శ్రీమద్భగవద్గీత -29 - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
శ్రీ మద్భగవద్గీత - 29




క్షేత్ర  క్షేత్రజ్ఞ విభాగయోగము 
13 వ అధ్యాయము

అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం
ఏత జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యదా
- 12 వ శ్లోకం

నిత్యము భగవంతునియందే దృష్టిగలిగియుండుట ఎప్పుడో మనకు గుర్తువచ్చినప్పుడు భగవంతునిదలచుట కాదు సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం బ్రహ్మ సత్యము జగత్తు మిథ్యయని యెరిగి చరించుట ఈ విషయం చెప్పినంత సులభం కాదు నిత్యము భగవంతుని యందు దృష్టికలిగి యుండుట ఒక గొప్పవరము ఆ ఎరుకయే చాలు మనలను దైవం దరికి చేర్చటానికి తత్వ జ్ఞానార్థ దర్శనమ్ - అనగా తత్వ జ్ఞానము మాటలతో చెప్పుట చాలదనియు ప్రత్యక్షముగా దర్శించవలెనని , అనుభూతమొనర్చు కొనవలెనని ఇచట చెప్పబడినది. భగవంతుని దర్శంచుటకు బాహ్యనేత్రములతో పనిలేదు. జ్ఞాననేత్రం ద్వారా ఆ పరమాత్మను దర్శించగలము జ్ఞాననేత్రము తెరుచుకోవాలంటే నిరంతర నామస్మరణ, నిష్కామకర్మాచరణ మరియు ధ్యాన యోగసాధన ఆవశ్యములు. ఎందువల్లనంటే ఈ గూడు ఎప్పుడు శిధిలమైపోతుందో ఎరుకలేదు. ఇప్పుడే ఈ క్షణమునందే సాధనాపరులమై జీవించాలి.
జ్ఞానగుణములు ఇరువది అవి క్రమముగ 1. తన్ను తాను పొగడు కొనకుండుట 2. డంబము లేకుండుట 3. పరప్రాణులను హింసింప కుండుట 4. ఓర్పుకలిగి యుండుట 5. ఋజుత్వముగలిగి యుండుట 6. గురుసేవచేయుట, 7. బాహ్యాభ్యంతర శుద్ధిగలిగి యుండుట 8. సన్మార్గమున స్ధిరముగా నిలబడుట 9. మనస్సును బాగుగ నిగ్రహించుట 10. ఇంద్రియ విషయములందు విరక్తి గలిగి యుండుట 11. అహంకారము లేకుండుట 12.పుట్టుక, చావు, ముసలితనము రోగము అనువానివలన గలుగు దుఃఖమును దోషమును మాటిమాటికి స్మరించుట 13. కొడుకులు (సంతానము) భార్య, యిల్లు-మున్నగు వాని యందు ఆసక్తి లేకుండుట. 15. ఇష్టానిష్టములు కలిగినపుడెల్లపుడును సమబుద్ది గలిగి యుండుట 16. భగవంతుని యందు అనన్యభక్తి గలిగియుండుట. 17. ఏకాంత ప్రదేశము నాశ్రయించుట. 18. జన సముదాయమునందు ప్రీతి లేకుండుట. 19. నిరంతరము ఆద్యాత్మజ్ఞానము గలిగియుండుట. 20. తత్వజ్ఞానము యొక్క గొప్ప ప్రయోజనమును తెలిసికొనుట.


సర్వతః పాణిపాదం తత్సర్వతోऽక్షిశిరోముఖమ్
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి

14 వ శ్లోకం

ఆ పరబ్రహ్మ సర్వత్రా నేత్రములు చెవులు ముఖములు గలిగి యున్నదని చెప్పుటవలన, మనము చేయు పుణ్య పాప ఖర్మలన్నింటినీ అతడు గమనించుచున్నాడని స్పష్టమగుచున్నది. ఈ మర్మమును తెలిసికొనినచో పాపకృత్యములనెన్నటికినీ జీవుడు చేయలేడు మనసుయందును పరమాత్మయుండుటచేత జీవుడు.
చేయు ప్రతి సంకల్పమును అతని దృష్టియందు పడుచుండును ఈ కారణము వలన ఏ సంకల్పమైనా ఏ కార్యమైనా అది ఎంత రహశ్యమైనప్పటికీ సర్వాంతర్యామియగు భగవంతునికి తెలియుండా జరగదు.
దేవుడెచటయున్నాడు? అన్న ప్రశ్నకు సర్వత్రాయున్నాడని ఇచట సమాధానమీయబడెను.
 

బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్

16 వ శ్లోకం

సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క వెలుపల, లోపల గూడా పరమాత్మయున్నాడని ఇచట స్పష్టీకరించబడింది.
ఆ జ్ఞేయ స్వరూపము ముందు దెల్పిన జ్ఞాన గుణములు గలిగియున్నప్పుడు మాత్రమే లభించునని స్పష్టమగుచున్నది కర్మ మార్గమునుగాని, భక్తి మార్గము గాని, ధ్యాన మార్గమునుగాని దేనిననుసరించినప్పటికినీ తుదకందరునూ ఈ జ్ఞేయస్వరూపమగు పరమాత్మనెరిగియే ముక్తిని పొందుదురు.

వాసనా క్షయముతోపాటుగా తత్వజ్ఞానమున్నూగలిగి యుండవలెను. సాధ్య వస్తువును గూర్చిన పరిజ్ఞానము, సాధన రెండునూ ఉండవలెనని భావము , భగవద్గీత యొక్క సారము, గీత యొక్క ధ్యేయము, లక్ష్యము ఈ జ్ఞేయ పరబ్రహ్మతత్వమే. తాము కూడా అట్టి పరబ్రహ్మ స్వరూపులేయని చింతించుచూ బ్రహ్మము నందు లీనమై బ్రహ్మ స్వరూపులై ప్రకాశించులాగున ప్రయత్నించవలెను. అదియే జీవిత పరమావధి.

జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్

18 వ శ్లోకం

పరమాత్మకు జ్ఞేయమను నామధేయము ఈ అధ్యాయమున ఒసగబడెను అనగా తెలిసికొనదగినదని అర్ధము ప్రపంచములో ఎన్ని వస్తువులను తెలిసికొనినను తెలిసికొనవలసినదగు బ్రహ్మమును తెలిసికొననిచో అవియన్నియు వ్యర్థములగును ఏలయన ప్రపంచ వస్తు జ్ఞానముచే జనులు జనన మరణ ప్రవాహమును తప్పించుకొనజాలరు.

చిదాకాశమే జ్ఞేయమగు పరబ్రహ్మము. అది అత్యంత సూక్ష్మమైనది స్థూల దృష్టికి అజ్ఞాన దృష్టికి అది గోచరింపదు ఒక్క జ్ఞాననేత్రము చేతనే అది తెలుపబడగలదు.పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల ప్రాణికోట్ల హృదయమందును స్ధావరాదులయందుకూడను దైవం వసించుచున్నాడు. కావున తన హృదయమందున్న పరమాత్మను పొందుటకు పాపాత్మునకు చెండాలునకు కూడా హక్కు కలదు కావున జాతి మత కుల విచక్షణ లేక సర్వులను నిరాటంకముగా ఆతనిని పొందుటకు యత్నింపవచ్చును.

హృదయమందు నివశించు భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడని నిశ్చయించి సత్య నిష్టులై పాడుకార్యములు చేయక భూతదయతో భగవత్ప్రాప్తికై నిరంతరము ప్రయత్నించవలెను.
ఇట్లు

సకల జన శ్రేయోభిలాషి

మీ రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
***

No comments:

Post a Comment

Pages