వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఆర్జికల్ - అచ్చంగా తెలుగు

వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఆర్జికల్

Share This
ఏకదంత ఉదంతం
-సుజాత.పి.వి. ఎల్.


వినాయకుడు ఏకదంతుడుగా ఎందుకు మారాడు? ఆ ఉదంతం బ్రహ్మ వైవర్త పురాణంలో మనకు కనబడుతుంది.
ఒకసారి పరమ శివునికి అత్యంత ప్రీతిపాత్రుడైన పరశురాముడు, తన దైవాన్ని దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆది దంపతులు ఏకాంతంలో ఉన్నారు. ఈ విషయాన్ని ద్వారం వద్ద కాపలా ఉన్న వినాయకుడు పరశురాముని చెప్పాడు. అయితే అందుకు పరశురాముడు, తానూ కూడా పరమశివుని తనయుడనేనని, ప్రస్తుతం ఆయన్ని తక్షణం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి, లోనికి వెళ్లేందుకు ప్రయత్నించ సాగాడు. గణేశుడు పరశురాముడిని అడ్డుకున్నాడు. పరశురాముడు ఎంత ప్రయత్నించినప్పటికీ వినాయకుడు తనని లోపలి వెళ్లనివ్వలేదు. పరశురాముని కోపం మితి మీరడంతో ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. ఇద్దరూ తమ తమ బలా బలాలను తేల్చుకునే స్థాయికి వచ్చేశారు. పరశురాముడు తన గండ్రగొడ్డలిని వినాయకునిపై ప్రయోగించేందుకు ఉద్యుక్తుడయ్యాడు. వెంటనే పక్కనున్న కార్తికేయుడు గురుపుత్రునిపై గండ్రగొడ్డలి ప్రయోగించుట తప్పని పరశురాముని వారించాడు. అయినా వినని పరశురాముడు వినాయకునిపై విసురుగా వెళ్ళాడు. అయితే వినాయకుడు చాలా శాంతంగా ఈశ్వరుని ఏకాంతానికి భంగం కలిగించవద్దని, విద్యా సంబంధం వలన తనకు పరశురాముడు సోదరునివంటి వాడని, తన మాట ఆలకించమని ఎంతగానో నచ్చజెప్పి చూసాడు. అయినా వినని పరశురాముడు తన గొడ్డలిని ప్రయోగించబోతుండగా, వినాయకుడు తన తొండాన్ని కోటి యోజనాల దూరం పెంచి , ఆ తొండంతో పరశురాముని తిప్పసాగాడు. అప్పుడు గిరగిరా తిరుగుతున్న పరశు రామునికి కాళ్ళూ చేతులూ స్వాధీనం తప్పాయి. పరశురాముని శరీరం కనిపించింది. అలా తిప్పుతున్నప్పుడు సప్త ద్వీపాలను, మేరువును, సకల సాగరాలను, భూలోకం, భువర్లోకం, స్వర్లోకం, జనలోకం,తపోలోకం, ధ్రువలోకం, ఆపై గౌరీ లోకం, శంభులోకం, అన్నిటినీ పరశురాముడు చూడటం జరిగింది. అనంతరం వినాయకుడు సమస్త సాగరాలను తన తొండంతో పీల్చివేశాడు. మళ్ళా తిమింగలాలతో, మొసళ్ళతో కూడిన సముద్రాలను బయటికి ఊదేశాడు. ఆ కల్లోల సాగర కెరటాలలో పరశురాముడిని కూడా విసిరేశాడు. సముద్రపు నీటిలో తెప్పరిల్లుకుని ప్రాణాలను దక్కించుకోవడానికి ఈదుతున్న పరశురాముని మళ్ళీ తొండంతో చుట్టిన గణేశుడు ఈసారి వైకుంఠాన్ని, లక్ష్మీ విష్ణుమూర్తులను, గోలోకాన్ని, విరజను, నూరు శిఖరాలు గల పర్వతాన్ని, గోపి జనాన్ని, శ్రీకృష్ణుడిని చూపించి తన శక్తిని చాటుకున్నాడు గణేశుడు. అయినా కోపం తగ్గని పరశురాముడు తన పరశువును ప్రయోగించాడు. వేగంగా దూసుకెళ్లిన పరశువు వినాయకుని దంతాన్ని మొదలు దాకా తెగ్గొట్టి, మరల పరశురాముని వద్దకు చేరింది. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలంతా భయభ్రాంతులయ్యారు. ఇంతలో పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వచ్చారు. పార్వతి ఏంజరిగిందని సుబ్రహ్మణ్య స్వామిని అడిగింది. స్కందుని ద్వారా విషయాన్ని విన్న పార్వతి పరశురాముని శపించబోయింది. వెంటనే పరశురాముడు పార్వతిని శరణు వేడి రక్షించమని కోరాడు. అంతటితో శాంతించిన పార్వతి పరశురామునికి అభయమిచ్చింది.
ఇలా గణేశుడు ఏకదంతుడయ్యాడు.
**** 

No comments:

Post a Comment

Pages