పరిశోధన - అచ్చంగా తెలుగు
పరిశోధన
వాసుదేవమూర్తి శ్రీపతి


నా మేధస్సు సమస్తం నీపైన కేంద్రీకృతం చేశాను
నీ కళ్ళు పలికే భావాలను విశదీకరించేశాను
నీ మౌనంలోని మాటలనీ ఆమాటలలోని అర్ధాన్నీ
తెలియజేసే యంత్రాన్నికనిపెట్టేశాను
తీపికి కారణం సెల్యులోస్‌ లేదా సుక్రోస్‌
ఆ రెండిటి కలయికతో పుట్టీన శృంగారోస్‌
నీ పలుకుల తీయదనానికి
కారణమని తెలుసుకున్నాను
మరొక ప్రయోగంలో
నీ నవ్వులోని ఏడురంగులకి
కారణం నీ పెదవుల చాటున
దాగిన నక్షత్రాలని తెలుసుకున్నాను
నీ మనస్సు లోతుని తెలుసుకునే
సోనార్‌ని తయారు చేశాను
నీ సర్వాంగ సౌందర్యానికి
కారణం తెలుసుకోవడానికి
సకల శాస్త్రాలు తిరగేసి
ఒక కొత్త శాస్త్రాన్ని ఆవిష్కరించి
దానికి నీ పేరుతో నామకరణం చేశాను
చివరిగా పై అన్నింటినీ తీసుకెళ్ళి
నాకన్నా మేథావుల ముందు ఉంచాను
వాళ్ళు నా ప్రయోగాలపై
మరెన్నో ప్రయోగాలు చేసి చివరికి
నాకు నీ పిచ్చి పట్టిందని తేల్చేశారు
ఆ పిచ్చికి మందు నీ ప్రేమేనని నిర్ణయించేశారు.


                 

***

No comments:

Post a Comment

Pages