ఆ తీరం ..!!
సుజాత తిమ్మన..

పిల్ల గాలులను మోసు కెళుతూ ...
మెత్తని అలలతో సంగీతాన్ని పలికిస్తూ..
మెల్లగా సాగిపోతోంది...గోదారమ్మ ..

ఆ స్వచ్చమైన నీటిఒడిలో స్వేచ్చగా తిరిగే
చేపలని బందించాలనేతాపత్రయంతో జాలరులు...
“కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టే పసిడితల్లి..
మమ్ము  చల్లగా కాపాడుమమ్మా...”
పల్లె పదాలు పాడుకుంటూ వలలు వేస్తున్నారు...

పుణికి పుచ్చుకున్న అమాయకత్వంతో ...
ఆటలేతమ ధ్యేయం అనుకునే పసితనం..
గోదారినే ఈదాలనే కుతూహలంతో...
కేరింతలతో...తుళ్ళింతలతో ..
ఒకరిపై ఒకరు పోటీ పడుతూ..
మునకలేస్తున్నారు నీటిలో...
మండించే సూర్యుని కిరణాలను సైతం 
లెక్కచేయక ఒళ్ళు మరిచి పిల్లవాళ్ళు ..

ఏరు దాటాలనే తాపత్రయం ..
పడవ ప్రయాణికులది..
వారిని గమ్యానికి చేర్చడమే 
వేగువానికి  జివనోపాది ...

ఉదయ సంధ్య నుంచి..
ఆస్తమ సంధ్య వరకు ..
రక రకాల మనుషులతో ..
కోలాహలమైన ఆ తీరం ..
నిశి కాంతను చేరి నిశ్శబ్దమవుతుంది..
అమావాస్య నాడు ఆపాదమస్తకము అర్పించుకుని..
పున్నమి నాడు వెన్నెలనంతా తాగేస్తుంది...
స్పందించే హృదయాలను తట్టి లేపుతూ..
లోనికి దూరి ...తెల్లకాగితం చూపుతుంది...
తననో పసిపాపగా మార్చి ఆవిష్కరించమని..
ఆ తీరం...గోదావరీ తీరం..!!
********** 

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top