గతి తప్పిన జ్ఞాపకాలు - అచ్చంగా తెలుగు

గతి తప్పిన జ్ఞాపకాలు

Share This
గతి తప్పిన ఙ్ఞాపకాలు 
 -సుజాత. పి.వి. ఎల్ 


నాలో నన్నే వెతుక్కుంటున్న వైనం
విచిత్రంగా తోస్తోంది!

నువ్వు లేని ’నేను’ ని
చూసుకుంటున్న ప్రతిసారీ
శూన్యమే కనిపిస్తోంది!

నీ పలుకుల జల్లు లేకుండానే
ఋతువులు కదిలిపోతుంటే
కాలం నన్ను వెలివేసిందేమో అనిపిస్తోంది.

గతి తప్పిన ఙ్ఞాపకాలు
ఒక్కొక్కటీ గుర్తొస్తుంటే
నా అస్తిత్వం నన్ను
నిలదీస్తున్నటనిపిస్తోంది.

నీ పలుకుల గంధాన్ని
మోసుకు రాలేని గాలిని
శ్వాసిస్తుంటే జ్వాలని
గుండెలలో నింపుకుంటున్నట్టుగా ఉంది.

నేలని యుగాలు తడపగలిగేన్ని మేఘాలు
నా కను కొనలలో మోస్తున్నంత భారంగా ఉంది.

అలజడులన్నీ ఒక్క ఉదుటన
అలలై ఎగసిపడుతుంటే
కలల అంచున నీ స్పర్శ
అగ్నిశిఖలా తగులుతున్నట్టనిపిస్తోంది.

నీ మదిలో కమ్ముకున్న
మాయ పొరలు తొలగేవరకూ
నా మనసుని
నిశీధిలో సమాధి చెయ్యాలనుంది.

ప్రేమించడమే తెలియని
నిన్ను చూస్తుంటే..

ప్రేమ అమృతం అని తెలియజెప్పడం కోసమైనా
జీవితాంతం నీకై నిరీక్షించాలనిపిస్తోంది!!

*** 


No comments:

Post a Comment

Pages