బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-12 -గరుడ వాహనం22-11-2019 - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-12 -గరుడ వాహనం22-11-2019

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు--12  -గరుడ వాహనం
 డా.తాడేపల్లి పతంజలి 


15-4  సంపుటము: 1-92

ఇటు గరుడని నీవెక్కినను
పటపట దిక్కులు బగ్గనబగిలె            ॥పల్లవి॥
01.
ఎగసిన గరుడని యేపున ‘ధా’ యని
జిగిదొలఁక చబుకు చేసినను
నిగమాంతంబులు నిగమ సంఘములు
గగనము జగములు గడగడ వడకె      ॥ఇటు॥
02.
బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నఖిలములు జర్జరితములై
తిరుపున నలుగడ దిరదిరదిరిగె         ॥ఇటు॥
03.పల్లించిన నీ పసిడి గరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షస సమితినీ మహిమ
వెల్లి మునుగుదురు వేంకటరమణా       ॥ఇటు॥

భావం
అన్నమయ్య ఈ కీర్తనలోగరుత్మంతుని వర్ణన చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాలలో అయిదవరోజురాత్రి వచ్చు  గరుడ సేవ చాలా ప్రాముఖ్యం కలిగినది.
ఈ సందర్భంలో ప్రసిద్ధమైన ఈ ఇటు గరుడని నీవెక్కినను అను కీర్తనభావ విశేషాలు తెలుసుకొందాం.
  
పల్లవి 
ఓ వేంకటేశ్వర! ఇటు రా గరుడా! అని చెప్పి నీవు గరుత్మంతుని ఎక్కినప్పుడు ( లేదా ఇక్కడ – యుద్ధరంగంలో నువ్వు గరుత్మంతుని ఎక్కినప్పుడు ) దిక్కులన్నీ ఒక్కసారిగా అతి వేగంగా పగిలిపోయాయి. అనగా గరుత్మంతునిరెక్కల చప్పుడు చాలా ఎక్కువగా ఉన్నదని భావం.(దిక్కులు1. తూర్పు, 2. పడమర, 3.ఉత్తరము, 4. దక్షిణము, 5. ఈశాన్యం, 6. నైరృతి, 7.వాయవ్యము, 8. ఆగ్నేయము, 9. ఊర్ధ్వదిశ, 10.అధోదిశ ) 
01.
 ఓ వేంకటేశ్వర! నిన్ను మోస్తూ ఒక్కసారిగా ఎగిరి పైకిలేచిన గరుత్మంతుని “థా “అని చప్పుడు చేస్తూ(కొరడా చప్పుడు) ప్రకాశవంతంగా నువ్వు కొరడాతోకొట్టగా వేదాంతములు, వేదాలు, ఆకాశము, లోకాలు,(స్వర్గమర్త్యపాతాళములు. భూలోకము, భువర్లోకము,  సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము - ఈయేడును ఊర్ధ్వలోకములు. అతలము, వితలము,  సుతలము,  రసాతలము, మహాతలము,తలాతలము, పాతాళము - ఈ యేడును అధోలోకములు) గడగడ వణికిపోయాయి.
02.
ఓ వేంకటేశ్వర!  కఠినముగా నువ్వుగరుత్మంతుని పరిగెత్తిస్తుండగా  నీ కోపము వ్యాపిస్తుండగా, వరుసగా ప్రపంచములో  సమస్తవస్తు సమూహం శిథిలములైనాలుగు  పక్కల గిరగిర తిరిగాయి.
03
. ఓ వేంకటేశ్వర!   జీను వేసిఉన్న   బంగారపు గరుత్మంతునిపై  వేగముగా నువ్వు ఎక్కినప్పుడు రాక్షసుల గుండె భయంతో ఝల్లుమంది.  నీ మహిమలో   అందరు మునిగిపోతారు.

విశేషాలు
కంచి గరుడ సేవ' కంటె ! తిరుమల గరుడసేవ అత్యంత వైభవంగా ఇప్పుడూ ప్రతి ఏటా జరుగుతోంది. గరుడ వాహనంపైవిహరించే  స్వామి వారికి, నిత్యం మూలమూర్తి అభరణాలైన మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను అలంకరిస్తారు. గరుడోత్సవంలో స్వామి పక్కన దేవేరులుండరు. ఇలాగరుడవాహన సేవలో అనేక విశేషాలు ఉన్నాయి. గరుడోత్సవాన్ని తిలకిస్తూ అన్నమయ్య పాట పాడుకోవటం జీవిత విశేషం. 
***

No comments:

Post a Comment

Pages