు. ఇకపై నేను శ్రద్ధపెట్టి చదువుతా”, అన్నాడు అర్జున్.

సాధువు తన కమండలం నుండీ కొద్దిగా నీళ్లు తీసుకుని అర్జున్ పై చల్లబోయేంతలో, “ఒక్క క్షణం స్వామీ! నేను సీతాపురం గ్రామంలో బడి కట్టించాలన్న విషయం మాత్రం నాకు గుర్తుండేలా చెయ్యండి”, అని వేడుకున్నాడు అర్జున్.

“తధాస్తు!”, అని అర్జున్ పై నీళ్లు చల్లాడు సాధువు. అర్జున్ కి ఒక్కసారి కళ్ళు తిరిగినట్లయ్యాయి. మళ్ళీ మామూలుగా అయ్యేసరికి తన ఎదుట సాధువు కనిపించలేదు కానీ ఇంట్లో తన కోసం ఎదురు చూస్తున్న అమ్మ గుర్తుకొచ్చింది. వెంటనే ఇంటికి పరిగెత్తాడు అర్జున్. 

***

ఇల్లు చేరేసరికి అర్జున్ అమ్మ కంగారుగా కళ్ళనీళ్లతో ఎదురు వచ్చి, “రా నాన్నా, రా! ఇంతసేపు రాకపోయేసరికి ఎటు వెళ్లిపోయావో అని నేనూ, నాన్నా తెగ ఆందోళన పడుతున్నాము. ఆ వెధవ ఇంటర్ పరీక్షలు పోతే పోయాయి. మళ్ళీ రాసుకుందువుగాని. నువ్వు పిచ్చి ఆలోచనలేమీ చెయ్యకు నాయనా! నీ మీదే మా ప్రాణాలన్నీ పెట్టుకున్నాము”, అంటూ కౌగలించుకుంది. ఆప్యాయంగా తల్లి ఇచ్చిన ఆ కౌగిలి అర్జున్ కి ఎంతో ఆనందాన్ని, ధైర్యాన్ని కలిగించింది. 

“ఈ సారి తప్పకుండా పాస్ అవుతానమ్మా! చూస్తూ ఉండు”, అని అన్నాడు అర్జున్.  

సాధువు మాటలు వంట పట్టించుకున్న అర్జున్ శ్రద్ధతో, ఇష్టంతో చదవడం మొదలు పెట్టాడు. మళ్ళీ తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా ఇంటర్ తో పాటూ పై చదువులన్నీ మంచి మార్కులతో పూర్తి చేసి తమ ఊరిలోనే ప్రభుత్వ కొలువు సంపాదించాడు అర్జున్. 

సాధువు మహిమ వల్ల సీతాపురం గ్రామంలో బడి కట్టించాలన్న విషయం మాత్రం అర్జున్ మనసులో గట్టిగా నాటుకుపోయింది. తనకొచ్చే డబ్బులో ప్రతి నెలా కొంత ఖర్చుపెట్టి ఆ గ్రామానికి ఎదో ఒకటి చేస్తూ ఆ గ్రామ ప్రజల మన్ననలు పొందిన అర్జున్ ఉద్యోగంలో కూడా మంచి పేరు సంపాదించాడు. తన పలుకుబడిని ఉపయోగించి సీతాపురం గ్రామంలో అతి పెద్ద పాఠశాలను అన్ని వసతులతో కట్టించాడు అర్జున్. ప్రభుత్వం వారు కూడా అందులో మంచి అర్హతలున్న టీచర్లను నియమించారు. దాంతో సీతాపురం గ్రామం పేరు పక్క ఊళ్ళల్లో కూడా ప్రసిద్ధి చెంది చుట్టు పక్కల ఊళ్ళల్లోని పిల్లలు కూడా అక్కడి బడికే రావడం మొదలుపెట్టారు. అర్జున్ సీతాపురం గ్రామానికి చేసిన మేలు గుర్తించిన ఆ గ్రామ ప్రజలు అర్జున్ కి సన్మానం ఏర్పాటు చేసి అతని సేవలను వేనోళ్ళ పొగిడారు. అర్జున్ తల్లిదండ్రులు తమ బిడ్డను చూసి గర్వపడ్డారు.

కానీ ఎన్నో సందర్భాలలో ఎంతో మంది, ‘మీకూ సీతాపురం గ్రామానికీ ఉన్న సంబంధం ఏమిటీ?’, అని అర్జున్ ని అడుగుతూ ఉండేవారు.  అర్జున్ సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో సరిపెట్టేవాడు. ఎందుకంటే ఆ బంధం వెనకున్న కారణమేమిటోనని ఎంత ఆలోచించినా సాధువిచ్చిన వర ప్రభావంవల్ల కావచ్చు- అర్జున్ కి కూడా ఎన్నడూ గుర్తు రాలేదు!
*****

No comments:

Post a Comment

Pages