నెత్తుటి పువ్వు - 10 - అచ్చంగా తెలుగు
నెత్తుటి పువ్వు - 10
మహీధర శేషారత్నం

(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. మొదటి నెల జీతంతో ఆమె రాజుకు ఒక చొక్కా కొనిస్తుంది.) 
“నేను నల్లటోళ్ళా” కోపం నటించాడు.

“చూడు” అంటూ తన చెయ్యి అతనిచెయ్యి పక్కపెట్టింది చిన్న పిల్లలా.

నాగరాజు చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కున్నాడు.

“ఎవరికీ చనువు ఇవ్వకు. చిక్కుల్లో పడతావు” సీరియస్ గా అని వెళ్ళిపోయాడు.

సరోజ ఆమాట లెక్కచేయలేదు.

రాజు రాములమ్మకే చెప్పాడు తానుకొన్నాళ్ళు రాలేనని, ఆడపిల్ల ఒకత్తే ఉంది కనుక చూస్తూండమని.

పిల్లకి దారి దొరికిందని రాములమ్మ సంతోషించింది. ఒప్పుకుంది.

*****

“వసంత వస్తుందిట కొడుకును తీసుకు దీపావళికి ఆరాత్రి పడుక్కోబోతూ లక్ష్మితో అన్నాడు నాగరాజు.

“ఫోన్ చేసిందా! అయ్యో! మా అన్న, వదినా వస్తామన్నారే. మన చంటాణ్ణి చూసినట్టు ఉంటుందని, పండగకదా అని రమ్మన్నాను.”

అంది లక్ష్మి,

నాగరాజు మాట్లాడలేదు. బావమరిది రాక అతనికి ఇబ్బందిలేదు కాని అతని స్వభావం రాజుకి నచ్చదు. రౌడీలా ప్రవర్తిస్తాడు. చిన్నా చితకా రాజకీయ నాయకుల వెనక తిరుగుతూ అంతా తనకే తెలుసని, తన మాటమీద పనులై పోతాయిని గొప్పలు చెప్పుకొంటూంటాడు. అతను ఉన్నప్పుడు వసంత రావడం అతనికి ఇష్టంలేదు. వసంతరాజు ఒక్కగానొక్క చెల్లెలు.

“ఎల్లా గబ్బా! ఇల్లుకూడా చిన్నది.” అంది ఆలోచనగా లక్ష్మి.

“సరే! వసంతకి ఫోన్ చేసి చెప్పేస్తాలే! స్కూళ్ళకి రెండు రోజులు సెలవు కల్సి వచ్చినప్పుడు రమ్మని” దుప్పటికప్పుకుంటూ అన్నాడు.

“అదెలా! ఆడపిల్ల పండక్కి వస్తా అన్నా! అంటే రావద్దనడం ఏం బాగుంటుంది. అందునా పిల్లాణ్ణి తీసుకు వస్తానంటే....” సాలోచనగా అంది.

“మరేంచేద్దాం! నేను మీ అన్నకి చెప్పలేను కదా!” లక్ష్మికి తెలుసు. తన అన్న అంటే మొగుడికి ఇష్టం ఉండదు అని. అయినా తనుకూడా ఎన్నోసార్లు చెబుతుంది

నీకు రాజకీయాలెందుకురా! చక్కగా వ్యవసాయం చేసుకోక అని, కాని అతడు వినడు. పొలం కౌలుకిచ్చేసి బలాదూరుగా తిరుగుతుంటాడు. భార్యకూడా తగినదే, ఏదో తన మొగుడు పెద్ద నాయకుడు అన్నట్టు ఫోజు కొడుతుంది.

“సరే! నేనే ఏదో చేస్తాలే” అంది లైటార్పుతూ అందుకే లక్ష్మి అంటే నాగరాజుకి ఇష్టం. ఏదీ సమస్యగా మార్చదు. గొడవ పెట్టుకోదు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages