అటక మీది మర్మం - 19 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 19

Share This
 అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) - 19
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)

 
(కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యాన్ని వెతికి పెట్టమని నాన్సీ తండ్రిని సాయమడుగుతాడు ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్. తన స్నేహితురాళ్ళతో అతని యింటికి వెళ్ళిన యువగూఢచారి అతని యింటిని్, అటకని గాలించినా ఫలితం శూన్యం. తట్టురోగంతో యింటికి తిరిగి వచ్చిన మార్చ్ మనుమరాలి సంరక్షణకు ఎఫీ అన్న అమ్మాయిని నియమిస్తుంది. ఆమె ద్వారానే ఆ యింటిలో ఆగంతకుడెవరో తిరుగుతున్నట్లు తెలుసుకొంటుంది. ఒకరోజు అటక మీద ఆమెకు బీరువాలో ఒక అస్తిపంజరం కనిపిస్తుంది. ఇదే సమయంలో తండ్రి తనకు అప్పజెప్పిన మరో కేసులో డైట్ కంపెనీలో దూరి బుషీట్రాట్ అన్న వ్యక్తిని కనుక్కోవటమే గాక, ఆ లాబ్ నుంచి రెండు సీసాల్లో పట్టు పరికిణీలు తయారుచేసే రసాయనిక ద్రవాల నమూనాలను రహస్యంగా సంపాదించి, తన తండ్రికి యిస్తుంది. ఆగంతకుడు తరచుగా కనిపించటంతో భయపడుతున్న ఎఫీని ఒక రోజు యింటికి వెళ్ళమని చెప్పి, తన స్నేహితురాళ్ళతో కలిసి ఆ రాత్రికి మార్చ్ భవంతిలో ఉండిపోతుంది నాన్సీ. ఆ రాత్రి ఒక ఆగంతకుడు భవంతి వెనుకకు వెళ్ళటం గమనించి అతన్ని అనుసరిస్తుంది. కానీ అతను అకస్మాత్తుగా మాయమవుతాడు. తన స్నేహితురాళ్ళను భవంతి బయట కాపలా ఉంచి, తాను మార్చ్ తో కలిసి అటకమీదకు వెడుతుంది. ఈ లోపున బయటినుంచి స్నేహితురాళ్ళ కేకలు వినిపించి వాళ్ళకు సాయపడటానికి బయటకు వెడుతుంది. వాళ్ళు ముగ్గురు ఎంత వెంబడించినా, సమయానికి అతనికి ఒక కారు సాయంగా రావటంతో, అతను దాన్ని ఎక్కి పారిపోతాడు. ఈసారి రేడియోలో వినబడిన పాటకు బాణీ కట్టింది బెన్ బాంక్సె గాక హారీహాల్ అని చెబుతారు. ఆ రోజు దొంగ మరొక పాటను దొంగిలించినట్లు గమనించారు గనుక ముగ్గురు అమ్మాయిలు మరునాడు ఆ భవంతిలో దొంగ వచ్చి పోయే రహస్య మార్గాన్ని కనుక్కోవాలని ప్రయత్నించి విఫలమవుతారు. అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకే్దో సైగ చేస్తోందని బెస్ అంటుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి అస్తిపంజరం దిగువన ఒక నాబ్ కనిపిస్తుంది. దాన్ని తెరిచేలోగా జెన్నర్ వచ్చాడని తెలిసి నాన్సీ కిందకు వెళ్ళి అతనితో మాట్లాడుతుంది. ఒక పాటంజు ముద్రించేముందు దాని అసలు రచయిత ఎవరన్నది తెలుసుకోవాలని చెప్పగానే, జెన్నర్ ఆమె హదులను దాటుతోందని కేకలు వేసి వెళ్ళిపోతాడు. తరువాత అటక మీదకు వచ్చిన నాన్సీ తీవ్రంగా ప్రయత్నించి ఆ గూటిని తెరవగలుగుతుంది. తరువాత కథ ఏమిటంటే. . .)


ఉత్తేజంతో నాన్సీ తన చేతిని ఆ కన్నంలోకి బలంగా తోసింది.
"కాగితాలు" ఉత్సాహంగా అరిచింది.
వేగంగా గుప్పిటితో వచ్చినన్ని కాగితాలను యువ గూఢచారి బయటకు తీసింది. కొవ్వొత్తి వెలుతురులో వాటిని చదవటం కష్టమనిపించింది. అందుకే ఆ ముగ్గురు యువతులు ఆ రహస్య అరలో ఉన్న వాటన్నింటిని బయటకు తీశారు. వాటిని కింద ఉన్న పడకగదిలోకి మోసుకుపోయారు.
బయటకెళ్ళి వచ్చిన మార్చ్ ఆత్రుతగా వాటిలోని పాత ఉత్తరాలను చదవటంలో నాన్సీకి సాయపడ్డాడు. బెస్,జార్జ్ మిగిలిన కాగితాలను వేరు చేస్తున్నారు.

ఉన్నట్లుండి బెస్ అరిచింది. "ఇదిగో అసలైన సంగీతం. 'తన నాయనమ్మ కూర్చిన శ్రావ్యమైన గీతానికి ఫిప్ మార్చ్ యిచ్చిన స్వరరూపం' అని కింద వ్రాసి ఉంది."
వాళ్ళంతా ఆ ఠావు కాగితాన్ని తెల్లబోయి చూశారు.
" దొంగలింకా దీనిని తీసుకెళ్ళలేదు. ఆ పరమాత్మకు ధన్యవాదాలు" పెద్దాయన గొణిగాడు. "దీన్ని వినాలనుకొంటున్నాను. నాన్సీ! దీన్ని పాడి వినిపించు."
వాళ్ళందరూ క్రింద అంతస్తులోని సంగీతపు గదికి వెళ్ళారు. నాన్సీ పియానోపై తన శక్తి మేరా శ్రుతి జేసింది. ఆ మధురగీతానికి బెస్, జార్జ్ కూనిరాగం తీశారు
.
"ఇది చాలా బాగుంది" బెస్ మైమరచిపోతూ అంది.

" ప్రచురించినట్లయితే దీనికి మంచి పేరు వస్తుంది" అని జార్జ్ వ్యాఖ్యానించింది.
"మా నాన్నకి ప్రజాదరణ ఉన్న మంచి సంగీత ప్రచురణకర్త తెలుసు" నాన్సీ చెప్పింది.
ఆ మాటలకు మార్చ్ సంతోషించాడు. "దీన్ని యింటికి తీసుకెళ్ళి అతని వద్దకు పంపించు" చెబుతున్న అతని కళ్ళు ఆశతో మెరిసాయి.
పెద్దాయన కోరినట్లుగా ఆమె కొన్ని గీతాలను యింటికి తీసుకెళ్ళింది. తన తండ్రి డ్రూ, హన్నాలతో మధ్యాహ్న భోజనం ముగించాక, నాన్సీ కొన్ని గీతాలను ఎన్నుకొంది. వాటిని పియానోపై వాయించి వారికి వినిపించింది.
వాళ్ళిద్దరూ ఆమెకున్న సంగీతాభిలాషను మెచ్చుకొన్నారు. ఆ గీతాలు మార్కెట్లో బాగా ప్రజాదరణ పొందిన పాటలకు సరిసమానస్థాయిలో ఉన్నాయని ప్రశంసించారు.
" నేను తొందరపడి మాట యివ్వలేను గానీ, హాకిన్స్ దీన్ని కొనవచ్చు" న్యాయవాది తన కూతురితో చెప్పాడు.
"నేను ఈ గీతాలను యీ రోజు మధ్యాహ్నం అతని వద్దకు తీసుకెడతాను. అతను నాకు మంచి స్నేహితుడే గాక నా క్లయింట్ కూడా! మనకు అద్భుతమైన ఫలితం దక్కవచ్చునని భావిస్తున్నా!"
మార్చ్ కి తన తండ్రి చేతనైనంత సాయం చేస్తానన్నందుకు నాన్సీ తృప్తిపడింది. ప్లెజెంట్ హెడ్జెస్ లో దొంగను పట్టుకోవటానికి తను వేయబోయే ప్రణాళిక గురించి ఆమె తండ్రికి చెప్పింది.
"అతను ఖచ్చితంగా ఏదో రహస్యమార్గం ద్వారా యింట్లోకి ప్రవేశిస్తున్నాడనిపిస్తోంది. కానీ దాన్ని నేను కనుక్కోలేకపోయాను. అందుకే ఈ రాత్రికి అతని కోసం మాటువేయాలనుకొంటున్నాం."
"చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని నాకు మాట యివ్వాలి" డ్రూ అన్నాడు.
"అలాగే నాన్నా! ఆ! మీ కేసు ఎంతవరకు వచ్చిందో చెప్పండి. నేను తీసుకొచ్చిన ఆ రసాయనిక ద్రవాన్ని విశ్లేషించారా?" అడిగిందామె.
" బుకర్ ఆ రసాయనాన్ని తన దగ్గర పనిచేసే ముఖ్య రసాయనికవేత్తకు యిచ్చి పరీక్షించమని, దాన్ని తమ దగ్గర ఉన్న రసాయనికాలతో పోల్చి చూడమని చెప్పాడు. ఇంతవరకు నాకెలాంటి రిపోర్టు రాలేదు."
"వాళ్ళు తొందరగా తేల్చుకోవాలని అనుకొంటున్నాను" నాన్సీ అసహనంగా అంది.
"అంత వేగంగా పని కావాలనుకొంటే, డైట్ ను మళ్ళీ ఎందుకు కలవలేదు?" ఆమె తండ్రి ఉడికిస్తున్నట్లు అన్నాడు. "తన ఫాక్టరీనుంచి నువ్వు అకస్మాత్తుగా మాయమైనందుకు బహుశా అతను కోపగించుకొని ఉంటాడు."
నాన్సీ ముఖం చిట్లించింది. తాను ఒక విషయం మాట్లాడుతుంటే తండ్రి మరొక విషయాన్ని కదుపుతాడేంటి? ఆలోచిస్తున్న ఆమెకు తండ్రి ఏదో సూచన చేస్తున్నట్లు గ్రహించింది.
"మీరనేదేమిటి? నేను తన లాబ్ లోకి వెళ్ళినట్లు అతను కనుక్కొన్నాడంటారా?"
" నేరపరిశోధనల్లో మనం వేసే ప్రతి ఆడుగు గుర్తుంచుకోవాలి. ఈ రోజు చేసిన ఒక చర్యకు భావిలో ప్రతిచర్య ఎదురుకావచ్చు. అందుకే ఏ విషయంలోను తొందరపడకూడదు. డైట్ తన పద్ధతుల్లో చాలా ఖచ్చితమైన మనిషి. తను నిన్ను తన పరిశోధనశాలలో మొదటిసారి చూశాడు. అతను వ్యాపారస్తుడు. నువ్వు అక్కడ కళ్ళు తిరిగిపడిపోయినట్లు నిజంగా నమ్మి ఉండకపోవచ్చు. ఆ రహస్యప్రాంతానికి ఏదైన గూఢచర్యంపై వచ్చి ఉంటావని కూడా అనుమానించి ఉండొచ్చుగా! మళ్ళీ యిక్కడకు రావద్దని చెప్పినా, సీసాల వ్యాపారంపై వెళ్ళినట్లుగా అతని ఫాక్టరీకి వెళ్ళావు. కానీ వాటిని అక్కడే వదిలేసి అకస్మాత్తుగా మాయమయ్యావంటే లాబ్ కే వెళ్ళావని అనుమానించి ఉండొచ్చుగా! దానికి తగ్గట్లు ఎవరూ లేని లాబ్ లో లైట్ వేసి వదిలేశావు. తన పని ముగించుకొని బుషీ ట్రాట్ ఆర్పేసిన లైట్ ను ఎవరు వేశారన్న అనుమానం రాదంటావా? అతను వేలిముద్రల నిపుణులను పిలిపించినా ఆశ్చర్యపోనవసరంలేదు. వాళ్ళిచ్చే సాక్ష్యంతో లాబ్ లో లైట్ వేసినవాళ్ళెవరన్న సమస్యను పరిష్కరించుకొంటాడు."
"వేలిముద్రలా?" నాన్సీ గుటకలు మింగింది.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)
***

No comments:

Post a Comment

Pages