అ"సామాన్యుడు" - అచ్చంగా తెలుగు
అ"సామాన్యుడు"
పద్మా దాశరధి 


"మేడమ్!నమస్తే"

తెలిసిన గొంతులా వినిపించింది.ఆఫీసు మెట్లు ఎక్కుతున్న సమీర ఆగి వెనక్కు తిరిగి చూసింది.ఎదురుగా శేఖర్!ఆకస్మికంగా అతను తన ఆఫీసుకి రావటంతో సమీర తెల్లబోయింది.అతను తమ ఫ్లోర్ లో 103 ఫ్లాట్ ఓనరనీ,లలిత భర్త అనీ తెలుసు.తనతో పెద్ద పరిచయం లేదు కూడా.ఎందుకు తన ఆఫీసుకు వచ్చాడా అని ఆలోచిస్తున్న సమీర మనసులో ఆలోచనలు చదివినట్టు సన్నగా నవ్వాడు శేఖర్.

"మీతో కాస్త మాట్లాడాలి సమీరగారూ.ఎప్పుడు ఫ్రీ గా ఉంటారో అడుగుదామని"

అతనికి తనతో ఏం మాటలో సమీరకు బోధపడలేదు.అయినా సభ్యత కోసం "సాయంత్రం ఆరు గంటలకు ఇంట్లో ఫ్రీగా ఉంటానండీ.రవి కూడా ఉంటారు.మీరు,లలిత ఇద్దరూ వచ్చేయండి"అంది

"లలితా?తను వద్దులెండి.మీతో పర్సనల్ గా మాట్లాడాలనే ఇక్కడికి వచ్చాను.నిజానికి నేనిక్కడకు వచ్చినట్లు తనకు తెలియదు"నేల చూపులు చూస్తూ చెప్తున్న శేఖర్ని చూస్తే సమీరకు ఆశ్చర్యంగా అనిపించింది.కాస్త చిరాకేసింది కూడా!

చేతిలోని కారు తాళం తిప్పుతూ ఆలోచించింది.

"మధ్యాహ్నం లంచవర్లో మినర్వాకి రాగలరా?నేనూ అక్కడికి వస్తాను."అంది.

"సరే సమీర గారూ!నేను తప్పకుండా వస్తాను.ధాంక్స్"అని చెప్పి వెళ్తున్న శేఖర్ని వెనుకనుంచి చూస్తున్న సమీరకు కాస్త వింతగా అనిపించింది.

రెండు గంటల వరకూ పనిలో మునిగి పోయింది.రెండింటికి మినర్వా చేరుకుంది.హోటల్లో అప్పటికే శేఖర్ వచ్చి ఉన్నాడు.ఏసీ లో కూర్చున్నారు ఇద్ధరూ.ఇద్దరికీ లంచ్ ఆర్డర్ చేశాడు శేఖర్.కుర్చీలో వెనక్కు వాలి విశ్రాంతిగా కూర్చుంది సమీర.కాస్త తడబాటుకు గురవుతున్నట్టు కనబడుతున్నాడు శేఖర్.

"ఇప్పుడు చెప్పండి.ఏంటి విషయం?"సౌమ్యంగా అడిగింది.

"నెల రోజుల క్రితం మా ఇంట్లో లలిత స్నేహితుల బాచ్ తో కిట్టి పార్టి జరిగింది.యధాప్రకారం తన ఆప్తులందరూ అందరూ ముసిరారు"అతని మాటలకు స్వల్ప చిరాకనిపించినా ఫక్కుమని నవ్వు కూడా వచ్చింది.లలిత నిర్వహించే ఈ పార్టీల సంగతి తనకు తెలిసిందే!ఇందులో తనకు చెప్పాల్సినది ఏముంది!

సమీర ఆలోచనలు చదివినట్టు అన్నాడు"మీ గురించే ఈ సారి పార్టీ జరిగింది"

సమీర నిజంగా అయోమయానికి లోనైంది.

"మీరు సూటిగా విషయం చెప్తే బావుంటుందేమో"మొహమాటంగా అంది.

"మిమ్మల్ని ఎక్కువ కన్ఫూజ్ చేయను.అంతా టూకీగా చెప్పేస్తాను .అసలేమైందంటే....."

ఆ రోజు మధ్యాహ్నం లలిత స్నేహితులు ఒక పదిహేనుమంది కిట్టి పార్టికి హాజరయ్యారు.నవ్వులతో, ఆటలతో  ఇల్లు హోరెత్తించారు. మూడయేసరికి అందరూ వెళ్ళి పోయారు.లలిత ప్రాణస్నేహితులు మాత్రం ఆగిపోయారు తనకు సహాయం చేయాలనే మిషతో!లలిత, వాణి, జయ, వసంత, అపర్ణ, పార్వతి, రమ! !వీళ్ళు ప్రాణ స్నేహితులు అవునో కాదో దేవుడికి తెలియాలి.కలిసి తిరుగుళ్ళు,షాపింగ్ లు,పిక్నిక్కులు...

"మలయ సమీరం మళ్ళీ ఏమన్నా రాసిందా ఈ మధ్య?"లలిత చర్చకు నాంది పలికింది.

"రాయకుండా ఉంటుందా?అన్నం తినటం మానేస్తుంది కానీ..."అపర్ణ వ్యంగ్యం.

"అయినా ఈ జనానికి దాని రాతలెందుకు అంత నచ్చుతాయో!వందల లైకులు,కామెంట్లు"వాణి కడుపు మంట.

"చూడటానికి ఎర్రగా బుర్రగా ఉంటుందిగా మరి?నువ్వూ నేనూ అలా ఉండమయ్యే" గౌరి దుగ్ధ!

"ఆవిడ అందరితోనూ ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడుతుంది మరి.నావలన కాదు బాబూ ఆ లయలు"వసంత ఏవగింపు

"మరే బాగా చెప్పావు.ప్రతివారూ ఆవిడతోనే కష్ట సుఖాలన్నీ వెళ్ళ బుచ్చుకుంటారు.అన్నిటికీ తగుదునమ్మా అని సలహాలు ఇస్తుందిగా మరి!పైగా ప్రతీ దిక్కు మాలిన ఆడదానికీ ,ముందు నేనున్నా సహాయానికి నా దగ్గరికి రండి అనే సలహా ఒకటి"లలిత విషం కక్కింది.

"ఆవిడకి పిల్లా జెల్లా?లింగు లిటుకూమని ఇంట్లో ఉండేది భార్యా భర్తలిద్దరే.ఇద్దరివీ పెద్ద ఉద్యోగాలు.బోలెడు సంపాదన!ఆ మొగుడు అతి మంచివాడు.ఈవిడ ఉద్యోగంతో పాటు సంఘ సేవలు, రాతకోతలు,సోషల్ మీడియాలో స్నేహాలు,ఆడింది ఆట,పాడింది పాట"జయ మాటల బాణాలు!

"ఈ మధ్య మీరు చూశారో లేదో ఒకతనితో మరీ ఎక్కువ స్నేహంగా ఉంటోంది.ఈవిడ రాసే కధకి,కవితకి,ప్రతి పిచ్చి రాతకీ మొదట వాడి కామెంటే ఉంటుంది."ఇది నిత్యం లలితా పారాయణ చేసే అరుణ మాటల బాణాలు.

"అయినా ఆ రవికి ఇదంతా తెలియదా?ఆయనకు ఎవరన్నా తెలియచేస్తే బావుండు"వయసులో అందరికన్నా పెద్దదైన పార్వతి ఉవాచ.

"మనం చెప్తే నమ్ముతాడా!ఎంతైనా భర్త కదా"చెప్తే బావుండు అన్న ఆశ వసంతది.

"కానీ ఇలా వదిలేస్తే బంగారంలాంటి సమీర కాపురం నాశనమైపోదూ"అరుణ అనవసరపు ఆదుర్దా

"అవును.ఈ సంగతి రవికి తెలియచేస్తే సరి.పెళ్ళాన్ని దారిలో పెట్టుకుంటాడు"గౌరి ఆరిందాతనం.

"అవును.గౌరి చెప్పింది నిజమే.మనం రవికి తెలియచేయక పోతే మనకే పాపం.అతను నమ్మినా నమ్మక పోయినా చెప్పటం మన ధర్మం"పార్వతి వత్తాసు పలికింది.అందరూ పైకి సమీర సంసారం పాడవుతుందేమోననే ఆందోళన వ్యక్త పరుస్తున్నా అది నటన అని అందరికీ తెలుసు.అలా ఒక సంసారంలో నిప్పులు పోసే ప్రయత్నానికి పునాదులు పడ్డాయి.రవికి ఎవరు తెలియచేయాలి అనే తర్జన భర్జనలు నడిచాక రవితో ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని లలిత ఆ బాధ్యత తన మీద వేసుకుంది.రవికి ఫోన్ చేసింది.

"అన్నయ్య గారూ!మీతో మాట్లాడాలండి ఒక రెండు నిముషాలు"....

"అలాగే అయ్యో తప్పకుండా"కళకళలాడుతున్న మొహంతో ఫోన్ పెట్టేసింది‌.

"రవి ఈ రోజు ఇంట్లోనే ఉన్నాడట.వస్తానన్నాడు ఇక్కడికే"

అందరూ ఎవరి పోర్షన్ వారు నిర్ణయించుకుని సిద్ధంగా ఉన్నారు.కాలింగ్ బెల్ మోగింది.లలిత తలుపు తీసింది.చిరునవ్వుతో రవి.చామన చాయ,స్నేహపూరితమైన నవ్వు,ఆకట్టుకునే ముఖ కవళికలు!

కూర్చుని కాఫీ తాగాక "చెప్పండి లలితగారూ!స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారే "అందరినీ కలియచూస్తూ అన్నాడు.

"రవి అన్నయ్యా!మేము మీ కుటుంబం మేలు కోరే వాళ్ళం అని మీకు నమ్మకమే కదా!"లలిత నాందీ ప్రస్తావన చేసింది

"ఎంతమాట"రవి అభిమానంగా అన్నాడు.

లలిత పుంజుకుంది.

"అందుకే మీకు కొన్ని విషయాలు చెప్ప దలిచాం మీ కుటుంబ శ్రేయస్సు కోరి.ఈ మధ్య సమీర చాలా అతిగా వెళ్తోంది సోషల్ మీడియాలో.మగవారి స్నేహాలు చాలా ఎక్కువైనాయి.తన రాతలు,కోతలే కాక, వ్యక్తిగతంగా కూడా స్నేహాలు చేస్తోంది.సోషల్ నెట్ వర్క్ లో అందరూ తనని గమనిస్తుంటారు.అంత చొరవ,చనువు తనకి అవసరమా చెప్పండి"లలిత నిప్పు రాజేసింది.

సాలోచనగా తల పంకించాడు రవి.

పార్వతి వంతు వచ్చింది"ఎవరో శ్రీనివాస్ అనే ఆయనతో చాలా చనువుగా ఉంటోంది రవిగారూ!మేము చూడలేక పోతున్నాం.నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు కదా!మీరే చెప్పండి"అనునయంగా అంది

"ఏదో లలితా పారాయణ గురించో,మణిద్వీప పూజలో అయితే అనుకోవచ్చు.ఇదేం పిచ్చి?ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నంత మాత్రాన అంత హద్దులు మీరిన చనువు అవసరమా అన్నయ్యా చెప్పండి"అరుణ చేసిన పారాయణ‌ ఇది.

"మీరు తనని కాస్త హెచ్చరించండి.ఆన్లైన్ ఏక్టివిటి తగ్గించుకోమనండి.అంతలా నలుగురి కళ్ళలో పడటం,పాపులర్ అవటం మంచిది కాదు కదా.మీ కోసమే చెప్తున్నాం"జయ ముక్తాయింపు.

రవి పెదవులపై చిరునవ్వు పక్కుమని నవ్వై అలలుగా గదంతా నిండింది.

"తప్పకుండా చెప్తానమ్మా!ఆ నలుగురితో జాగ్రత్తగా ఉండమని.

జయగారూ!మీ అబ్బాయి సంసారం చిక్కుల్లో ఉంది.మమీ కోడలు విడాకుల నోటీసిచ్చి వెళ్ళిపోయింది.పాపం మంచి పిల్ల.చాలాసార్లు‌ సమీర దగ్గర మీ ఇంట పెట్టే ఆరళ్ళ గురించి చెప్పి బాధ పడింది కూడా.ఆ అమ్మాయిని అన్యాయం చేయకండి.

పార్వతిగారూ!మీ అమ్మాయికి ముప్పై రెండేళ్ళు దాటినట్టున్నాయి.మీరు చెప్పారని సమీర కూడా తన బయోడేటా తీసుకుని మంచి సంబంధం కోసం నలుగురికీ చెప్పి పెడుతోంది.అందరం ఏదో ఒక సంబంధం చూసి సెటిల్ చేద్దాం.పాపం మంచిపిల్ల!

అపర్ణగారూ.మీ చిన్నవాడు మొన్న పోలీసు కేసులో ఇరుక్కున్నాడండీ బైక్ రాష్ గా రాంగ్ సైడ్ నడుపుతూ!మీకు ఫోన్ చేస్తే తిడతారని సమీరకే ఫోన్ చేశాడట.మేమిద్దరం వెళ్ళి స్టేషన్ లో హామీ సంతకాలు చేసి తీసుకు వచ్చాం.

లలితా!మీ పిల్లలు చదువులో చాలా వెనకబడి ఉన్నారని,ఇంట్లో పట్టించుకునే దిక్కులేదని శేఖర్ నాతో చాలా సార్లు చెప్పి బాధ పడ్డాడమ్మా.మంచి ట్యూటర్ ఉన్నారు.సమీర మాట్లాడింది ఆయనతో.రేపు ఫస్టు తారీకు నుంచి వస్తాడు.

అపర్ణా!మీకు సుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని,కంట్రోల్ అవటంలేదనీ సమీర బాధ పడుతోంది.ఎలాగైనా మిమ్మల్ని తనతో వాకింగ్ కి తీసుకు వెళ్ళాలనీ ఆలోచిస్తోంది.ఆన్లైన్లో మంచి ఆయుర్వేదం  డాక్టర్ దగ్గర  అపాయింట్మెంట్ కూడా తీసుకుంది.ఆపని చేయండి వీలైనంత త్వరగా.ఆరోగ్యమే మహాభాగ్యం కదా?మీరు చెప్పినవన్నీ నేను సమీరకు తప్పకుండా చెప్తాను.మా కుటుంబం పట్ల మీకున్న అభిమానానికి చాలా కృతజ్ఞులం"

లేచి వెళ్ళిపోయాడు రవి.గుమ్మం బయట శేఖర్ కనబడ్డాడు.అందరి నోళ్ళు మూతబడ్డాయి.రవిని చూసి శేఖర్ తల దించుకున్నాడు.రవి చిరునవ్వుతో శేఖర్ తో చేయి కలిపాడు.శేఖర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

"ఇదీ సమీరగారూ జరిగింది.మీ మంచితనం,నలుగురిలో మీకున్న ఆదరణ ఇలాటి జెలసీలకు కారణం అవుతుంది.మీ బలం రవిగారే.ఆయన మీ పక్కన ఉండగా ఏ పురుగూ మిమ్మల్ని ముట్టుకోలేదు.అసాధారణ వ్యక్తిత్వం ఆయనది.మీరు గర్వించాల్సిన లైఫ్ పార్ట్నర్ రవి.మీ దంపతులకు నా అభినందనలు"స్నేహ పూరితమైన చిరునవ్వుతో చెప్తున్న శేఖర్ని రెండు కళ్ళూ అప్పగించి చూస్తూ కూర్చుంది సమీర!

ఇలాటి మనుషులు కూడా ఉంటారా?ఇంత జరిగినా రవి తనతో ఒక్కముక్క కూడా చెప్పలేదు ఇప్పటివరకూ!

"ఇక వెళ్దామా"మెత్తగా అడిగాడు శేఖర్. బాగ్ తీసుకుని యాంత్రికంగా బయటకు నడిచింది సమీర."ఇక నేను వెళ్తానండీ.మీరూ దీని గురించి మర్చిపోండి"మెత్తగా చెప్పి వెళ్ళిపోయాడు శేఖర్.

ఇంటికి వచ్చి సోఫాలో వాలిపోయింది సమీర.ఇదంతా జరిగి నెలపైనే అయిందా?అయినా రవి తనతో ఒక్కమాటకూడా అనలేదా?ఎందుకలా?తన గురించి ఏమనుకుని ఉంటాడు?తను సోషల్ మీడియాలో ఏక్టివ్ గా ఉంటుందనీ,సామాజిక కార్యక్రమాలు చేపడుతుందనీ, నిరాశ్రయులైన ఆడవారికి షెల్టర్ హోమ్ ఏర్పరిచిందనీ రవికి బాగా తెలుసు.కానీ ఈ విషం చిమ్మే మాటలను అతను ఎలా స్వీకరించి ఉంటాడు?ఆలోచనలలో మునిగిన సమీర చీకట్లు వ్యాపించటం గమనించలేదు.ఇంట్లోకి వచ్చిన రవి లైటేయటం కూడా సమీరకు తెలియదు.నిశ్శబ్ధంగా కిచెన్లోకి వెళ్ళి రెండు కప్పుల కాఫీ కలిపి తీసుకొచ్చాడు.కప్పులు టీపాయ్ మీద పెట్టి "సమీ!"అని మృదువుగా పిలిచాడు.దిగ్గున లేచింది సమీర."బాగా అలసిపోయావా ఈ రోజు"కాఫీ కప్పు చేతికిస్తూ అడిగాడు.రవి మొహంలోకి చూడాలంటే కష్టంగా ఉంది సమీరకు.అంతులేని అవమానభారంతో మనసు కుంగిపోతోంది.ఎలా ఆ భారం దించుకోవాలో అర్ధమవక సతమతమవుతోంది.

"ఏమైందిరా"ఆదరంగా అడిగాడు రవి.ఇక ఆపుకోలేకపోయింది సమీర.సుడిగాలిలా రవిని చుట్టేసింది.చిన్నపిల్లలా భోరుమంది.మాట్లాడకుండా సమీర తల నిమురుతూ ఉన్నాడు రవి.తను మరోసారి అడగక్కరలేదని అతనికి తెలుసు.కాసేపటికి సర్దుకుంది సమీర."శేఖర్ మా ఆఫీసుకు వచ్చాడు"ఎర్రబడిన కళ్ళతో రవిని సూటిగా చూస్తూ అంది.

"ఓ అదా!"నవ్వాడు రవి."ఒక్కమాట కూడా నాతో అనలేదు రవీ నువ్వు.ఎంత అ‌సామాన్యుడివి నువ్వు"సమీర నోరు మూసేశాడు రవి

."నిప్పులాంటి భార్యని నెత్తిమీద ఏ భర్త అయినా పెట్టుకుంటాడు సమీ!అందులో అసామాన్యం ఏమీ లేదు. భార్య మర్యాద కాపాడటం భర్తగా నా ధర్మం కూడా!కానీ ధర్మం కోసం భార్యని పదిమంది ముందూ శిక్షించిన శేఖరే అసామాన్యుడు.నా గొప్ప ఏం లేదు ఇందులో"అన్నాడు.

భార్యను శిక్షించటమా?అయోమయంగా  చూస్తున్న సమీరను చూసి "అయితే శేఖర్ మొత్తం చెప్పలేదన్నమాట నేను చెప్తా విను"మొదలెట్టాడు రవి.

ఆ రోజు రవికి షేక్ హాండ్ ఇచ్చి ఇంట్లోకి అడుగు పెట్టిన శేఖర్ హాల్లో ఆడవాళ్ళను పట్టించుకోకుండా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు.శేఖర్ని పట్టించుకోకుండా చర్చల్లో మునిగి పోయున్నారు మిత్రులందరూ.

"ఆ రవి అసలు మనిషేనా"పార్వతి ఆశ్చర్యపోతోంది.

"ఛీ!మనిషేనా ఏంటీ!మగాడేనా అను"గౌరి ఈసడింపు.

"అవును మరి!నీ భార్య చేసే ఘనకార్యాలివిరా నాయనా అని మర్యాదగా చెప్తే నమ్మడేంటి ?చేతకాని దద్దమ్మలాగా ఉన్నాడే"అరుణ ఎగతాళి మాటలు!

"కనీసం అలాగా అండీ?నేను కనుక్కుంటాను అనికూడా అనలేదు"వసంత ఉవాచ!

"ఛ!రవి మంచివాడు అనుకున్నాను కానీ,మరీ ఇంత చేతకానివాడు అనుకోలేదు.అందుకే ఆ సమీర అంత నెత్తిమీద ఎక్కింది.అదే శేఖరైతేనా?భార్య అలా పనికిమాలిన వ్యవహారాలు నడుపుతోందని తెలిస్తే కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోమంటారు.అయినా మనం దీన్ని ఇక్కడితో వదిలిపెట్టొద్దు.మన సర్కిల్లో ఈ మహాతల్లి భాగోతం అంతా బయటపెడదాం.ఆవిడ మాయమాటలను నమ్మొద్దని చెబ్దాం"లలిత మరో ఘనకార్యానికి శ్రీకారం చుట్టింది.

"లలితా"శేఖర్ కఠినంగా పిలిచాడు.వేడివేడి చర్చల్లో ఉన్న లలిత అయిష్టంగానే లోపలికి వెళ్ళింది.రెండు నిముషాల అస్పష్ట వాదన తరువాత చెంప ఛెళ్ళుమన్న శబ్ధం!అందరూ ఒక్కసారిగా గతుక్కుమన్నారు.

"అవును.నేను చేతైన మగాడినే.నా భార్య మరో ఆడదాని మీద ఈర్ష్యతో కాపురాలు కూల్చేపని చేస్తోంటే చూస్తూ ఊరుకునేంత మంచివాడిని కాదు.సరదాగా స్నేహితులతో పార్టీ అంటే పోనీ పాపం అనుకున్నాను.ఇలా పనికిమాలిన మందతో కూర్చుని మరో ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తే పళ్ళూ రాలగొడతాను.కాళ్ళూ విరగ్గొట్టి కొంపలో కూర్చోబెడతాను.ఈ కిట్టీలూ,తొక్కా ఇక మనింట్లో జరగటానికి ఒప్పుకోను.ఇలాటి మూక మన  గడప తొక్కటానికి వీల్లేదు!వారిజ సంసారం నాశనం చేయబోయారు మీరంతా చేరి.ఊరుకున్నాను.ఇక ఉపేక్షించను"రంకెలు వేస్తున్న శేఖర్ని విస్తుబోతూ చూస్తోంది లలిత.ఎడమచెంప కందిపోయింది పాపం.స్నేహితులందరూ మెల్లిగా లేచి పిల్లుల్లా జారుకుంటుండగా రవి ఎదురయ్యాడు గుమ్మం దగ్గర..తలలు భూమిలోకి దించుకుని తప్పుకున్న వారి మధ్యనుంచీ అదే చిరునవ్వుతో లోపలికి వెళ్ళి టీపాయ్ మీద తను వదిలేసిన కళ్ళజోడు తీసుకుని వెళ్ళాడు రవి.

విస్తుపోయి వింటోంది సమీర."కానీ రవీ నేను ..నేను అలాగ కాదు.అందరికీ సాయపడాలని కోరుకుంటా.కానీ నన్ను ఎందుకలా?నాకే ఎందుకిలా?"సమీర కళ్ళు మళ్ళీ నిండాయి.

"అవునూ వారిజా వాళ్ళు ఎప్పుడో ఫ్లాట్ వదిలేసి వెళ్ళి పోయారుగా?ఏం జరిగి వెళ్ళిపోయారు?"అయోమయంగా అడిగింది.వారిజ,కిషోర్లది కూడా అదే అపార్ట్ మెంట్ లో సొంత ఫ్లాట్!ప్రస్తుతం గాళీ చేసి వేరే ఇంటికి మారిపోయారు

"ఈ లలితమండలి సభ్యులందరూ వారిజ మీద కత్తి కట్టారు సమీ!తమ కూటమిలో చేరదనీ,వీళ్ళను దగ్గరకు చేర్చుకోదనీ!అంతే,వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చే కిషోర్ ఫ్రెండుతో వారిజకు సంబంధం ఉందని ప్రచారాలు చేశారు.నిజానికి కిషోర్ వారిజకు కజిన్!తమ్ముడి వరస కూడానూ!వీళ్ళకది తెలిసి ఏడిస్తే కదా!

వారిజా, కిషోర్ పరువు పోయిందని ఇల్లు అద్దెకిచ్చి వెళ్ళిపోలేదు సమీ!దుష్టులకు దూరంగా ఉంఢటం మంచిదని వెళ్ళిపోయారు!వాచ్ మెన్ భార్య గౌరినీ వదలలేదు వీళ్ళు!వీళ్ళ ప్రచారాల గురించి అందరికీ తెలుసు సమీ!జీవిత చరిత్రలను తిరగరాస్తారు వీళ్ళు"

కళ్ళు పెద్దవి చేసి వింటున్న సమీర కళ్ళు మళ్ళీ నీటి కొలనులైనాయి!

"ఇంత ఘోరంగానా రవీ?నాకు ఇవన్నీ ఒద్దు!నాకు నువ్వు ముఖ్యం!మనం ముఖ్యం!మన సంసారం ముఖ్యం!నా వరకూ నేను బావుంటే చాలు.ఈ సమాజ సేవ చేయటానికి చాలా మందే ఉన్నారు"డెస్పరేట్ గా మాట్లాడుతోంది సమీర!

రవి చేయి సమీర భుజాలచుట్టూ పడింది రక్షణకవచంలాగా!

"నీకే ఎందుకంటే సమీ,నువ్వు సమీరవి.రాయి రప్ప,చెట్టుపుట్ట ,మనిషి పశువు అందరినీ చల్లగా స్పర్శించటమే నీ ధర్మం.అది అందరికీ సాధ్యపడదురా!ఆ స్పర్శని ఆస్వాదించాలంటే పరిపూర్ణమైన  ఆరోగ్యం ఉండాలి.జ్వరం వచ్చినవాడికి ఆ చల్లగాలి పడదు  సమీ!ఆ గాలి సోకకుండా కంబళీ కప్పుకుంటాడు!నువ్వు నీకోసమే!ఎవరికోసమో నువ్వు మారకు.ఆ అవసరం లేనేలేదు"

రవి చల్లని మాటలకు. సమీరం మరింత శీతలమైంది కరిగి వర్షించింది!సమీర రవి కౌగిలిలో ఒదిగిపోతూ శేఖర్ కి మనసులోనే చేతులు జోడించింది.
***

No comments:

Post a Comment

Pages