అక్బర్ సేనలకు తలవంచని గోండుల రాణి దుర్గావతి - అచ్చంగా తెలుగు

అక్బర్ సేనలకు తలవంచని గోండుల రాణి దుర్గావతి

Share This
అక్బర్ సేనలకు తలవంచని గోండుల రాణి దుర్గావతి
అంబడిపూడి శ్యామసుందర రావు.


 చరిత్రలో మనము సాహసాన్ని ప్రదర్శించి శత్రువులతో పోరాడిన ఝాన్సీ లక్షి బాయ్ రాణి రుద్రమ వంటి  రాణుల గురించి విన్నాము కానీ మనకు తెలియని ఆటువంటి రాణులు అంటే చరిత్ర పుటలలో కలిసిపోయి సామాన్య  జనాలు మరచిపోయిన రాణులు ఎందరో మన దేశములో ఉన్నారు శత్రువు బలవంతుడైన ఏమాత్రము జంకక
ధైర్యముగా  ఎదురు నిల్చి పోరాడిన రాణులలో గోండుల రాణి దుర్గావతి గురించి తెలుసుకుందాము.


 చందెలియ రాజ కుటుంబానికి చెంది మధ్యప్రదేశ్ లోని గోండ్ సంస్థానపు రాజును వివామాడిన రాణి దుర్గావతి మొదటి నుంచి యోదురాలు ఆవిడ శక్తి సామర్ధ్యాలు మొదటి సారిగా ప్రపంచానికి తెలిసింది మొఘల్ సైన్యము తన రాజ్యములోకి ప్రవేశించటానికి ప్రయత్నించి నప్పుడు జరిపిన పోరాటం లోనే. దుర్గావతి 5అక్టోబర్,1524న  ఉత్తర ప్రదేశ్ లోని బాంద జిల్లాలో జన్మించింది తండ్రి కీరత్ రాజ్ చందెలియ రాజా వంశానికి చెందిన వాడు ఈ కుటుంబము వారే ప్రఖ్యాతి గాంచిన ఖజురహో దేవాలయాలు నిర్మనించిన వారు అంతేకాకుండా మహమ్మద్ ఘజని దురాక్రమణలను అడ్డుకున్న యోధులు అటువంటి కుటుంబములో పుట్టిన దుర్గావతి అంతకుముందు రాజుల  పరాక్రమాలను వారి గాధలను వింటూ ఉత్తేజము చెందేది. ఆవిడ  గుర్రపుస్వారీ, విలువిద్య వంటి విద్యలను చిన్న వయస్సులోనే నేర్చుకుంది.


ఆ రోజుల్లో స్త్రీలు రాజుగారి సైన్యములో యోధులుగా ఉండటం అంత  సులువైన విషయము కాదు, కానీ దుర్గావతి వీటిని లక్ష్యముగా పెట్టుకొని తయారు అయేది. 18 ఏళ్ల వయస్సులో రాణి దుర్గావతి గోండ్ వంశానికి చెందిన దళపట్ షాను వివాహమాడింది ఆతను గర్హ మండ్ల సంస్థానాధీశుడైన  రాజా సంగ్రామ్ షా పెద్ద కుమారుడు ఆరోజుల్లో గోండ్ చందెలియ వంశాల మధ్య వివాహము సామాన్యమైన విషయము కాదు. కానీ రాజకీయముగా ప్రాధాన్యత సంతరించుకున్న విషయము. దళపతి షాతో దుర్గావతి వివాహము వల్ల చందెలియ సైన్యానికి ముస్లిం దురాక్రమణ దారుడు షేర్ షా సూరి ని ఎదుర్కోవటములో గోండ్ సైన్యము కూడా కలిసింది. ఈ రెండు సైన్యాలు విజయవంతముగా షేర్ షా సూరి సైన్యాన్ని ప్రతిఘటించాయి. కానీ దుర్గావతికి ఈ యుద్ధము ఆఖరి యుద్ధము కాదు మొఘల్స్ తో పోరాటం కొనసాగించవలసి వచ్చింది.


రాణి దుర్గావతి 1545లో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ బాలుడికి వీర్ నారాయణ్ అనే పేరు పెట్టింది ఆ బాలుడు ఐదు ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు దళపతి షా చనిపోయినాడు. పిల్లవాడు చిన్నవాడు అవటం వల్ల దుర్గావతి రాణి అయి రాజ్యాన్ని సక్రమముగా పాలించింది. దుర్గావతి గోండ్ రాజ్య విస్తరణను కొనసాగించింది.పక్క రాజ్యాల రాజులు దుర్గావతి ఆడది  కాబట్టి ఆ రాజ్యాన్ని సులభముగా ఆక్రమించవచ్చు అన్న అపోహలో ఉండేవారు కానీ వారి ఆశలు అడియాసలు అయినాయి. ఆవిడ  పరిపాలనలో ఆధార్ సింహ ,మాన్ ఠాకూర్ వంటి మంత్రుల సహకారము పూర్తిగా ఉండేది.


ఆవిడా సైన్యములో 20,000 అశ్విక దళము, 1000 ఏనుగుల దళము, వాటికి మద్దతుగా సరిపడినంత పదాతి దళము ఉండేది. గోండ్ సంస్థానంలోని 23,000 గ్రామాలలో సుమారు 12,000 గ్రామాలు నేరుగా ప్రభుత్వ పరిథి లో ఉండేవి. ఆవిడ జబల్పూర్ కు సమీపాన రానిటాల్ జలాశయము ను నిర్మించింది.రాజ్య పాలనలో గర్హ మండ్ల ను
ప్రజారంజకంగా పాలిస్తున్నప్పటికీ ఏనాడు తన యుద్ధ పోరాట మూలలను నిర్లక్ష్యము చేయలేదు. గర్హ  మండ్ల లోని కధనం ప్రకారము ఒకసారి ఒక సింహము ఆ ప్రాంతాన్ని అక్కడి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉండేది సైనికుడు గాని వేటగాడు గాని ఆ సింహాన్ని చంపటం లేదా లొంగదీసుకోవటం కుదిరేది కాదు అప్పుడు ఈ రాణి స్వయముగా అడవికి వెళ్లి పొదలచాటున ఉన్న సింహాన్ని గుర్తించి ఒక దెబ్బకు తుపాకీతో కాల్చి చంపింది చుసిన ఆవిడ  వెంట ఉండే సైనికులకు నోటిమాట రాలేదు. ఈ సంఘటన ఆవిడ  పరాక్రమానికి వేటాడే తీరుకు ఒక నిదర్శనము.


రాణి దుర్గావతి తన రాజధానిని సింగోర్గర్ నుండి  తూర్పున ఉన్నచౌరగర్ కు మార్చింది ఈ కోట సాత్పురా పర్వతశ్రేణిలో ఉండటం వలన శత్రువులకు దుర్భేద్యమైనదిగా ఉండేది ఈ రాజధాని మార్పు దుర్గావతి రాజకీయ చతురతకు ముందు చూపుకు నిదర్శనము.షేర్ షా సూరి రాజ్యాన్ని ఆక్రమించుకున్న బాజ్ బహదూర్ (సాజిత్  ఖాన్ కుమారుడు) దుర్గావతి కోటాపై దండెత్తి భారీ నష్టాలతో తిరిగి వెళ్ళాడు.ఆరేళ్ళ తరువాత 1562లో మొఘల్ సామ్రాట్ అక్బర్ బాజ్ బహదూర్ పై దండెత్తి అతని రాజ్యాన్ని ఆక్రమించుకొని పొరుగున వున్న దుర్గావతి గర్
మండల్ సంస్థానము వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసాడు.ఆ విధముగా దుర్గావతి ఒకవైపు అక్బర్ సామ్రాజ్యము  మరోవైపు క్వాజ అబ్దుల్ మజీద్ అసఫ్ ఖాన్ రాజ్యము ఉంది ఇద్దరు శత్రువుల మధ్య దుర్గావతి మనుగడ సాగించాలి.


అటువంటి పరిస్తుతులలో దుర్గావతి మంత్రి దివాన్ ఆధర్ సింహ అసఫ్ ఖాన్ తో రాజీపడితే మంచిది అని సలహాఇచ్చాడు "ఆత్మ గౌరవాన్ని కోల్పోయి బ్రతకటము కన్నా హుందాగా చని పోవటం మంచిది నేను నామాతృ భూమికి చాలాకాలము సేవ చేసాను. ఇటువంటి సమయములో నాజీవితాన్ని మసక బారనివ్వను నాకు పోరాడటం తప్ప వేరే గత్యంతరం లేదు "అని దుర్గావతి ఆత్మ విశ్వాసము,ఆత్మగౌరవంతో సమాధానము ఇచ్చింది.


గౌర్  నది నర్మద నదుల మధ్యగల నర్రాయి లోయకు తగ్గి శ్వీయ రక్షణ కోసము దుర్గావతి యుద్ధము చేయ నిశ్చయించుకుంది కానీ అక్బర్ సేనలకు ముందు దుర్గావతి సైన్యము తోపోలిస్తే పెద్దది బలమైనది అయినప్పటికీ మొదటి రోజు యుద్దములో దుర్గావతిదే పై చేయిగా నిలిచింది.   రాణి దుర్గావతి ఆ రోజు రాత్రి మొఘల్ సైన్యముపై దాడి చేయాలనీ అనుకుంది కానీ మంత్రులు వద్దని వారించారు మరునాడు ఉదయము దుర్గావతి షర్మాన్ అనే యుద్దములో పాల్గొనే ఏనుగునెక్కి కొడుకు వీర్ నారాయణ్ తో పాటు యుద్దములో పాల్గొంది దురదృష్ట వశాత్తు అక్బర్ సైన్యము అదనపు బలగాలతో దుర్గావతి మీద దాటి చేశారు శత్రు సైనికులు వదలిన బాణాలు ఒకటి చెవి దగ్గర, రెండవది గొంతు లో గుచ్చుకున్నాయి. ఈ పరిస్తుతులలో అపజయము తప్పదు అన్న భావన ఆమెకు కలిగింది.శత్రువుల చేతిలో చనిపోవటం ఇష్టము లేని దుర్గావతి తన మంత్రి ఆధర్ సింగ్ ను అతని కత్తితో
తనను చంపమని కోరింది  కానీ నమ్మిన బంటు అయిన ఆధర్ సింగ్ నిరాకరిస్తే తానె కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంది. కొడుకు వీర్ నారాయణ్ కూడా ఈ యుద్దములో మరణించాడు.


దుర్గావతి తన తుది శ్వాస విడిచేవరకు ఆవిడ తన పోరాట పటిమను యోధుల లక్షణాలను ఎక్కడ వదులుకోలేదు మొఘల్ సైన్యము రాణి దుర్గావతిని ఓడించి నప్పటికీ ఆవిడ యుద్దములో ప్రదర్శించిన ధైర్యసాహసాలు నాయకత్వ లక్షణాలు తోటి సహచరులతో ధైర్యము నింపి వారిని యుద్దానికి సన్నద్ధము చేయటంలో ఆవిడా నేర్పు వల్ల నాయకు రాలిగా చరిత్రలో ముఖ్యముగా గొండులలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకొని కీర్తి శేషురాలు అయింది.
***

.

No comments:

Post a Comment

Pages