ఏ దేవుడు ఎంత కాపాడతాడో?
ఆండ్ర లలిత

ఉలిక్కి పడి లేచింది గాఢ నిద్రనుంచి అనసూయ. ఆ చీకటిలో దీపం వేయకుండా అతి సుకుమారంగా పక్కకు తిరిగి భర్త రామచంద్ర కేసి చూస్తూ, “ఏవండీ! కల” అని నడుము దగ్గర తట్టి లేపింది.   రామచంద్రకి అనసూయ అంటే ప్రాణం. తనకి కేన్సర్ వచ్చి తగ్గినా, ఏదో ఒక చికిత్స. తన జీవితం సవ్యంగా నడిచేటందుకు రోజూ వాడవలసిన మందులు వల్ల ఏవో చిన్న చిన్న side effects అనసూయ జీవితంలో భాగం అయ్యిపోయాయి. తను చిరునవ్వుతోనున్నా రామచంద్రకి తెలుసు, దాని వెనకల దాగియున్న సమాధానలు లేని ప్రశ్నలు ఎంత వేధిస్తుంటాయో మనసులోతననిననీ. అవి మర్చిపోయేటందుకు ఏదో నమ్మకంతో ముందుకు సాగిపోతుంది,  ప్రతినిమిషం తను చేసే పనులలో చిన్న చిన్న ఆనందాలు చవి చూస్తూ. ఈ మనసతత్వం రామచంద్రకి చాలా ఇష్టం. అందుకే అనసూయని  మరింత అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. అనసూయ కంటనీరు రానీయడు.  వయసుకి 50 ఏళ్ళైనా జీవితం నేర్పిన పాఠాలలో ఆరితేరి పోయాడు. అనసూయ మీద విసుక్కోడు. అనసూయ మీద బెంగా , సంసార బాధ్యతలు ఇంకా కార్యాలయంలో వత్తిడులతో తన ఆరోగ్యంకూడా  అంతంతమాత్రంగా మారింది. అందుకే తన ఉద్దేశ్యం ఒకటే, ఉన్నన్ని రోజులు ఉన్నదాంట్లో సుఖముగా సంతృప్తిగా ఉండటం. 
అనసూయ పిలిచిన వెంటనే మెలకువ తెచ్చుకుని రామచంద్ర తనకేసి తిరిగి  తన మీద చేయివేసి చిరునవ్వుతో “ఎవరు వచ్చారు? ఏమైంది?” అని  చంద్రబింబములాంటి అనసూయ ముఖం కేసి చూడటానికి కళ్ళు నలుపుకుంటూ దీపం వేసి   ఒక చంటి పాపకి తల నిమిరినట్లు నిమిరి  అనసూయ  కళ్ళలో సమాధానం వెతకసాగాడు.  రామచంద్ర కేసి తిరిగి “మరి చెప్పేయమంటారా... మరి నేను చెప్పాక కలంతా వినాలి మీరు. పడుకోకూడదు” అంది అనసూయ బిగుసుకుపోయిన తన కాళ్ళు అబ్బా అనుకుంటూ మెల్లిగా స్వాధీన పరచుకుంటూ చక్కగా మంచం మీద  బాసెం పెట్టుకుని కూర్చుని ఏదో ప్రసంగం ఇచ్చేటట్టు. ఇదంతా చూస్తున్న రామచంద్ర మనసులో అనుకున్నాడు షిరిడి సాయి బాబాగారి పటం కేసి చూస్తూ. మా ఆవిడ ఏమి చేసిన ఒక పద్ధతుంటుంది. సమయంతో పనిలేదు. కాకపోతే అక్కడ ప్రసంగం ఇచ్చేవారు గొంతు సరిచేసుకుంటూ పాలు మిరియాలు అడిగితే...ఇక్కడ గొంతు తడుపుకునేటందుకు మంచి నీళ్ళు అడుగుతుంది అనుకుంటుంటేనే “ఏవండీ ముందు కాస్త మంచి నీళ్ళు ఇవ్వరూ”అంది. అనసూయ రామచంద్ర కేసి తిరిగి చిద్విలాసంతో చక్కగా  ఎవరో ఒకరు దొరికారుబాబూ తన కల గురించి  వినేందుకు  అనుకుంటూ   ప్రసంగం మొదలు పెట్టింది. గొంతు సవరించుకుంటున్న అనసూయ తీరు  చూస్తుంటే  రామచంద్రకి సంతోషమేసింది. ఎన్ని బాధలు వచ్చినా చక్కగా సంతోషంగా ,ఆ భగవంతుడు మీద భారం వేసి స్వీకరింస్తుందనీ. కాని  దేని గురించి చెప్పబోతోందో రామచంద్రకి అర్థంకాక, అతని  మనసు అనసూయ మాటల్ని పరిశీలించ సాగింది. ఏమీ లాభం లేకపోయింది. కనిపెట్టలేక పోయాడు. అప్పుడు అనుకున్నాడు , ఏదో చాలా గట్టి కలే వచ్చియుంటుందని. 
ఇంతలో “శ్రీ వేంకటేశ్వర స్వామి వచ్చారండి. ఆయన నన్ను ధీర్ఘాయుష్మాన్భవయని దీవించారండి”అంది అనుసూయ రామచంద్రతో. 
“చాలా అదృష్టవంతురాలివి అనసూయ నువ్వు. ఇంక పడుకో, ‘Bone marrow biopsy’ ఉంది కదా రేపూ”అన్నాడు రామచంద్ర సమయం చూస్తూ తనుకూడా నిద్రపోవాలి అనుకుంటూ. 
“అవును కదా! చాలా నొప్పి ఉంటుందేమో... కాస్త మెల్లిగా చేయమని డాక్టర్గారితో చెప్పరూ? ఓపిక లేదండీ. శరీరం గుల్లైపోయింది” అంటుంటే, అనసూయ   అసహయతతో రామచంద్ర ముఖం చిన్నబోయింది. అది గమనించి అనసూయ మళ్ళీ అందుకుంటూ “ ఈ మధ్యన నొప్పి అలవాటైపోయింది. కాస్త కళ్ళుమూసుకొని భగవంతుని ధ్యానిస్తే అదే పోతుంది. అయినా ఒకవేళ నొప్పి పుట్టినా ఏమీ మాట్లాడను, సరేనా! నా వెంకన్న సామి కాళ్ళు పట్టుకున్నాను. ఆయనే దాటిస్తారు. ఏవండీ మీరేమీ బెంగ పెట్టుకో వద్దు” అంటుంటే  అనసూయ ముఖంలో ఆత్మస్థైర్యం, మనోనిగ్రహంతో వెలిగిపోతున్న తేజస్సు చూసి రామచంద్ర మురిసిపోయి చల్లగా కలకాలం ఉండాలని దీవించాడు.  నడిపించేవాడు ఆ భగవంతుడు   అనుకుంటూ, బాబాగారి పటం కేసి చూసి “నా అనసూయని చల్లగా కాపాడు నాయనా” అనుకున్నాడు . ఆ తరువాత తన కేసి తిరిగి పౌర్ణమి చంద్రుడిలా వెలిగిపోతున్న తన ముఖ తేజస్సు చూసి ఆనందించి,  “పౌర్ణమి చంద్రుని కళ అనసూయలోనే ఉండనీయవయ్యా. మా జీవితాలలోకి అమావస్య రానీయకయ్యా.  రేపు అనసూయకి ఎలా ఉంటుందో  తెలియదు. నేను నొప్పి ఉండదు అంటే నమ్మింది. జాగ్రత్తగా అనసూయని చూసుకోవయ్యా. Bone marrow biopsy with local anaesthesia మాత్రమేనని తనకి నేను చెప్పలేదు. చెప్తే.. నొప్పి భరించలేను, చేయించుకోనని ఏడుస్తుంది. చూసుకో. నీకు అప్పచెప్తున్నాను నా సొత్తు. తిరిగి అప్ప చెప్పేయాలి సుమా” అని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాడు. నీవే  నాకు శరణం అనుకుంటూ, తన బాధ పక్కకి పెట్టి అనసూయ ఆనందంలో పాల్గొన్నాడు రామచంద్ర.
“ఏవండీ ! వింటున్నారా! కూర్చోలేకపోతున్నాను” ఒక్క క్షణం నడుము నొప్పిగా ఉందని మళ్ళీ పడుకుని పైన తిరుగుతున్న ఫాను కేసి చూస్తూ భర్త రామచంద్ర తో అంది అనసూయ.
రామచంద్ర కూడా  తలగడ సరి చేసుకుని పడుకొని ఆవలిస్తూ   “ వింటుంన్నానే” అన్నాడు  అనసూయతో.
“ఇక పడోకోవమ్మా. రేపు మాట్లాడుకుందాం అనసూయమ్మో! నీ కల గురించి ఏమి చేయాలో రేపు ఆలోచిద్దాం.  మనకా ఆనవాయతి లేదు. మనం చూస్తే శైవ భక్తులం. ఇప్పటికి పడుకో. అయినా, నువ్వు “రామస్కందం హనూమంతం వైనతేయం వ్రుకోదరం” చదువుకునే బదులు శ్రీ వేంకటేశ్వర స్వామిని తలుచుకుని ఉంటావు అంతే.  ప్రస్తుతానికి ఒక నమస్కారం పెట్టి పడుకో చాలు. ఏమీ చేయలేని మొక్కులు మొక్కకమ్మా. రేపు తాపీగా మాట్లాడుకుందాము”అంటూ దీపం తీసేసి మరోపక్కకి వత్తికిలి పడుకున్నాడు. అనసూయకి నిద్రపట్టలేదు. తన మనసులో వచ్చిన విషయం కక్కేయనిదే నిద్ర పట్టదు తనకి. ఏది మనసులో దాచుకోలేదు. 
మళ్ళీ అనసూయ  భర్త రామచంద్రుని  తట్టి లేపుతూ “అదేంటండి అలా పడుకుంటారు. అసలు ఏమైందని అడగరేంటి? ఏమి పట్టనట్టు పడుకుంటారు, రేపు మళ్ళీ పొద్దన్నే ఆసుపత్రికి వెళ్ళాలికదా! కొంచం వినచ్చుగా”అంటూ లేపసాగింది. కళ్ళుమూసుకునే “రేపు మాట్లాడుకుందాము అన్నానా. పడుకో. నీకెలా కావాలో అలా చేద్దాము. దేవుడికి దణ్ణం పెట్టుకొని  పడుకో. మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకోకు. ఎక్కువ ఆలోచనలు చేసి  తెచ్చుకోకు ఆరోగ్య సమస్యలు.నువ్వు నాకు కలకాలం కావాలి” అంటూ తన కేసి తిరిగి  తన పొట్టమీద చేయి వేసి గురక తీస్తూ నిద్రలో జారుకున్నాడు రామచంద్ర.
అనసూయ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు.  అనసూయ  కళ్ళు మూసుకున్నా, మనసు మటుకు వీరవిహారం చేస్తోంది.  తనలో తాను మాట్లాడుకోసాగింది. కేన్సర్  చికిత్సంటేనే  నొప్పి. కాని ఆ కాస్త నొప్పి భరిస్తే చిరునవ్వు తప్పక వస్తుందని తనకి గాఢ విశ్వాశం. కానీ ఎన్ని రోజులు...కాదు కాదు ఎన్ని ఏళ్ళు....తెలీదుగా...ఒకటి తగ్గుతే మరొకటి వస్తూవుంటుంది... ఏమన్నా అంటే, వైద్యులు మనతో ఇవన్ని చిన్నవే కదా ‘side effects' ఇవి nothing! ‘You are fine. Life has to move on... You are brave... Keep moving...Don't think of past. Be positive'అంటారు. ఎంత ఆలోచించకుండా ఉందామన్నా, బంధాలు అనుబంధాలు వదులుకోలేక...వాటి చిక్కుముడులు విప్పలేక...బంధాలని వదలలేక...  సతమతమౌతూ మళ్ళీ ఆ భగవంతుని ఆశ్రయిస్తానేమిటో అనుకుంది అనసూయ. తను డీలా పడిపొతున్నానని గమనించి మళ్ళి తననితను తామాయించుకుంటూ ఇలా తన మనసుతో మాటలు సాగించింది.
“ఎందుకో తెలుసా మనసా... కేన్సర్ రోగమే అంతా... మన జీవితం మన చేతులలో లేదు. ఆ భగవంతుడి చేతులలో ఉంది. మనని నమ్ముకున్నవారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి వారి సుఖ సంతోషాలలో పాల్గొనాలని నాలో ఉన్న  చిన్న ఆశ, ఆ  భగవంతుడు నాతోపాటు నడుస్తూ నా చిన్న చిన్న  కోరికలు నెరవేరుస్తుంటే మరి నేను కృతజ్ఞత చెప్పుకోవాలని ఆశ కలగటం తప్పా..లేక మా కుటుంబం శివుడునే నమ్ముతారు. మాకు శ్రీ వేంకటేశ్వర స్వామిని నమ్మే  ఆనవాయితీ లేదు అనుకొని నా మనసులోని కోరిక చంపుకోవాలా! అంత పెద్ద తప్పు చేస్తున్నానా. నా జీవితం ఏమైనా ఫర్వాలేదా! ఆనవాయితీ అంత ముఖ్యమా! పోనీ నా కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడాలని వాంఛతో నేను నా కోరిక త్యాగంచేస్తే, నాకు నా కుటుంబం, వాళ్ళు నమ్మిన దైవం నాకు ప్రాణం పోస్తారా! ఏమో తెలీయటం లేదు. అగమ్యగోచరంగా ఉంది. ఆత్మస్థైర్యం కోలుపోతున్నాను. ఏమి చేయ్యాలో తోచటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నాకూ తెలుసు, శివుడూ వెంకన్న సామి ఒకటే అని. మరి నా మనసులో ఈ ఘర్షణ ఏమిటి. ఓం నమః శివాయ అనే నా నోటెంబడ రావాలా! ఓం నమో వేంకటేశాయ అని రాకూడదా!  పిల్లాడు దెబ్బ తగిలితే అమ్మా అని అరుస్తాడు. అమ్మా అనకూడదు నాన్నా అనాలని కొట్టి చంపేస్తామా!  ఏమిటో ఈ మనస్తత్వాలు అర్థంకావు..ధైర్యచేసి ఓకవేళ నేను నా మనసు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తుంటే, అందరూ నన్ను వెలివేస్తారని భయపడనా! లేదు వాళ్ళని నొప్పించి చేస్తే బెడుసు కొట్తుందని నమ్మానా.... మనసా క్లిష్టమైన పరిస్థితిలో పడేస్తావెందుకు. నేను ఎవరినీ నొప్పించాలని అనుకోను. దేవుడు ఒక్కడే అని నాకూ తెలుసు. ఏ పేరుతో మనము పిలిచినా పలుకుతాడని కూడా తెలుసు.  నన్ను నేను సమర్థించుకునే ప్రయత్నంలో,  ఇవన్నీ మర్చిపోతాను. ప్రతీ సారి  శరీర పరీక్షల కోసం ఆ కేన్సర్ వార్డులో కూర్చుని, వైద్యుని కోసం వేచియున్నప్పుడు ఒక్కటే కనబడుతుంది. అందరి ముఖాలపైనా ఒకటే ప్రశ్న. నా జీవితం నిలబడుతుందా?  ఈ నొప్పులనుండి విముక్తి ఉంటుందాయని.  నా ఉద్దేశ్యంలో అక్కడ అనుభవిస్తున్న వారికి తెలుసు జీవితం యొక్క విలువ,  ఖరీదు ఎంతోయని. నొప్పి, బాధ, బతకాలనే ఆశ , బంధుత్వాలు ఇంకా బంధాల విలువలు ఇంకా ఎన్నెనో.  అందరిలో ఒకదాన్నిగా ఉండి అనుభవిస్తూ, నాలో కలిగిన ప్రశ్నలన్నింటికి మానవమాత్రురాలిగా సమాధానాలు దొరక్క, ఆ భగవంతుని మీద భారం మోపాను. నేను  శ్రీ వేంకటేశ్వర స్వామిని నమ్మాను. నన్ను నేను శాంత పరచుకునేందుకు.  అలాంటి సమయంలో,  నా కుటుంబానికి నచ్చుతుందా నచ్చదా నేను చేసే పని అని ఆలోచన రాదు నాకు.  ఏదో ఆ బాధలో పిచ్చిదాన్ని అవ్వకుండా, జీవితం నిలబడాలంటే బాధలు తట్టుకునే ఆత్మస్థైర్యం కావాలి కదా.  అది ఆ భగవంతుడు ని ఇవ్వమని కోరుకున్నాను”.
అయినా అనవాయితీలు మూఢనమ్మకాలు మనం పెట్టుకున్నవి. ఇవన్నీ ఆత్మస్థైర్యం కోలుపోయే పరిస్థితి తేకూడదు. మన పంతాలు పట్టింపులు ఒక ప్రాణం కన్నా ముఖ్యం కాదుకదా! మనలో మానవత్వం  జీవించేటట్టు చూసుకుందాం.  తల్లీ తండ్రుల నుండి బిడ్డలని వేరు చేయలేము.  అలాగే  అందరికీ తండ్రి వంటి శ్రీ వేంకటేశ్వరస్వామి  నుండి ఏ శక్తి వేరు చేయగలదు.  ఆయనని నేను నమ్మాను. పాలముంచినా నీటముంచినా ఆయనదే భారం.  నా సమస్యలకి పరిష్కారాలు నేను ఎంత ఆలోచించినా లేవు. ఆయనే నన్ను నడిపిస్తాడు. రేపు bone marrow biopsy  అయ్యి  చికిత్సలు అయ్యి ఇంటికి వస్తానని నమ్మకం లేదు.  నిన్నే నమ్ముతున్నాను స్వామీ. ఓంనమో వేంకటేశా అనుకుంటూ నిద్రలో జారుకుంది అనుసూయ.
పొద్దున్నే మౌనంగా తయారైపోయి రామచంద్రతో కార్లో ఆసుపత్రికి బయలుదేరింది. అన్ని formalities తరువాత wheel chair లో కూర్చొని రామచంద్రకి  దిగాలుగా బై చెప్పింది. ఆగు అని రామచంద్ర తనకి బుల్లి వెంకటేశ్వర స్వామికి తను  రోజూ పూజ చేసుకునే  కుంకుమ  కాస్త పొట్లం కట్టుకుని వచ్చిన పొట్లం తన పేన్టు జేబులో నుంచి తీసాడు. అది విప్పితనకి కుంకుమ బొట్టు పెట్టి తన చేయిపట్టుకుని “అంతా బావుంటుంది. నీకు కావల్సినట్టే చేసుకుందాం. నేను ఇక్కడే కూర్చుంటాను. వెళ్ళిరా.. నీ కోసం”. “నీ కోసం” అనగానే అనసూయకి ఏడుపుతోపాటు నవ్వొచింది. తను ఊహించలేదు, రామచంద్ర తనకోసం  శ్రీ వేంకటేశ్వర స్వామి కుంకుమ తెస్తారని. అది తనకి కొండంత బలం ఇచ్చింది.  చిరునవ్వుతో  “నేను రావటానికి ఆలస్యం అవుతుందేమో! ఏదో ఓకటి తినండి నీర్సమొస్తుంది. నేను బానే ఉంటాను”, బెంగపెట్టుకోవద్దని ధైర్యం చెప్పి   చిరునవ్వుతో wheel chair లో వెళ్ళిపోయింది. 
ఆ వేచియుండే హాల్లో కూర్చుని,  “మూఢ నమ్మకాలు, అర్థంలేని ఆనవాయితీలు, ఆచారాలు మనలో  మనవత్వం నశింప జేస్తాయేమోనని. అవన్నీ ప్రాణంకన్నా ముఖ్యం కాదు కదా.  ప్రతీ జీవరాశిలో ఆ భగవంతుడు ఉంటాడని నమ్మితే మన జన్మ ధన్యం .అది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదని తనలో తాను రామచంద్ర అనుకుంటూ  నవ్వుకున్నాడు. తనకి ఇష్టమైన పాట “ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు” అని అన్నమాచార్యులు వారు రచించిన పాట పాడుకుంటూ జీవితంలో భగవంతుడు నిర్ణయించిన సమయం వరకు సుఖ సంతోషాలతో అనసూయతో ముందుకు సాగిపోయాడు.
***

3 comments:

  1. చదువుతుంటే మనసంతా ఒకలాంటి ఆర్ద్రతతో నిండిపోయింది లలితా! అన్నిరోగాలూ భరించలేనివే అయినా, కేన్సర్ రోగం జీవితపు పరిమితులు చెప్పేస్తుంది. భయపెడుతుంది. మనిషిలో ఆశను హరించి నిర్లిప్తతను నింపుతుంది. కుటుంబం ఆదరణ ఎంతో అవసరం ఆ సమయంలో. నీకధల్లో భార్యాభర్తల మధ్య చక్కని స్నేహాన్నీ, అనురాగాన్నీ చూపిస్తావు. దైవం చేసే లీలలు , ఆధ్యాత్మిక చింతన ప్రేరేపిస్తాయివనీకధలు. చాలా రోజులకు మనసుని తట్టిన కధ ఇది. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శశికళక్కా

      Delete

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top