భావోద్వేగం - అచ్చంగా తెలుగు
  భావోద్వేగం
 శ్రీపతి వాసుదేవమూర్తి




మనిషిని నేను ఋషిని కాను
భావోద్వేగాన్ని అదుపు చెయ్యలేను
కన్నీరే కదా కారితే కారనీ ఖర్చయ్యేదేముంది
పైగా కాస్త బరువు తగ్గుతుంది.


నా భావనలో తప్పుందని నాకు తెలుసు
దానికి నువ్వు బాధ్యురాలివి కావు అని కూడా తెలుసు
భారం మొయ్యలేని ప్రతిసారి ఇలా బయట పడిపోతుంటా
నన్ను క్షమించు...


ఎప్పుడు పుడుతుందో
ఎలా పుడుతుందో
ఎందుకు పుడుతుందో తెలియదు
కానీ అది పుట్టేసరికి సమయం మించిపోయింది
ఇప్పుడు మన మధ్యన దూరం ఒక జీవిత కాలం
మరుక్షణం కరుణించేంత సహృదయం నీకున్నా
ఆ కరుణని సహించేంత సహనం నాలో లేదు.

ప్రేమకరుణ రెండు వేరు వేరు భావాలు
తేడాని నా మనసు పసికట్టేస్తుంది
అప్పుడు భారం మరింత పెరుగుతుంది.

మనం రైలు పట్టాల్లాంటి వాళ్ళం
కలిసే ఉన్నా కలుసుకోలేం
ఒక వేళ కలిస్తే ప్రమాదం జరుగుతుంది
దాన్ని ప్రపంచం కథలు కథలుగా చెప్పుకుంటుంది.

మన్నించు...!
మరోసారి నీ మనసు నొప్పించాను
మనిషినే కదా…!!
భావోద్వేగాన్ని అదుపు చెయ్యలేను.
***

No comments:

Post a Comment

Pages